భరోసా లేని బాల్యవిద్య!

    ఏ జాతి అభివృద్ధి అయినా, ఏ దేశ వికాసమైనా విద్య, వైద్య రంగాలపై ఆధారపడి ఉంటుంది. వాటిపై అక్కడి ప్రభుత్వాలు పెడుతున్న ఖర్చు ను బట్టి ఉంటుంది. కెనడా వంటి దేశాల్లో ఈ రెండింటిపరంగా ప్రజలకయ్యే ఖర్చును ప్రభుత్వాలే భరిస్తాయన్న వాస్తవాన్ని గమనించినప్పుడు మిగతా చోట్ల కూడా అలా ఎందుకు జరగడం లేదు అనే ప్రశ్న తలెత్తుతుంది. ప్రజల అభివృద్ధి, వికాసాలకు మించిన ప్రగతి లక్షం వేరే ఏముంటుంది అనే తలంపు కలుగుతుంది. కాని […] The post భరోసా లేని బాల్యవిద్య! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

    ఏ జాతి అభివృద్ధి అయినా, ఏ దేశ వికాసమైనా విద్య, వైద్య రంగాలపై ఆధారపడి ఉంటుంది. వాటిపై అక్కడి ప్రభుత్వాలు పెడుతున్న ఖర్చు ను బట్టి ఉంటుంది. కెనడా వంటి దేశాల్లో ఈ రెండింటిపరంగా ప్రజలకయ్యే ఖర్చును ప్రభుత్వాలే భరిస్తాయన్న వాస్తవాన్ని గమనించినప్పుడు మిగతా చోట్ల కూడా అలా ఎందుకు జరగడం లేదు అనే ప్రశ్న తలెత్తుతుంది. ప్రజల అభివృద్ధి, వికాసాలకు మించిన ప్రగతి లక్షం వేరే ఏముంటుంది అనే తలంపు కలుగుతుంది. కాని ప్రభుత్వ విద్యారంగం పట్ల మన కేంద్ర పాలకులు ప్రదర్శిస్తున్న నిర్లక్షానికి సాక్షంగా వెలువడిన అధికారిక గణాంకాలను గమనించినప్పుడు దేశం ఎంత దురవస్థలో ఉందో అనే బాధ, ఆవేదన కలుగుతాయి.

మన దేశంలో విద్య ఉమ్మడి జాబితాలో ఉంది. కాబట్టి పిల్లలకు సరైన వాతావరణంలో మంచి చదువును అందించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద అమితంగా ఉంటుంది. దేశంలోని దాదాపు సగం (40 శాతానికి పైగా) ప్రభుత్వ పాఠశాలల్లో విద్యుత్ సౌకర్యం, ఆట స్థలాలు కరువని మానవ వనరుల అభివృద్ధిపై ఏర్పాటయిన పార్లమెంటరీ కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్యా శాఖకు సంబంధించిన పద్దులపై రాజ్యసభకు సమర్పించిన నివేదికలో ఈ కమిటీ ఈ కఠోర వాస్తవాన్ని వెల్లడించింది. 2020-21 సంవత్సరానికి పాఠశాల విద్యా శాఖ రూ. 82,570 కోట్ల నిధులు అడగ్గా రూ. 59,845 కోట్లే కేటాయించి 27 శాతం కోత విధించిన నిర్వాకాన్ని ఈ నివేదిక ఎండగట్టింది. కనీసం సవరించిన బడ్జెట్‌లోనైనా ఈ లోటు పూడ్చాలని సూచించింది. నిజానికి వీధి వీధినా పిచ్చుక గూళ్లలా వెలుస్తున్న ప్రైవేటు పాఠశాలల్లోనే ఆటస్థలాల ఊసు, ఉనికి మచ్చుకైనా ఉండదు.

వెలుతురు చొరని చీకటి గుయ్యారాల్లాంటి ఇరుకు ఇళ్లల్లో, ఫ్లాట్లలో ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు తామరతంపరగా, ఇబ్బడిముబ్బడిగా నడుస్తున్నాయి. అటువంటి వాటికి అనుమతులు ఇవ్వడమే ప్రభుత్వాల అపరాధం కాగా, ఒకప్పుడు విశాలమైన ఆటస్థలాలకు పేరొందిన ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పుడా వసతి కరువయిపోడం క్షమించరాని నిర్లక్ష్యానికి నిదర్శనం. ప్రాథమిక, సెకండరీ, ఉన్నత పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు వయసులో నవనవలాడుతుంటారు. వారి మెదళ్లు, శరీరాలు వికాసానికి, ఎదుగుదలకు అనువుగా ఉంటాయి. ఆ దశలో వారికి తగిన సౌకర్యాలు కలిగించి వారి శారీరక, మనోవికాసాలను పెంపొందించడం కోసమే పాఠశాలల్లో క్రీడలు, చిత్రలేఖనం, చేనేత వంటి కళాత్మక వృత్తుల్లో తర్ఫీదు ఇవ్వడం ఒకప్పుడు తప్పని సరిగా ఉండేది.

అందుకోసం ఫిజికల్ ఎడ్యుకేషన్, డ్రాయింగ్, క్రాఫ్ట్ టీచర్ల పోస్టులు విధిగా ఉన్నత పాఠశాలల్లో ఉండేవి. వాటి సంగతి అటుంచి 40 శాతానికిపైగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యుత్తు లేకపోడమంటే పసి వయసు పిల్లల విద్యా, వికాసాలపట్ల కేంద్రానికి గల శ్రద్ధ ఎంతటిదో అర్థమవుతున్నది. మణిపూర్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనైతే కరెంటు సదుపాయమున్న పాఠశాలలు 20 శాతం కూడా లేవన్న నివేదికాంశం అత్యంత ఆందోళనకరం. ఒడిశా, జమ్మూకశ్మీర్‌లలో ఆటస్థలాలున్న పాఠశాలలు 30 శాతం కూడా లేవన్న సమాచారం దిగ్భ్రాంతికరమైనది. ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్టళ్లల్లో మరుగుదొడ్లు లేకపోడమో, ఉన్నా వాడదగిన రీతిలో ఉండకపోడమో సర్వసాధారణమైపోయింది. ఈ కారణంగా బాలికలు బడి చదువులు మానుకుంటున్నారన్నదీ కాదనలేని చేదు వాస్తవమే. నిధుల కొరతను దృష్టిలో ఉంచుకొని పార్లమెంటరీ కమిటీ చేసిన ఒక సూచన, సిఫారసు ఎంతైనా హర్షించదగినది.

ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీ గోడలు నిర్మించడానికి మహాత్మ గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించాలని కమిటీ సూచించింది. ఆ పథకాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారన్న విమర్శ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన తక్షణ సదుపాయాల కోసం దాని నిధులను వాడుకోడం వివేకవంతమైన పనే. పాఠశాలలకు విద్యుత్తు సదుపాయం కల్పించడానికి సౌర విద్యుత్తును వినియోగించుకోవాలని ఇందుకోసం నూతన, పునరుత్పాదక, నిరంత రాయ ఇంధన వనరుల శాఖ సాయం తీసుకోవాలని పార్లమెంటరీ కమిటీ చూపించిన దారి తప్పనిసరిగా అనుసరించదగినదే. ఉన్నత పాఠశాలల్లో తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయ భవనాల నిర్మాణం విషయంలో ఎక్కడున్న గొంగడి అక్కడే అన్న దుస్థితిని పార్లమెంటరీ కమిటీ ఎత్తి చూపించింది. పిల్లలు మంచి విద్యను నేర్చుకుంటే వారిలో ప్రశ్నించే తత్వం పెరుగుతుందనే భయం కేంద్ర పాలకులను పీడిస్తున్నదా అనే ప్రశ్న ఎవరిలోనైనా కలిగితే ఆక్షేపించవలసిన పని లేదు.

Parliamentary Panel Finds over 40% Govt Schools Across

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post భరోసా లేని బాల్యవిద్య! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: