వేధిస్తారు.. వసూలు చేస్తారు

Police

 

హైదరాబాద్: హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న కొందరు ఎస్సైల వసూళ్ల వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. వసూళ్లకు పాల్పడుతున్న ఎస్సైలు, ఇన్స్‌స్పెక్టర్లపై నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ కఠినంగా వ్యవహరిస్తున్నా వారిలో మార్పు రావడం లేదు. వెస్ట్‌జోన్ పరిధిలోని పలు ఫోకల్ పోలీస్ స్టేషన్లలో ఎస్సైలుగా దీర్ఘకాలంగా పోలీస్ స్టేషన్లలో తిష్టవేసి కొందరు ఎస్సైలు కేసులు, నిందితుల పేరును సాకుగా చూపి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో అడ్మిన్ ఎస్సైగా పనిచేస్తున్న సుధీర్ రెడ్డి, ఇన్స్‌స్పెక్టర్ బల్వంతయ్య ఓ కేసులో నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ.50,000., మద్యం బాటిళ్లను లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇది పోలీస్ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. ఈ సంఘటన మరవకముందే అదే తరహాలో కొందరు ఎస్సైలు మద్యం బాటిళ్లు తీసుకుంటున్నారు.

పబ్ నిర్వాహకులకు వేధింపులు…
వెస్ట్ జోన్ ప్రాంతంలో ఉన్న పబ్‌ల నిర్వాహకులను బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లలోని కొందరు ఎస్సైలు నిత్యం వేధిస్తున్నట్లు తెలిసింది. నిబంధనల పేరుతో నిర్వాహకులను బెదిరిస్తూ నెలవారీగా మామూళ్లు తీసుకునేలా మార్గం సుగమం చేసుకుంటున్నారే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మామూళ్లతో ఆగకుండా తాము చెప్పినప్పుడల్లా తాము పంపించిన వారికి పబ్‌లలో ఉచితంగా మద్యం సరఫరా చేయాలని వేధిస్తున్నారు. వారి మాట వినని పబ్ నిర్వాహకులపై పబ్ సమయం దాటిపోయాక కూడా నడుపుతున్నారని అక్రమ కేసులు నమోదు చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చేసేది ఎమిలేక పబ్ నిర్వాహకులు సదరు ఎస్సైలు అడిగినప్పుడల్లా డబ్బులతోపాటు వారు చెప్పిన పనిచేస్తున్నారు.

ప్రతి పబ్ నుంచి ఆ ఎస్సైకి మద్యం బాటిళ్లు…
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో దీర్ఘకాలంగా తిష్టవేసిన ఓ ఎస్సై పబ్ నిర్వాహకుల నుంచి నిత్యం మద్యం బాటిళ్లను వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని పబ్ నిర్వాహకులను తాను చెప్పినప్పుడళ్లా మద్యం బాటిళ్లను ఇవ్వాలంటూ హుకుం జారీ చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడు. పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న దాదాపు 20 పబ్బుల నుంచి రెండు, మూడు రోజులకు మద్యం బాటిళ్లు తీసుకుంటున్నట్లు తెలిసింది. పబ్‌లే కాకుండా పేరొందిన రెస్టారెంట్ల నుంచి సైతం సదరు ఎస్సైకి నిత్యం ఖరీదైన బఫెట్ ఉచితంగా వెళ్లాల్సిందేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి ఎస్సైలపై ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

police illegal charges on pubs cafes and restaurants

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వేధిస్తారు.. వసూలు చేస్తారు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.