జూ.పంచాయతీ కార్యదర్శులకు ఆఫర్ లెటర్

TSPRIకేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్
కోడ్ అభ్యంతరం లేదని స్పష్టీకరణ
హైదరాబాద్: రాష్ట్రంలోని 9335 గ్రామ పంచాయతీలకు కొత్త కార్యదర్శులకు నియామక పత్రం ఇచ్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించుకునేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపింది. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎంఎల్‌ఎసి ఎన్నికల కోడ్ పరంగా ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ ప్రఫుల్ అవస్థి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ రజత్ కుమార్‌కు గురువారం లేఖ ద్వారా తెలిపారు. ఎన్నికల నిబంధనావళి నుంచి వెసులుబాటు ఇవ్వాల్సిందిగా కోరుతూ పంచాయతీరాజ్ శాఖ ఈ నెల 5వ తేదీన సిఇఒ రజత్ కుమార్‌ను కోరింది. దీనిని ఇసి పరిశీలనకు పంపగా అనుమతి లభించింది.

కార్యదర్శుల నియామకాల కోసం అక్టోబర్‌లో నిర్వహించిన రాతపరీక్ష సందర్భంలో ఇచ్చిన ప్రశ్నాపత్రంలో ప్రశ్నలన్నీ సక్రమంగానే ఉన్నట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తేల్చింది. దీంతో నియామకాలకు మార్గం సుగమం అయింది. అక్టోబర్ 10వ తేదీన అభ్యర్థులకు రాతపరీక్షను నిర్వహించారు. దీనికి 4.75 లక్షల మంది హాజరుకాగా, మార్కుల ఆధారంగా వారి నుంచి పంచాయతీరాజ్ కమిషనర్ నేతృత్వంలోని కమిటీ అర్హులను ఎంపిక చేసింది. జిల్లాలవారీగా సర్టిఫికేషన్ పూర్తి చేసి ఎంపిక మొదలు పెట్టగానే హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఇప్పుడు ఆఫర్ లెటర్‌లు ఇచ్చేందుకు అన్ని అడ్డంకులు తొలగాయి. ఇదిలా ఉండగా మైనార్టీ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు యూనిఫాంలు, షూష్, కొత్త తరగతి భవనాల నిర్మాణాలు వంటి వాటికి కూడా కోడ్ వర్తించదని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి తెలిపింది.

Offer Letters to TS Panchayat Secretary Selected Candidates

Related Images:

[See image gallery at manatelangana.news]