పెట్రో భగభగలు ఆరవా?

ఇంధన ధరలు మున్నెన్నడూలేని స్థాయికి చేరుకున్నాయి. ప్రామాణికంగా తీసుకునే ఢిల్లీలో సోమవారం నాడు పెట్రోలు రిటైల్ రేటు లీటరు రూ. 79.15కు ఎగబాకింది. అయితే రాష్ట్ర వ్యాట్‌లో వ్యత్యాసం కారణంగా ఇతర మహానగరాల్లో ఈ మంట మరీ దారుణంగా ఉంది. పెట్రోలు ధర ముంబయిలో లీటరు రూ. 86.65 (డీజిల్ రేటు బ్రాకెట్లలో రూ. 75.62), హైదరాబాద్‌లో రూ. 84.01 (రూ.77.48), బెంగళూరులో రూ.81.82 (రూ.73.52), చెన్నైలో రూ. 82.34 (రూ. 75.27). ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. […]

ఇంధన ధరలు మున్నెన్నడూలేని స్థాయికి చేరుకున్నాయి. ప్రామాణికంగా తీసుకునే ఢిల్లీలో సోమవారం నాడు పెట్రోలు రిటైల్ రేటు లీటరు రూ. 79.15కు ఎగబాకింది. అయితే రాష్ట్ర వ్యాట్‌లో వ్యత్యాసం కారణంగా ఇతర మహానగరాల్లో ఈ మంట మరీ దారుణంగా ఉంది. పెట్రోలు ధర ముంబయిలో లీటరు రూ. 86.65 (డీజిల్ రేటు బ్రాకెట్లలో రూ. 75.62), హైదరాబాద్‌లో రూ. 84.01 (రూ.77.48), బెంగళూరులో రూ.81.82 (రూ.73.52), చెన్నైలో రూ. 82.34 (రూ. 75.27). ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. జోక్యం చేసుకోవటానికి సుముఖంగా లేదు. డాలర్‌తో మారకంలో రూపాయి విలువ రోజురోజుకు బలహీనపడుతూ రూ. 71లను దాటినప్పటికీ, మార్కెట్‌లో దాని విలువను అది స్థిరపరుచుకునే వరకు ప్రభుత్వం జోక్యం చేసుకోరాదని ప్రభుత్వ ఆర్థిక సలహాదారులు చెబుతున్నారు. పర్యవసానంగా వినియోగదారులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ఇంధన ధరల పెరుగుదల ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది కావున నిత్య జీవితావసర వస్తువుల ధరలన్నీ పెరిగి పేదలు, మధ్యతరగతులు మరింత దోపిడీకి గురవుతారు. క్రూడ్ ఆయిలు ధర గరిష్ట స్థాయికి చేరినప్పుడు సైతం యుపిఎ ప్రభుత్వం ఇంధన రిటైల్ రేట్లను ఇప్పటి ఎన్‌డిఎ ప్రభుత్వం కన్నా ఎంతో మెరుగ్గా నిర్వహించింది. పన్నులు గణనీయంగా తగ్గించింది. క్రూడ్‌పై దిగుమతి సుంకం ఎత్తివేసింది. యుపిఎ ప్రభుత్వ కాలంలో ఒకానొక దశలో క్రూడ్ బ్యారల్ ధర శిఖరాయమానంగా 147 డాలర్లను చేరింది. ఇప్పుడు క్రూడ్ బ్యారల్ ధర 75 డాలర్లకు కాస్త అటుఇటుగా ఉంది. మరి ఎన్‌డిఎ పెట్రో ధరలను ఎందుకు నియంత్రించటం లేదు?
2014 మే నెలలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తదుపరి దాని అదృష్టం కొద్ది క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పతనమైనాయి. 2015 లో బ్యారల్ 33 డాలర్లు. అయితే ఈ తగ్గుదలను పరిమితంగానే వినియోగదారులకిచ్చి, ఎక్సైజ్ పెంచుతూ తన బొక్కసం నింపుకునే వనరుగా మలుచుకుంది. మూడు నాలుగేళ్లలో 9 సార్లు ఎక్సైజ్ పెంపు చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు మరీ పిండుకుంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఒక్క వనరు నుంచే రూ. 5 లక్షల కోట్లు పోగు చేసుకున్నాయన్నది విశ్లేషకుల మాట. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 201314 నుంచి 201718 మధ్య పెట్రోలు, డీజిల్‌పై కేంద్ర ఎక్సైజ్ సుంకం మూడు రెట్లయింది. అదే కాలంలో రాష్ట్రాలు వ్యాట్‌ను 38 శాతం పైగా పెంచాయి. నాలుగేళ్లలో పెట్రోలుపై కేంద్ర ఎక్సైజ్ లీటరుకు రూ. 9.48 నుంచి రూ. 21.48 కి చేరింది; డీజిల్‌పై ఎక్సైజ్ రూ. 3.65 నుంచి రూ. 15.33కు చేరుకుంది. అంటే పెట్రోలుపై వెచ్చించే ప్రతి 100 రూపాయల్లో దాదాపు రూ. 46, డీజిల్ విషయంలో దాదాపు రూ. 36 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బొక్కసం చేరుతున్నది. బడ్జెట్ లోటు నింపుకోవటానికి, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు దాన్ని వెచ్చిస్తున్నాయి. ఇంధన ధరలను జిఎస్‌టి కిందకు తేవాలన్న డిమాండ్ పరిశీలనలో ఉన్నట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, గరిష్టంగా 28 శాతం జిఎస్‌టి, ఇతర సెస్సుల విధింపుతో ధర ఏమంత తగ్గబోదని నిపుణులు చెబుతున్నారు. మన ఇరుగుపొరుగు దేశాల్లో ధరలను పరిశీలిస్తే మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న భారం సులభంగా అవగతమవుతుంది. భారత రూపాయి విలువలో లీటరు పెట్రోలు చిల్లర ధర పాకిస్థాన్ లో రూ. 65.20, శ్రీలంకలో రూ. 69.14, నేపాల్‌లో రూ. 71.25, బీజింగ్‌లో రూ. 70.49.
మన దేశ ఇంధన అవసరాల్లో దాదాపు 80 శాతం దిగుమతులపై ఆధారపడి ఉన్నందున, రూపాయి మారక విలువ పతనం వల్ల క్రూడ్‌కు ఎక్కువ చెల్లించవలసివస్తోంది. రెండు , ఇరాన్‌పై డోనాల్డ్ ట్రంప్ ఆంక్షలు నవంబర్ నుంచి అమలులోకి రానున్నందున అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధర మరింత పెరిగే ప్రమాదముంది. క్రూడ్ ఆయిలు ధర బ్యారల్‌కు 10 డాలర్లు పెరిగితే జిడిపి 0.3 శాతం తగ్గుతుందని, దేశంలో విక్రయ ధర లీటరుకు రూ. 10 పెరిగితే ద్రవ్యోల్బణం 0.5 శాతం పెరుగుతుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి.
ఇంధన ధరల పెరుగుదల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రూపాయి విలువ శీఘ్రతర పతనంతో దిగుమతులకు ఎక్కువ మొత్తం చెల్లింపుల వల్ల కరెంట్ అక్కౌంట్ (విదేశీ వాణిజ్య ఖాతా) లోటు విస్తృతమవుతోంది. మరో వైపున, ఇంధన విక్రయాలపై పన్నులు తగ్గిస్తే బడ్జెట్ లోటు పెరిగిపోతుంది. మోడీ ప్రభుత్వానికిది పెద్ద డైలమా. రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి కొంత ఆదాయం కోల్పోవటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రాకపోతే ఎన్నికల ముందు మోడీ ప్రభుత్వానికి తలపోటు తప్పదు.