‘బీహారీ’, ‘బాహారీ’!

ఎన్‌డిఎ, గ్రాండ్ అలయెన్స్‌లకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఘట్టం నేటితో ముగుస్తుంది. 8వ తేదీ ఓట్ల లెక్కింపు. ఫలితాల కోసం యావద్దేశం ఉత్కంఠతతో ఉంది. ఎన్‌డిఎ పక్షాన ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రధాన ప్రచారకుడు కావటంవల్ల ఈ ఎన్నికలు అధిక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దీర్ఘకాల బద్ధ విరోధులు లాలుప్రసాద్, నితీష్‌కుమార్‌లు కాంగ్రెస్‌ను కలుపుకుని ‘మహాగట్ బంధన్’గా ఏర్పడటం బిజెపిని బీహార్‌కు దూరంగా ఉంచాలన్న వారి పట్టుదలకు నిదర్శనం. ప్రధానమంత్రి స్వయంగా 30బహిరంగసభల్లో ప్రసంగించటం, […]

ఎన్‌డిఎ, గ్రాండ్ అలయెన్స్‌లకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఘట్టం నేటితో ముగుస్తుంది. 8వ తేదీ ఓట్ల లెక్కింపు. ఫలితాల కోసం యావద్దేశం ఉత్కంఠతతో ఉంది. ఎన్‌డిఎ పక్షాన ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రధాన ప్రచారకుడు కావటంవల్ల ఈ ఎన్నికలు అధిక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దీర్ఘకాల బద్ధ విరోధులు లాలుప్రసాద్, నితీష్‌కుమార్‌లు కాంగ్రెస్‌ను కలుపుకుని ‘మహాగట్ బంధన్’గా ఏర్పడటం బిజెపిని బీహార్‌కు దూరంగా ఉంచాలన్న వారి పట్టుదలకు నిదర్శనం. ప్రధానమంత్రి స్వయంగా 30బహిరంగసభల్లో ప్రసంగించటం, బీహార్‌ను తమ ఖాతాలో వేసుకునేందుకు ఆయన విశ్వప్రయత్నాన్ని సూచిస్తున్నది. ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఇంత పెద్ద ఎత్తున జాతీయ ప్రాధాన్యతను సంతరించుకోవటం ఇదే ప్రథమం. ఆచరణలో మత, కుల రాజకీయాల మధ్య పోటీగా పరిణమించింది. ప్రచారం వ్యక్తిగత ఆరోపణల స్థాయికి దిగజారింది.
లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, బీహార్‌లలో ఘనవిజయాలే బిజెపిని అధికారంలోకి తెచ్చిన విషయం గుర్తుంచుకోదగింది. ఉత్తరభారత్‌లో ఈ రెండు పెద్దరాష్ట్రాల్లో బిజెపి వ్యతిరేకశక్తులు అధికారంలో ఉన్నాయి. ఇప్పుడు బీహార్‌ను తమ ఖాతాలో వేసుకుంటే, 2017లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీని స్వాధీనం చేసుకోవటం బిజెపికి సులభమవుతుంది. అదే జరిగితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి పని సునాయాసమవుతుంది. అయితే, ప్రధానమంత్రి ప్రచారం చేసినప్పటికీ, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవటం బిజెపి నాయకత్వాన్ని కలవరపరిచింది. నరేంద్ర మోడీ సమ్మోహనశక్తి అప్పుడే తరిగిపోయిందన్న ప్రచారం మొదలైంది. ఈ రెండు రాష్ట్రాల్లో అరడజను లోక్‌సభ ఉప ఎన్నికల్లో సిట్టింగ్ సీట్లను బిజెపి కోల్పోవటం ఈ సందేహపీడనను పెంచింది. కాబట్టి బీహార్‌ను గెలవటం ద్వారా వాటన్నిటికీ చెక్ పెట్టాలని, నరేంద్రమోడీని తిరుగులేని నాయకుడిగా స్థిరపరచాలని బిజెపి భావించి ఉండవచ్చు. నరేంద్ర మోడీ-నితీష్‌కుమార్ మధ్య స్పర్ధ గుజరాత్ మత అల్లర్ల(2002) నాటినుండీ ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జెడి(యు), బిజెపి పొత్తు ఉన్నా నరేంద్రమోడీని బీహార్‌లో ప్రచారానికి తెచ్చే బిజెపి ప్రయత్నాలను నితీష్ విజయవంతంగా అడ్డుకున్నారు. అలాగే బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్రమోడీ పేరును ప్రకటించటాన్ని వ్యతిరేకించిన నితీష్‌కుమార్, తన ప్రయత్నం విఫలమైనాక బిజెపితో సంబంధాలు తెంచుకున్నారు. సంకీర్ణ ప్రభుత్వం నుంచి ఆ పార్టీని బయటకు పంపారు.
నరేంద్రమోడీ హిందూత్వముఖం సమాజాన్ని విభజిస్తుందని, దాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు నితీష్‌కుమార్ ప్రకటించారు. అందువల్ల ఇందులో సైద్ధాంతిక ఘర్షణ ఉంది, వ్యక్తి అహంభావాల మధ్య పోటీ ఉంది.
ప్రధానమంత్రి తొలుత ‘ఆటవికరాజ్యం’ తిరిగి వస్తుందంటూ లాలుప్రసాద్‌పై దాడి ఎక్కుపెట్టారు. అలాగే నితీష్ మంచివాడేకానీ – ముందు జార్జిఫెర్నాండెజ్‌ను, తర్వాత బిజెపిని వెన్నుపోటు పొడిచారని, అందువల్ల ఆయన డిఎన్‌ఎలో ఏదో లోపముందని నిందించారు. ఈ రెండు అస్త్రాలు బెడిసికొట్టాయి. మధ్యమధ్యలో బీహార్ అభివృద్ధిలో దూసుకుపోవాలంటే ఒక్కసారి బిజెపికి అధికారమివ్వండని, తాను ఎన్నికల ముందే ప్రకటించిన రూ.1.25లక్షకోట్ల ప్యాకేజీని చూపి, ఓటర్లను అభ్యర్థించారు మోడీ. చివరకు, లాలుప్రసాద్ తన కుమారులకు కాకుండా నితీష్‌కుమార్‌ను ముఖ్యమంత్రిని చేస్తాడా? అంటూ వారిద్దరి మధ్య పొరపొచ్చాలు సృష్టించే పాచిక ప్రయోగించాడు. ప్రధాని ఆరోపణలన్నిటినీ సమర్ధతతో, నేర్పుతో తిప్పికొట్టిన మహాకూటమి ఒబిసి నేతలిరువురూ బీహార్‌ను పాలించేది బీహారీలేకాని, బాహారీలు (బయట వ్యక్తులు)కాదని సెంటిమెంట్‌తో కొట్టారు. సమయానుకూలంగా, దాద్రీ ఘటన, ఆర్‌ఎస్‌ఎస్ అధినేత రిజర్వేషన్‌లను సమీక్షించాలని కోరటం వంటి సమస్యలు పెద్ద చర్చనీయాంశాలైనాయి. అగ్రవర్ణాలు, వారిలోని ఇబిసిలను కూడగడతాయని భావించిన ఈ అంశాలు, ముస్లింలు, దళితులను బిజెపికి పూర్తిగా దూరం చేశాయంటున్నారు.
ప్రచార దుమారం ఎంతగా రేగినా ప్రజలు అంతిమంగా అభివృధ్దినే కోరుకుంటారు. సమర్థుడైన పాలకునిగా, మచ్చలేని నాయకునిగా నితీష్‌కుమార్‌కు కులాలకు అతీతంగా ఉన్న మంచిపేరే బహుశా రెండు కూటముల మధ్య వ్యత్యాసం కావచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ పోటాపోటీ సమరంలో ఏ కూటమికి బీహార్ ఓటర్లు పట్టంగట్టినా దాని ప్రభావం ఢిల్లీ రాజకీయాలపై ఉంటుందనేది నిర్వివాదాంశం.

Comments

comments