ప్రధాని ఉద్దీపన అంతరార్థం

PM-Modi

ఉద్దీపన ప్యాకేజీ పేరుతో ప్రధాన మంత్రి రూ. 20 లక్షల కోట్లు ప్రకటించేసరికి ప్రతి వాళ్లూ తమ బాంక్ అకౌంట్‌లో తిన్నగా డబ్బు పడిపోతుందని ఆశించారు. కానీ ఆర్థిక మంత్రి రోజూ కొంచం చొప్పున దశలవారీగా ఐదు రోజుల్లో ప్యాకేజీ వివరాలు మొత్తం ఇచ్చేసరికి అందరూ నిరాశకి గురయ్యారు. ఎందుకంటే ప్రభుత్వం అంత మొత్తాన్నీ తనే భరించకుండా వేరువేరు రూపాలలో ప్యాకేజీని విభజించింది. రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీలో ప్రభుత్వం సొంతంగా ఖర్చు పెట్టేది చాలా తక్కువ. అదీ రూ. 2 లక్షల కోట్ల లోపలే, లేదా మొత్తం ప్యాకేజీలో 10%, లేదా స్థూల జాతీయ ఉత్పత్తిలో 1% కంటే తక్కువ ఉంటుందనీ, మిగిలినది రిజర్వు బ్యాంక్ పెంచబోయే ద్రవ్యత రూపంలోనూ, ప్రభుత్వం ఇవ్వబోయే హామీల రూపంలోనూ ఉంటుందని స్పష్టమైంది.

అలా ఎందుకు రూపొందించిందో తెలియాలంటే అసలీ ప్యాకేజీ వెనుక లక్ష్యాలేమిటి, ఎందుకిలా రకరకాలుగా విభజించింది మొదలైనవి తెలియాలి. ఆర్థిక మంత్రి ప్యాకేజీ వివరించినప్పటికీ దాని లక్ష్యాలు మాత్రం సవిస్తరంగా వివరించలేదు. మనం ఆ వివరాలను క్షుణ్నంగా పరిశీలిస్తే ఆ ప్యాకేజీ మూడు ముఖ్యోద్దేశాలను దృష్టిలో పెట్టుకుని తయారు చేసినదని అర్థమౌతుంది. అవి (1) తక్షణ- మధ్యకాలీన సవాళ్లను, అంటే లాక్‌డౌన్ మూలంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలను, సంస్థలను ఆదుకోవడం, (2) ఆర్థిక మాంద్యం వైపు దారితీస్తున్న ఆర్థిక వ్యవస్థను లాక్‌డౌన్ సడలింపబడుతున్నకొద్దీ నెమ్మది నెమ్మదిగా సరైన దారిలో పెట్టడం, (3) అవసరమైన సంస్కరణలు చేబడుతూ, భారతదేశం దీర్ఘకాలీన వృద్ధికి త్వరిత గతిన చేరేలా చూడడం. ఇవి ఎలా సంభవమో అర్థం కావాలంటే ప్యాకేజీని లోతుగా చూడాలి. అంతర్లీనంగా ఉన్న ఉద్దేశాలను అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా నాలుగు ప్రశ్నలకు సమాధానం దొరికితే తప్ప ఈ ప్యాకేజీ కొంత తికమకగానే ఉంటుంది. వాటిని గురించి చర్చించి, వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మొట్టమొదట ఎదురయ్యే ప్రశ్న ఏమిటంటే, లాక్‌డౌన్ మూలంగా ఇబ్బందుల పాలవుతున్న కుటుంబాలకు మరింత ధనం వెచ్చించి, సహాయం చేసి, ఔదార్యం చూపే ప్రయత్నం చెయ్యకుండా ప్రభుత్వం ఎందుకు గుప్పిలి బిగించి కూర్చుంది? కోట్లాది కుటుంబాలు తాము కష్టపడి పొదుపు చేసుకున్న డబ్బు మొత్తం ఖర్చు అయిపోవడం వల్ల రోడ్డునపడి, ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నాయి. అయితే నిధుల కొరత వల్ల ప్రభుత్వానికి కూడా ఉపాధి కోల్పోయిన అందరికీ నూటికి నూరుపాళ్లు సహాయం అందించడం జరిగే పనికాదు. అలాగని ఊరుకోకుండా వలస కార్మికులకు ఉద్యోగాలు, ఉపాధి మార్గాలు కల్పించడానికి కొన్ని పథకాలు (ఎం.ఎన్.ఆర్.ఇ.ఇ.ఐ. వంటివి) రూపొందించింది. అయినప్పటికీ ఆర్థిక రంగం కోలుకోవడం ఆలస్యమైన కొద్దీ మరిన్ని మార్గాల ద్వారా ప్రజలను పోషించడం తప్పనిసరి.

కరోనా మహమ్మరి మూలంగా లాక్‌డౌన్ పొడిగించబడుతోంది. దానితో సంక్షోభం పెరుగుతోంది. అంతటి సంక్షోభం మధ్యలో ఉన్న ఈ సమయంలో, విపత్తు నుంచి బయటపడే ప్రయత్నానికి ఇవ్వవలసినంత ప్రాధాన్యత ఇవ్వకుండా సంస్కరణలు చేపట్టాలనే అలోచన ఎంతవరకు సమంజసం అన్నది చాలామందిలో తలెత్తుతున్న మరో ప్రశ్న. మనం కొంత జాగ్రత్తగా ఆలోచిస్తే దీని వెనుక ఉన్న ప్రభుత్వ హేతుబద్ధత అర్థం అవుతుంది. సంక్షోభ సమయంలో సంస్కరణలు చేపట్టడం మంచిది కాదన్న మాట వాస్తవమే. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందున్న సవాలు –ప్రజల జీవితాలు నిలబెట్టటం, వారికి జీవనోపాధి కల్పించడం. కానీ ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టి, సహాయం అందించడం మాత్రమే కాకుండా, ఇలాంటి సమయంలో సంస్కరణల మీద కూడా దృఢ సంకల్పం కలిగి ఉండాలి. అప్పుడే మార్కెట్లో అనుమానాలు తీర్చడానికి అవకాశం ఉంటుంది. ఇంత మహమ్మారి మన వెనుక పడుతున్నప్పటికీ ప్రభుత్వం ఆర్థిక రంగాన్ని పుంజుకునేలా చేసే కృతనిశ్చయంతో ఉందనే నమ్మకం మార్కెట్‌లో కలగాలి.

అలా చూస్తే సంస్కరణల గురించి ప్రభుత్వ ప్రకటన ఉపోద్ఘాతం మాత్రమే. దాని విషయంలో ప్రజలకు విశ్వాసం కలగాలంటే ప్రభుత్వం సవిస్తరంగా ఒక శ్వేతపత్రం విడుదల చెయ్యాలి. ఏఏ సంస్కరణలు ఎప్పుడు చేబట్టబోతున్నారు, దేనిని ఎప్పటిలోగా పూర్తి చెయ్యాలని అనుకుంటున్నారు, ఫలితాలు ఏమి రావచ్చు- అన్న వివరాలు మార్కెట్‌కి వివరిస్తే మాత్రమే ప్రభుత్వ ఉద్దేశాలు అర్థమవుతాయి. వాటి అమలు, పని తీరులను బట్టి ప్రభుత్వం మీద నమ్మకం కలుగుతుంది. వీటన్నిటికీ నిధులు కావాలి. అంటే మరింత అప్పులు చెయ్యాలి.

ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ప్రభుత్వం ఇంత అప్పులు చేస్తోంది కదా, మరి ఉద్దీపన ప్యాకేజీ మూలంగా వచ్చే ద్రవ్యత లోటు ఎంత? దాని పరిణామాలు ఎలా ఉంటాయి? ద్రవ్యత లోటు గణనీయంగా పెరిగిపోతుందని, అది విపరీత పరిణామాలకు దారితీస్తుందని, ఆర్థిక వ్యవస్థ సుస్థిరత దెబ్బ తినవచ్చుననీ చాలామంది ఆర్థిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఈ సవాలును ఎలా ఎదుర్కోగలదు?

నిజానికి అది చాలా క్లిష్టమైన సమస్య. ఇంతకు ముందే వివరించినట్లు, ప్రభుత్వం ముందుగా లాక్‌డౌన్ కాలంలో ప్రజల మనుగడ గురించి శ్రద్ధ తీసుకోవాలి. దానికి చాలా నిధులు కావాలి. లాక్‌డౌన్ సరళీకరించిన తరువాత మళ్లీ సాధారణ పరిస్థితి నెలకొనేలా చూడాలి. అలా చూడడం ఇటు నైతికంగానూ, అటు రాజకీయంగానూ అత్యవసరం. ఈ ఖర్చుకి ప్రభుత్వం అప్పులు చెయ్యక తప్పదు.మరి మధ్యకాలీన స్థితిని కాపాడుకోవాలంటే ఎంత వరకు అప్పు చెయ్యవచ్చు అన్నదే సమస్య.

మనం జాగ్రత్తగా విశ్లేషించి చూస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కరోనా సంక్షోభానికి ముందే ఆర్థిక పరమైన ఒత్తిడికి లోనై ఉన్నాయి అని తెలుస్తోంది. ఈ సంవత్సరం బడ్జెట్ ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్థూల జాతీయ ఉత్పత్తిలో 6.5% లోటు ఉంటుంది అని అంచనా వేశారు. లాక్‌డౌన్ మూలంగా ఆదాయం ఇంకా తగ్గి, లోటు 10% దాకా పడిపోవచ్చు. అప్పులు చేసినకొద్దీ ఈ లోటు పెరిగి 15% దాకా వెళ్లవచ్చు. ఈ స్థితి ఎన్నో సమస్యలకు దారి తీస్తుంది. ద్రవ్యోల్బణం, నికర చెల్లింపుల (బాలెన్స్ ఆఫ్ పేమెంట్స్) ఒత్తిడి ఎదుర్కోవాలి. వడ్డీ రేట్లు తగ్గడం వలన ప్రైవేటు పెట్టుబడులు పడిపోవడం జరుగుతుంది.

ఇటువంటి ఎన్నో విపరీత పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. మన అనుభవంలో ఇటువంటి పరిస్థితులు ఎన్నో ఎదుర్కొన్నాం. ఇటువంటి విపత్త్తు రాకుండా ఉండాలంటే ఆర్థిక వ్యవస్థలో వృద్ధి రేటు పెరిగేలా చూసుకోవాలి. అప్పుడే ఈ అప్పుల భారం వృద్ధి రేటు మీద ప్రభావం చూపించదు. అందుకే సత్వర సంస్కరణలు ఎంతో అవసరం. అలాగే స్వల్పకాల రుణాల కోసం ఒక పరిమితి పెట్టుకోవాలి తప్ప అవధులు లేకుండా అప్పులు చెయ్య కూడదు. అలా అయితేనే ప్రభుత్వం మీద మార్కెట్లకు విశ్వాసం నిలబడుతుంది.

మరి ఆఖరి ప్రశ్న ఏమిటంటే, ప్యాకేజీ భారీగా ఉన్నప్పటికీ, ప్యాకేజీలో మధ్య- చిన్న తరహా పరిశ్రమలకి ఇచ్చిన ప్రాముఖ్యత మరీ అధిక నిష్పత్తిలో ఉందనిపిస్తోంది. అలా ఎందుకు ఇవ్వవలసి వచ్చినదంటే, మన ఆర్థిక వ్యవస్థ పని తీరులో ఈ పరిశ్రమలు విశిష్ట ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. అవి స్థూల జాతీయ ఉత్పత్తిలో, ఉద్యోగాలు కల్పించడంలో, ఎగుమతులలో మన అంచనాలకు మించి పాత్ర వహిస్తాయి. అయితే లాక్‌డౌన్ పుణ్యమా అని అవి చాలా భారీ మొత్తాన్నే కోల్పోతున్నాయి. అవి త్వరగా కోలుకుంటేనే అనుకున్న వృద్ధి రేటు సాధించే అవకాశం ఉంటుంది. అందుకే ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీలో వీటికి ప్రాధాన్యతనివ్వడం చాలా మంచి నిర్ణయం.

లాక్‌డౌన్ కాలంలో కూడా ఈ పరిశ్రమలకి కొన్ని స్థిర ఖర్చులు ఉంటాయి. వాటి కోసం ఆర్థిక సహాయం కావాలి. అలాగే లాక్‌డౌన్ తరువాత మళ్లీ ఉత్పత్తి ప్రారంభించాలన్నా నిధులు కావాలి. నిజానికి ఈ విషయంలో బ్యాంకులు ముందుకు రావాలి. అయితే ఆ రుణాలు, రాని బాకీలుగా మిగిలిపోతాయనే భయంతో బ్యాంకులు ముందుకు రావడం లేదు. అలాంటప్పుడు విశ్వసనీయత పెంచడానికి ప్రభుత్వం పూనుకుంటే మాత్రమే బ్యాంకులకు ఉన్న భయం తగ్గుతుంది. అంటే ఇటువంటి రుణాలకు ప్రభుత్వ హామీ పథకం ఉండాలి. వాటికి ద్రవ్యత కోసం సహాయం చెయ్యాలి.

ఇటువంటి సందర్భాలలో కొన్ని పథకాలు మంచి ఫలితాలనిస్తాయి. కొన్ని ఎంత బాగా అమలు చేద్దామని ప్రయత్నించినా అంత బాగా ఫలించకపోవచ్చు. ప్రభుత్వం వాటి పనితీరు గమనిస్తూ అవసరమైన సర్దుబాట్లు చెయ్యవలసి ఉంటుంది. ఇవన్నీ తరచి చూసిన మీదట ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ చాలా హేతుబద్ధంగా ఉందనే చెప్పాలి. నిజానికి ఎంత జాగ్రత్తగా రూపొందించిన ప్యాకేజీనైనా విమర్శించడం తేలిక. ఏ ప్యాకేజీ నూటికి నూరు శాతం పరిపూర్ణంగా ఉండదు. కానీ దానిలోని లోటుపాట్లు చూసుకుంటూ ప్రభావవంతంగా అమలు చేసినపుడు ఆర్థిక వ్యవస్థ ఆటుపోట్లకు తట్టుకునే అవకాశం ఉంటుంది. తద్వారా అభివృద్ధి పథం చేరే అవకాశాలు బాగుంటాయి.

PM Modi stimulus package interception

లంక నాగరాజు

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్రధాని ఉద్దీపన అంతరార్థం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.