వృత్తిలో భాగస్వామి ప్రోత్సాహం తప్పనిసరి

  ప్రస్తుత పరిస్థితుల్లో అవసరాలు తీర్చలేని ఆదాయం, పెరుగుతున్న ఆర్థికభారం భార్యాభర్తల మధ్య చిక్కులు తెచ్చిపెడుతోంది. ఆపై లేనిపోని అపోహలు, అనుమానాలతోటే జీవితం వెళ్లదీస్తున్నారు. భర్త తనకు తెలియకుండా అత్త మామలకే సంపాదించిన డబ్బంతా ఇస్తున్నాడనే భార్య ఆరోపణ. పుట్టింటి వాళ్ళే తన భార్యకు లేనిపోని విషయాలు నేర్పుతున్నారని భర్త వాదన. దంపతులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే దాంపత్య జీవితం ఒడిదుడుకులతో వెళ్లదీస్తున్నవారి సంఖ్య రోజు రోజుకూ పెరిగి పోతోంది. సగం జీవితాలు అనుమానాలతోనే నాశనం […] The post వృత్తిలో భాగస్వామి ప్రోత్సాహం తప్పనిసరి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ప్రస్తుత పరిస్థితుల్లో అవసరాలు తీర్చలేని ఆదాయం, పెరుగుతున్న ఆర్థికభారం భార్యాభర్తల మధ్య చిక్కులు తెచ్చిపెడుతోంది. ఆపై లేనిపోని అపోహలు, అనుమానాలతోటే జీవితం వెళ్లదీస్తున్నారు. భర్త తనకు తెలియకుండా అత్త మామలకే సంపాదించిన డబ్బంతా ఇస్తున్నాడనే భార్య ఆరోపణ. పుట్టింటి వాళ్ళే తన భార్యకు లేనిపోని విషయాలు నేర్పుతున్నారని భర్త వాదన. దంపతులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే దాంపత్య జీవితం ఒడిదుడుకులతో వెళ్లదీస్తున్నవారి సంఖ్య రోజు రోజుకూ పెరిగి పోతోంది. సగం జీవితాలు అనుమానాలతోనే నాశనం అయిపోతున్నాయి కూడా. జీవితాంతం వెలుగు నీడలా ఉండే భాగస్వామిని అనుమానించడం అనేది ఒక మానసిక రుగ్మతయే అంటారు నిపుణులు.

ఒకరిపై ప్రేమతో మరొకరు:
నేటి యువత తెలుసుకోవాల్సింది ముఖ్యంగా పెళ్ళి చేసుకునే ముందే మీరు మీ భార్యను ఎలా చూసుకోవాలి, ఎలా ప్రేమించాలి అని. ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం కూడా మంచిదే. ఎందుకంటే పెళ్ళయ్యాక అనుమానంతో జీవితం దుర్లభం అవుతుంది. ప్రేమ వివాహం అయినా, పెద్దలు చేసిన పెళ్లి అయినా భార్యాభర్తల బంధంలో ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ ఉంటేనే ఆ బంధం బలపడుతుంది. కాని అవతలి వ్యక్తి కూడా మనిషే అని వారికి ఒక వ్యక్తిగత జీవితం ఉంటుందని తెలుసుకోవాలి. ప్రేమ అంటే సొంతం చేసుకోవడం కాదు. వారికి స్వేచ్ఛనివ్వాలి. ప్రేమ పేరుతో అవతలివారిని తమకు బందీగా చేసుకుని, ఊపిరి సలపనివ్వకపోతే ఆ బంధం ఎక్కువ రోజులు ఉండదు. రోజూ భార్యను ప్రశ్నించడం, అనుమానించడం అంటే వారిని, ఇద్దరిమధ్య ఉన్న బంధాన్ని అవమానించడమే.

ఒకరిపై మరొకరికి నమ్మకం:
ఒకరిపై మరొకరికి నమ్మకం దాంపత్య జీవితంలో ప్రధానమైనది. వేరొకరితో స్నేహంగానో, అవసరం ఉండి ఏదైనా మాట్లాడినా కూడా తప్పు పట్టుకుంటే అది బాధాకరమే. కించపరిచే మాటలు మాట్లాడే అలవాటు ఉంటుంది కొందరిలో. అలా అనడం వల్ల తనకు ఆత్మసంతృప్తి కలుగుతుంది కాని తనతో జీవితం పంచుకునే వ్యక్తికి బాధను కలిగిస్తుందనేది గుర్తించగలగాలి. నమ్మిన వ్యక్తిని మోసం చేయాలనే ఆలోచనను మనసులోకి రానివ్వకూడదు. ఎక్కువ శాతం వివాహేతర సంబంధాలు ఏర్పడటానికి కారణం, ఇద్దరి మధ్య ఉండే సంబంధాన్ని అభివృద్ధి చేసుకోకపోవడమే ప్రధాన సమస్య. ఒకరి అభివృద్ధికి ఇంకొకరు తోడు నీడగా ఉండాలి. ఒకరికి ఒకరు భరోసాగా ఉండాలి. ఆనందమయ జీవితానికి సర్దుబాటు తప్పనిసరి అని గుర్తించాలి.

అభినందించడం :
చదువులోగాని, వృత్తిరీత్యా ఉన్నత స్థాయికి ఎదుగుతూ ఆ విషయాన్ని భాగస్వామితో పంచుకున్నప్పుడు భాగస్వామి ప్రతిస్పందన ఎలా ఉంటుందో గమనించాలి. మీరు విజయం సాధించిన విషయం మీ భాగస్వామికి చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఇది అనుకోకుండా వచ్చిందా..! ముందే ఊహించావా..? అని అడిగితే వారికి మీ సామర్థ్యం మీద కొద్దిగా నమ్మకం ఉన్నట్లే. అసలు ఆ విషయం తెలియచేయాలంటేనే మీకు భయంగా ఉంటుందా, దాన్నిబట్టి మీ సక్సెస్‌ను సంతోషించే వ్యక్తా కాదా అని విషయం అర్థం అవుతుంది. మీరు సాధించినదానికి ముందు మీరు సంతోషించడం మొదలుపెట్టండి. భాగస్వామినీ అభినందించడం అలవాటు చేసుకున్నట్లైతే అరమరికలు లేని దాంపత్య జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది.

ఎత్తిపొడుపు మాటలతో నరకయాతన:
ఎంతో ఆతృతతో ఇంటికి వచ్చి, ఒక ముఖ్యమైన ప్రాజెక్టుకి మిమ్మల్ని హెడ్ బాస్ చేశారని మీరు చెప్తే, మీ బాస్‌తో చనువుగా ఉండబట్టే లేదా లంచం ఇవ్వడం వల్లనే మీకు ఆ పొజిషన్ వచ్చిందని సూచనప్రాయంగానో, ఎత్తిపొడుపు మాటలతో మాట్లాడితే నరకప్రాయమే అవుతుంది. కాని ఈ తరహా అభిప్రాయమే సాధారణంగా సమాజంలో ఉంటుంది. అది మీ భాగస్వామి అభిప్రాయం కూడా అయితే అది మార్చాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి అభిప్రాయాన్ని, మాటలను ఏమాత్రం సహించేది లేదని వారికి తెలపాలి. అభినందించక పోయినా ఫర్వాలేదు కానీ కించపరిచే మాటలతో మాట్లాడితే మనసు గాయపడుతుందని గుర్తించండి.

మీ స్నేహితులను హేళన చేస్తే:
మీ స్నేహితుల గురించి ఎప్పుడూ అవహేళనగా మాట్లాడుతున్నా, వారి స్నేహం వల్లనే మీ ప్రవర్తన సరిగా లేదని నిందలు వేస్తున్నా, వారిని కలిసినప్పుడు వారితో కఠినంగా, కోపంగా మాట్లాడుతున్నా, మీ స్నేహితుల నుంచి మిమ్మల్ని దూరం చేయాలనే ప్రయత్నమే కావచ్చు. అలాంటప్పుడు మీరు భాగస్వామితో మెల్ల మెల్లగా సర్ది చెప్పే ప్రయత్నం చేయాలి. మీరు కూడా వెంటనే స్పందించకుండా వీలైతే మీ భాగస్వామికి ఇష్టం లేనివారితో ఎక్కువ స్నేహం తగ్గించుకోవడం లాంటివి చేయాలి. అప్పుడే దాంపత్య జీవితంలో ఆనందాన్ని ఆస్వాదించడం చేయగలుగుతాం.

ప్రోత్సహించండి:
వృత్తి, ఉద్యోగ ధర్మాల్లో మీకు తప్పనిసరి హాజరు కావాల్సిన మీటింగ్స్ ఉంటే మీ భాగస్వామి అర్థం చేసుకోకుండా తను చెప్పిన పని కావాలనో, సమయానికి ఇంటికి వచ్చేయాలనో పట్టుబడితే, మీ భాగస్వామి మీ వృత్తికి సరైన ప్రాముఖ్యతనివ్వడంలేదనే అర్థం చేసుకోవాలి. పైగా అయినదానికి, కానిదానికి, మీరు మారిపోయారని మిమ్మల్ని నిందిస్తుంటే ఇటు ఉద్యోగం వదులుకోవాలా లేక భాగస్వామిని సంతోషపెట్టాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. మీ కెరీర్ వల్లనే మీరు మరింత ఆత్మవిశ్వాసంతో ఉన్నారనిపిస్తే, ఈ వృత్తి తోనే మన ఈ జీవితాన్ని అనుభవిస్తున్నామని భావిస్తే భాగస్వామిలో మార్పు తేవడం తప్ప వేరే మార్గం ఉండదు.

అనుమానం పెనుభూతం:
అనుమానం ఎవరికి ఉన్నా వారు తమ ప్రవర్తన పట్ల వెంటనే రియలైజ్ అయితే మంచిది. లేదంటే సంసారంలో లేనిపోని గొడవలు వచ్చి భార్యాభర్తలు విడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తల ఆనందానికి కారణం మీరే… మీ ఆలోచనలు మార్చుకుని ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటేనే సంతోషంగా ఉండగలుగుతారు. భార్యాభర్తల మధ్య ఎలాంటి సమ్యలు వచ్చినా సులభంగా పరిష్కరించుకోవచ్చు. ఇకపై మీ సంసారంలో ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకునే బాధ్యత దంపతులదే. కుటుంబ జీవనమే సాంఘిక జీవనానికి పునాది. ఆలుమగల మధ్య సర్దుబాటే ఆనందమయ దాంపత్య జీవిత రహస్యం వివాహ వ్యవస్థ పవిత్రతను, ఇందులో చోటు చేసుకుంటున్న అపశృతులను సరిచేసుకుని, కలకాలం కొనసాగేలా వివాహబంధాన్ని పునరుద్ధరించుకోవాలి.

                                                                                  -డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి, ఫ్యామిలీ కౌన్సెలర్

Partner Encouragement is must in profession

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వృత్తిలో భాగస్వామి ప్రోత్సాహం తప్పనిసరి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: