వరంగల్ మాస్టర్ ప్లాన్‌కు కసరత్తు

people

 

త్వరలో అనుమతి, ప్రజలకు మెరుగైన సేవలందించేలా ప్రణాళికలు

హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా వరంగల్ రూపాంతరం

హైదరాబాద్ : వరంగల్ మహానగర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. వరంగల్ మాస్టర్ ప్లాన్ – 2041 ఆమోదంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం హైదరాబాద్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) చైర్మన్ మర్రి యాదవరెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, కుడా వైస్ చైర్మన్ ఎన్.రవికుమార్, పీవో ఇ.అజిత్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రెండో పెద్ద నగరంగా ఉన్న వరంగల్ సమగ్ర అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్టు పేర్కొన్నారు.

త్వరలోనే కొత్త మాస్టర్ ప్లాన్ కు ప్రభుత్వం ఆమోదం తెలపనుందని మంత్రి తెలిపారు. మాస్టర్ ప్లాన్ త్వరగా ఆమోదం పొందేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ కు ఆయన సూచించారు. రాష్ట్రంలో వరంగల్ కు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరంగా వరంగల్ రూపుదిద్దుకుంటుందన్నారు. భవిష్యత్తు అవసరాలకు తగినట్లుగా వరంగల్ మహా నగరాన్ని అభివృద్ధి చేసేలా కొత్త మాస్టర్ ప్లాన్ తయారు చేసుకుంటున్నామన్నారు. గతంలో ఉన్న వరంగల్ మాస్టర్ ప్లాన్ 1971ను మార్పు లు, చేర్పులు చేస్తూ ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా వరంగల్ మాస్టర్ ప్లాన్ – 2041 తయారయ్యిందన్నారు.

వరంగల్ సమగ్ర అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా ఈ కొత్త మాస్టర్ ప్లాన్ ఉంటుందన్నారు. మూడు జిల్లాల్లోని 19 మండలాలు, 181 రెవెన్యూ గ్రామాలు ఈ మాస్టర్ ప్లాన్ పరిధిలో ఉండగా, మొత్తం 1,800 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉందన్నారు. గత మాస్టర్ ప్లాన్ తో పోల్చితే 20 రెట్లు ఎక్కువ విస్తీర్ణం ఉంటుందన్నారు. టెక్స్‌టైల్ పార్క్, టూరిజం హబ్ వంటి అన్ని అంశాలతో వరంగల్ ఎకనామిక్ హబ్ గా అభివృద్ధి చెందుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ కొత్త ప్లాన్ తయారు చేశామని ఆయన పేర్కొన్నారు. కుడా పరిధిలో ఉన్న 2 వేల చెరువులను పరిరక్షించేలా మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తున్నామన్నారు.

పార్కుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్‌రోడ్డులతో పాటు తదితర అంశాలతో పాటు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి ప్రణాళికలు అమలు చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ప్రజల సూచనలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి అవసరమైన మార్పులతో తుది ప్లాన్ సిద్ధం చేశామని ఆయన తెలిపారు. ఎన్జీవోలు, పౌరుల నుంచి వచ్చిన దాదాపు 3,500 ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్నామన్నారు.

మాస్టర్ ప్లాన్ ఆమోదం కోసం ఈ ఏడాది జూన్‌లో ప్రభుత్వానికి పంపించామన్నారు. త్వరగా మాస్టర్ ప్లాన్ ఆమోదం పొందేలా మున్సిపల్ శాఖ తదుపరి చర్యలు తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సూచించారు. మున్సిపల్ శాఖ పూర్తిగా సమీక్షించిన అనంతరం ప్రభు త్వం ఆమోదం తెలుపుతుందని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ మంత్రితో పేర్కొన్నారు. ఈ సమావేశానికి ముందు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కుడా చైర్మన్, అధికారులతో సమీక్షించారు.

Plans to serve the people better

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వరంగల్ మాస్టర్ ప్లాన్‌కు కసరత్తు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.