కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్

Nobel Prize

 

లిథియం బ్యాటరీతో మలుపు
తొలిసారిగా 97 ఏళ్ల్ల వ్యక్తికి

స్టాక్‌హోం : రసాయనిక శాస్త్రంలో విశేష పరిశోధనలు సాగించిన మూడుదేశాలకు చెందిన ముగ్గురికి ఈ ఏటి నోబెల్ పురస్కారం దక్కింది. అమెరికా, బ్రిటన్, జపాన్‌లకు చెందిన పరిశోధకులను సంయుక్తంగా ఈ నోబెల్‌కు ఎంపిక చేసినట్లు నిర్ణేతల కమిటీ బుధవారం తెలిపింది. లిథియం అయాన్ బ్యాటరీల రూపకల్పన, స్మార్ట్‌ఫోన్లకు, శిలాజ ఇంధన రహిత పర్యావరణానికి వీరి పరిశోధనలు ఉపయోగపడినట్లు గుర్తించారు. అమెరికాకు చెందిన శాస్త్రవేత్త జాన్ గుడెనఫ్, బ్రిటన్‌కు చెందిన స్టేన్లీ విట్టింగ్‌హామ్, జపాన్‌కు చెందిన అకిరా యోషినోలకు ఈ నోబెల్ పురస్కారం పరిధిలో సంయుక్తంగా 9,14,000 డాలర్ల మొత్తం పారితోషికంగా అందిస్తారు. ఇందులో అమెరికాకు చెందిన పరిశోధకులు గుడెనఫ్ ఇప్పుడు 97 సంవత్సరాల వయస్సులో ఉన్నారు.

ఈ విధంగా ఇంతటి పెద్ద వయస్సు వారికి నోబెల్ పురస్కారం దక్కడం ఇదే తొలిసారి అయింది. తేలికపాటి, రీచార్జబుల్, అత్యంత శక్తివంతమైన బ్యాటరీలు ఇప్పుడు మొబైల్ ఫోన్లు మొదలుకుని ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రిక్ వాహనాల వరకూ అన్నింటిలోనూ విరివిగా వాడుతున్నారు. అంతేకాకుండా సౌర, వాయు మరల ఇంధన నిల్వకు కూడా ఈ బ్యాటరీలు దోహదం చేస్తున్నాయని, ఈ విధంగా కార్బన ఉద్గారాలు వెలువడటం తగ్గుతుంది. పర్యావరణ హితం జరుగుతోందని రాయల్ స్వీడిష్ అకాడమీ వారు తెలిపారు.

1991లో మార్కెట్‌లోకి ప్రవేశించిన నాటి నుంచి లిథియం బ్యాటరీలు మనిషి జీవితాలను ప్రభావితం చేసే విధంగా పలు సాంకేతిక పనిముట్లు అందుబాటులోకి వచ్చేలా చేశాయని, ఈ విధంగా అధునాతన జీవన ప్రక్రియలో భాగం అయిన సెల్‌ఫోన్ వ్యవస్థ బ్యాటరీకి తగు విధంగా ఈ పరిశోధకులు ప్రాణం పోశారని నోబెల్ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఇప్పటి విజేతలలో ఒక్కరైన విట్టింగ్‌హామ్ 1970 చమురు సంక్షోభ దశలో సాగించిన పరిశోధనలు ప్రత్యామ్నాయ ఇంధన వనరుల దిశలో కీలకంగా మారాయి. లిథియంలోని శక్తివంతమైన ఇంధనాన్ని సమీకృతపర్చుకుని బ్యాటరీల రూపకల్పనలో అధ్యయనం చేశారు. నీటిపై కూడా తేలియాడే విధంగా లిథియం లోహం ఉంటుంది.

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.