‘ఇదేదో నెమలి నీడలా వుంది’

నేటికాలంలో సామాజికమాధ్యమాల పుణ్యమా అని కవిత్వ వాతావరణంలో తిరిగే వాళ్ల సంఖ్య పెరిగింది. కవిత్వం చదివే వాళ్ల సంఖ్య, రాసేవాళ్ల సంఖ్య కూడా పెరిగింది. ఇది సంతోషించాల్సిన విషయం. ఒక కవి అంటాడు, ‘కవిత్వం రాసేవాళ్ల సంఖ్య పెరిగేకొద్దీ/పాపాత్ముల సంఖ్య తగ్గుతుందని’. ఈ కవులసంఖ్య పెరగడాన్ని స్వాగతించి,ప్రోత్సహించే లబ్దప్రతిష్టులు కొందరైతే, కొత్తతరం రాసే దానిలో పసలేదనీ,శిల్పంలేదనీ ఎద్దేవా చేసేవాళ్లు కొందరు. ఇలాంటి వాతావరణంలో కొత్తగా రాసేవారైనా,ఎవరైనా కవిత్వాన్ని శ్రద్ధతో, నిబద్ధతతో రాయాల్సివుంది. ఏదైనా రాయండీ,అది కవిత్వమై పరిమళించాలనీ […]

నేటికాలంలో సామాజికమాధ్యమాల పుణ్యమా అని కవిత్వ వాతావరణంలో తిరిగే వాళ్ల సంఖ్య పెరిగింది. కవిత్వం చదివే వాళ్ల సంఖ్య, రాసేవాళ్ల సంఖ్య కూడా పెరిగింది. ఇది సంతోషించాల్సిన విషయం. ఒక కవి అంటాడు, ‘కవిత్వం రాసేవాళ్ల సంఖ్య పెరిగేకొద్దీ/పాపాత్ముల సంఖ్య తగ్గుతుందని’. ఈ కవులసంఖ్య పెరగడాన్ని స్వాగతించి,ప్రోత్సహించే లబ్దప్రతిష్టులు కొందరైతే, కొత్తతరం రాసే దానిలో పసలేదనీ,శిల్పంలేదనీ ఎద్దేవా చేసేవాళ్లు కొందరు. ఇలాంటి వాతావరణంలో కొత్తగా రాసేవారైనా,ఎవరైనా కవిత్వాన్ని శ్రద్ధతో, నిబద్ధతతో రాయాల్సివుంది. ఏదైనా రాయండీ,అది కవిత్వమై పరిమళించాలనీ కొత్తతరమొకటి బలంగా వేళ్లూనుకోవాలనే సదుద్దేశ్యంతో సహృదయకవులు కవిత్వంపై కవిత్వాన్ని రాస్తుంటారు.ఏది కవిత్వంకాదో ఏది కవిత్వమో దిశానిర్దేశం చేస్తుంటారు. వారిలో ఆశారాజు ఒకరు.

ఇటీవల ఆయన కాలినడకలో ఇబ్బంది పడుతోన్నా,కలం నడకను ఆపలేదు. 111 కవితలతో తాజాగా ‘ఇదేదో నెమలినీడలా వుంది‘ సంపుటిని తీసుకువచ్చారు.అందులో కవిత్వంపై కవిత్వంగా (మెటాపోయట్రీ) ‘పచ్చల పిడిబాకు‘ ను రాశారు. అందులో పాదాల్ని చదువుదాం.కవితారచనపై శ్రద్ధ పెరుగుతుంది. ‘పసలేని వుట్టి వచనం రాసి/పచ్చని కవిత్వమనడం మానుకుందాం/ప్రచారం చేసుకుని/కవిగా ముద్రేసుకోవడం ఆపేద్దాము/కవిత్వాన్ని కవిత్వంలానే రాద్దాము/కాలమెంతైనా సరే/కవిత్వం అబ్బేదాకా తపస్సు చేద్దాము‘ అంటూ సాహిత్యలోకంలో నేడు నెలకొన్న కృత్రిమస్పందనలపై చురకలు పెట్టారు. ‘రాసింది బాలేదంటే/కోపం వద్దు/అద్భుతంగా వుందంటే/మోసపోవద్దు/కొన్ని ముందుమాటలు ముంచుతాయి/రాసేవాళ్ల ఉనికికోసం /నేర్చుకునే కవిని ఉరితీస్తాయి‘. కొత్తకలాలకు ఎంతో ‘మేలుకొలుపు’నిలా వ్యక్తం చేశారు. అలాగే కవిత్వం ఎలావుండాలో కూడా చెబుతారు.

‘పూసిన పువ్వుకు/పరిమళముండాలి/పాకే తీగకు తిరిగిన ఒంపులు వుండాలి/చేసిన తల్వార్ కు/బురుజును ఎగరేసే పదునుండాలి/పట్టుకుని పిడికిలికి/ఆకట్టుకునే నగిషీలుండాలి’. ఈ వాక్యాల్లో ధ్వనించేదీ కవిత్వానికి ఇంద్రధనస్సులాంటి సౌందర్యం వుండాలనీ! రాసింది వచనానికి భిన్నంగావుండాలనీ, రాసినవాడు మనిషై వుండాలనీ, రాసిందంతా ప్రేమై బతకాలనీ ఆశారాజు కవిత్వాశయం. నిజంగా ఏది రాస్తారో అలాగే జీవిస్తారు. మనుషులతో ఆత్మీయకరచాలనం చేస్తూ,నిరాడంబరంగా, నిర్మలంగా క్షణాలను వెలిగిస్తుంటారు. ముఠాలు గట్టి, రాజకీయాలకు పాల్పడే కవులందరికీ భిన్నంగా ఆశారాజుని చెప్పవచ్చు. ఇక ఈ సంపుటిలోని కవిత్వం ఆయనన్నట్టు ‘పచ్చల పిడి బాకు‘ లాంటిదే. ఒక కత్తి ఎంత పదునుగున్నా, పిడి లేకపోతే అందంగావుండదు. ఈ సత్యం తెలిసిన కవి,తన అక్షరాల్ని ఈస్థటిక్స్ ను అద్ది పాఠకులకు అందించారు.ఇందులో రెండురకాలుగా కవిత్వంవుంది. చాలా కవితలు మినీలరూపంలో వున్నాయి, మిగిలినవి రెగ్యులర్ ఫ్రీవెర్స్ గా వుండి అలరించేవీ. ఇపుడు కొన్ని మినీలను ఆస్వాదిద్దాం.
‘రాళ్లూ రప్పలే దేవుళ్లవుతాయి‘ అనే మినీలో..
‘వాళ్లు బెదిరిస్తారు/తిరిగిచూడకు/మీదపడి కొడతారు/భయపడి పారిపోకు/హింసించి హింసించి/పాషాణులవుతారు/బండల ముందెప్పుడూ తలదించకు/రాళ్లే దేవుళ్లయి కూర్చుంటాయి/అటు చూసీ ఇటు చూసీ చేతిలోకి తీసుకో/అది ఆయుధమవుతుంది.
కవిత ఎన్ని పాదాలున్నదని కాదు. ఎన్ని పాదాల్లో కవిత్వముందన్నదీ లెక్క. అలాగనీ కవితలో అన్ని పాదాలూ కవిత్వముండదు. చివర కొసమెరుపుతో కవితను కొత్తగానూ, హత్తుకునేలాగూ చెప్పవచ్చు. ఈ సంపుటిలో అనేక కవితలు మినీరూపంలో వుండటం,హృద్యంగా వుండటం, నవనవంగా వుండటం,వ్యంగ్యంగా వుండటం జరిగింది. అల్పాక్షరాల్లో అవసరమైన కవిత్వాన్ని రాశారు ఆశారాజు.
‘ఈనాటి వాతావరణం’లో…
‘గాలిలో/పసుపు/కుంకుమ/కాషాయం కలిసాయి/ప్రాణవాయువు లేదు/ఇంకా మనుషులు ఎట్లా బతుకుతారు?‘ గౌరీలంకేష్ హత్య కవిలోకాన్ని,ప్రజాస్వామ్యవాదుల్ని చలింపజేసింది.ఆలోచింపజేసింది.పాలకులే మతాలకు కొమ్ముగాస్తే ఎలాంటి అరాచకాలు జరుగుతాయో కళ్లకు కట్టించిందీ కవిత.
ఆశారాజు కవిత్వంలో సున్నితమైన,లలితమైన వాక్యాలుంటాయి.పదార్భాటం వుండదు.మితిమీరిన ఆవేశం వుండదు.భాషలో తీవ్రత వుండదు.గాయపరిచే భాష వుండదు.‘నాజూకు‘ కవితను చదివితే,పై విషయం తేటతెల్లమవుతుంది.అభం శుభం ఎరుగని ఆడపిల్లలను వేధించేవాళ్లకు,వాళ్లపై దాడిజేసే వాళ్లకు బడిలో కూర్చోబెట్టి పాఠాలను బోధించడాన్ని సున్నితంగా ఖండిస్తారిలా…
‘కసుగాయలను కొరికేసేవాళ్లను/చెట్టుకు కట్టేయకుండా/నీడలో కూర్చోబెట్టి/ఈ నీతి పాఠాలెందుకు!?‘.
కాలంతో పాటు కవిత్వం రాయడం అందరూ చేయలేరు. ఆరోగ్యం సహకరించనపుడు కూడా కవిత్వాన్ని శ్వాసతీసే వాళ్లు అరుదు. వారిలో ఆశారాజు ముందు వరసలో వుంటారు.మోకాళ్ల శస్త్రచికిత్స జరిగి ఇబ్బంది పడుతున్నా కవిత్వాన్ని లేపనంగా అద్దుకుంటూ ఇలాగంటారు.
‘అలసిపోయాననీ/చీకట్లో మడమ తిప్పలేదు/మైలురాళ్లు లెక్క పెట్టుకుని/ఏ నీడ దగ్గరా సేద తీరలేదు/అలసిపోయాను/కాని,ఆగిపోలేదు/గాయాలను చూసి బెదిరి/ఎప్పుడూ ఓడిపోలేదు‘.
కవిత్వాన్ని కవిత్వంగా రాయడం, కవిత్వంలో సౌందర్యాన్ని మేళవించడం ఆయనకు అక్షరంతో పెట్టిన విద్య.
కూలిన గోడల్లో వేణువు రాగంలా కవిత్వాన్ని చదవడానికి చందమామని పిలుస్తాడు. ధ్వంసమైన దృశ్యాన్ని పురివిప్పిన నెమలిని చేస్తాడు. దమ్ కా బిర్యానీ, చికెన్ అప్ఘానీ, ఫిష్ గోవన్ ,మీఠా ఖుబానీ,ఛాయ్ సులేమానీ ల రుచులను కవిత్వపుటల పల్లెంనిండా వడ్డించి, ఆరగించమంటాడు. ఆశారాజు కవిత్వం సరళసుందరం.అనేక సంస్కృతుల్లోంచి నూతనపదాలను కవిత్వం చేసిన ఫుట్ నోట్సుని జోడిస్తుంటారు. ఇంతేజాం(బందోబస్తు, ఏర్పాటు), గుడ్ గుడీ ధూమం(హుక్కా తాగడం), బీన్ (పాములను ఆడించడానికి వాడే పుంగి), బర్బాద్ (నష్టం, నాశనం), దావాత్ (సిరాబుడ్డి),దస్త్రం(కాగితాల కట్ట),కమ్మలు(పేజీలు),హిసాబ్ (లెక్క). ప్రత్యేక దృష్టిలో చూడాలేగానీ ఉర్దూపదాలను తెలుగుపదాలతో కలిపి ఆశారాజుశైలిగ మార్చేస్తారు. ప్రతి సంపుటిలోనూ ఇలాంటివెన్నో పసందు చేస్తాయి.
‘ఇదేదో నెమలి నీడలా వుంది‘ కవిత్వం ప్రస్తుతం అవసరమైన విషయాలన్నీ అద్దంలో చూపెట్టింది. చర్చించదగిన అంశాలన్నింటినీ పొందుపరిచింది. నోళ్లమీద నానిపోవాల్సిన,నాట్యమాడాల్సిన ఎన్నో కవితాపంక్తులను ఇందులో కవితకొకటైనా తారసపడతాయి. మచ్చుకు కొన్ని పట్టిచూద్దాం..
1.‘నదిని దాటడానికి/నావకోసం ఎదురుచూడొద్దు/అడ్డంగా వరదలో దూకి/ఈదుకుంటూ దరిని చేరాలి‘
2.‘అద్దం అబద్ధమాడదు/దీపం కనికట్టు చేయదు/కాలం ఒకరివైపే వుండదు‘
3.‘ఎప్పుడూ ఒకేలా/పండుగరోజులే వుండవు/ఏడ్చుకుంటూ కూర్చుంటే/కార్తులన్నీ వెళ్లిపోతాయి/ఉత్సాహంగా వుంటేనే/ఉదయాస్తమయాల అందం తెలిసేదీ/ఉదాసుగా వుండేవాళ్లకు /ఉత్సవాలే వుండవు‘.
మనుషుల మధ్య ఏర్పడిన ఖాళీలను పూరించడానికీ, రాకపోకలు లేక,ప్రేమలు లేక ఒంటరిద్వీపాల్లా మనుషులు మిగలకూడదనీ ‘విడిపోకుండా ప్రేమించుకుందాం‘ అనే విశ్వజనీనత నెలకొనాలంటే ఆశారాజుకవిత్వం చదవాలి. మనుషులు కలిసిపోయి,ఖాళీ జాగ లేకుండాలంటే చదవాలి. ఎప్పటికప్పుడు కొత్తకొత్త వస్తుదనంతో,దృశ్యాలతో కవిత్వాన్ని సుసంపన్నం చేస్తోన్న పాగల్ షాయర్ ఆశారాజు గారికి అభినందనలు.

Number readers growth in Poetry atmosphere

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: