పాక్ ప్రతి చర్య

  భారత హైకమిషనర్ బహిష్కరణ వాణిజ్య సంబంధాలు రద్దు ఎన్‌ఎస్‌సి భేటీలో పాక్ ప్రధాని ఇమ్రాన్ నిర్ణయం 370 ఆర్టికల్ రద్దు, జమ్ము కశ్మీర్ విభజనతో రగిలిపోతున్న వైనం ఇస్లామాబాద్ : కశ్మీర్‌పై భారత్ చర్యకు పాకిస్థాన్ రగిలిపోయింది. పాకిస్థాన్‌లోని భారత హై కమిషనర్ అజయ్ బిసారియాను దేశం నుంచి బహిష్కరించింది. భారత్‌తో దౌత్య సంబంధాలరు కుదించుకోవాలని నిర్ణయించింది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన ఇక్కడ అత్యంత కీలకమైన జాతీయ భద్రతా కమిటీ ( ఎన్‌ఎస్‌సి) సమావేశం […] The post పాక్ ప్రతి చర్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

భారత హైకమిషనర్ బహిష్కరణ
వాణిజ్య సంబంధాలు రద్దు
ఎన్‌ఎస్‌సి భేటీలో పాక్ ప్రధాని ఇమ్రాన్ నిర్ణయం
370 ఆర్టికల్ రద్దు, జమ్ము కశ్మీర్ విభజనతో రగిలిపోతున్న వైనం

ఇస్లామాబాద్ : కశ్మీర్‌పై భారత్ చర్యకు పాకిస్థాన్ రగిలిపోయింది. పాకిస్థాన్‌లోని భారత హై కమిషనర్ అజయ్ బిసారియాను దేశం నుంచి బహిష్కరించింది. భారత్‌తో దౌత్య సంబంధాలరు కుదించుకోవాలని నిర్ణయించింది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన ఇక్కడ అత్యంత కీలకమైన జాతీయ భద్రతా కమిటీ ( ఎన్‌ఎస్‌సి) సమావేశం జరిగింది. జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని భారతదేశం ఏకపక్షంగా, అన్యాయంగా రద్దు చేసిందని పేర్కొంటూ, తాము ప్రతిచర్యకు దిగుతున్నట్లు ప్రకటించారు. ఎన్‌సిసి భేటీ సుదీర్ఘంగా సాగింది. ఆర్టికల్ 370 ఎత్తివేత నిర్ణయం గురించి తమ దేశం తరఫున నిరసనను ఏ విధంగా వ్యక్తం చేయాలనే అంశంపై విస్తృతంగా చర్చించారు.

తమ దేశంలో భారతీయ హైకమిషనర్ వెంటనే దేశం విడిచి పోవాలని ఆదేశించారు. దౌత్య సంబంధాల తగ్గింపు ప్రక్రియలో భాగంగా వెనువెంటనే ఇరుదేశాల మధ్య వాణిజ్యాన్ని నిలిపివేయాలని నిర్ణయించారు. ఇక ద్వైపాక్షిక ఏర్పాట్లను సమీక్షించాలని, తగు విధంగా నిర్ణయాలు తీసుకోవాలని సంకల్పించారు. ఇమ్రాన్‌ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన భేటీ వివరాలను అధికారికంగా ఆ తరువాత ప్రకటించారు. తమ దేశ రాయబారి ఇక ఢిల్లీలో ఉండరని, ఇక్కడి నుంచి భారతీయ హై కమిషనర్‌ను స్వదేశానికి పంపిస్తున్నామని విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషీ ఎన్‌ఎస్‌సి సమావేశం తరువాత టీవీ ఛానల్స్‌తో మాట్లాడుతూ చెప్పారు.

సోమవారం భారత ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేయడం, రాష్ట్రాన్ని విడగొట్టడం వంటి నిర్ణయాలు తీసుకుంది. ఈ చర్యను వెనువెంటనే పాకిస్థాన్ తీవ్రంగా ఖండించింది. దీనిపై అంతర్జాతీయ , ప్రాంతీయ తీవ్ర ప్రభావాలు ఉంటాయని హెచ్చరించింది. ప్రస్తుతం భారతీయ హై కమిషనర్ అజయ్ ఇస్లామాబాద్‌లో ఉన్నారు. ఇటీవలే భారత్‌కు హై కమిషనర్‌గా నియమితులు అయిన మొయిన్ ఉల్ హక్ ఇంకా ఢిల్లీకి వెళ్లి బాధ్యతలు తీసుకోలేదు. ఈ దశలో పాకిస్థాన్ ఈ నిర్ణయం తీసుకుంది. జమ్మూ కశ్మీర్ లోపలా, నియంత్రణ రేఖ వెంబడి పరిస్థితిని కూడా జాతీయ కమిటీ సమీక్షించినట్లు వెల్లడైంది. భారత ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించిందని, దీనికి తగు జవాబు ఇవ్వాల్సి ఉంటుందని కమిటీలో అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

ఆర్టికల్ రద్దుపై ఐరాసకు
దౌత్య సంబంధాలను దాదాపుగా నిలిపివేయాలనే నిర్ణయం తీసుకున్న పాకిస్థాన్ కశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370పై భారత ప్రభుత్వ నిర్ణయంపై తీవ్రంగా స్పందించింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి ముందుకు తీసుకువెళ్లాలని, ఇతర ప్రపంచ దేశాలకు కూడా తెలియచేయాలని నిర్ణయించింది. ప్రత్యేకించి భద్రతా మండలి వెంటనే కశ్మీర్ అంశాన్ని సమీక్షించాల్సి ఉందని, దీనిని మండలి ముందుకు తీసుకువెళ్లుతామని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి తెలిపారు. ఈ నెల 14న తమ దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని కశ్మీరీలకు సంఘీభావంగా నిర్వహించాలని నిర్ణయించారు. 15వ తేదీని బ్లాక్‌డేగా పాటించాలని కూడా తలపెట్టారు.

సైన్యం అప్రమత్తంగా ఉండాలి
అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని, సైన్యం అప్రమత్తతను కొనసాగించాలని, అవాంఛనీయ ఘటనలకు తావ్విరాదని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదేశించారని అధికార వర్గాలు తెలిపాయి. కీలకమైన ఎన్‌ఎస్‌సి భేటీకి దేశ విదేశాంగ, రక్షణ, అంతర్గత వ్యవహారాల మంత్రులు, ఆర్థిక వ్యవహారాల సలహాదారుడు, కశ్మీర్ సంబంధిత విషయాల మంత్రితో పాటు త్రివిధ బలగాల అధిపతులు, ఐఎస్‌ఐ చీఫ్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

సౌదీ యువరాజుతో మంతనాలు
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించిన ఆర్టికల్ 370ని రద్దు చేసి, భారత ప్రభుత్వం ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టిన తర్వాత… కశ్మీర్‌లో పరిస్థితి గురించి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌కు వివరించినట్టు పాక్, సౌదీ మీడియాలు తెలిపాయి. ఇద్దరు నాయకులూ మంగళవారం ఫోన్‌లో మాట్లాడుకున్నారని అధికార సౌదీ ప్రెస్ ఏజెన్సీ (ఎస్‌పిఎ) తెలిపింది. ‘ఫోన్‌లో వారు ఆ ప్రాంతంలో (కశ్మీర్) చోటుచేసుకున్న పరిణామాల గురించి, అందుకు చేసిన ప్రయత్నాల గురించి చర్చించారు’ అని ఏజెన్సీ తెలిపింది. పాకిస్థాన్, సౌదీ అరేబియా సన్నిహితంగా ఉండే మిత్రదేశాలు. సంపన్న దేశమైన సౌదీ అరేబియా ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌కు అండగా నిలబడింది.

Pak PM Imran to NSC meeting to discuss Kashmir situation

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పాక్ ప్రతి చర్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: