జంధ్యాల మార్క్ కామెడీతో…

Pandugadi photo studio movie

 

ఆలీ హీరోగా తెరకెక్కుతున్న పూర్తి వినోదాత్మక చిత్రం ‘పండుగాడి ఫోటో స్టూడియో’. ‘వీడు ఫోటో తీస్తే పెళ్ళి అయిపోద్ది’ అనేది ట్యాగ్‌లైన్. పెదరావూరు ఫిలిం సిటీ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర విద్యాలయం ఆర్ట్స్ పతాకంపై దిలీప్ రాజా దర్శకత్వంలో గుదిబండి వెంకట సాంబిరెడ్డి రూపొందించిన ఈ చిత్రం ఆడియో వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఆడియో సిడీని ప్రముఖ దర్శకులు పూరి జగన్నాథ్, బోయపాటి శీను సంయుక్తంగా విడుదల చేశారు. ట్రైలర్‌ను ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి విడుదల చేశారు. ఈ వేడుకలో బాపట్ల ఎంపి నందిగాం సురేష్, హీరో శ్రీకాంత్, సీనియర్ నటుడు నరేష్, అల్లరి నరేష్, బాబు మోహన్, ఛార్మి, ఖయ్యుమ్, ప్రవీణ, అనిల్ కడియాల తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరో ఆలీ మాట్లాడుతూ “దర్శకుడు దిలీప్ రాజా మొదట నాకు కొన్ని పాటలు పంపి వినమన్నారు. ఆ పాటలు నచ్చడంతో సినిమా చేస్తానని చెప్పాను. కథ కూడా చాలా బాగుంది. వెంకటేశ్వర విద్యాలయ సంస్థ అధినేతగా ఉన్న నిర్మాత సాంబిరెడ్డి సినిమాలపై ఇష్టంతో ఈ చిత్రాన్ని నిర్మించారు”అని అన్నారు. నిర్మాత గుదిబండి సాంబిరెడ్డి మాట్లాడుతూ “మొట్టమొదటిసారిగా మా బ్యానర్‌లో ఆలీతో ఈ చిత్రాన్ని నిర్మించాను. కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని చూసి ఆనందించి, ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. అలాగే మా బ్యానర్‌లో రెండో చిత్రంగా స్టార్ హీరో మమ్ముట్టి నటించిన చిత్రంతో సెప్టెంబర్‌లో మీ ముందుకు రానున్నాము” అని తెలిపారు.

చిత్ర దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ “జంధ్యాల మార్క్ కామెడీతో ఈ చిత్రం ఉంటుంది. ఆలీ హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన ఈ సినిమాకు పూర్తి న్యాయం చేశారు. ఇక సినిమా విషయానికి వస్తే… పండుగాడు ఫోటో తీస్తే ఎవరికైనా పెళ్లై పోతుంది అనేది కాన్సెప్ట్. సీన్ టు సీన్ కామెడీ ఉండేలా రాసుకున్నాను. ఈ సినిమా షూటింగ్ మొత్తం తెనాలిలో చేశాము. పాటలు మాత్రం అరకులో చిత్రీకరించాము. యాజమాన్య అందించిన సంగీతం ఆహ్లాదంగా ఉంటుంది”అని చెప్పారు.

Pandugadi photo studio movie Audio Released

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జంధ్యాల మార్క్ కామెడీతో… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.