ఖాకీ కర్కశం

Police

 

నెట్టి పడేశాడు.. బూటు కాలితో తన్నాడు.. అడ్డొచ్చిన విద్యార్థులపై లాఠీ ఝుళిపించాడు..
సోషల్ మీడియాలో వీడియో వైరల్.. ఘటనపై నెటిజన్ల మండిపాటు
చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు : బాధితురాలి తల్లి అనుమానం

మన తెలంగాణ/హైదరాబాద్/రామచంద్రాపురం : సంగారెడ్డిలో పోలీసుల తీరు వివాదాస్పదమైంది. వివరాల్లోకి వెళితే… ఉన్నత చదువులు చదివించాలన్న సదాశయంతో ఓ కార్పోరేట్ కాలేజీలో చేరిన తమ కుమార్తె బలవన్మరణం చెందడంపై ఆమె తల్లిదండ్రుల గుండె పగిలింది. బుధవారం ఆమె మృతదేహాన్ని మార్చురీ నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న దశలో మృతురాలి తండ్రిపై ఓ పోలీసు అధికారి విచక్షణారహితంగా ప్రవర్తించాడు. మానవత్వం మరిచాడు. కర్కశత్వాన్ని ప్రదర్శించాడు. ఆ తండ్రిని బూటు కాలితో తన్నాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరలయ్యింది. పోలీసుల దురుసు, దుందుడుకు ప్రవర్తనపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కూతురు పోయి పుట్టెడు దుఃఖంలో వున్న తల్లిదండ్రులతో పోలీసులు వ్యవహరించే తీరు ఇదేనా? అని నెటిజన్లు పోలీసుల దుశ్చర్యపై మండిపడుతున్నారు. ఈ ఘటనపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ శివారులోని పటాన్ చెరువులో ఈ విషాద సంఘటన బుధవారం చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే…
పటాన్‌చెరువు సమీపంలోని వెలిమల గ్రామంలోని ఓ కార్పొరేట్ కళాశాలలో సంధ్యారాణి అనే విద్యార్థిని ఇంటర్ మొదటి సంవత్సరం విద్యనభ్యసిస్తోంది. ఏమైందో ఏమో కానీ.. మంగళవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఆమె కాలేజీ హాస్టల్ భవనంలో బాత్‌రూంలోకి వెళ్లి అక్కడే ఉరివేసుకుని బలవన్మరణం చెందింది. గమనించిన కాలేజీ సిబ్బంది ఆమెను చికిత్స నిమిత్తం నల్లగండ్ల సిటిజన్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. కుమార్తె మరణవార్త విని బోరున విలపించారు.

అసలేం జరిగింది!?
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఎనుగొండకు చెందిన చంద్రశేఖర్ తన పెద్ద కుమార్తె సంధ్యారాణి(16)ని వెలిమలలోని ఓ కార్పోరేట్ కళాశాలలో హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటోంది. సంధ్యారాణి వారం రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. యాజమాన్యం తమకు తెలిసిన వైద్యం పేరిట మాత్రలను ఇచ్చినా జ్వరం తగ్గుముఖం పట్టలేదు. ఈ విషయాన్ని సంధ్యారాణి ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు వివరించింది.

దీంతో వారు కలిసేందుకు వస్తామని సంధ్యకు తెలపగా మీరు వచ్చినా యాజమాన్యం అనుమతించదని శనివారం రండని ఇంట్లో వారికి తెలిపింది. మంగళవారం మధ్యాహ్నం సంధ్యారాణి బాత్‌రూంలోకి వెళ్లి గీజర్ పైపుతో ఉరేసుకుని బలవన్మరణం చెందిందని చెబుతూ సంధ్యా రాణిని నల్లగండ్లలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందింది. సంధ్యారాణి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించే సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రులు, బంధువులు విద్యార్ధిని శవంతో కళాశాల ఎదుట నిరసన వ్యక్తం చేసేందుకు ప్రయత్నించారు.

మార్చురీ తాళం పగులగొట్టి ప్రీజర్‌బాక్సుని జాతీయరహదారిపైకి తీసుకుని వచ్చారు. ఒక్కసారిగా అప్రమత్తమైన పోలీసులు లాఠీచార్జి నిర్వహించి ప్రీజర్ బాక్సుని తిరిగి మార్చురీకి తరలించారు. ఈ క్రమంలో విద్యార్థిని తండ్రి చంద్రశేఖర్ ఆసుపత్రి గేటు వద్ద ప్రీజర్ బాక్సుకు అడ్డుపడగా కానిస్టేబుల్ శ్రీధర్ బలంగా బూటుతో కడుపులో తన్నడంతో బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డుపడిన విద్యార్థులపై సైతం లాఠీ ఝుళిపించారు. అటు కాలేజీ, ఇటు ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి కొనసాగింది. ధర్నాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ ను అక్కడ ఉన్న పోలీసు అధికారులు ఆసుపత్రి నుంచి వెళ్లగొట్టారు.

అనుమానాలెన్నో…!
సంధ్యారాణి బలవన్మరణంపై ఆమె తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. ఈ సందర్భంలో తల్లి సంధ్యారాణి మాట్లాడుతూ.. ‘సంధ్య జర్వం వచ్చిందని మాకు ఫోన్ చేసింది. కాలేజీ సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదు, వారి నిర్లక్షంగానే నా కూతురు చనిపోయింది. మంగళవారం కాలేజీ నుండి ఫోన్ చేసి సంధ్య ఆరోగ్యం బాగాలేదు, అర్జెంట్‌గా రావాలంటూ ఫోన్ చేశారు. మేము వచ్చేసరికి నల్లగండ్లలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వాష్ రూమ్‌లోని గ్రీజర్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని కాలేజీ సిబ్బంది చెబుతున్నారు. ఓ వైపు కూతురు చనిపోయి ఉంటే పోలీసులు కాళ్లతో తన్నడం ఎంతవరకూ కరెక్ట్? అని ఆమె ప్రశ్నిస్తున్నారు.
బుధవారం మధ్యాహ్నం ఘటనకు సంబంధించిన సమాచారం తెలుసుకుని ఘటనపై విచారణ చేపట్టేందుకు కాలేజీకి వచ్చిన ఇంటర్మీడియేట్ అధికారి కిషన్‌ని విద్యార్థి సంఘాలు ఘోరావ్ చేశాయి. సదరు కళాశాలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని నిలదీశారు.

పరిహారానికి యాజమాన్యం అంగీకారం…
చిట్టచివరకు సదరు కళాశాల యాజమాన్యం విద్యార్థి కుటుంబానికి రూ.12 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించేందుకు అంగీకరించడంతో ఉద్రిక్త పరిస్థితులు చల్లబడ్డాయి. సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో పటానుచెరు ఏరియా ఆసుపత్రిలో సంధ్యారాణి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి తల్లిద్రండులకు అప్పగించారు. విద్యార్థిని ఆరోగ్యం విషయంలో పూర్తి నిర్లక్షం వహించినందుకు సదరు కళాశాల డీన్, డైరెక్టర్, ప్రిన్సిపాల్‌పై సెక్షన్ ౩౦4 కింద కేసు నమోదు చేసినట్లు సిఐ రాంరెడ్డి తెలిపారు.

కర్కశ ఖాకీపై వేటు
కర్కశ ఖాకీపై వేటు పడింది. కానిస్టేబుల్ శ్రీధర్(పిసి ౩౦9)ను సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. మృతురాలి తండ్రితో దురుసుగా ప్రవర్తించిన సంఘటనపై పోలీసు శాఖ తరపున తీవ్రంగా చింతిస్తున్నామని సంగారెడ్డి జిల్లా ఇంఛార్జి ఎస్పీ చందనదీప్తి తెలిపారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.

Police action in Sangareddy is controversial

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఖాకీ కర్కశం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.