స్త్రీ విద్యకు అవరోధాలు…

మన సంప్రదాయ సమాజం దారుణంగా నిర్లక్ష్యం చేసిన కీలక ప్రగతిశీల అంశాల్లో స్త్రీ విద్య ఒకటి. మహాత్మ జ్యోతిరావు ఫూలే సహచరి సావిత్రి బాయి ఫూలే తొలి భారతీయ ఉపాధ్యాయినిగా బాలికలకు మొదటి పాఠశాల స్థాపించినంతవరకు భారతావనిలో స్త్రీ విద్యకు ప్రాముఖ్యం లభించలేదంటే అతిశయోక్తి కాదు. సంప్రదాయ భారతీయ సమాజంలో మహిళలు ద్వితీయ శ్రేణి పౌరసత్వాన్ని మాత్రమే అనుభవించారన్న చేదు సత్యాన్ని కాదనలేము. ఇందుకు విరుద్ధంగా ఆధునిక భారత రాజ్యాంగం సర్వసమానత్వ సాధన పునాదిగా రూపొంది జన […] The post స్త్రీ విద్యకు అవరోధాలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన సంప్రదాయ సమాజం దారుణంగా నిర్లక్ష్యం చేసిన కీలక ప్రగతిశీల అంశాల్లో స్త్రీ విద్య ఒకటి. మహాత్మ జ్యోతిరావు ఫూలే సహచరి సావిత్రి బాయి ఫూలే తొలి భారతీయ ఉపాధ్యాయినిగా బాలికలకు మొదటి పాఠశాల స్థాపించినంతవరకు భారతావనిలో స్త్రీ విద్యకు ప్రాముఖ్యం లభించలేదంటే అతిశయోక్తి కాదు. సంప్రదాయ భారతీయ సమాజంలో మహిళలు ద్వితీయ శ్రేణి పౌరసత్వాన్ని మాత్రమే అనుభవించారన్న చేదు సత్యాన్ని కాదనలేము. ఇందుకు విరుద్ధంగా ఆధునిక భారత రాజ్యాంగం సర్వసమానత్వ సాధన పునాదిగా రూపొంది జన జీవనానికి సారథ్యం వహిస్తున్నది. పురుషులతో పాటు మహిళలకూ సకల విద్యావకాశాలు కల్పించడమే ప్రభుత్వాల పరమ కర్తవ్యంగా దిశా నిర్దేశం చేస్తున్నది. ఆచరణలో మాత్రం ఇది ఆశించిన స్థాయిలో ఫలించడం లేదు.

2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో పురుష అక్షరాస్యులు 82.14 శాతం కాగా, మహిళల్లో కేవలం 65.4 శాతం మందే ఉన్నారు. వాస్తవానికి తలిదండ్రులు చదివించాలేగాని బాలికలు విద్యలో బాలురను తలదన్నగలరని పదేపదే రుజువవుతున్నది. రాష్ట్రంలో ఇటీవల వెలువడిన ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లోగాని, సిబిఎస్‌ఇ 12వ తరగతి రిజల్స్‌లో గాని బాలికలదే మళ్లీ పైచేయి కావడం ఇందుకు తిరుగులేని తాజా నిదర్శనం. అయితే క్షేత్రస్థాయి వాస్తవాలు గమనించినప్పుడు మన దేశంలో చదువుకు పురుషుడున్నంత చేరువగా మహిళలు ఇప్పటికీ లేరని స్పష్టపడుతుంది. బాలికలు బడికి వెళ్లి చదుకోడానికి లెక్కలేనన్ని అవరోధాలు ఈనాటికీ కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నగరానికి సమీపంలోని హాజీపూర్‌లో ఒక కామాంధుడు, ముగ్గురు విద్యార్థినులకు లిఫ్ట్ ఇచ్చే నెపం మీద లోబరచుకొని రేప్ చేసి హతమార్చిన దారుణోదంతం బయటికి వచ్చిన తర్వాత ఆ గ్రామస్థులు తమ ఊరికి బస్సు సౌకర్యం లేకపోవడం వల్లనే ఈ ఘోరాలు జరుగుతున్నాయని పోలీసులకు మొరపెట్టుకున్నారు.

ఈ సమాచారాన్ని గమనిస్తే బాలికలు చదుకోవాలనుకోడం వారిని చదివించబోవడం ఈ రోజుకీ ఎంత సాహసోపేతమో అర్థంకాక మానదు. ఆ గ్రామస్థుల విజ్ఞప్తి మేరకు టిఎస్‌ఆర్‌టిసి వెంటనే హాజీపూర్‌కు బస్సు మంజూరు చేయడం హర్షించదగినది, అభినందించదగినది. ఈ విధంగా బడి వేళల్లోనూ, ఇతర సమయాల్లోనూ మహిళలు గమ్యాలు చేరడానికి తగిన వాహన సౌకర్యం లేని గ్రామాలు చాలా ఉండవచ్చు. రాబడి, ఖర్చు లెక్కలు కుదరక మారుమూల గ్రామాలకు బస్సులు నడిపించడానికి ఆర్‌టిసి వెనుకాడుతూ ఉండవచ్చు. దారి డొంకలులేని పల్లెల నుంచి కిలోమీటర్ల దూరం ప్రయాణించి పాఠశాలలకు వెళ్లడానికి బాలికలు వెనుకాడే ప్రమాదం ఇందువల్లనే అధికంగా ఉంది. హాజీపూర్ గ్రామస్థులు అదనపు బస్ సర్వీసుతోపాటు స్థానికులకు ఆటోలు నడుపుకునే వెసులుబాటు కల్పించాలని కూడా కోరారు.

వీలైనంతగా పలు రకాల రవాణా సౌకర్యాలు కల్పించడం ప్రజలకు మేలు చేయడమేగాక స్త్రీ విద్యకు ఎంతగానో తోడ్పడుతుంది. కేవలం బాలికల దారి ఇబ్బందిని గమనించి వారిని తన బైక్ మీద గమ్యం చేరుస్తానని ఆశపెట్టి ఆ దుండగుడు ఆ ముగ్గురిపై హత్యాచారాలకు ఒడిగట్టాడని, మృత దేహాలను పాడుబడ్డ బావిలో పడేశాడని ఆ కథనాలు చెబుతున్నాయి. గ్రామాల నుంచి స్కూళ్ళకు, కాలేజీలకు వెళ్లే బాలికలు సురక్షితంగా గమ్యాలు చేరుకోవాలంటే ఏ భయానికీ ఆస్కారం లేని రవాణా సౌకర్యం ఎంత అవసరమో హాజీపూర్ ఉదంతం తెలియజేస్తున్నది. బాలికలు చదువుకోడానికి, విద్య నేర్చుకున్నా అది సద్వినియోగమయ్యే రీతిలో ఉద్యోగాలు, వ్యాపారాలు వంటివి చేసుకోడానికి ముందుగా అడ్డొచ్చేది సంప్రదాయ గృహ వాతావరణమే. పాతకాలపు ఆలోచనల సంకెళ్లలో మగ్గడం వల్లనో, కఠిన దారిద్య్రం కారణంగానో తలిదండ్రులే ఆడపిల్లలను చదువులకు దూరంగా ఉంచుతున్నారు.

ఈ ధోరణిని నిరుత్సాహపరిచి స్త్రీ విద్య వల్ల ఆ కుటుంబానికి, సమాజానికి కలిగే మేలును వివరించి బాలికలను ప్రాథమిక తరగతుల్లో చేర్పించే కృషిలో ప్రభుత్వాలు, సామాజిక శ్రేయస్సు కోరే సంస్థలు సఫలమవుతున్నా ఐదో తరగతి పూర్తి చేయకముందే వారిలో చాలా మంది చదువు మానేస్తున్నారు. ఇందుకు చెప్పుకోదగిన కారణాల్లో ప్రధానమైంది ఇంట్లో వంట పనికి, పొలంలో పంట పనికి బాలికలను వినియోగిస్తున్న తలిదండ్రుల మానసిక, ఆర్థిక స్థాయే. పెరిగి పెద్దవారవుతున్న వయసులోని బాలికలకు పాఠశాలల్లో కనీస సౌకర్యాలు ఉండడం లేదు. దేశంలోని అనేక పాఠశాలల్లో మరుగుదొడ్లే లేవని మరి పెక్కు స్కూళ్లల్లో బాలికలకు ప్రత్యేకించి బాత్‌రూంలు కరవని సర్వేలు చాటుతున్నాయి. ఇలా అనేక అవరోధాలను దాటుకుంటూ చదువుకోడానికి వెళ్లే మహిళకు కామాంధుల కాటు తప్పడం లేదు. ఈ పరిస్థితిలో సమూలమైన మార్పు తీసుకురావడానికి ప్రభుత్వాలే కాకుండా మొత్తం సమాజం నడుం బిగించవలసి ఉన్నది.

Obstacles to woman education

Related Images:

[See image gallery at manatelangana.news]

The post స్త్రీ విద్యకు అవరోధాలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: