మెరుగ్గా సన్నద్ధమైతే ఉద్యోగం సొంతం

9,355 జూనియర్ పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలు                                                                                                  పునశ్చరణ, మాక్ […]

9,355 జూనియర్ పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలు                                                                                                  పునశ్చరణ, మాక్ టెస్టులతో మేలు
సెప్టెంబర్ 12 వరకు దరఖాస్తుకు అవకాశం

గ్రామీణ వ్యవస్థలో పంచాయతీ సెక్రటరీలది కీలకపాత్ర. అందుకే ప్రభుత్వానికీ, ప్రజలకూ మధ్య వారధిగా ఉంటూ సంక్షేమ పథకాలలో గ్రామాభివృద్ధిలో, సంక్షేమ పథకాల అమలులో పంచాయతీ కార్యదర్శులు ప్రధాన పాత్ర పోషిస్తారు. ఈ ఉద్యోగం ద్వారా గ్రామాల అభివృద్ధికి కృషిచేసే అవకాశం లభిస్తుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టుల నియామకానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ 2018, ఆగస్టు 31న  నోటిఫికేషన్ జారీ చేసింది.

తెలంగాణలో అమలులోకి వచ్చిన కొత్త జోనల్ విధానం ప్రకారం జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు పోటీపడవచ్చు. ఉన్న స్వల్పవ్యవధిలో మెరుగ్గా సిద్ధం కావాలంటే, ఒకే తరహా అంశాలను అనుసంధానం చేసుకోవాలి. ఈ పోస్టుల భర్తీకి నెల లేదా నెలన్నర రోజుల వ్యవధిలో రాత పరీక్షలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రణాళికాబద్ధంగా సిద్ధమైతే జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాన్ని సొంతం చేసుకోవచ్చు.

అర్హతలు… జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు 2018, ఆగస్టు 31 వరకు 18 సంవత్సరాల నుంచి 39 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఎస్‌సి,ఎస్‌టి, బిసి అభ్యర్థులకు ఐదేళ్ల వయోపరిమితి ఉంటుంది.

పరీక్షా విధానం… ఆబ్జెక్టివ్ విధానంలో రెండు పేపర్లకు రాత పరీక్ష ఉంటుంది. మొత్తం 200మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకాలలో నెగెటివ్ మార్కుల విధానం అమలు చేస్తున్నారు. అభ్యర్థులు గుర్తించిన ప్రతి తప్పు సమాధానానికి 1/4వ వంతు చొప్పున మార్కులు తగ్గిస్తారు. సరైన సమాధానం తెలియని ప్రశ్నకు సమాధానం గుర్తించకుండా వదిలేస్తే, ఆ ప్రశ్నకు ఎలాంటి మార్కుల తగ్గింపు ఉండదు. టిఎస్‌పిఎస్‌సి పరీక్షల్లో, ఎస్‌ఐ, కానిస్టేబుల్ పరీక్షల్లో లేని రుణాత్మక మార్కుల విధానం ఈ పరీక్షల్లో ఉంది కాబట్టి అభ్యర్థులు పకడ్బందీగా సాధన చేయాలి. పరీక్షా విధానం, సిలబస్ క్షుణ్ణం గా అధ్యయనం చేయాలి.

పేపర్-1… జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీస్, తెలంగాణ సంస్కృతి, చరిత్ర నుంచి ప్రశ్నలు ఉంటాయి. రెండు గంటల (120 నిమిషాలు) వ్యవధిలో 100 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. ఒక ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 100 మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుంది.

పేపర్-2… తెలంగాణ పంచాయతీ రాజ్ యాక్ట్- 2018, గ్రామీణాభివృద్ధ్ది కార్యక్రమాలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. రెండు గంటల(120 నిమిషాలు) వ్యవధిలో 100 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. ఒక ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 100 మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుంది.

ప్రిపరేషన్ ప్లాన్… పేపర్-1లో జనరల్‌స్టడీస్‌తో పాటు మెంటల్ ఎబిలిటీస్‌కు ప్రాధాన్యమివ్వాలి. వర్తమాన అంశాలపై పట్టు సాధించాలి. ఇందుకోసం గత ఆరు నెలల సమాచారం సేకరించి చదవాలి. జాతీయ, -అంతర్జాతీయ అంశా లు, క్రీడలు, సదస్సులు-, సమావేశాలు, పర్యటనలు, వార్తల్లో వ్యక్తులు వంటివాటితో పాటు జనరల్ నాలెడ్జ్‌పై దృష్టి సారించాలి. ఇటీవల జరిగిన వివిధ క్రీడ లు, సదస్సులు, వివిధ సూచీల్లో భారత్‌స్థానం, నూతన ముఖ్యమంత్రులు, గవర్నర్లు, అవార్డులకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేయాలి. తెలంగాణ అంశా ల్లో పథకాలు, తెలంగాణ వార్షిక నివేదికలు, 2018-19 బడ్జెట్, ఐటి వృద్ధి తదితర అంశాలపై దృష్టి సారించాలి.

ఇతర పరీక్షల సిలబస్‌తో సరిపోల్చుకోవాలి… విఆర్‌ఒ, కానిస్టేబుల్, ఎస్‌ఐ, గ్రూపు 4 ఉద్యోగాల కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఉన్న సిలబసే ఇక్కడా పేపర్1లో కనిపిస్తుంది. వివిధ కేడర్ల సిలబస్‌లను పంచాయతీ కార్యదర్శి సిలబస్‌తో సరిపోల్చుకుని అదనంగా ఉన్న విభాగాలపై దృష్టి పెడితే సమయం ఆదా అవుతుంది. సిలబస్ డిగ్రీ స్థాయిలో ఉంటుందని పేర్కొన్నారు. పేపర్1 సిలబస్‌లో మొత్తం 12 అంశాలు పేర్కొనగా, వాటిలో రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్, అంతర్జాతీయ సంబంధాలు-, ఈవెంట్స్, నిత్య జీవితంలో సైన్స్, పర్యావరణ సమస్యలు- విపత్తు నిర్వహణ, దేశ, రాష్ట్ర భౌగోళికాంశాలు, ఆర్థిక వ్యవస్థ: భారత రాజ్యాంగం- విశిష్ట లక్షణాలు, రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం, ఆధునిక భారతదేశ చరిత్ర- జాతీ యోద్యమం, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, తెలంగాణ ప్రభుత్వ విధానాలతోపాటు మెంటల్ ఎబిలిటీ (వెర్బల్, నాన్ వెర్బల్) అంశాలు ఉంటాయి. పాలిటీకి సంబంధించి భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాలు, భారత రాజకీయ వ్యవస్థ-

ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ప్రధానంగా పంచాయతీరాజ్ వ్యవస్థపై దృష్టిసారించాలి. మూడంచెల పంచాయతీ వ్యవస్థ, నిర్మాణం, విధులు, 73,74వ రాజ్యాంగ సవరణలు, రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన, ఈ-గవర్నెన్స్, రెవెన్యూ పరిపాలన, వివిధ స్థాయిల్లో ఉన్న అధికారులు, -అధికారాలు-, విధుల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి. స్థానిక సంస్థలకు సంబంధించి కమిటీలు-

సిఫార్సుల్లో ప్రతి ఒక్క పాయింట్‌ను తెలుసుకోవాలి. తెలంగాణ చరిత్ర, ఉద్యమం, ఇక్కడి సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం మొదలైన విభాగాల నుంచి ప్రశ్నలు తప్పనిసరిగా కనిపిస్తాయి.
ఉద్యమ చరిత్రను లోతుగా అధ్యయనం చేయాలి…

తెలంగాణకు సంబంధించి ఉద్యమ చరిత్రను లోతుగా అధ్యయనం చేయాలి. ఉద్యమ చరిత్రలో 1948 నుంచి 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకు జరిగిన ముఖ్య ఉద్యమాలు, ఒప్పందాలు, ముల్కీ నిబంధనలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కేంద్రప్రభుత్వం నియమించిన కమిటీలు, -వాటి సిఫార్సులు వంటి వాటిపై అవగాహన ఏర్పరచుకోవాలి. దీంతోపాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా రూపొందించిన పునర్ వ్యవస్థీకరణ బిల్లులో తెలంగాణకు సంబంధించి ప్రత్యేకంగా పొందుపరచిన అంశాలు; తెలంగాణకు కల్పించిన హక్కులపై దృష్టిసారించాలి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ బగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, హరితహారం వంటి వాటితోపాటు ఇతర సంక్షేమ కార్యక్రమాల గురించి క్షుణ్ణం గా అధ్యయనం చేయాలి.

భౌగోళికంగా తెలంగాణలోని ముఖ్యమైన నదులు -గోదావరి, కృష్ణ- వాటి ఉపనదులు, వాటి పరీవాహక ప్రాంతాలు, ఆయా నదులపై కట్టిన సాగునీటి ప్రాజెక్టులు- డ్యామ్‌లు, ముఖ్యమైన పంటలు, భౌగోళిక ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలపై దృష్టిపెట్టాలి.

పేపర్ 2 : రెండవ పేపర్‌లో మొత్తం 10 అంశాలను సిలబస్ గా పేర్కొన్నారు. ఈ పేపర్‌లో ప్రధానంగా తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, 2018తోపాటు గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలపై ప్రధానంగా దృష్టిపెట్టారు.
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 నుంచి అధికంగా ప్రశ్నలు వచ్చే అవకాశముంది. పంచాయతీ సెక్రటరీ విధులు- బాధ్యతలను కూడా చట్టంలో వివరించారు. వీటిని అభ్యర్థులు సమగ్రంగా అధ్యయనం చేయాలి.

పంచాయతీ కార్యదర్శిగా నియమితులయ్యేవారు ఈ చట్ట పరిధిలో పనిచేయాల్సివుంటుంది. దీన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయడం పరీక్ష కోసం, ఎంపిక తర్వాత విధుల నిర్వహణకూ ఆవశ్యకం. చట్టంలోనే పంచాయతీ కార్యదర్శి విధులను వివరంగా పేర్కొన్నారు. ఈ చట్టంపై తెలంగాణ ప్రభుత్వ ప్రచురణ సమగ్రంగా అందుబాటులో ఉంది.

పునశ్చరణ అవసరం… జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టులకు సన్నద్ధ్దమయ్యే అభ్యర్థులు ఎప్పటికప్పుడు చదివిన అంశాలను పునశ్చరణ చేసుకోవడం అవసరం.

సిలబస్‌లో పొందుపరిచిన అంశాలను చాప్టర్ల వారీగా మోడల్ పేపర్లను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. అలాగే పాత ప్రశ్నాపత్రాలు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. వీటితోపాటు వివిధ ఇన్‌స్టిట్యూట్‌లు, వివిధ సంస్థలు నిర్వహించే గ్రాండ్ టెస్టులకు హాజరుకావడం మంచిది. మాక్ టెస్టులకు హాజరుకావడం వల్ల అభ్యర్థులు ప్రశ్నల క్లిష్టత స్థాయిని తెలుసుకో
గలుగుతారు.

గ్రాండ్ టెస్టులలో పాల్గొనడం ద్వారా అభ్యర్థులు ఎవరికి వారే పరీక్షించుకోగలుగుతారు. అభ్యర్థులు సొంతంగా టైం టేబుల్ రూపొందించుకుని అందుకు అనుగుణంగా నిరంతరం అధ్యయనం చేస్తూ ఉండాలి. అందుబాటులో ఉన్న సమయాన్ని వృథా చేయకుండా నిరంతరం శ్రమిస్తూ సిలబస్‌లో పొందుపరిచిన అన్ని అంశాలపై పట్టు సాధించాలి.

ముఖ్యమైన తేదీలు…
దరఖాస్తు ప్రారంభం : సెప్టెంబర్ 3, 2018
దరఖాస్తు ముగింపు : సెప్టెంబర్ 12, 2018,
ఫీజు చెల్లింపుకు సెప్టెంబర్ 11 చివరి తేదీ
దరఖాస్తు ఫీజు:రూ.800,
ఎస్‌సి,ఎస్‌టి,బిసి, వికలాంగ అభ్యర్థులకు రూ.400
వెబ్‌సైట్ : www.tspri.cgg.gov.in

Related Stories: