ఇక్కడే పెంచి…. పెద్ద చేద్దాం

తక్కువ ఖర్చు.. ఎక్కువ చేపల ఉత్పత్తి.. అధిక ఆదాయం, ఇప్పటికే పలు అధ్యయనాలు చేసిన రాష్ట్ర మత్సశాఖ

Pen Culture

 

మన తెలంగాణ/హైదరాబాద్ : తక్కువ ఖర్చుతో చేప పిల్లలను వదిలి వాటిని పెంచి పెద్ద చేసి మత్సకారులకు ఎక్కువ ఆదాయం అందించడమే లక్షంగా మత్సశాఖ పెన్‌కల్చర్‌పై దృష్టిసారించింది. రాష్ట్రంలోని ఆరు రిజర్వాయర్లలో ప్రయోగత్మకంగా ఈ పద్ధతిని అమలు చేయనున్నారు. ఇందులో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఘన్‌పూర్, కరీంనగర్‌లోని ఎల్‌ఎమ్‌డి, నల్లగొండలోని శాలిగౌరారం, మహబూబాబాద్‌లోని పెద్ద చెరువు, ఖమ్మంలోని పాలేరు, మెదక్‌లోని పోచారం రిజర్వాయర్లలో పెన్ కల్చర్ ద్వారా చేప పిల్లలను పెంచేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఒక్కొ పెన్ కల్చర్‌కు రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ పద్ధతిలో ఒక హెక్టారు వీస్తీర్ణంలో 5 నుంచి 7 లక్షల ఫింగర్‌లింగ్(25 ఎంఎం) చేప పిల్లలను వదలవచ్చు. గత మూడేళ్లుగా రాష్ట్రంలో ఉచిత చేప పిల్లల పంపిణీ చేస్తున్నారు. ఈ చేప పిల్లలను ఇతర ఉత్పత్తి కేంద్రాల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఇందులో 80 ఎంఎం నుంచి 100 ఎంఎం, 35 ఎంఎం నుంచి 45 ఎంఎం వరకు ఉన్న చేప పిల్లలు ఉన్నాయి. 80 ఎంఎల చేప పిల్లలను టెండర్ ద్వారా ఒక్కటి రూ.1.50 లకు కొనుగోలు చేస్తుండగా, అంతకంటే చిన్నవరి 60 పైసల నుంచి 70 పైసలకు కొనుగోలు చేస్తున్నారు. అదే పెన్ కల్చర్‌లో ఫింగర్‌లింగ్స్‌కు (25 ఎంఎం) చేప పిల్లలను కేవలం 25 పైసలకు కొనుగోలు చేసి రిజర్వాయర్‌లో పరిమిత ఎన్‌క్లోజర్‌లో వదులుతారు. అక్కడే దానికి దాణా అందిస్తారు. అలా 80 ఎంఎం సైజు వచ్చిన తరువాత కొన్నింటిని తీసి రిజర్వాయర్‌లోని ఇతర ప్రదేశంలో వదులుతారు. కొన్నింటిని ఆ ఎన్‌క్లోజర్‌లోనే పెంచుతారని మత్సశాఖ అధికారులు చెబుతున్నారు.

ప్రత్యేక జాగ్రత్తలు తప్పనిసరి..

సాధారణంగా నీటి వనరుల్లో చేపల ఉత్పత్తి కంటే పెన్ కల్చర్‌లో అధికంగా ఉంటుంది. నాలుగు నుంచి 10 రెట్లు ఉత్పత్తి అధికంగా ఉంటుందని మత్సశాఖ కమిషనర్ డాక్టర్ సి. సువర్ణ మన తెలంగాణకు చెప్పారు. ఒక్క హెక్టారుకు నాలుగు టన్నులు ఉత్పత్తి వస్తుంది. కేజ్ కల్చర్‌తో చూస్తే నిర్వహణ వ్యయం కూడా తక్కువే. వాటికి సాధారణ దాణానే ఇస్తామని కాకపోతే ఈ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ విధానంలో చేపలు వివిధ రకాల ఇబ్బందులను కూడా తట్టుకుంటాయని చెబుతున్నారు. నార్వేలో 1.2 హెక్టారు లో (రెండున్నర ఎకరాల్లో) పెన్ కల్చర్ విధానంలో ఏకం గా 150 టన్నుల ఉత్పత్తి వచ్చినట్లు పేర్కొన్నారు. కాకపోతే పెన్ కల్చర్‌కు నీళ్లు మారుతూ ఉండాల్సి ఉంటుం ది. ఆక్సిజన్ స్థాయిపై కూడా జాగ్రత్తలు ఉండాలి. సముద్ర తీరం, ఉపరితలంపై నీరున్న చోట్ల, లోతుగా ఉండే నీటి వనరులు పెన్ కల్చర్‌కు అనుకూలమైనవి.

ఎన్‌సిడిసి నిధులతో..

సమీకృత మత్స అభివృద్ధి పథకం కోసం జాతీయ సహకార అభివృద్ధి బ్యాంకు (ఎన్‌సిడిసి) నుంచి రూ. 1000 కోట్ల రుణ మంజూరు పొందిన విషయం తెలిసిందే. ఈ నిధులతో మత్సకారులకు మోపెడ్‌లు, వలలు, ట్రాలీ ఆటోలు వంటివి పెద్ద ఎత్తున సబ్సిడీపై పంపిణీ చేస్తున్నా రు. అందులో పెన్ కల్చర్‌కు సంబంధించి కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. కేజ్ కల్చర్‌కు భిన్నంగా పెన్ కల్చర్ ఉంటుంది. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొత్తంలో చేపల ఉత్పత్తిని పెన్ కల్చర్‌లో చేపట్టవచ్చు. రాష్ట్రంలో అనుకూలమైన నీటి వనరులు ఉన్నాయా లేదా అసలు పెన్ కల్చర్‌ను ఎలా చేపట్టవచ్చు అనేదానిపై ఉత్తర్‌ప్రదేశ్ నుంచి ఆ కల్చర్‌లో విషయ ప్రావీణ్యం ఉన్న మత్య శాస్త్రవేత్త డాక్టర్. ఝాను హైదరాబాద్‌కు పిలిపించి చర్చలు కూడా జరిపారు. ఇటీవల మత్సశాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ కూడా ఇతర రాష్ట్రాలలో పెన్ కల్చర్ అమలును అధ్యయనం చేసి వచ్చారు.

The post ఇక్కడే పెంచి…. పెద్ద చేద్దాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.