పండుటాకుల మహాకావ్యం

  ఇప్పుడంతటా మైక్రోఫ్యామిలీసే విస్తరించిన నేపథ్యంలో వృద్ధులకు ఇవాళ ఇంట్లో చోటులేదు. వాళ్లను పాత సామాను కింద జమచేసి వృద్ధాశ్రమాల్లోకి విసిరేస్తున్నాం. ఫలితంగా సమాజం మానవీయ విలువలు లేకుండా, నైతిక విలువలు మర్చిపోయి మృగప్రాయంగా తయారైంది. ప్రతిమనిషి వృద్ధాప్యాన్ని ఒక రోగంగా, నేరంగా భారంగా భావించి వృద్ధాప్యాన్ని ఏవగించుకుంటున్నాడు. కాని ఏ మనిషైనా తప్పనిసరిగా చేరాల్సిన చిట్టచివరి మజిలీ వృద్ధాప్యమే. తెలుగులో బాల్య మీద వచ్చినంత కవిత్వం వృద్ధాప్యం మీద రాలేదు. అక్కడక్కడ కొత మంది సీనియర్ […] The post పండుటాకుల మహాకావ్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఇప్పుడంతటా మైక్రోఫ్యామిలీసే విస్తరించిన నేపథ్యంలో వృద్ధులకు ఇవాళ ఇంట్లో చోటులేదు. వాళ్లను పాత సామాను కింద జమచేసి వృద్ధాశ్రమాల్లోకి విసిరేస్తున్నాం. ఫలితంగా సమాజం మానవీయ విలువలు లేకుండా, నైతిక విలువలు మర్చిపోయి మృగప్రాయంగా తయారైంది. ప్రతిమనిషి వృద్ధాప్యాన్ని ఒక రోగంగా, నేరంగా భారంగా భావించి వృద్ధాప్యాన్ని ఏవగించుకుంటున్నాడు. కాని ఏ మనిషైనా తప్పనిసరిగా చేరాల్సిన చిట్టచివరి మజిలీ వృద్ధాప్యమే. తెలుగులో బాల్య మీద వచ్చినంత కవిత్వం వృద్ధాప్యం మీద రాలేదు. అక్కడక్కడ కొత మంది సీనియర్ కవులు ముదిమి మీద కవిత్వం రాయకపోలేదు. కాని ముసలితనంలోని అనేక పార్శ్యాలను తడుముతూ ఒక కావ్యాన్నే రాయడం చాలా అరుదు. దీన్ని బద్దలు కొట్టి వృద్ధుల ప్రపంచంపై డా. ఎన్. గోపి రాసిన తాజా కవితా సంపుటి ‘వృద్ధోపనిషత్’.

“ఒంటరితనమంటే
తాను కూర్చున్న కుర్చీ
ఒక శిలాజంగా మారిపోవడం
ఎదుటివారు మాట్లాడే ప్రతి మాటా
డొల్లగా మారి
హృదయానికి గుచ్చుకోవటం
ఒక కన్నీటి చుక్క
యేరులై, నదులై
సముద్రమై పొంగిపొర్లటం
చనిపోయిన సహచరి
ఫోటోలోంచి జాలిగా పలుకరించటం”
రక్తమంతా చల్లబడిపోయి, అవయవాలన్నీ కదలడానికి మొరాయించి, పడక కుర్చీనో, మంచాన్నో నేస్తున్నప్పుడు ఎడారి లాంటి ఒంటరితనాన్ని భరించడం చాలాకష్టమైన పని. గడిచిన జీవితకాలపు జ్ఞాపకాలన్నీ ఒక్కోటి నిద్రలేస్తుంటాయి. వసంతకాలం నాటి రంగులన్నీ మాయమైపోయి ఒక తెల్లని శూన్యం మనసంతా ఆవరిస్తుటుంది. చుట్టూ రాళ్లలాంటి మనుషులెంత మంది ఉన్నా ఒక్క పలకరింపూ లేక నిశ్శబ్దం మెల్లమెల్లగా హృదయాన్ని కోస్తూ వెళ్తుంది. అందుకే ఒంటరితనం ‘వృద్ధాప్యానికి పూచే పిచ్చిపువ్వు’ అంటాడు కవి.

“శత్రువులెప్పుడూ లేరు
ఇప్పుడు ముసలితనమే ఓ దుష్మన్!
ఎవరిపైనా షికాయత్ లేదు
ఉంటే దేవునిపైన
కాని అతడేదీ వినడు”
శరీరం రోజుక్కొత శిథిలమవుతూంటుంది. మనం పిలవకుండానే మడతల్లాంటి ముడతలు ముఖం మీదికి వచ్చి కూర్చుంటాయి. కాలం తెచ్చిన మార్పుకు ఎవరి మీద ఫిర్యాదు చేయాలి? చేస్తే గీస్తే కనిపించని దేవునిపైనే చేయాలి. న్యాయదేవతకు కళ్లుండవు కాని చెవులుంటాయి. దేవునికి కళ్లుంటాయి కాని చెవులుండవు. అందుకే అతడేదీ వినడు. ఇక మనకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? అప్పుడు జీవితం బతికి తీరవలసిన విధిగా తోస్తుంది. కానైతే ఇక్కడొక ఇబ్బంది. జీవితమంతా ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, బాధలు, నొప్పులుగానే గడిచిపోతుంది. చివరి మజిలీలోనైనా కాస్త ఊరట దొరకుతుందేమోనని ఆశ. అదీ దొరక్కపోతే గడవాల్సిన క్షణాలన్నీ ముళ్ళుగానే తోస్తాయి.

“మనల్ని కవులుగా మార్చిన ప్రేమ
ఇప్పటికీ
కరుణకాంతుల్తోనే వుంది.
కాకపోతే
ప్రియురాలి చేతులిప్పుడు
తామర తూడులు కావు.
ముఖంలో చంద్రబింబం లేదు
నడకలోంచి
రాజహంసలు తొలిగిపొయ్యాయి.
ప్రేయసి పాతబడుతుందేమో కాని ప్రేమ పాతబడదు. యవ్వనపు తొలివాకిట్లో నిలబడి నచ్చిన సుందరిని ఎదనిండా నింపుకున్నప్పుడు ఏదో కొత్త వెలుతురు హృదయం నిండా పరుచుకుంటుంది. అప్పుడు మాట్లాడే ప్రతిమాటలో ఎంతో భావుకత తొంగి చూస్తుది. ఆ మూగ ప్రేమలో ఎన్నో మౌనపరిమళాలు. అయితే విషాదం ఏమిటంటే ఆ ప్రియురాళ్లుకూడా ఇప్పుడు మనలాగే ముసలివాళ్లు అయిపోవటం. ‘కాని ఆనాటి మన చిరునవ్వులు ఎప్పటికీ వాడని పువ్వులు. అప్పటి మన ఆత్మలు అఖండంగా వెలిగే దీపాలు’. కాలం ఎంత కటువైంది? ఆమెకు కూడా ముసలితనాన్ని ప్రసాదించింది. ‘ఒకప్పటి నా అందాల సుందరి తరగని అనురాగరాగిణి కూడా ముసల్ది అయిందే’ అని కవి ఆశ్చర్యపోతుంటాడు. అయినా ఇప్పటికీ ఆమె మీదే ఆధారపడటం ఒక తప్పని జీవన వాస్తవం.

“అమ్మాయీ!
గ్లాసు నీళ్లు తెచ్చి పెట్టమ్మా
కోడలికి వినపడిందిగాని
వినబడక పోవటంతో సమానం”
కాస్సేపు
నిశ్శబ్దం రాజ్యమేలింది
ఎవరు నింపారో తెలియదుగాని
అతని కళ్లనిండా నీళ్లు!”
ఇంట్లో చాలా చేతులుంటాయి కాని అవి ఏవేవో పనుల్లో బిజీగా వుంటాయి. పలకరిచకపోతే పలకరించక పోయారు కనీసం గొంతు తడుపుకోవడానికి గుక్కెడు మంచి నీళ్లు కూడా ఇచ్చే తీరిక లేకపోతే ఎట్లా? అరచి అరచీ, కుమిలీ కుమిలీ చివరాఖరికి కళ్లనిండా నీళ్లు తెచ్చుకోవటం మినహా ఏమీ మిగలదు. నిజానికి వృద్ధాప్యం శాపం కాదు. కానీ పట్టిచుకోకపోవడం వల్లే అది శాపంతో సమానంగా మారిపోతుంది. ఒకప్పుడు ఇంటికి అన్నీ సమకూర్చిన చేయి అది. ఇప్పుడది ఏ ఆసరా లేక లోకం చూపించే నిర్లక్ష్యానికి వణికిపోతుంది. ‘వృద్ధుడంటే ముసలివాడని కాదు. వృద్ధి పొందిన వాడని’ ఈ ప్రపంచం ఎప్పుడు తెలుసుకుంటుందో!
“మొట్టమొదటి సారి కొడుకులు
గద్దల్లా కనిపిస్తున్నారు
వద్దురా!
నా మందులగ్గావాల్రా
ఆకు వక్కలు కొనుక్కుట బిడ్డా!
అని శోకాలు పెట్టింది ముసల్ది
ఎవడు వింటడు!
యముడు ప్రాణాలు లాక్కుపోతున్నట్టు
పైసలు వదలదీసిండు”
వయసులో సంపాదించిన ధనమైనా ఉండాలి. కొడుకులైనా ఉండాలనేది ఒక జీవన సూత్రం. జనాభాలో తొంభైశాతం పేదరికపు బతుకులే కాబట్టి వాళ్ల దగ్గర డబ్బుడే అవకాశమే లేదు. ఓట్ల కోసమో, వృద్ధుల మీద నిజమైన ప్రేమోకాని ప్రభుత్వాలు గత కొత కాలంగా ఓల్డేజ్ పెన్షన్‌లు మంజూరు చేస్తున్నాయి. వాటినీ ఒలుచుకుపోయే క్రూరమైన కొడుకులున్న కాలం ఇది. పెరుగుతున్న బిపి, షుగర్‌లను తగ్గించుకునేందుకో, బుక్కెడు బువ్వ కోసమో పొదుపుగా వాడుకుంటున్న పెన్షన్ కాస్తా కొడుకుల పాలయ్యాక ముసలి ప్రాణానికి మళ్లీఖాళీ చేతులే మిగులుతాయి.

బాల్య, కౌమర, యౌవన, వృద్ధాప్య దశల్లో మనిషి చేరుకునే దయనీయమైన దశ నిస్సందేహంగా వృద్ధాప్యమే! చూస్తూ చూస్తూ ఉండగానే రుతువులన్నీ మారిపోయి శిశిరమొక్కటే మన నెత్తి మీదికి వచ్చి కూర్చుంటుంది. శరీరం పటుత్వం తప్పి ఒక్క అడుగు వేయడం దుర్భరమైపోతుంది. విశాల ప్రపంచాన్ని చుట్టి వచ్చిన కాళ్లు ఒక్క చిన్న గదికో, రేకుల షెడ్డుకో పరిమితమై జ్ఞాపకాలు కాకుల్లా పొడుచుకుతింటాయి. మన అస్తిత్వమే ప్రశ్నార్థకమై భయకంపితుల్ని చేస్తుంది. కూలిపోతున్న శరీరాన్ని మళ్లీ ఎలా కూడదీసుకోవాలో అర్ధంగాక మనసు నరక కూపంలో చిక్కుకుంటుంది. ఎంగిలి విస్తరాకులాంటి ముదుసలి ప్రాణాన్ని ఎట్లా విదుల్చుకోవాలో అర్ధంగాక లోకం తలపట్టుకుంటుంది. కాని వృద్ధాప్యం చాలా విలువైందని, అదొక జీవన సారాంశ దశ అంటాడు కవి ఇందులో.

‘వృద్ధాప్యానికి ఎదురయ్యేసమస్యలు దైహికం, మానసికం, సామాజికం అని స్థూలంగా మూడు రకాలుగా వుంటాయి. ఇంకెన్నో!? వృద్ధులు శారీరక శైథిల్యం, తరాల అంతరం, నిరాదరణ, ఒటరితనం, నాస్టాల్జియా, మతిమరుపు, మృత్యుభయం వంటి పలుసంక్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకొని వుంటారు. అయినా జీవన పరిణతి, ప్రేమతత్త్వం, సంతృప్తి వంటి వెలుగులు కూడా ఉంటాయి. వృద్ధాప్యదశలోని దైన్యాన్ని ఒకానొక చైతన్యంతో అధిగమించవచ్చునని నా కనిపించింది. ఉన్న కాస్త కాలంలో నిరాశను దగ్గరకు రానీయకూడదనీ, మృత్యువును సహజ ప్రక్రియగా స్వీకరిస్తూ తాత్త్వికంగా కూడా దర్శించవచ్చు’నంటాడు కవి.

అనుభవాల తేజస్సుతో నిండిన వృద్ధాప్యపు పలు అచుల్ని ఈ ‘వృద్ధోపనిషత్’ చాలా మర్యాదగా మన మనస్సుల్లోకి ఒంపుతుంది. వృద్ధులు ఇంటికి వెళ్లాడిన గబ్బిలాలు కాదని సంసారానికి దారిదీపాల్లాంటి వారని ఇందులోని ప్రతి అక్షరం రసార్ద్రంగా చెబుతుంది. ముదిమిని ఇష్టంగా అంగీకరించాలని, దృష్టి మార్చి చూస్తే ‘ముదిమి ఒక పగడాలదీవి’ అంటుంది ఈ కవితా సంపుటి. వయసు శరీరానికే కాని మనసుకు కాదని గొప్ప చైతన్యాన్ని నింపుతుంది. వృద్ధుడంటే మమకారాల చెట్టు అని, శాతిని వెదజల్లే రత్నదీపమని ధ్వనిపజేస్తుంది. ఈ కావ్యం. మరణశయ్య మీదున్న వృద్ధాప్యాన్ని చీదరించుకోవడం కాదు దాని వెలుతురును ఆవాహన చేసుకోవాలని ప్రతి కవిత ఎలుగెత్తి చాటుతుంది. ‘వృద్ధాప్యం అకస్మాత్తుగా ఊడిపడింది కాదు. శరీర మహారణ్యంలోంచి ఇప్పుడు బయట పడిందంతే’ అని పండుటాకుల పట్ల మన చూపును సవరించే కావ్యం. ఇప్పటి కాలానికి ప్రతి మనిషికి అత్యవసరమైన ఔషధం.
– డాక్టర్ వెల్దండి శ్రీధర్

Old Age Poems book written by Dr. N. Gopi

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పండుటాకుల మహాకావ్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: