మిర్చిపైన రైతన్న ఆశలు

Mirchi crop

 

ఖమ్మం : తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కడంతో అత్యధిక శాతం రైతులు మెట్ట పోలాల్లో మిర్చి పంటను వేసేందుకు సిద్ధపడుతున్నారు. గత రెండెండ్ల నుంచి తేజ మిర్చి రకానికి విదేశాల్లో డిమాండ్ ఉండటంతో ఈ పంటను వేసేందుకు రైతులు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది మిర్చి ధర రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. గత పది రోజుల నుంచి రూ. 1000కి పైగా ధర పెరుగుతూ వస్తుంది. గత మంగళవారం రూ. 14,700 ధర పలికి రికార్డు సృష్టించింది. ఈ నెలాఖరకు క్వింటాకు రూ. 15వేలు దాటవచ్చని మార్కెట్ అధికారులు పేర్కొంటున్నారు.

ప్రధానంగా విదేశాల్లో తేజ మిర్చి రకానికి డిమాండ్ ఉండటంతో ఇక్కడ రేటు పెరుగుతుంది. జూన్ నెల నుంచి ఈ రకం మిర్చికి ధర పుంజుకుంటున్నప్పటికి జూలై, ఆగస్టు నెలలో రికార్డు స్థాయిలో ధర పెరిగింది. జూలై నెల ప్రారంభంలో రూ. 13వేలు దాటిని మిర్చి ధర నెలాంతానికి ఏకంగా రూ. 14వేలకు చేరుకుంది. జూలై 30న గరిష్టంగా రూ. 14వేల 200 పలికింది. ఇంతటి రేటు మిర్చి పంట సాగు చరిత్రలోనే చూడలేదని రైతులు, వ్యాపారులు పేర్కొంటున్నారు. ఆగస్టు 13 నుంచి ఈ నెలాఖరు వరకు రూ. 15వేలు దాటే అవకాశం ఉంది. చైనా, బంగ్లాదేశ్, సింగపూర్, మలేసియా దేశాలో ఈ రకం మిర్చికి మంచి గిరాకి ఉంది. దీంతో తేజ రకం మిర్చికి ఊహించని రీతిలో ధర పలుకుతోంది.

తెలంగాణ రాష్ట్రంలో మిర్చి పంట సాగు
మన రాష్ట్రంలో తేజ రకం మిర్చిని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, వరంగల్ రూరల్ జిల్లాల్లో విస్తరంగా పండిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ పంటను సాగు చేస్తుంటారు. మిర్చి విక్రయాలు రాష్ట్రంలో ప్రధానంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో జరుగుతూ ఉంటాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని సుమారు 80వేల ఎకరాల్లో మిర్చిని సాగు చేస్తుంటారు. ఈ పంట ఉత్పత్తి సీజన్ ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ నెలాఖరు వరకు విక్రయాలు జరుగుతూ ఉంటాయి. ఈ ఏడాది సీజన్‌లో ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో తేజ రకం మిర్చి రూ. 7,500 నుంచి రూ. 8,500 ధర పలికింది. భవిష్యత్తులో మిర్చికి ధర ఇంకా ఎక్కువ అవుతుందని భావించిన వ్యాపారులు ఈ ధరలతో రైతుల నుంచి కొనుగోలు చేసి కోల్ట్ స్టోరేజ్‌లలో నిల్వ ఉంచారు.

భారీగా వ్యవసాయం ఉన్న రైతులు అరకోరగా కోల్డ్ స్టోరేజ్‌లలో నిల్వ ఉంచుతున్నారు. ఇతర దేశాలకు ఎగుమతికి అనుమతి లభించటంతో ఇక్కడ మిర్చికి డిమాండ్ పెరిగింది. రికార్డు స్థాయిలో ధర పెరగటంతో కోల్డ్ స్టోరేజ్‌లలో నిల్వ ఉంచిన రైతులు, వ్యాపారులు సైతం పంట సీజన్ రావటంతో పెట్టుబడికి అమ్మకానికి మొగ్గుచూపుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న కోల్డ్ స్టోరేజ్‌లలో దాదాపు లక్ష బస్తాల చొప్పున నిల్వ చేసే సామర్ధం ఉంది. ఇప్పటికే నిల్వ ఉంచిన మిర్చిలో దాదాపు 30 నుంచి 40 శాతం మిర్చిని విక్రయించినట్లు అంచనా. ప్రస్తుత మార్కెట్‌లో మిర్చికి రికార్డు స్థాయిలో ధర పలకడంతో రైతులు సైతం ఈ ఏడాది ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.

విదేశాల్లో ఎగుమతి వల్లే మిర్చికి ధర
-మార్కెట్ చైర్మన్ మద్ధినేని వెంకటరమణ
మలేసియా, బంగ్లాదేశ్, చైనా, సింగపూర్ వంటి దేశాలకు మిర్చి ఎగుమతులకు అనుమతులు లభించటం వల్ల అక్కడ మిర్చికి డిమాండ్ పెరగటంతో ఇక్కడ కోల్డ్ స్టోరేజ్‌లలో నిల్వ ఉన్న పంటకు ధర పలుకుతుందని, ఈ నెలాఖరుకు క్వింటా మిర్చి ధర రూ. 15వేలు దాటే అవకాశం ఉందని మార్కెట్ కమిటీ చైర్మన్ మద్ధినేని వెంకటరమణ, వైస్ చైర్మన్ పిన్ని కోటేశ్వరరావు పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో డిమాండ్ ఉండటం వల్ల రైతులు ఈ ఏడాది తేజ రకం మిర్చిని సాగు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిపారు.

Profits for farmers with Mirchi crop

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మిర్చిపైన రైతన్న ఆశలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.