రాజ్యసభ ఘనత

 

Sampadakiyam            సందర్భానుసారంగా వ్యక్తులను, సంస్థలను, వ్యవస్థలను ప్రశంసిస్తూ బిగ్గరగా మాట్లాడడానికి, తమ వరకూ వచ్చేటప్పుడు వారి పట్ల, వాటి మీద గౌరవాన్ని చూపించి ఆ పొగడ్తకు వన్నె తెచ్చేలా వ్యవహరించడానికి చాలా తేడా ఉంది. మాటకు తగిన క్రియాశీలత ఉన్నవారు ప్రజల హృదయాలలో నిలిచిపోతారు. లేనివారి ఉపన్యాసాలు, ఉగ్గడింపులు గాలిలో కలిసిపోతాయి. 250వ సమావేశాల సందర్భంగా రాజ్యసభను ప్రధాని మోడీ విశేష పదజాలంతో కొనియాడారు. అది పరమోత్తమ సభ అన్నారు. సమాఖ్య వ్యవస్థకు ప్రాణం వంటిదని భావించారు. ఎన్నో వైరుధ్యాలున్న సువిశాల భారత దేశానికి బ్రిటన్, అమెరికాల్లో మాదిరిగా రెండు సభల పార్లమెంటు ఉండడమే మంచిదని రాజ్యాంగ సభ పెద్దలు అభిప్రాయపడ్డారు. 1952లో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగినంత వరకు రాజ్యాంగ సభే తాత్కాలిక పార్లమెంటుగా వ్యవహరించింది.

అది ఒకే సభతో కూడిన పార్లమెంటు. ప్రజలు నేరుగా ఎన్నుకునే ప్రతినిధుల సభ ఒక్క దాని వల్లనే ఇంతటి పెద్ద దేశం అవసరాలు తీరవని భావించి జాతీయ స్థాయిలో రెండవ సభను రాష్ట్రాల మండలిగా ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని గుర్తించారు. ఆ విధంగా 1954 ఆగస్టు 23న రాజ్యసభ ఏర్పాటును ప్రకటించారు. లోక్‌సభకు భిన్నమైన నిర్మాణంతో రాజ్యసభ అవతరించేలా చూశారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఎన్నికైన ప్రతినిధులు రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవాలని, అదనంగా వివిధ రంగాలకు చెందిన నిపుణులు 12 మందిని నామినేటెడ్ సభ్యులుగా చేర్చుకోవాలని, లోక్‌సభకు పోటీ చేసేవారికి ఉండవలసిన పాతికేళ్ల వయసుకు మించి రాజ్యసభ సభ్యత్వానికి 30 ఏళ్లుండాలని నిర్ణయించారు. పదవీ కాలాన్ని కూడా ఆరేళ్లు చేశారు. భారత ఉపరాష్ట్రపతి సభాధ్యక్షులుగా వ్యవహరించాలని నిర్దేశించారు. అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు ఎన్నుకునేది కాబట్టి రాజ్యసభలో పరిపూర్ణమైన సమాఖ్య లక్షణం మూర్తీభవించి ఉంటుంది.

అన్నిటికీ మించి లోక్‌సభలోని సంఖ్యాధిక్యతతో పాలక పక్షం తనకు ఇష్టం వచ్చిన రీతిలో ఆదరాబాదరాగా శాసనాలను రూపొందించుకునే సరళికి బ్రేక్ వేయడానికి రాజ్యసభ ఉపయోగపడాలని భావించారు. ఆయా శాసనాల్లోని మంచి చెడులను సావధానంగా చర్చించి అవసరమైతే తగిన సవరణలను సూచించే దిద్దుబాటు వ్యవస్థగా రాజ్యసభ రాణించాలని రాజ్యాంగ నిర్మాతలు అభిలషించారు. లోక్‌సభలో తిరుగులేని, ఎదురులేని మెజారిటీ పాలక పక్షానికి సిద్ధించినా రాజ్యసభలో తగినంత సంఖ్యాధిక్యత లేకపోతే దాని ఆటలు సాగని పరిస్థితిని ఆశించారు. వాస్తవానికి ప్రధాని మోడీ సారథ్యంలోని మొదటి ఎన్‌డిఎ ప్రభుత్వం రాజ్యసభలో తగినంత సంఖ్యాబలం లేక వివాదాస్పద అంశాలపై చట్టాలు చేయడానికి సాహసించలేకపోయింది. రాజ్యసభలో మెజారిటీ లేమికి భయపడి కొన్ని కీలక బిల్లులకు ద్రవ్య బిల్లు ముసుగు వేసి లోక్‌సభ ఆమోదంతోనే చట్టాలు చేయించుకునే దొడ్డి దారి అతి తెలివి తేటలను కూడా ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రదర్శించింది.

2016 ఆధార్ బిల్లును అదే మార్గంలో గట్టెక్కించింది. ఆ విధంగా ఆ బిల్లుకు సవరణలు చేసే అవకాశాన్ని రాజ్యసభకు మోడీ ప్రభుత్వం నిరాకరించింది. అప్పటికి రాజ్యసభలో ప్రభుత్వానికి తగినంత బలం లేకపోవడమే అందుకు కారణం. అలాగే అత్యంత ప్రగతి నిరోధకమైనదిగా పరిగణన పొందిన 2018 నాటి పారిశ్రామిక ఉద్యోగ నిబంధనల బిల్లును కూడా ఈ పద్ధతిలోనే చట్టం చేశారు. తమ నిరంకుశ నిర్ణయాలకు ఎదురు లేని తనాన్ని ఆశించే పాలకులు ప్రజాస్వామ్యానికి మంచి చేయలేరు. ఒకవైపు రాజ్యసభను ఫెడరల్ వ్యవస్థకు ఆత్మ, ప్రాణం వంటిదని మెచ్చుకుంటూనే మరోవైపు దానిని అగౌరవపరిచే విధంగా అడుగులు వేయడం దాని ప్రాధాన్యాన్ని దారుణంగా తగ్గించి వేయడం నేటి పాలకుల చిత్తశుద్ధిని బోనులో నిలబెడుతున్నది. రాష్ట్రాల్లో రెండవ సభ అయిన శాసన మండలిని పాలకులు ఒక్క కలం పోటుతో రద్దు చేసిన సందర్భాలున్నాయి.

అందుకు అవి ప్రతిపక్ష సభ్యుల ఆధిక్యంలో ఉన్నవి కావడం కూడా ఒక ప్రధాన కారణం. రాజ్యసభకు ఇంతవరకు అటువంటి దుర్గతి పట్టకపోడమే సంతోషించవలసిన అంశం. ఎంత త్వరగా శాసనాలు చేశామన్నది కాదు ఎంత వివేచనతో మరెంత గాఢమైన మథనంతో వాటికి అంతిమ రూపం ఇచ్చామన్నదే ముఖ్యం. అటువంటి ప్రయోజనాన్ని రాజ్యసభలో చర్చలు, అది సూచించే సవరణల ద్వారా సాధించగలుగుతాము. 2016 ఆధార్ చట్టం కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి డివై చంద్రచూడ్ అసమ్మతి తీర్పు చెబుతూ మెజారిటీ గుత్త పెత్తనానికి రాజ్యసభ విరుగుడని అది రాజ్యాంగ విలువలను కాపాడుతుందని రాజ్యాంగ నిర్మాతలు భావించినట్టు అభిప్రాయపడ్డారు. దానిని కాపాడినప్పుడే అది విశిష్ట సభ అని ప్రధాని మోడీ చేసిన ప్రశంసకు సార్థకత కలుగుతుంది.

PM remarks during Special Discussion marking the 250th

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రాజ్యసభ ఘనత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.