భారతీయ రైల్వేలో ప్రైవేటు కూత

Indian railways

కోట్లాది మంది ప్రజలను ప్రతినిత్యం సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్న భారతీయ రైల్వే ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నది. లక్షల కోట్ల రూపాయల ఆస్తులున్న రైల్వేను ప్రైవేటు పెట్టుబడిదారులకు ధారాదత్తం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. సామాన్యుడి ప్రయాణ సాధనంగా రైలు ఇక ఎంతో కాలం ఉండబోదు. రైల్వేలను ప్రైవేటు పరం చేయబోమని పదేపదే చెబుతూనే ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించేలా రైల్వే బోర్డు చాప కింద నీరులా ప్రయత్నాలు చేస్తోంది. దేశ రవాణా రంగానికి జీవనాడి వంటి రైల్వే వ్యవస్థను ప్రైవేటీకరించే యత్నంలో భాగంగా దేశంలో మొట్టమొదటి ప్రైవేటు రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్ పట్టాలపై పరుగులు తీస్తోంది.

దేశ రాజధాని న్యూఢిల్లీ నుండి ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో మధ్య అక్టోబర్ నాలుగున ఈ రైలు సేవలు ప్రారంభమయ్యాయి. మరో తేజస్ ఎక్స్‌ప్రెస్ అహ్మదాబాద్ ముంబై సెంట్రల్ మధ్య త్వరలో నడవనుంది. తేజస్ రైళ్ల నిర్వహణ బాధ్యతలను భారతీయ రైల్వే బోర్డు పైలట్ ప్రాజెక్టుగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సిటిసి) కు అప్పగించింది. మూడేండ్లు ఈ సంస్థ ఈ రైళ్లను నడుపుతుంది. వీటిల్లో రాయితీలు, పాస్‌లు అనుమతించరు. తేజస్ రైలును ప్రవేశపెట్టిన అనంతరం భారత రైల్వేల ప్రైవేటీకరణ మరింత వేగం పుంజుకుంది. తాజాగా 150 రైళ్లు, 50 రైల్వే స్టేషన్లను దశల వారీగా ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది.

రైళ్ల ప్రైవేటీకరణ, రైల్వే స్టేషన్లు ఆధునీకరించడంపై విధి విధానాలు రూపొందించడానికి సాధికార కమిటీని ఏర్పాటు చేసింది. నీతి ఆయోగ్ సిఇఒ చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో రైల్వే బోర్డు చైర్మన్, కేంద్ర ఆర్థిక, పట్టణాభివృద్ధి శాఖల కార్యదర్శులు, రైల్వే ఫైనాన్షియల్ కమిషనర్ సభ్యులుగా ఉన్నారు. 150 రైళ్లు, 50 రైల్వే స్టేషన్లు, 24 రూట్లు, 14 ఇంటర్ సిటీ సర్వీసులు 10 ఓవర్ నైట్, లాండ్ డిస్టెన్స్ సర్వీసులలో ప్రైవేటు సేవలు ప్రారంభం కానున్నాయి. ఇంటర్ సిటీ సర్వీసులలో సికింద్రాబాద్ విజయవాడ రూట్, లాంగ్ డిస్టెన్స్ ట్రైన్లలో సికింద్రాబాద్ ఢిల్లీ సర్వీసులు కూడా ఉన్నాయి.

భారతీయ రైల్వేని ప్రైవేటీకరించే చర్యల వలన రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమౌతుంది. ప్రజలకు చవకైన, సురక్షితమైన ప్రజారవాణాని కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. ఇతర రవాణాతో పోల్చితే రైలు రవాణా చాలా చవక. 166 సంవత్సరాల చరిత్ర గల భారత రైల్వేలు రెండున్నర కోట్ల మంది ప్రయాణికులకు రోజువారీగా గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ప్రైవేటీకరణ ముప్పుతో ఇప్పటి వరకు స్వల్పంగా ఉన్న టికెట్ ధరలు అమాంతం పెరిగే అవకాశముంది. సామాన్యులపై భారం ఖాయంగా కనబడుతున్నది. నిత్యం ముప్పై లక్షల టన్నుల వస్తువులను దేశంలోని వివిధ ప్రాంతాలకు రైళ్లు తరలిస్తున్నాయి. రైల్వేల నుండి సరుకు రవాణా వ్యవస్థను కూడా ప్రైవేటు రంగానికి అప్పగించడానికి సమాయత్తం కావడం రైల్వే వ్యవస్థను ధ్వంసం చేయటమే అవుతుంది.

రైల్వే రవాణాతో సంబంధం ఉన్న ప్రతీ వస్తువు ధర పెరిగే అవకాశముంది. 13 లక్షల ఎనిమిది వేల మంది శాశ్వత ఉద్యోగులకు, లక్షల కొలది కాంట్రాక్టు కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ రైల్వే. పరోక్షంగా రైల్వేపై ఆధారపడిన కుటుంబాలు, సంస్థలు కోట్లాదిగా ఉన్నాయి. ప్రైవేటీకరణ కాబోయే మార్గాలలో వీరి భవిష్యత్తు అంధకారం కానుంది. రైల్వే ప్రయాణంలో వృద్ధులకు, వికలాంగులకు, విద్యార్థులకు, ఆర్మీకి చెందిన వారికి చార్జీలలో ఇచ్చే రాయితీలు ప్రైవేటీకరణ గండంతో అటకెక్కే ప్రమాదం ఉంది. దేశంలోనే ప్రభుత్వాధీనంలో ఉన్న అతి పెద్ద ప్రభుత్వ ఉపాధి సంస్థ రైల్వే.

ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మహిళలకు, వికలాంగులకు ఉద్యోగ నియామకాలలో రిజర్వేషన్లు కల్పిస్తున్నది. ప్రైవేటువ్యక్తులు ఈ సంస్థను హస్తగతం చేసుకున్నట్లయితే రిజర్వేషన్లకు మంగళం పాడినట్లే. ఉద్యోగాలుపోతాయి. సామాజిక న్యాయం దెబ్బ తిం టుంది. రైల్వేల ప్రైవేటీకరణతో దేశ ప్రజల ప్రయోజనాలను, భద్రతని, కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోంది. బ్రిటన్ లాంటి అనేక దేశాలలో రైల్వే ప్రైవేటీకరణ అనుకున్న ఫలితాలు సాధించలేక అనేక నష్టాలను మూటకట్టుకుంది. కోట్లాది మందికి ఉపయోగపడే భారతీయ రైల్వేను ప్రైవేటీకరించే చర్యలకు ప్రభుత్వం స్వస్తి పలకాలి. ప్రభుత్వ చర్యల్ని రైల్వే ఉద్యోగ, కార్మిక సంఘాలు, అన్ని తరగతుల ప్రజలు తీవ్రంగా ప్రతిఘటించాలి.

Privatisation of Indian railways

* బిల్లిపెల్లి లక్ష్మారెడ్డి, 94409 66416

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post భారతీయ రైల్వేలో ప్రైవేటు కూత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.