నీరవ్ కు జైలు గది రెడీ…

  నిబంధనల మేరకు అన్ని సదుపాయాలు కల్పిస్తాం రాష్ట్ర హోం శాఖకు మహారాష్ట్ర జైళ్ల శాఖ లేఖ ముంబయి: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు వేల కోట్ల రూపాయల రుణాలను ఎగవేసి బ్రిటన్‌కు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని గనుక అక్కడి ప్రభుత్వం భారత్‌కు అప్పగిస్తే అతడ్ని ఉంచడానికి ముంబయిలోని ఆర్థర్ రోడ్డు జైలులోని 12వ నంబర్ బ్యారక్‌లో ఒక గదిని అధికారులు సిద్ధంగా ఉంచారని రాష్ట్ర హోం శాఖకు చెందిన అధికారిఒకరు మంగళవారం తెలిపారు. ఒక […] The post నీరవ్ కు జైలు గది రెడీ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నిబంధనల మేరకు అన్ని సదుపాయాలు కల్పిస్తాం
రాష్ట్ర హోం శాఖకు మహారాష్ట్ర జైళ్ల శాఖ లేఖ

ముంబయి: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు వేల కోట్ల రూపాయల రుణాలను ఎగవేసి బ్రిటన్‌కు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని గనుక అక్కడి ప్రభుత్వం భారత్‌కు అప్పగిస్తే అతడ్ని ఉంచడానికి ముంబయిలోని ఆర్థర్ రోడ్డు జైలులోని 12వ నంబర్ బ్యారక్‌లో ఒక గదిని అధికారులు సిద్ధంగా ఉంచారని రాష్ట్ర హోం శాఖకు చెందిన అధికారిఒకరు మంగళవారం తెలిపారు. ఒక వేళ మోడీని బ్యారక్‌లో ఉంచితే ఆర్థర్ రోడ్డు జైలులో పరిస్థితి, అక్కడ ఉన్న సదుపాయాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని జైళ్ల శాఖ రాష్ట్ర హోం శాఖకు గత వారం అందజేసిందని కూడా ఆ అధికారి చెప్పారు.

ఈ సమాచారాన్ని ఇవ్వాలని కేంద్రం కూడా ఇటీవల రాష్ట్ర హోం శాఖను కోరిందని ఆయన చెప్పారు. నీరవ్ మోడీని గత మార్చి 19న స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు లండన్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వాండ్స్‌వర్త్ జైల్లో ఉంచిన ఆయనను అక్కడి ప్రభుత్వం త్వరలో భారత్‌కు అప్పగించే అవకాశముంది. గత నెల వెస్ట్ మినిస్టర్ కోర్టు ఆయనకు బెయిలు ఇవ్వడానికి నిరాకరించింది కూడా. కాగా జైల్లో కల్పించే సదుపాయాలకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి ఇటీవల ఒక హామీ లేఖను కూడా సమర్పించింది. దాదాపు రూ.9 వేల కోట్ల మేర బ్యాంకులకు రుణాలు ఎగవేసి బ్రిటన్‌లో తలదాచుకున్న మద్యం వ్యాపారి విజయ్ మాల్యా విషయంలో కూడా రాష్ట్రప్రభుత్వం గత ఏడాది కేంద్రానికి ఇలాంటి హామీనే ఇచ్చింది.

ఒక వేళ మోడీని భారత్‌కు అప్పగిస్తే ఆయనను ఆర్థర్ రోడ్డు జైలులోని 12వ నంబర్ బ్యారక్‌లో ఉన్న రెండు జైలుగదుల్లో ఒక దానిలో ఉంచుతామని కేంద్రానికి పంపిన లేఖలో రాష్ట్రప్రభుత్వం తెలియజేసిందని హోం శాఖ అధికారి చెప్పారు. ప్రస్తుతం ఈ రెండు గదుల్లో ఒక దానిలో ముగ్గురు ఖైదీలు ఉన్నారని, రెండోది ఖాళీగా ఉందని ఆ లేఖలో తెలిపారు. మోడీ, మాల్యా ఇద్దరినీ ఒకే గదిలో ఉంచుతామని, 20 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పు ఉండే ఆ గదిలో మూడు ఫ్యాన్లు, ఆరు ట్యూబ్ లైట్లు, రెండు కిటికీలు ఉన్నాయని జైళ్ల విభాగం ఆ లేఖలో తెలిపిందని ఆ అధికారి చెప్పారు. అంతేకాకుండా ముగురికన్నా ఎక్కువ మంది ఖైదీలు ఉండని సెల్‌లోనే మోడీని ఉంచడం జరుగుతుందని కూడా జైళ్ల శాఖ హామీ ఇచ్చిందని ఆయన తెలిపారు.

ఒక వేళ మోడీని బ్యారక్‌లో ఉంచినట్లయితే యూరోపియన్ కరెక్షన్ సెంటర్లలో ఉంచే వ్యక్తులకు వర్తించే నిబంధనలకు అనుగుణంగా ఆయపకు మూడు చదరపు మీటర్ల వ్యక్తిగత జాగా లభిస్తుందని, అలాగే ఒక కాటన్ మ్యాట్, దిండు, బెడ్‌షీట్, బ్లాంకెట్ కూడా ఇస్తారని ఆయన చెప్పారు. అలాగే గది బైట వ్యాయామం చేసుకోవడానికి, తిరగడానికి కూడా తగినంత సమయం ఇస్తారని, ఇది రోజుకు గంటకు పైగానే ఉంటుందని కూడా ఆయన చెప్పారు.

గదిలోపల తగినంత వెలుతురు, ఆయన వ్యక్తిగత వస్తువులు పెట్టుకోవడానికి స్టోరేజి సదుపాయం, ప్రతిరోజు స్వచ్ఛమైన తాగు నీరు. 24 గంటలు వైద్య సదుపాయం, స్నానపానాదుల సదుపాయం కూడా ఉంటుందని ఆ లేఖలో జైళ్ల శాఖ హామీ ఇచ్చిందని ఆ అధికారి తెలిపారు. అంతేకాకుండా బ్యారక్ కట్టుదిట్టమైన భద్రత కలిగి ఉండి, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగల , తగిన శిక్షణ పొందిన పోలీసులను అక్కడ నియమిస్తారు కాబట్టి గతంలో అక్కడ వేధింపులకు గురి చేయడం, లేదా ఖైదీల పట్ల దురుసుగా ప్రవర్తించడం లాంటి ఎలాంటి సంఘటనా జరగలేదని కూడా ఆ లేఖలో తెలిపినట్లు ఆ అధికారి చెప్పారు.

Preparing a Prison Room to Nirav Modi

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నీరవ్ కు జైలు గది రెడీ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: