ఆమె నిర్మల కాదు నిర్బల ఏమీ చేయరు.. మాట్లాడరు

Nirmala Sitharaman

 

లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపి చౌదరి
ఆర్థిక పరిస్థితిపై చురకలు

న్యూఢిల్లీ : ఆమె నిర్మల కాదు..నిర్బల అని దేశంలో ఆర్థిక పరిస్థితి గురించి కాంగ్రెస్ నేత, ఎంపి అధీర్ రంజన్ చౌదరీ వ్యాఖ్యానించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై సోమవారం లోక్‌సభలో విమర్శలు గుప్పించారు. ఆర్థిక పరిస్థితిని గట్టెక్కించలేని ఆమె నిర్మలా సీతారామన్ కాదు నిర్బల సీతారామన్ అని స్పందించారు. దీనితో సభలో అధికార పక్ష సభ్యుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.

బిజెపి నేతృత్వ మోడీ ప్రభుత్వానికి ఏ విషయంలోనూ దూరదృష్టి లేదని, ప్రత్యేకించి ఆర్థిక రంగంలో ఈ పరిస్థితి స్పష్టం అవుతోందన్నారు. దేశ ప్రగతి మందగించింది. ప్రభుత్వానికి ముందుచూపు కొరవడిందన్నారు. ఇక నిర్మలను నిర్బల అని పిలవడంలో తప్పేమీ లేదని అభిప్రాయపడ్డారు. నిర్మల శక్తిహీనురాలు అని, నిర్బల అంటే సరిపోతుందని వ్యాఖ్యానించారు.

‘ఆమె ఆర్థిక మంత్రిత్వశాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే దిగజారుతున్న ఆర్థిక పరిస్థితిపై మాట్లాడలేని అశక్తతతో ఉన్నారు. కీలక అంశంపై ఆమె స్పందించకపోతే ఎలా’ అని ప్రశ్నించారు. ఈ ఏడాది జులై సెప్టెంబర్ త్రైమాసికంలో భారతదేశ స్థూల స్వదేశీ ఉత్పత్తి (జిడిపి) స్థాయి కేవలం 4.5 శాతంగా ఉందని, గత నెలలో వెలువరించిన ఆర్థిక అధికారిక గణాంకాలతో వెల్లడైంది. ఆరేండ్లలో ఇది అత్యల్ప స్థాయి పతనం.

తగ్గిన పెట్టుబడులు, ఉత్పత్తి క్షీణతలను ఈ విషయం స్పష్టం చేస్తోందని, కేంద్ర ప్రభుత్వ విభజిత విధానాలతో ఈ దారుణ పరిస్థితి ఏర్పడిందని లోక్‌సభలో కాంగ్రెస్ సభాపక్ష నేత అయిన అధీర్ రంజన్ తెలిపారు. బిజెపి నాయకత్వ ప్రభుత్వ తీరుతో పారిశ్రామికవేత్తలు విసిగిపొయ్యారు. ప్రభుత్వ ప్రతిష్ట సన్నగిల్లిందని, దీనితో పెట్టుబడులకు సరైన వాతావరణం పోయిందన్నారు. వ్యక్తిగత పరోక్ష పన్నులను తగ్గిస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలి. దీనితోనే దేశం తిరిగి ప్రగతిపథం వైపు మళ్లుతుందని తెలిపారు.

నిర్మలనే.. నిర్మలమైన సబలనే: సీతారామన్
కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ వ్యాఖ్యలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. తాను నిర్బలను కాదని నిర్మలనే అని నిర్మలమైన సబలగానే సాగుతానని స్పష్టం చేశారు. తాను ఏది చేసినా నిర్మలమైన రీతిలోనే ఉంటుందని ఆర్థిక మంత్రి తేల్చిచెప్పారు. సభ్యుడు తమను నిర్బల అంటున్నారని, దీనికి ఒక్కటే సమాధానం చెపుతున్నానని తనతో పాటు తమ పార్టీలో ఏ సభ్యురాలు నిర్బలలు కాదని స్పష్టం చేశారు.

Nirmala Sitharaman criticized in Lok Sabha

The post ఆమె నిర్మల కాదు నిర్బల ఏమీ చేయరు.. మాట్లాడరు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.