పాక్‌ –లంక తొలి టెస్టు డ్రా

PAK

రావల్పిండి: పాకిస్థాన్ గడ్డపై సుదీర్ఘ విరామం తర్వాత జరిగిన తొలి టెస్టు మ్యాచ్ ఫలితం తేలకుండానే డ్రా అయ్యింది. రావల్పిండి వేదికగా పాకిస్థాన్‌శ్రీలంక జట్ల మధ్య చారిత్రక తొలి టెస్టు మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌కు పదేపదే వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ డ్రాగా ముగియక తప్పలేదు. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన ధనంజయ డిసిల్వా అజేయ శతకం సాధించాడు. పాకిస్థాన్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న ధనంజయ 15 ఫోర్లతో 102 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఓపెనర్‌గా దిగిన కెప్టెన్ దిముత్ కరుణరత్నె 59 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ ఒశాడా ఫెర్నాండో (40) తనవంతు పాత్ర పోషించాడు. వికెట్ కీపర్ డిక్వెల్లా 33 పరుగులు చేశాడు. దీంతో లంక గౌరవప్రద స్కోరును సాధించింది.

ఆబిద్, ఆజమ్ శతకాలు

తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన పాకిస్థాన్ ఆదివారం చివరి రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. ఓపెనర్ ఆబిద్ అలీ, స్టార్ ఆటగాడు బాబర్ ఆజమ్‌లు అజేయ శతకాలతో చెలరేగారు. మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన పాక్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ షాన్ మసూద్ (౦) తెరవకుండానే పెవిలియన్ చేరాడు. అయితే తర్వాత వచ్చిన కెప్టెన్ అజహర్ అలీతో కలిసి మరో ఓపెనర్ ఆబిద్ అలీ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. ఇద్దరు జాగ్రత్తగా ఆడుతూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. కానీ, 4 ఫోర్లతో 36 పరుగులు చేసిన అజహర్‌ను లహిరు కుమార వెనక్కి పంపాడు.

దీంతో 90 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఈ దశలో బ్యాటింగ్‌కు దిగిన స్టార్ ఆటగాడు బాబర్ ఆజమ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. ఇటు ఆజమ్, అటు ఆబిద్‌లు చెలరేగడంతో స్కోరు పరిగెత్తింది. ఇద్దరు అద్భుత ఆటతో అభిమానులను కనువిందు చేశారు. ఆబిద్ సమన్వయంతో బ్యాటింగ్ చేయగా, ఆజమ్ దూకుడును ప్రదర్శించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన ఆబిద్ 11 ఫోర్లతో 109 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు చెలరేగి ఆడిన ఆజమ్ 128 బంతుల్లో 14 ఫోర్లతో 102 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. కాగా, ఆబిద్ అలీకి మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.

Pakistan vs Sri Lanka First Test Draw

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పాక్‌ – లంక తొలి టెస్టు డ్రా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.