బెంగాల్‌లో బిజెపి దూకుడు

         లోక్‌సభ ఎన్నికలు ముగిసిపోయినా పశ్చిమ బెంగాల్‌లో మాత్రం బిజెపి, తృణమూల్ కాంగ్రెస్(టిఎంసి)ల మధ్య రాజకీయ యుద్ధం ఇంకా వేడిగా, వాడిగా సాగుతున్నది. మంగళ, బుధవారాల్లో ముగ్గురు టిఎంసి ఎంఎల్‌ఎలు, ఆ పార్టీకి చెందిన పెక్కుమంది కౌన్సిలర్లు బిజెపిలో చేరడం మరి ముగ్గురు శాసన సభ్యులు చేరబోతున్నట్టు వార్తలు రావడం ఆ రెండు పార్టీల మధ్య సాగుతున్న ఉధృత సమరానికి నిదర్శనం. ఇంకొక వైపు మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి […] The post బెంగాల్‌లో బిజెపి దూకుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

         లోక్‌సభ ఎన్నికలు ముగిసిపోయినా పశ్చిమ బెంగాల్‌లో మాత్రం బిజెపి, తృణమూల్ కాంగ్రెస్(టిఎంసి)ల మధ్య రాజకీయ యుద్ధం ఇంకా వేడిగా, వాడిగా సాగుతున్నది. మంగళ, బుధవారాల్లో ముగ్గురు టిఎంసి ఎంఎల్‌ఎలు, ఆ పార్టీకి చెందిన పెక్కుమంది కౌన్సిలర్లు బిజెపిలో చేరడం మరి ముగ్గురు శాసన సభ్యులు చేరబోతున్నట్టు వార్తలు రావడం ఆ రెండు పార్టీల మధ్య సాగుతున్న ఉధృత సమరానికి నిదర్శనం. ఇంకొక వైపు మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరు అంశం వివాదాస్పదమైంది. హాజరవుతానని మొదట ప్రకటించిన ఆమె ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ప్రమాణ స్వీకారోత్సవ వేదిక మీద పశ్చిమ బెంగాల్‌కు చెందిన బిజెపి అమర వీరుల కుటుంబాలకు సత్కారం అంశం మమత నిర్ణయం మార్చుకోడానికి కారణమైంది.

తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల దాడుల్లో మరణించిన బిజెపివారి కుటుంబ సభ్యులకు సత్కారం జరపనున్నట్టు ప్రకటించడంతో మమతా బెనర్జీ ఆగ్రహానికి గురయ్యారు. వారు రాజకీయ హత్యలకు గురైన వారు కాదని వ్యక్తిగత స్పర్దల వల్ల జరిగిన ఘర్షణల్లో చనిపోయిన వారని మమత అంటున్నారు. వారిని తృణమూల్ కార్యకర్తల దాడుల్లో చనిపోయిన వారుగా చెబుతున్నందుకు నిరసనగా తాను ప్రమాణ స్వీకారోత్సవానికి రాదలచుకోలేదని ఆమె ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకుంటున్న రాజకీయ ‘పరివర్తన’ ఆశ్చర్యం కలిగించడం సహజం. 33 సం॥ రాల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన వామపక్ష ఫ్రంట్‌ను 2011లో ఓడించి చరిత్ర సృష్టించిన తృణమూల్ కాంగ్రెస్ ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దెబ్బకు విలవిలలాడుతున్నది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఈ రాష్ట్రం నుంచి నామ మాత్రపు ప్రాతినిధ్యాన్ని మాత్రమే సాధించుకున్న బిజెపి ఈ సారి 18 సీట్లు కైవసం చేసుకొని కలా, నిజమా అనిపించింది.

2011లో వామపక్ష ఫ్రంట్‌ను నామరూపాలు లేకుండా చేసినప్పుడు దానిని ఆ రాష్ట్రంలో వస్తున్న మార్పు (పరివర్తన్) గా మమతా బెనర్జీ వర్ణించారు. ఇప్పుడా మార్పు టిఎంసిని తొక్కుకుంటూ బిజెపి దిశగా వడిగా సాగిపోతున్నది. ఇది మంచి నుంచి చెడుకా, కాదా అనే దాన్ని వదిలిపెడితే పశ్చిమ బెంగాల్ ప్రజలు మరోసారి మార్పు కోరుకుంటున్నారని స్పష్టపడుతున్నది. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల హింసోన్మాదం, ప్రశ్నను, అసమ్మతిని సహించలేని దాని నాయకత్వ ధోరణి ఆ రాష్ట్ర ప్రజలను విసుగెత్తించాయని అందుకే వారు బిజెపి వైపు చూడడం ప్రారంభించారని బోధపడుతున్నది. రాష్ట్ర జనాభాలో 30 శాతంగా ఉన్న ముస్లింలను మమత బుజ్జగిస్తున్నారని అలాగే వలస వచ్చి స్థిరపడినవారి పట్ల మెతక వైఖరి వహిస్తున్నారని భారతీయ జనతా పార్టీ చేసిన ప్రచారాన్ని అక్కడి మెజారిటీ ప్రజలు నమ్మినట్టు తెలుస్తున్నది. అయితే జరిగినవి లోక్‌సభ ఎన్నికలే కాబట్టి మమతా బెనర్జీ వద్ద గల సుస్థిరమైన రాష్ట్రాధికార దండానికి ఎటువంటి ముప్పు కలగడానికి వీలు లేదు. అసెంబ్లీలో తృణమూల్ కాంగ్రెస్‌కు 200 పైచిలుకు స్థానాల బలం ఉన్నది.

పార్టీలో పెద్ద చీలిక వంటి పరిణామమేదో సంభవిస్తే తప్ప 2021లో జరగవలసి ఉన్న అసెంబ్లీ ఎన్నికల వరకు మమత పాలన అవిఘ్నంగా కొనసాగడానికే అవకాశాలెక్కువగా ఉన్నాయి. అయితే ఆమెకు పీడకలలు రప్పించి తీరాలనే దృష్టి బిజెపి ధోరణిలో స్పష్టంగా కనిపిస్తున్నది. ఇది ఎంతమాత్రం సమర్థించదగినది కాదు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతున్న దశలోనే 40 మంది తృణమూల్ ఎంఎల్‌ఎలు తనతో మాట్లాడుతున్నారని ప్రధాని మోడీ ప్రకటించారు. ఎన్నికల తర్వాత తృణమూల్ ప్రభుత్వాన్ని పడగొట్టబోతున్నామని ఆయన అప్పుడే సూచన ప్రాయంగా వెల్లడించారు. ఇప్పుడు జరుగుతున్నది దానికి దారితీసే కసరత్తేనని అనిపిస్తే తప్పు పట్టలేము. ప్రజాస్వామ్య రాజ్యాంగానికి చిత్తశుద్ధితో బద్ధుడనై ఉన్నానని చెప్పుకున్న ప్రధాని మోడీగాని, బిజెపి జాతీయ నాయకత్వంగాని పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వం మార్పు కోసం తొందరపడడం ఎంతమాత్రం హితవైనది కాదు.

లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును ఆసరాగా చేసుకొని అసెంబ్లీ తీర్పును తారుమారు చేయాలనుకోడం మంచి కాదు. కేంద్రంలో తనకు లభించిన ఎదురులేని అధికారంతో రాష్ట్రాల్లో ప్రతిపక్షాల ప్రభుత్వాలను కూలదోయాలనే అత్యుత్సాహానికి పాల్పడడం వల్ల గతంలో కాంగ్రెస్‌కు ఎటువంటి చేదు అనుభవం ఎదురైందో తెలిసిందే. రేపు భారతీయ జనతా పార్టీకి కూడా అదే దుస్థితి కలుగుతుంది. అందుచేత బిజెపి పశ్చిమ బెంగాల్‌లోగాని, కర్ణాటకలోగాని మళ్లీ ప్రజల అభిమానాన్ని చూరగొనడం ద్వారానే అధికారాన్ని చేజిక్కించుకోవాలిగాని కూల్చివేతల కుట్రలను ముమ్మరం చేయడం ద్వారా అందుకు పాల్పడడం తగదుగాక తగదు.

Political war between BJP and TMC in Bengal

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బెంగాల్‌లో బిజెపి దూకుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: