పాక్ చెప్పేదొకటి చేసేదొకటి…

Pakistan

 

హాఫీజ్ సయీద్‌ను పాకిస్థాన్‌లో అరెస్టు చేశారన్న వార్త ఇప్పటికీ అనేక సార్లు మనం విని ఉన్నాం. ఈ వార్త వచ్చిన కొన్ని రోజులకే ఏదో మూల చిన్న వార్తలా అతన్ని విడుదల చేశారన్న వార్త కూడా వస్తుంది. పాకిస్థాన్ మారిపోయినట్లు ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నాలు తీవ్రంగా చేస్తుంది. హాఫీజ్ సయీద్‌ను అరెస్టు చేస్తారన్న వార్తను చాలా మంది స్వాగతించారు. చాలా మంది మంచి పని చేస్తున్నారని ప్రశంసించారు. ఉగ్రవాదాన్ని అణిచేస్తాం అనే ప్రసంగాలు మామూలే. కాని భారతదేశానికి సంబంధించినంత వరకు పరిస్థితేమీ మారలేదు. భారతదేశం ఇచ్చిన అనేక డోసియర్లు హాఫిజ్ సయీద్‌కు సంబంధించినవే.

కాని పాకిస్థాన్ ఎలాంటి చర్య తీసుకోలేదు. ఎన్నిసార్లు ఆయన్ను అరెస్టు చేయలేదు? ఎన్నిసార్లు ఆయన్ను నిర్బంధంలోకి తీసుకోలేదు? ఎన్నిసార్లు ఆయన్ను విడుదల చేయలేదు? పాకిస్థాన్‌లోని కోర్టులు న్యాయబద్ధంగానే ఆయన్ను విడుదల చేస్తున్న వార్తలు కూడా వస్తున్నాయి. హాఫిజ్ సయీద్‌ను ముందస్తు జాగ్రత్తగా అరెస్టు చేయడం, ప్రివెంటవ్ కస్టడీ వగైరా ఈ వార్తలన్నీ కంటితుడుపు చర్యలేనని భారతదేశానికి బాగా తెలుసు. పాకిస్థాన్ టెర్రరిజాన్ని ఒక ఆయుధంగా ఉపయోగిస్తుందన్నది ఇప్పుడు రహస్యమేమీ కాదు. హాఫిజ్ సయీద్ గురించి వస్తున్న వార్తలన్నీ కేవలం వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నాలు మాత్రమే.

పాకిస్థాన్ ఇప్పుడు హాఫిజ్ సయీద్ పై అనేక కేసులు పెడుతున్నట్లు చెప్పింది. లష్కరె తయ్యిబా ఒక ఉగ్రవాద సంస్థ. ఈ సంస్థ కోసం హాఫీజ్ సయీద్ నిధులు సేకరించాడు. ఐదు ట్రస్టులను ఉపయోగించి లష్కర్ కోసం నిధుల సేకరణ జరిపారు. హాఫీజ్ సయీద్ పై 23 కేసులు, ఆయన అనుచరులపై 12 కేసులు బుక్ చేస్తున్నామని పాకిస్థాన్ ప్రకటించింది. కాని, పాకిస్థాన్‌లో పలుచోట్ల హాఫిజ్ సయీద్ తన స్వంత కంగారూ కోర్టులు నడుపుతున్నాడు. వాటి గురించి ప్రస్తావన ఎక్కడా లేదు.

ఈ సంస్థల ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకుంటున్నట్లు ప్రకటించారు. కాని ఇలా వివిధ సంస్థల ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్న వార్తలు, బ్యాంకు ఖాతాలు స్తంభింపజేసిన వార్తలు గతంలో కూడా చాలా వచ్చా యి. విచిత్రమేమంట, అనేక సార్లు ఈ సంస్థలపై పాకిస్థాన్ చర్యలు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇన్నిసార్లు చర్యలు తీసుకున్నప్పటికీ ఈ సంస్థలు పాకిస్థాన్‌లో ఎలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఎలా చురుకుగా ఉన్నాయన్నది వెయ్యి డాలర్ల ప్రశ్న. ఈ సంస్థలు పని చేస్తున్నాయంటే, చురుగ్గా ఉన్నాయంటే అర్థం ఒక్కటే. పాకిస్థాన్‌లో అధికారంలో ఉన్న శక్తుల మద్దతు, సహకారం వాటికి లభిస్తుంది. అందువల్లనే ఈ సంస్థలు ఇంకా పని చేయగలుగుతున్నాయి. అంత బలం, అధికారం పాకిస్థాన్ లో ఎవరికి ఉందంటే.. పాకిస్థాన్ సైన్యానికి తప్ప అలాంటి అధికారం మరెవ్వరికీ లేదు.

హాఫీజ్ సయీద్ పై చర్యలు వంటి వార్తల ద్వారా భారతదేశం కాస్త మెత్తబడి మరలా చర్చలకు సుముఖత చూపుతుందని కొందరు ఆశించవచ్చు. అమెరికా ఇటీవల బెలుచీ లిబరేషన్ ఆర్మీపై నిషేధం విధించింది. ఈ నిషేధం తర్వాత ప్రతిస్పందనగా పాకిస్థాన్ టెర్రరిస్టులపై కొరడా ఝళిపించిందని కొందరు విశ్లేషించవచ్చు. ఇమ్రాన్ ఖాన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇద్దరి మధ్య చర్చలకు ముందు ఇలాంటి చర్యలు అవసరమని పాకిస్థాన్ భావిస్తూ ఉండవచ్చు. అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు పాకిస్థాన్ మిత్రుడేమీ కాదు. పాకిస్థాన్ పట్ల ప్రత్యేక ప్రేమ ఏదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు లేదు. పాకిస్థాన్ ప్రధానిపై చాలా ఒత్తిడి ఉంది. అమెరికా దృష్టిలో ఇప్పుడు పాకిస్థాన్ కన్నా ఇండియా చాలా ముఖ్యమైన దేశం.

భారతదేశం అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా భావిస్తోంది. అమెరికా ఇండియాల మధ్య కొన్ని విభేదాలున్నప్పటికీ ఇప్పుడు ఇండియాతో స్నేహాన్నే అమెరికా కోరుతోంది. పాకిస్థాన్ విషయంలో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్సు కూడా చాలా అనుమానంగానే చూస్తోంది. 2017 కన్నా 2018లో అనుమానాస్పద లావాదేవీలు 57 శాతం పెరిగాయని చెప్పింది. పాకిస్థాన్ పై బ్లాక్ లిస్టు వేటు అక్టోబరులో పడే అవకాశాలున్నాయి. అత్యంత బలహీనమైన యాంటీ మనీ లాండరింగ్ విధానాలు, బలహీనమైన కౌంటర్ టెర్రర్ వ్యవస్థలున్న దేశాల జాబితాలో పాకిస్థాన్ పేరును కూడా యూరోపియన్ కమిషన్ చేర్చింది.

పాకిస్థాన్ నేరాల చిట్టాను డోసియర్ రూపంలో భారతదేశం ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్సుకు అందజేసింది. ముఖ్యం గా భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి పాకిస్థాన్ ప్రమేయం గురించిన సాక్ష్యాధారాలు అందజేసింది. దీనివల్ల ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్సులో పాకిస్థాన్ పరిస్థితి ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంది. 2019 ఫిబ్రవరి వరకు పాకిస్థాన్ ఉగ్రవాద ఫండింగ్ గురించి వివరాలు ఇండియా అందజేసింది. ఈ వివరాల వల్ల ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ పాకిస్థాన్ విషయం లో, ఉగ్రవాద నిధుల సరఫరా విషయంలో ఖచ్చతమైన అవగాహనకు రావడం సాధ్యమైంది. నిజానికి ఈ సమాచారమంతా పాకిస్థాన్‌కు కూడా ఇండియా అందజేసింది. అనేక సార్లు ఈ సమాచారాన్ని ఇచ్చింది. కాని పాకిస్థాన్ ప్రతిసారీ తగిన ఆధారాలు లేవనే మాట మాత్రమే చెబుతూ వచ్చింది.

టెర్రరిస్టులు టెర్రరిస్టులే… మానవత్వానికి శత్రువులే. మంచి టెర్రరిస్టు, చెడ్డ టెర్రరిస్టు అంటూ తేడా ఉండదు. అందరు చెడ్డవాళ్ళే. ఈ మాటలను భారత ప్రధాని పలుమార్లు చెబుతూ వస్తున్నారు. అంతర్జాతీయ సంస్థలకు పాకిస్థాన్ టెర్రర్ సహకారం గురించిన ఆధారాలను, డోసియర్లను భారతదేశం సమర్పించడం వల్ల పాకిస్థాన్ పై మరింత ఒత్తిడి పెంచవచ్చు. వివిధ దేశాలకు కూడా ఈ సమాచారాన్ని అందజేయడం ద్వారా వాస్తవాలను వివరించవచ్చు.

ఉగ్రవాదాన్ని ఒక ఆయుధంగా పాకిస్థాన్ ఉపయోగిస్తుందని, ఉగ్రవాదులకు సహాయ సహకారాలు అందిస్తుందని ఇప్పటికే చాలా దేశాలు అనుమానిస్తున్నాయి. సరయిన ఆధారాలు, సమాచారం ఈ దేశాలకు అందజేస్తే పాకిస్థాన్ విషయంలో ఉన్న అనుమానాలను నిర్ధారించుకునే అవకాశం ఉంది. పాకిస్థాన్ విషయంలో వివిధ దేశాలు ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశమూ ఉంటుంది. పాకిస్థాన్ పై అంతర్జాతీయ ఒత్తిడి పెంచడమే పాకిస్థాన్‌ను దారిలో పెట్టే మంచి మార్గం.

Pakistan promotes Terrorism

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పాక్ చెప్పేదొకటి చేసేదొకటి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.