కాళేశ్వరం ప్రాజెక్టుకు పోటెత్తిన జనం

  భారీ వర్షాలతో గోదావరికి పెరిగిన వరద అన్నారంలో 7.68 టిఎంసిల నీటి నిల్వ కొనసాగుతున్న మోటార్ల వెట్ రన్ వరంగల్ : ఒక పక్క భారీ వర్షాలు కురుస్తుండగా.. మరో పక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆదివారం జనం పోటెత్తారు. సెలవు దినం కావడంతో వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో ప్రజలు కాళేశ్వరం ప్రాజెక్టును చూడటానికి భారీ ఎత్తున తరలివచ్చారు. ముందుగా కాళేశ్వరం చేరుకున్న పర్యాటకులు అక్కడి నుంచి కన్నెపల్లి పంప్‌హౌస్, అన్నారం బ్యారేజ్‌లను సందర్శించారు. […] The post కాళేశ్వరం ప్రాజెక్టుకు పోటెత్తిన జనం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

భారీ వర్షాలతో గోదావరికి పెరిగిన వరద
అన్నారంలో 7.68 టిఎంసిల నీటి నిల్వ
కొనసాగుతున్న మోటార్ల వెట్ రన్

వరంగల్ : ఒక పక్క భారీ వర్షాలు కురుస్తుండగా.. మరో పక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆదివారం జనం పోటెత్తారు. సెలవు దినం కావడంతో వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో ప్రజలు కాళేశ్వరం ప్రాజెక్టును చూడటానికి భారీ ఎత్తున తరలివచ్చారు. ముందుగా కాళేశ్వరం చేరుకున్న పర్యాటకులు అక్కడి నుంచి కన్నెపల్లి పంప్‌హౌస్, అన్నారం బ్యారేజ్‌లను సందర్శించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం క్రాస్ రోడ్డులో వాహనాల రద్దీతో ఎక్కడికక్కడే ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు జోక్యం చేసుకుని వాహనాలను పంపించాల్సిన పరిస్థితి ఎదురైంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు గోదావరి వరద ఉధృతి రోజు రోజుకు పెరుగుతున్నందున ఆదివారం 25 వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా ఉంది. కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద మోటార్లను యదావిధిగా వెట్ రన్ చేస్తూనే ఉన్నారు. ఎత్తిపోస్తున్న గోదావరి నీరు అన్నారం బ్యారేజ్‌లో 7.68 టీఎంసీల నీటి నిల్వకు చేరుకుంది.

సుందిళ్ల ప్రాజెక్టుకు అన్నారం నుంచి నీటిని పంపింగ్ చేయడానికి నాలుగు మోటార్లను వెట్ రన్ చేస్తున్నారు. గోదావరి నది తీరంపై నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్‌లో 94.5 మీటర్ల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం 4.5 టీఎంసీల నీరు ఉండటంతో కన్నెపల్లి పంప్‌హౌస్‌లో మోటార్లను నిర్విరామంగా వెట్న్ చేస్తున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద కొనసాగుతుంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి, అన్నారం, మేడిగడ్డ బ్యారేజ్‌లన్నీ కూడా కాళేశ్వరం ప్రధాన రహదారిలోనే ఉన్నాయి. వీటిని సందర్శించడానికి పర్యాటకుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఆదివారం సెలవు దినం కావడం, ఉద్యోగులు, వ్యాపారులు, రైతులు భారీ ఎత్తున ప్రయివేటు వాహనాల్లో తరలివస్తున్నారు.

కన్నెపల్లి పంప్‌హౌస్ వద్దకు వెళ్లాలంటే మట్టి రోడ్డు ఉండటం వల్ల వర్షంతో ఆ రోడ్డు బురదమయంగా మారింది. అయినప్పటికీ ప్రజలు మాత్రం వాహనాలను పక్కన పెట్టి కాలినడకన ప్రాజెక్టుకు చేరుకుని జల కలను చూసి సంబ్రమాశ్చర్యానికి గురవుతున్నారు. ఆదివారం ప్రాజెక్టును సందర్శించడానికి వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్గొండ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున ప్రజలు అక్కడి చేరుకుంటున్నారు. మహారాష్ట్రకు, తెలంగాణకు కాళేశ్వరం వద్ద వారధిని నిర్మించడంతో మహారాష్ట్రలోని గోదావరి ఒడ్డున ఉన్న గ్రామాల ప్రజలు కూడా భారీ ఎత్తున తరలివస్తున్నారు.

ఇటు దైవ సందర్శనం.. అటు ప్రాజెక్టు సందర్శన
కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించే పర్యాటకుల సంఖ్య భారీగా పెరగడంతో కాళేశ్వరం దేవాలయంలో కొలువు తీరి ఉన్న ముక్తీశ్వరస్వామి దేవస్థానానికి భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఆషాడమాసం కావడంతో పర్యాటకులు రెండు కలిసి వస్తాయనే దృక్పథంతో ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరుతున్నారు. కాళేశ్వరంలోని దేవాలయంలోని ముక్తీశ్వరస్వామిని సందర్శనం చేసుకోడానికి గోదావరి నదిలో స్నానాలు చేసి స్వామిని దర్శించుకుంటున్నారు. అక్కడే విడిది ఏర్పాటుచేసుకుని భోజన, ఇతర ఏర్పాట్లను పూర్తి చేసుకుని నేరుగా బ్యారేజ్‌లను సందర్శించే కార్యక్రమానికి వెళ్తున్నారు. ఒకే రోజు ఇటు దైవ దర్శనం, అటు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజ్‌లను తిలకించడం వల్ల పర్యాటకులు ఎంతగానో మురిసిపోతున్నారు.

దేవాదులకు పెరుగుతున్న నీటి ప్రవాహం
భూపాలపల్లి, ములుగు జిల్లాలలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటం వల్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజ్ తరువాత గోదావరి నదీ తీరం తుపాకులగూడెంలోని దేవాదుల ప్రాజెక్టు వరకు వస్తున్న వరద ఉధృతి భారీగా పెరుగుతుంది. ఆ మేరకు దేవాదుల ఇన్‌టెక్ వెల్ వద్ద నీటి నిల్వ అనూహ్యంగా పెరుగుతుంది. ప్రాజెక్టులో నాలుగు మోటార్లను వెట్న్ చేస్తుండగా వచ్చిన నీటిని ఎత్తిపోయడానికి అధికారులు ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మల్లూరు వాగు ఉప్పొంగడంతో చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. భూపాలపల్లి బొగ్గు గనుల్లో కురుస్తున్న భారీ వర్షం వల్ల ఉత్పత్తి నిలిచిపోయింది.

People who come to visit Kaleshwaram Project

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కాళేశ్వరం ప్రాజెక్టుకు పోటెత్తిన జనం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: