తక్షణ సాయం రూ.1500 కోట్లు

PM applies Rs 1500 cr relief fund for Bengal, Odisha

 

బెంగాల్‌కు రూ.1000 కోట్లు, ఒడిషాకు రూ 500 కోట్లు
ఎంఫాన్ ప్రభావిత రాష్ట్రాల సిఎంలతో ప్రధాని మోడీ ఏరియల్ సర్వే
ప్రధాని ప్రకటనపై ముఖ్యమంత్రి మమత అసంతృప్తి
లక్ష కోట్లు దాటిన నష్టం భర్తీకి డిమాండ్

కోల్‌కతా/భువనేశ్వర్ : ఎంఫాన్ తుపాన్ తాకిడికి గురైన బెంగాల్, ఒడిషాలకు రూ 1500 కోట్ల సాయం అందిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.

ఇది తాత్కాలిక సాయం అని శుక్రవారం ఆయన ప్రకటించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ప్రధాని మోడీ ఈరోజే సంబంధిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు మమత బెనర్జీ, నవీన్ పట్నాయక్‌తో కలిసి వేర్వేరుగా ఏరియల్ సర్వేద్వారా సమీక్షించారు. విరుచుకుపడ్డ తుపాన్‌తో 80 మంది మృతి చెందారు. పశ్చిమ బెంగాల్, ఒడిషా తీర ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. వేలాది హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. రహదారులు, విద్యుత్ సౌకర్యాలు వంటి పలు మౌలిక వ్యవస్థలకు భంగం వాటిల్లింది. తుపాన్ తరువాత రెండు రోజులకు ప్రధాని గగనతల సమీక్షకు వెళ్లారు. పశ్చిమ బెంగాల్‌కు రూ 1000 కోట్లు మధ్యంతర సాయం అందిస్తున్నట్లు ప్రధాని తెలిపారు.

పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్, సిఎం మమత బెనర్జీ, రాష్ట్ర ఉన్నతాధికారులతో ప్రధాని మోడీ పరిస్థితి గురించి తొలుత కోల్‌కతాలో ఉన్నత స్థాయిలో సమీక్షించారు. రాష్ట్రానికి ఇటీవలి కాలంలో ఎప్పుడూలేని స్థాయిలో తుపాన్ బీభత్సంతో నష్టం వాటిల్లిందని ప్రధానికి మమత బెనర్జీ తెలిపారు. లక్ష కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లిందని, దీనిని కేంద్రం భర్తీ చేయాల్సి ఉందన్నారు. కరోనావైరస్ వ్యాప్తి, మృతుల సంఖ్య పెరగడం, మరో వైపు వలసకూలీల ఆగమనం , తీవ్రస్థాయిలో కేంద్రంతో రాజకీయ వివాదాల సుడిగుండంలో ఉన్న బెంగాల్‌పై ఎంఫాన్ భీకర రీతిలోనే విరుచుకుపడింది. రాష్ట్రంలోని పలు జిల్లాలలో దెబ్బతిన్న పంటలతో కూడిన పొలాలను ప్రధాని చూశారు.

పలు చోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. పెద్ద పెద్ద వృక్షాలు కూకటివేళ్లతో నేలరాలాయి. దీనితో పాటు విద్యుత్ స్తంభాలు కూలాయి. తీర ప్రాంత జిల్లాలతో పాటు కోల్‌కతా మహానగరంలో కూడా విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. గవర్నర్, సిఎంతో కలిసి ఏరియల్ సర్వే తరువాత ప్రధాని సాయం గురించి స్పందించారు. కేంద్రం నుంచి తక్షణసాయం అందిస్తున్నట్లు, తుపాన్‌తో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ 2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడ్డ వారికి రూ 50వేలు సాయం అందిస్తామని ప్రకటించారు. తుపాన్ సమయంలో బెంగాల్, ఒడిషా ప్రభుత్వాలు బాగా పనిచేశాయని ప్రధాని అభినందించారు. ఆ తరువాత ఒడిషాలోని తీర ప్రాంతాలలో దాదాపు 90 నిమిషాల పాటు ప్రధాని ఏరియల్ సమీక్ష నిర్వహించారు.

ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఇతరులతో కలిసి పరిస్థితిని పరిశీలించిన తరువాత భువనేశ్వర్‌లోని బిజూ పట్నాయక్ విమానాశ్రయంలోనే ఉన్నతస్థాయిలో ప్రధాని సమీక్షించారు. ఇందులో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, ప్రతాప్ సారంగీ ఇతరులు ఉన్నారు. ఒడిషాకు రూ 500 కోట్ల సాయం ప్రకటిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమగ్ర నివేదిక అందిన తరువాత దీర్ఘకాలిక సహాయ చర్యలు ఉంటాయని ప్రధాని ఈ సందర్భంగా భరోసా కల్పించారు. కేంద్రపారా, జగత్‌సింగ్‌పూర్, భద్రక్, బాలాసోర్ వంటి జిల్లాలో ప్రధాని ఏరియల్ సర్వే జరిగింది.

మహానగరంలో అంధకారం
తుపాన్‌తో పూర్తిగా దెబ్బతిన్న కోల్‌కతాలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీనితో అత్యధిక ప్రాంతంలో రాత్రిపూట చీకట్లు కమ్ముకున్నాయి. మొబైల్ సిగ్నల్స్‌కు ఇంటర్నెట్‌కు అంతరాయం ఏర్పడింది. ఓ వైపు కరోనా వైరస్ ప్రభావం తీవ్రం అవుతున్న దశలోనే ఇప్పుడు తుపాన్ విరుచుకుపడటం, కాలుష్య వాతావరణానికి దారితీయడంతో పరిస్థితి మరింత దిగజారుతుందని ఇరు రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. నిత్యం పలు రైళ్లు ఇతరత్రా లక్షలాది మంది వలస కూలీలు స్వరాష్ట్రాలకు తరలిరావడంతో వారికి సరైన ఏర్పాట్లు చేయడం, మరో వైపు వైరస్ నియంత్రణ చర్యలు ఉధృతం చేయాల్సిన అవసరం ఉండటంతో రెండు రాష్ట్రాల సిఎంలు పలు విధాలుగా సాధనసంపత్తులను సమకూర్చుకునే దిశలో ఉన్నారు.

ఒక్కచోటికి జనం.. దూరం పాటించడం ఇదో సంకట స్థితి : మోడీ
వైరస్‌ను ఎదుర్కొనేందుకు భౌతిక దూరం పాటించాలి, సామూహిక ఉనికి ఉండకూడదు. అయితే తుపాన్ నుంచి రక్షించేందుకు ప్రజలను సామూహికంగా సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉందని ప్రధాని మోడీ చెప్పారు. ఇది ఓ సంకట తీవ్రత అని తెలిపారు. సహాయక కేంద్రాలలో భారీ సంఖ్యలో జనం ఉండాల్సి రావడంతో వైరస్ కట్టడికి ప్రభుత్వం తీసుకునే చర్యలకు పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు.

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post తక్షణ సాయం రూ.1500 కోట్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.