ప్రచారపర్వంలో భౌతిక దాడులు

   ప్రజాస్వామ్యంలో విమర్శ, వాదన మాత్రమే ఉండాలి. ముఖ్యంగా ఎన్నికల బరిలోని రాజకీయ పార్టీలు, వాటి అభ్యర్థులు ప్రజా సమస్యలపై తమ అభిప్రాయాలను, ఆలోచనలను ప్రజలకు ఎరుకపరచడంలో పోటీ పడాలి. అలా చేయడం ద్వారా వారి హృదయాలను చూరగొనాలి. వారి ఓటును పొందగలగాలి. ఆ పద్ధతిలో అధికారాన్ని చేజిక్కించుకోగలగాలి. అంతేగాని వ్యక్తిగత నిందారోపణలు, దూషణలు, భౌతికమైన దాడులతో ప్రచార రంగాన్ని భ్రష్టు పట్టించడం ఎంతమాత్రం సబబు కాదు. 69 ఏళ్ల ప్రజాస్వామ్య భారతదేశంలో పార్టీలుగాని, అభ్యర్థులుగాని ఈ […] The post ప్రచారపర్వంలో భౌతిక దాడులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

   ప్రజాస్వామ్యంలో విమర్శ, వాదన మాత్రమే ఉండాలి. ముఖ్యంగా ఎన్నికల బరిలోని రాజకీయ పార్టీలు, వాటి అభ్యర్థులు ప్రజా సమస్యలపై తమ అభిప్రాయాలను, ఆలోచనలను ప్రజలకు ఎరుకపరచడంలో పోటీ పడాలి. అలా చేయడం ద్వారా వారి హృదయాలను చూరగొనాలి. వారి ఓటును పొందగలగాలి. ఆ పద్ధతిలో అధికారాన్ని చేజిక్కించుకోగలగాలి. అంతేగాని వ్యక్తిగత నిందారోపణలు, దూషణలు, భౌతికమైన దాడులతో ప్రచార రంగాన్ని భ్రష్టు పట్టించడం ఎంతమాత్రం సబబు కాదు. 69 ఏళ్ల ప్రజాస్వామ్య భారతదేశంలో పార్టీలుగాని, అభ్యర్థులుగాని ఈ తరహా పరిణతిని ప్రదర్శించలేకపోడం ఎవరి తప్పనాలో అర్థం కాని అయోమయ స్థితి. ప్రజాస్వామ్య వ్యవస్థ ఆశించే రాజకీయ ప్రవర్తనను నాయకులు ఇప్పటికీ అలవరుచుకోలేకపోతున్నారు. పార్టీలు వాటి నాయకులను బట్టే కార్యకర్తలు, అభిమానులు కూడా అపమార్గం పడుతున్నారు.

గత నెలలో బిజెపి జాతీయ ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావుపై జరిగిన బాంబు దాడి, మొన్న శనివారం నాడు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్‌ను చెంప దెబ్బ కొట్టిన ఉదంతం ఇందుకు తాజా ఉదాహరణలు. ఇటువంటివి మన ప్రజాస్వామ్య స్థాయిని నైతిక పాతాళంలోకి దిగజార్చివేస్తున్నాయి. గత నెల 18 వ తేదీన ఢిల్లీ బిజెపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో జివిఎల్ నరసింహారావుపై శక్తి భార్గవ అనే వ్యక్తి కాలి బూటుతో దాడి చేశాడు. కాంగ్రెస్ పార్టీ దర్శకత్వంలోనే ఈ దాడి జరిగిందని నరసింహారావు ఆరోపించారు. అంతకు ముందు రాహుల్ గాంధీని ‘బాబర్ భక్తుడు’ గా పేర్కొంటూ ట్విట్టర్‌లో నరసింహారావు వ్యాఖ్యానించారు. అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని కాకుండా చేయడానికి ఒవైసీలు, జిలానీలతో రాహుల్ కుమ్మక్కయ్యారని కూడా అందులో ఆయన ఆరోపించారు. నెహ్రూ వంశమే ఇస్లామిక్ దురాక్రమణదారుల పక్షపాతి అని కూడా అభిప్రాయపడ్డారు.

ఆ సీన్ అక్కడ కట్ చేస్తే, నరసింహారావుపై బూటు దాడి జరిగిన 16 రోజులకు మొన్న శనివారం నాడు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఒక వ్యక్తి నేరుగా చెంప దెబ్బే కొట్టాడు. లోక్‌సభ ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా ఢిల్లీ మోతీనగర్‌లో కేజ్రీవాల్ రోడ్ షో జరుగుతుండగా ఆయన వాహనం ఎక్కి మరీ ఆ వ్యక్తి ఈ నిర్వాకానికి పాల్పడ్డాడు. ఇది బిజెపి పనే అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. నరసింహారావు ఆరోపించినట్టు ఆయనపై గత నెలలో దాడి జరిపించింది కాంగ్రెస్ వారే అయితే బిజెపి వారు హస్తం పార్టీ వారినే లక్షంగా చేసుకొని ప్రతి దాడి చేసి ఉండాలి. కాని అందుకు విరుద్ధంగా కేజ్రీవాల్ మీద భౌతిక దాడి జరగడం విడ్డూరం. బయటికి కనిపించే దాడుల వెనుక ఉన్నదెవరో, ఏ పార్టీవారో లేక వ్యక్తిగత శత్రువులో నిజాయితీతో కూడిన లోతైన దర్యాప్తులోనే తెలుస్తుంది. అటువంటి శోధనలు మన దేశంలో అరుదు. అందుచేత ఈ దాడుల వెనుక గల హస్తాలు ఎవరివో ఎప్పటికీ తెలియని రహస్యాలుగానే మిగిలిపోతాయి. కేజ్రీవాల్ మీద ఇటువంటివి జరగడం ఇది మొదటి సారి కాదు.

2018 నవంబర్‌లో ఒక వ్యక్తి కేజ్రీవాల్ కాళ్లకు నమస్కారం చేయడానికి వంగినట్లు నటించి ఆయన ముఖమ్మీద కారం చల్లాడు. 2016 ఫిబ్రవరిలో పంజాబ్‌లోని లూథియానాలో కొంత మంది వ్యక్తులు కేజ్రీవాల్ కారు మీద ఇనుప రాడ్‌లతో దాడి చేశారు. అంతకు ఒక నెల ముందు ఆయనపై సిరా దాడి జరిగింది. అదే సంవత్సరం ఏప్రిల్‌లో ఒక వ్యక్తి ఆయన మీద బూటు విసిరాడు. ఇంకా వెనక్కిపోతే 2014 ఏప్రిల్ 8న ఒక ఆటో రిక్షా డ్రైవర్ ఢిల్లీలోని సుల్తాన్‌పురి ప్రాంతంలో కేజ్రీవాల్‌ను చెంప దెబ్బ కొట్టాడు. అంతకు నాలుగు రోజుల ముందు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల రోడ్ షోలో కేజ్రీవాల్‌ను చెంప దెబ్బ కొట్టడానికి ఒక వ్యక్తి ప్రయత్నించాడు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కేజ్రీవాల్ మీద, మరి కొందరు ఆప్ నేతల మీద ఉత్తరప్రదేశ్ వారణాసి నియోజకవర్గంలో కొంత మంది కోడి గుడ్లు, సిరాతో దాడి చేశారు.

అదే సంవత్సరంలో అన్నాహజారే అనుయాయినని చెప్పుకొన్న ఒక వ్యక్తి కేజ్రీవాల్ ఓపెన్ జీప్ ఎక్కి అతని మెడ మీద కొట్టాడు. 2013లోనూ ఆయన మీద సిరా దాడి జరిగింది. ఇన్ని సార్లు ఇంత నీచమైన భౌతిక దాడులకు గురి కావడానికి కేజ్రీవాల్‌లోని గొప్పతనమే కారణమై ఉండాలి. ఆయనను రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇటువంటి నీచ చర్యలకు పాల్పడుతున్నారనుకోవాలి. అంటే దేశంలో ప్రజాస్వామికంగా పోటీ చేసి నెగ్గే తత్వానికి బదులు పాశవిక పద్ధతుల్లో అధికారాన్ని సాధించుకోవాలనే తప్పుడు ధోరణులు నానాటికీ ప్రబలుతున్నాయని స్పష్టపడుతున్నది. ఇటువంటివి కేవలం దాడులకే పరిమితం కాక ఒక్కోసారి హత్యలకూ దారి తీసినా ఆశ్చర్యపోనక్కర లేదు. ఇంతకంటే మన ప్రజాస్వామ్యానికి అపహాస్యమేముంటుంది? ప్రజాస్వామ్యం ముసుగులో ఫాసిస్టు శక్తులు మితిమీరుతున్నాయనుకోవాలి.

Physical Attacks in the Lok sabha Election campaign

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ప్రచారపర్వంలో భౌతిక దాడులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: