అంతర్మథనంలోకి నెట్టివేసే నడిసొచ్చిన తొవ్వ

  జీవితం నుండి కవిత్వం పుడుతుందా లేదా కవిత్వం నుండి జీవితం ఆవిష్కృతం అవుతుందా అన్న ప్రశ్న ఎదురైనపుడు జీవితాన్ని, కవిత్వాన్ని పర్యాయ పదాలుగా చేసుకుని, ఓ పిల్లవాడు జీవితంలోకి కవిత్వంలోకి అడుగులు వేస్తూ కనిపిస్తాడు. కవిత్వం జీవిత ఆత్మగా మారినపుడు, జీవితమే కవిత్వంలోకి అడుగులు వేసినపుడు, అలాంటి జీవితం సమాజంలోకి, బతుకు మూలాల్లోకి వెళ్లగలిగినపుడు ఆ కవిత్వం, ఆ జీవితం తనకంటూ ఓ నిర్మాణాత్మకమైన తొవ్వను ఏర్పరుచుకుంటుంది. ఆ తొవ్వ అడుగడుగునా, కండ్లల్లో సుడులు తిరుగుతూ […] The post అంతర్మథనంలోకి నెట్టివేసే నడిసొచ్చిన తొవ్వ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

జీవితం నుండి కవిత్వం పుడుతుందా లేదా కవిత్వం నుండి జీవితం ఆవిష్కృతం అవుతుందా అన్న ప్రశ్న ఎదురైనపుడు జీవితాన్ని, కవిత్వాన్ని పర్యాయ పదాలుగా చేసుకుని, ఓ పిల్లవాడు జీవితంలోకి కవిత్వంలోకి అడుగులు వేస్తూ కనిపిస్తాడు. కవిత్వం జీవిత ఆత్మగా మారినపుడు, జీవితమే కవిత్వంలోకి అడుగులు వేసినపుడు, అలాంటి జీవితం సమాజంలోకి, బతుకు మూలాల్లోకి వెళ్లగలిగినపుడు ఆ కవిత్వం, ఆ జీవితం తనకంటూ ఓ నిర్మాణాత్మకమైన తొవ్వను ఏర్పరుచుకుంటుంది. ఆ తొవ్వ అడుగడుగునా, కండ్లల్లో సుడులు తిరుగుతూ నేలను తడిపిన కన్నీళ్లు, ఓ పోరాటపు గొంతు నుండి ప్రపంచాన్ని జయించేలా ఉవ్వెత్తున ఎగసిన ఓ స్వరపు అంచు, ఆవేశంతో వేడెక్కి నిప్పుల్లా మరిగే చెమట చుక్కలు, ప్రతీ ఉద్వేగాన్ని అక్షరాలలో నింపుకుని సిగరెట్ దొప్పలపై ప్రాణం పోసుకున్న కవిత్వం, లాఠీ దెబ్బలకు, ఎన్‌కౌంటర్లకు చిందిన రక్తపు మడుగులు, తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ, తమ పోరాటాన్ని, ఉనికిని చాటి చెప్తూ, ఆ తొవ్వ అడుగడుగునా సజీవ గుర్తులుగా ఊపిరి తీస్తాయి.

అలాంటి బతుకును, పోరాటాన్ని, ఉద్యమాన్ని, అనుభవాన్ని ప్రతీ అడుగులో మోస్తూ, ఆ కాలం నాటి స్థితిగతులను, ఆ పరిస్థితులలో, ఉద్యమాలలో, పోరాటాలలో కవిత్వం తనపై, పోరాటంపై చూపిన ప్రభావాన్ని, ఆ అనుభవం నడిచొచ్చిన అడుగులను ఒక చోట వేయిస్తూ, ఎన్నో సాహిత్య చర్చలను, సాహిత్య, ఉద్యమ ప్రాముఖ్యతను నీతో నాతో పంచుకుని, నిన్ను నన్ను తన మొదటి అడుగు నుండి ఓ కొత్త తీరానికి తీసుకుని వెళ్లి, అంతర్మథనంలోకి నెట్టివేసే తొవ్వే నారాయణ స్వామి వెంకటయోగి రచించిన ‘నడిసొచ్చిన తొవ్వ’. ఈ పుస్త కం వ్యక్తికి, కవికి, సమాజానికి ఏం ఇవ్వగలిగింది అన్న ప్రశ్న ఎదురైనపుడు, సాహిత్యం సమాజాన్ని వ్యవస్థను ఏ విధంగా ప్రభావితం చేయగలుగుతుంది అన్న ప్రశ్నలకు ఈ తొవ్వ వెంట ఎన్నో అనుభవాలు సమాధానాలుగా ఎదురవుతాయి. సాహి త్యం ఒక వ్యక్తిని ప్రత్యక్ష సమాజంలోకి పోరాటంలోకి ఉద్యమంలోకి ఎలా తీసుకువెళ్లగలిగిందో, ఎలా ప్రభావితం చేయగలింగిందో అవగాహనలోకి వస్తుంది.

కవిత్వం వ్యక్తిగత స్వలాభాల కోసమే రాసుకుంటాము అనే ధోరణి కలిగిన కవుల ఆలోచనా విధానంపై ఈ నడిసొచ్చిన తొవ్వ నిర్మాణాత్మకమైన ప్రభావాన్ని చూపగలుగుతుంది. సాహిత్యం కవిత్వం ద్వారా ఏం సాధించవచ్చు, ఏ విధంగా సమాజానికి కవిత్వాన్ని అన్వయించవచ్చు అన్న సంశయాల మధ్య నలిగే వారికి ఇదొక నిర్దిష్టమైన తొవ్వను చూపించగలుగుతుంది. ఒక సగటు పాఠకుడికి, కవికి సాహిత్యం పట్ల, సమాజంపై దాని ప్రభావం పట్ల ఒక స్థాయిలో నిర్దిష్ట అవగాహనా దృక్పథం ఏర్పడడానికి తన వంతు పాత్రను ఈ నడిసొచ్చిన తొవ్వ భుజాన మోసింది. కవిత్వం పట్ల ఒక ప్రేమని, బాధ్యతని, గౌరవాన్ని పెంచుతుందీ నడిసొచ్చిన తొవ్వ.

ఈ నడిసొచ్చిన తొవ్వలోని ప్రారంభ అడుగులే, ఆ తొవ్వ సుదీర్ఘ ప్రయాణంగా పోరాటాన్ని, ఉద్యమాన్ని సంలీనం చేసుకుని సాగడానికి పునాదులుగా నిలిచాయి. తన ఎనిమిదేళ్ల ప్రాయం నుండి తనలో మొదలైన సంఘర్షణను, వివిధ సంఘటనలను, ఆయా సంఘటనలలో ఉన్న వ్యక్తుల మధ్య సంభాషణలను, తనలోని ఆ కాలపు అంతర్మథనానికి కొన్ని దశాబ్దాల తరువాత సైతం సజీవ సహజ రూపాన్ని ఇవ్వగలిగారంటే, ఆ గతం ఎంతటి బలమైన ప్రభావాన్ని ఆ పిల్లవాడిపై, రచయితపై వేశాయో, ఎన్ని కన్నీటి రాత్రులను, కాలిన గాయాలతో ఎన్ని సాయంత్రపు నడకలను అనుభవించాయో ఒక అవగాహనకు రావచ్చు.

లేత ప్రాయంలోనే తోటి విద్యార్థుల నుండి సామాజిక అర్థిక పరమైన వివక్ష అడుగడుగునా చుట్టు ముట్టినప్పుడు, అందులో నుంచి పుట్టిన సంఘర్షణ, ఆదిలోనే తెలుగు సాహిత్యంతో సాన్నిహిత్యాన్ని పెంచే పరిస్థితులు, పాఠశాల నిర్వహిస్తున్న పద్య పోటీలో నువ్వు తక్కువ కులం వాడివి, నువ్వు నాతో గెలవలేవు అన్న తోటి విద్యార్థి మాటలు, ఆ హేళన పెంచిన కసి, అదే సమయం లో సాహిత్యంపై పుట్టిన ఆసక్తి, ఆ పిల్లవాడి వెళ్లాల్సిన తొవ్వకు బలమైన పునాదులు వేశాయి. దాదాపుగా తొమ్మిది ఏళ్ల చిరుప్రాయంలోనే స్త్రీని భోగ వస్తువుగా చిత్రీకరిస్తూ వెలువడిన సాహిత్యంలో ఏదో తెలియని లోపముందని, ఆ పద్యాల్లో ఎక్కడో ఒక చోట, వారన్న సమాజం యాదృచ్ఛికంగా కనబడింది తప్ప సమాజాన్ని, జీవితాన్ని, జీవితంలోని వైరుధ్యాలను, బతుకు వెతలను చెప్పినట్టు కనబడడం లేదని, ఇటువంటి దారిసరైనది కాదని విశ్వసించి, ప్రజల బతుకును, ఆ బతుకు వెతలను ప్రతిబింబించేదే సమాజానికి సంఘానికి ఉపయోగపడుతుందని భావించి, ఆ వయసులోనే పోతన నైతికతను గ్రహించి అటు వైపు అడుగులు వేసి, తను వెళ్లాల్సిన మార్గాన్ని నిర్దేశించుకున్నాడీ పిల్లవాడు.

ఈ పిల్లవాడి ఆలోచనా దృక్పథం ఈ కాలానికీ, ఈ కాలం కవులకీ అన్వయించదగినదే. ఈ తొవ్వను రచయిత ఆత్మకథగా చూడడం కన్నా, కవిత్వాన్ని జీవితాన్ని ఒకే అడుగులో బంధించి అడుగులు వేసిన ఓ పిల్లవాడి ప్రయాణపు అనుభవాల గాయంగా చూసినప్పుడే, ఆ అడుగుల ఆత్మ పాఠకుడిని వెంటాడుతుంది. నిజానికి ఈ ప్రయాణంలో, ప్రయాణం తరువాతా పరిపక్వత పొందిన ప్రస్తుత నారాయణ స్వామి ఎక్కడా కనిపించడు, వినిపించడు. కనిపించేది ఆ పిల్లవాడి పాదముద్రలే, వినిపించేది ఆ పిల్లవాడి కవిత్వమే.

ఈ సంక్లిష్ట ప్రయాణంలో వివిధ సంఘటనలు, పరిస్థితులు ఆ ప్రయాణానికి అనుకూలంగా మారాయా, లేదా ఆ ప్రయాణమే భిన్న అవకాశాలను తనకు తాను కల్పించుకుంటూ, అంది వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకుంటూ ఒక నిర్మాణాత్మక తొవ్వను ఏర్పరుచుకున్నాయా అన్న సంశయం వచ్చినప్పుడు, మనసులో ఒకే విషయంపై ఆలోచనల ప్రవాహం సాగుతున్నప్పుడు, అస్పష్టంగా, అదృశ్యంగా ఉన్న దారులు సైతం ముసుగులు తొలగించుకుని గమ్యం వైపు తనకు తాను ఓ అడుగుగా మారి సహకరిస్తాయి. తపన సంఘర్షణ అన్వేషణ అదృశ్యంగా ఉన్న దారుల గుట్టు విప్పి గమ్యానికి బాటలు పరుస్తుంది అన్నది జీవిత సూత్రం. సరిగ్గా ఈ నడిసొచ్చిన తొవ్వ అడుగు అడుగులో జరిగిందదే.

ఒక అడుగు తీసి మరో అడుగు వేసే లోపు దేశ విదేశీ కవుల కవిత్వాలు, కవిత్వ పుస్తకాలు ఎన్నో ఆ పిల్లవాన్నే కాదు, సగటు పాఠకుడినీ పలకరిస్తాయి, ప్రేరేపిస్తాయి. విప్లమోద్యమాలలో ప్రముఖ పాత్ర పోషించిన వరవర రావు, శివారెడ్డి, హెచ్ ఆర్ కె.విమలక్క వంటి ఉద్యమకారులతో కలిసి చాయ్ బిస్కట్ తింటూ ఇక్కడ సాహిత్య చర్చలు జరుగుతాయి. రాసిన ప్రతీ కవితనూ అపురూపంగా చూసుకుంటూ, ఓ ప్రకాష్ కో, ఓ రమేష్ కో తోటి విద్యార్ధులతోనో, ముఖ్యంగా కవి శివారెడ్డితోనో పంచుకునే క్షణాలు అబ్బురమనిపిస్తాయి.

ఈ తొవ్వ గుండా ప్రయాణిస్తున్న వారికి నేనూ ఓ కవితను శివారెడ్డికి చూపించాలనే అనుభూతి కలగడం అత్యంత సహజం. ఈ తొవ్వలో శివారెడ్డి ప్రేమే కాదు, కవిత్వం గురించి అలా భుజం మీద చేయి వేసి ఆయన చెప్పే ఎన్నో విషయాలు, సూచనలూ ప్రతీ పాఠకుడినీ కదిలిస్తాయి, ఆలోచింపజేస్తాయి. కవిత్వం పట్ల ఒక ప్రేమనీ బాధ్యతనీ, గౌరవాన్నీ పెంచుతాయి. ఈ తొవ్వ వెంట ఎన్నో క్షణాలు కవిత్వంతో కలిసి కాలినడకన వెళ్తుంటాయి. మరెన్నో భావాలు సిగరెట్ దొప్పలపై, చిన్న కాగితాలపై ప్రాణం పోసుకుంటాయి. కవిత్వం కవిత్వంగా కాక ఆ పిల్లవాడి శ్వాసగా పరిచయమవుతుంది. అప్పుడు కొన్ని ప్రశ్నలు అంతర్లీనంగా వినపడి, పాఠకుడిని అంతర్లాలోచనలోకి నెట్టివేస్తాయి. పిఎస్‌డియు లోని ప్రకాష్ రమేష్ కిరణ్ నగేష్ వంటి స్నేహితులు ప్రతీ పాఠకుడికి మిత్రులవుతారు. సాహిత్య లేకుండావారి మధ్య నుండి కాలం ఇసుమంతైనా కదలదు. పుస్తక ప్రపంచం ఓ అపురూప దృశ్యంలా కళ్ళ ముందు మెదిలి, కొత్త పుస్తకంలోని సువాసనలోకి ఉన్న పలాన మనసును నెట్టివేస్తుంది. అందులో కవిత్వ పుస్తకాలు పేజీల్లా తిరుగుతూనే ఉంటా యి.

ఈ పుస్తకం చదువుతున్నప్పుడు ఎదో మూలాన నేనూ పుస్తకం అరువు తెచ్చుకోవాలన్న దుగ్ధ మనసును తడుతుంది. చూపు నుండి తప్పిపోయిన ఎన్నో పుస్తకాలు కళ్ళ ముందు లీలగా మెదులుతాయి. ఈ కవిత్వం, సంఘర్షణ, పోరాటం మధ్య మధ్య లో ప్రేమ బాధ అయోమయం అసహనం కలగలిపిన ఓ కన్నీటి స్పర్శ, ఓ వెచ్చని కౌగిలింతతో, అతనే ప్రపంచంగా బతుకున్న ఓ తండ్రి ఈ పిల్లవాడి గురించి ప్రతీ క్షణం ఆలోచిస్తూ కనబడుతారు. గేటు దగ్గర తన మనుమడు రాసే ఉత్తరం వస్తుందేమో అని ప్రతీ రోజూ కళ్లద్దాలు వెనుక మసకగా కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ, గతాన్ని తలుచుకుని ఊపిరి అల్లుకుంటూ నిలబడ్డ నాయనమ్మ ప్రేమ పలకరిస్తూనే ఉంటుంది. కానీ ఆ మనుమడి జీవితం కవిత్వం పోరాటాల చుట్టూ తిరుగుతూ కవిత్వాన్ని ప్రపంచంగా చేసుకుని, నాయనమ్మకు, నాన్నకు నిరీక్షణను మిగిలిస్తుంది. అలా నిరీక్షిస్తూనే నాయనమ్మ, ఆ తరువాత తండ్రీ కాలం చేయడం విషాదభరితం. ఆ పిల్లవాడిని అనునిత్యం వెంటాడే ఓ చేదు జ్ఞాపకం.

ఈ తొవ్వ నుండి అడుగు బయటికి వేసిన తర్వాత కూడా భుజాల మీద శివారెడ్డి చేతులు అలాగే ప్రేమగా కవిత్వమై నిమురుతూ ఉంటాయి. ఒక పుస్తకం నచ్చితే అది జీవితాంతం మనతోనే ఉండాలన్న ఆయన మాటలు సందర్భానుసారంగా వినిపిస్తూనే ఉంటాయి. జేబులో దాచుకున్న సిగరెట్ దొప్పలపై కవిత్వం సజీవంగానే ఉంటుంది. పోరాటం ఉద్యమం అన్నప్పుడల్లా ఈ తొవ్వ యాదిలోకి వస్తుంది. ఎందరో విప్లవ ఉద్యమకారులపై, ఉద్యమాలపై గౌరవం పెరుగుతుంది. అబిడ్స్‌కి వెళ్ళినప్పుడు సెకండ్ హ్యాండ్ పుస్తకాలు కొనుక్కుంటూ ఓ పిల్లవాడు కళ్ళ ముందు తచ్చాడుతూ తిరగాడుతూనే ఉంటాడు. బస్సు స్టాపుల్లో, కాలినడకన కవిత్వం కొత్తగా పరిచయం అవుతూనే ఉంటుంది. ప్రతీ అక్షరం మీద గౌరవం పెరుగుతుంది. ఇది కథా కాదు, నవల అంతకన్నా కాదు. కవిత్వాన్ని జీవితాన్ని ఒకే అడుగులో నింపుకున్న జీవితం.

చివరి పేజీలోని చివరి అక్షరాన్ని తిరగేసినప్పుడు భౌతికంగా ఈ తొవ్వ నీ నుండి పక్కకు జరుగుతుందేమో కానీ, ఎన్నో అడుగుల్లో మరెన్నో సంఘటనల్లో అంతరార్ధ భావాలలో లీలగా ఈ తొవ్వ నీలో, నీ అక్షరాల్లో కదులుతూనే ఉంటుంది. ఈ నడిసొచ్చిన తొవ్వకు ఈ భాగం ముగింపు కాదు. ఈ భాగమంతా అతన్ని పిల్లవాడిగానే స్పృశించడానికి కారణం తను నడిసొచ్చిన తొవ్వలో ఇది మొదటి భాగం మాత్రమే. అంటే సుమారు ఇరవై రెండు, ఇరవై మూడేళ్ల వరకు జరిగిన ప్రయాణం. దాదాపు రెండు సంవత్సరాల పాటు వారం వారం శీర్షికగా కవిసంగమం అనే ఫేస్ బుక్ గ్రూపులో నిర్విరామంగా సాగిన ఈ ప్రస్తుత తొవ్వ, మరెన్నో అడుగులను ఆ సంగమంలోని పాఠకులతో కలిసి వేస్తూనే ఉంది. ప్రస్తుతం ఈ నడిసొచ్చిన తొవ్వ లో మొదటి అడుగు వేయండి. తరువాత అదే మిమ్మల్ని తీసుకెళ్లాల్సిన చోటుకు తీసుకెళ్లి వదిలేస్తుంది.

poetry Personal Self interest

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అంతర్మథనంలోకి నెట్టివేసే నడిసొచ్చిన తొవ్వ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: