వచ్చే నెలాఖరులో కొత్త సెక్రటేరియట్‌కు శంకుస్థాపన!

Old Secretariat building to be demolished in July

 

ఆర్థికశాఖ నుంచి ‘రైట్ ఆఫ్’ రాగానే టెండర్ల ప్రక్రియ
అత్యాధునిక హంగులతో నూతన సచివాలయం నిర్మాణం
హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే పలువురు మంత్రులు, అధికారులతో సిఎం కెసిఆర్ చర్చ?

మన తెలంగాణ/హైదరాబాద్: కొత్త సచివాలయ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఈ నేపథ్యంలోనే వారంలోపే పాత సచివాలయాన్ని కూల్చివేసి, కొత్త సచివాలయం నిర్మాణానికి జూలై నెలాఖరులోగా (శ్రావణమాసం)లో శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి రెండు, మూడు రోజుల్లో ఆర్థికశాఖ నుంచి ‘రైట్ ఆఫ్’ వచ్చే అవకాశం ఉందని, దీనికి సంబంధించి ఆర్ అండ్ బి అధికారులు ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపనున్నట్టుగా సమాచారం.

ఆర్థికశాఖ నుంచి ‘రైట్ ఆఫ్’ రాగానే ఆర్ అండ్ బి శాఖ అనుమతితో టెండర్ల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే కూల్చివేతలకు సంబంధించిన తేదీలను సిఎం కెసిఆర్ ప్రకటించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సెక్రటేరియట్ కూల్చివేతపై ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్‌ను కూల్చివేసి కొత్తది కట్టుకోవడానికి అనుమతించింది. ఈ నేపథ్యంలో కొత్త సెక్రటేరియట్‌ను ఆధునిక హంగులతో నిర్మించడానికి ప్రభుత్వం సమాయత్తం అవుతోంది.

మంత్రివర్గ ఉపసంఘం, సాంకేతిక కమిటీల నివేదిక ఆధారంగా…
సచివాలయం తరలింపు, నూతన సచివాలయ నిర్మాణం, అసెంబ్లీ నూతన భవన నిర్మాణం అంశాలపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధ్యక్షుడిగా, మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్ సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం సంవత్సరం క్రితం ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ప్రస్తుత సచివాలయం అందులో ఉన్న సౌకర్యాలను, భవనాల పరిస్థితిని అధ్యయనం చేయడానికి ఇంజనీరింగ్ చీఫ్‌లతో మంత్రివర్గ ఉపసంఘం సాంకేతిక కమిటీని నియమించింది. ఆ కమిటీ అప్పట్లోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ప్రస్తుతం ఆ నివేదిక ఆధారంగా కొత్త సచివాలయం నిర్మాణం జరగనున్నట్టు అధికారులు తెలిపారు.

డిజైన్లతో పాటు నిర్మాణంలోనూ ఆధునిక టెక్నాలజీ వినియోగించేలా…
తెలంగాణ చరిత్ర, ప్రతిష్టను చాటే విధంగా భవన నిర్మాణ నమూనాను రూపొందించాల్సిందిగా స్వయంగా కెసిఆర్ ప్రముఖ ఆర్కిటెక్ట్‌లకు గతంలో సూచించారు. సిఎం విజ్ఞప్తి మేరకు స్పందించిన కొంతమంది ఆర్కిటెక్టులు ప్రముఖ డిజైన్లను సిఎంకు పంపించారు. సిఎం కెసిఆర్ సచివాలయ నిర్మాణానికి సంబంధించి కొత్త డిజైన్లను ఇప్పటికే ఎంపిక చేసినట్టుగా తెలిసింది. అయితే డిజైన్లతో పాటు నిర్మాణంలోనూ ఆధునిక టెక్నాలజీ వినియోగించాలని సిఎం కెసిఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం. ప్రస్తుతం సచివాలయ నిర్మాణానికి సుమారు రూ.450 కోట్ల అంచనాతో కూడిన ప్రతిపాదనలను సిద్ధం చేసిన మంత్రివర్గ ఉపసంఘం, సాంకేతిక కమిటీలు గత సంవత్సరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే.

సాధారణంగా ఇసుకలో 20 శాతం మేర కలిపి..
పది బ్లాకులతో కూడిన పాత సచివాలయాన్ని కూల్చే సందర్భంలో వందల టన్నుల కాంక్రీట్ వ్యర్థాలు ఉత్పన్నం అవుతాయి. ఆ వ్యర్థాలను కొత్త సచివాలయ నిర్మాణంలో వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. కొత్త సచివాలయ నిర్మాణానికి ఇసుక చాలా అవసరం. పాత సచివాలయాన్ని కూల్చినప్పుడు ఉత్ఫన్నమయ్యే వ్యర్థాలను ఇసుకగా మార్చి కొత్త నిర్మాణంలో వినియోగించాలని అధికారులు కొత్త ప్రతిపాదనలతో కూడిన నివేదికలను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించారు. సుమారు 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త సచివాలయాన్ని నిర్మించనున్న నేపథ్యంలో ఇసుక చాలా అవసరమని గుర్తించిన అధికారులు దానికి ప్రత్యామ్నాయంగా పాత భవనాలకు కూల్చివేయగా వచ్చే వ్యర్థాలను వినియోగించాలని యోచిస్తున్నారు. అందులో భాగంగానే కాంక్రీట్ శిథిలాలను ఆధునిక పద్ధతుల్లో పొడిగా మార్చి దానిని నిర్మాణంలో వినియోగించనున్నట్టుగా సమాచారం. సాధారణంగా ఇసుకలో 20 శాతం మేర కలిపి వినియోగిస్తారని, పలు నగరాల్లో ఇప్పటికే కాంక్రీట్ వ్యర్థాల రీసైక్లింగ్ చేసి నిర్మాణాల్లో వినియోగిస్తున్నారని దానినే కొత్త సచివాలయ నిర్మాణంలో ఉపయోగించాలని నిర్ణయించినట్టుగా తెలిసింది.

కూల్చివేతలకే రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల ఖర్చు
కూల్చివేతలోనూ అత్యాధునిక పద్ధతులను అవలంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. పాత భవనాలను కూల్చివేసే సమయంలో చుట్టుపక్కల వారితో పాటు రోడ్డుపై వెళ్లే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సిఎం అధికారులకు సూచించినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఒకేసారి భవనాలు నేలమట్టం అయ్యేలా ఇంప్లోజన్ విధానాన్ని అనుసరించాలని అధికారులు నిర్ణయించినట్టుగా సమాచారం.

ఈ పద్ధతి వలన 10 నుంచి 15 అంతస్థుల భవనాన్ని 15 నుంచి 30 నిమిషాల వ్యవధిలో నేలమట్టం చేయనున్నట్టు తెలిసింది. ఒక్కో భవనంలో మూడు నుంచి ఐదు దశల్లో జిలెటిన్ స్టిక్స్‌ను అన్ని ఫిల్లర్లకు అమర్చి సచివాలయం బయటి నుంచి రిమోట్ ఫెన్సింగ్ విధానం ద్వారా పేల్చుతారు. 11 బ్లాకులకు జిలెటిన్‌స్టిక్‌లను అమర్చిన తరువాత ఎక్కడా సాంకేతిక లోపాలు లేకుండా చూసుకొని సచివాలయం లోపలి నుంచి ఈ ఆపరేషన్ నిర్వహిస్తారు. కేవలం కూల్చివేతలకే రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్లు అవసరమని ఆర్‌అండ్ బి అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు.

సచివాలయంలో బ్లాక్స్ సంఖ్యను పెంచేలా చర్యలు

ప్రస్తుతం ఉన్న సచివాలయం పాతబడనప్పటికీ అది ఇప్పటి పరిపాలనకు ఏమాత్రం అనుకూలంగా లేదు. సరికొత్త టెక్నాలజీ లేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక, నూతన టెక్నాలజీతో కూడిన సచివాలయాన్ని నిర్మించాలని నిర్ణయించింది. దీంతోపాటు సచివాలయంలో బ్లాక్స్ సంఖ్యను కూడా పెంచాలనుకుంటోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం వినిపించిన వాదన సమ్మతించదగ్గ విధంగా ఉండటంతో హైకోర్టు ప్రభుత్వ వాదనకే మొగ్గుచూపుతూ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువరించింది.

ఇప్పటికే డిజైన్లు ఓకే

గత సంవత్సరం ప్రముఖ కంపెనీలు నూతన సచివాలయానికి సంబంధించిన డిజైన్లను ప్రభుత్వానికి సమర్పించారు. ఇప్పటికే డిజైన్లను కూడా సిఎం కెసిఆర్ ఓకే చేసినట్టుగా తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో వెంటనే పాత సచివాలయాన్ని కూల్చివేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా రావడంతో పలువురు మంత్రులు అధికారులతో సిఎం సోమవారం సమావేశం అయినట్టుగా తెలిసింది. కొత్త సచివాలయం నిర్మాణానికి సంబంధించి డిజైన్లతో పాటు పాత సచివాలయం కూల్చివేతకు సంబంధించిన విషయాలపై ముఖ్యమంత్రి కెసిఆర్ వారితో చర్చించినట్టుగా తెలిసింది.

 

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post వచ్చే నెలాఖరులో కొత్త సెక్రటేరియట్‌కు శంకుస్థాపన! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.