కోర్టు ధిక్కార దోషం!

‘ధిక్కారముల్ సైతునా’ అంటూ సుప్రీంకోర్టు, ప్రఖ్యాత పౌరహక్కుల న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌ను దోషిగా నిర్ధారించింది. ఆయన తన ట్వీట్ల ద్వారా న్యాయ వ్యవస్థ పట్ల దేశ ప్రజలకున్న విశ్వాసాన్ని కదిలించి వేసే ప్రయత్నం చేసి నేరపూరిత ధిక్కారానికి పాల్పడ్డారని జస్టిస్ అరుణ్ మిశ్రా అధ్యక్షతన గల ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం అభిప్రాయపడింది. ఇందుకు ఆయనకు వేయనున్న శిక్షపై ఈ నెల 20న విచారణ జరపనున్నట్టు ప్రకటించింది. 1971 న్యాయ స్థాన ధిక్కార చట్టం ప్రకారం దోషికి ఆరు […] The post కోర్టు ధిక్కార దోషం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

‘ధిక్కారముల్ సైతునా’ అంటూ సుప్రీంకోర్టు, ప్రఖ్యాత పౌరహక్కుల న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌ను దోషిగా నిర్ధారించింది. ఆయన తన ట్వీట్ల ద్వారా న్యాయ వ్యవస్థ పట్ల దేశ ప్రజలకున్న విశ్వాసాన్ని కదిలించి వేసే ప్రయత్నం చేసి నేరపూరిత ధిక్కారానికి పాల్పడ్డారని జస్టిస్ అరుణ్ మిశ్రా అధ్యక్షతన గల ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం అభిప్రాయపడింది. ఇందుకు ఆయనకు వేయనున్న శిక్షపై ఈ నెల 20న విచారణ జరపనున్నట్టు ప్రకటించింది. 1971 న్యాయ స్థాన ధిక్కార చట్టం ప్రకారం దోషికి ఆరు మాసాల గరిష్ఠ జైలు శిక్ష లేదా రూ. 2000 జరిమానా విధించవచ్చు. అయితే ధర్మాసనం రాజ్యాంగం 129 అధికరణ ద్వారా తనకు సంక్రమించిన అధికారాల కింద ఈ కేసును విచారించినట్టు తెలుస్తున్నది. ఈ అధికరణ ద్వారా దోషికి విధించే శిక్షకు కాల పరిమితి ఉండదు. ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి శరద్ ఎ బాబ్డే ఒక ఖరీదైన మోటారు బైకు మీద వెళుతున్న ఫోటోను ప్రశాంత్ భూషణ్ ట్విట్టర్‌లో ఉంచారు. అలాగే గత ఆరు సంవత్సరాల్లో పని చేసిన నలుగురు ప్రధాన న్యాయమూర్తుల ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు దేశంలో ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసే పాత్ర పోషించిందనే అభిప్రాయం కలిగేలా మరో ట్వీట్ పెట్టారన్నది అభియోగం. ఈ ట్వీట్లను అత్యున్నత న్యాయస్థానం తనకు తానుగా విచారణకు స్వీకరించింది. కరోనా కారణంగా ప్రత్యక్ష విచారణలకు స్వస్తి చెప్పిన సమయంలో పరోక్ష పద్ధతి ద్వారా విచారణ జరిపి తీర్పు ఇచ్చింది. బాబ్డే మోటారు సైకిల్ పై ఉన్న ఫోటోను పెట్టడం ద్వారా భారత ప్రధాన న్యాయమూర్తి ఒక వైపు సుప్రీంకోర్టును మూసివేసి దేశ ప్రజల న్యాయ హక్కును నిరాకరిస్తూనే ఒక బిజెపి నేతకు చెందిన రూ. 50 లక్షల ఖరీదైన బైకుపై విహరిస్తున్నారనే అభిప్రాయాన్ని ప్రశాంత్ భూషణ్ కలిగించినట్టు ధర్మాసనం తీర్పులో పేర్కొన్నది. న్యాయ వ్యవస్థ దేశ ప్రజాస్వామ్యానికి మూల స్తంభమని, రాజ్యాంగ రక్షితమైన దాని పునాదులను కదిలించే ప్రయత్నం చేసినందుకు ఆయనను కఠినంగా శిక్షించవలసిందేనని అభిప్రాయపడింది. ప్రశాంత్ భూషణ్ అత్యంత అనుభవజ్ఞుడైన న్యాయవాది. అనేక ప్రజా ప్రయోజక వ్యాజ్యాల ద్వారా హక్కుల పరిరక్షణ కోసం పాటుపడుతున్నారు.

అటువంటి వ్యక్తి వెలిబుచ్చే అభిప్రాయాలను అనాలోచితమైనవిగానో, ఆకతాయితనంతో కూడుకున్నవిగానో పరిగణించి కొట్టి పారేయలేం. అత్యున్నత న్యాయస్థానం దేశ భవితవ్యానికి సంబంధించిన అత్యంత కీలక కేసుల్లో ఆశించినంత సమున్నతంగా వ్యవహరించడం లేదనే బాధతో ఆయన ఆ ట్వీట్లను పోస్టు చేసి ఉండవచ్చు అనిపిస్తే ఆక్షేపించలేము. జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం ఇచ్చిన తీర్పు, వెనువెంటనే కొన్ని ప్రతిపక్షాల నుంచి, పలువురు న్యాయ పెద్దల నుంచి విమర్శలను ఎదుర్కోవడం గమనార్హం. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించిన రాజ్యాంగం 370వ అధికరణ రద్దు వంటి చర్యలపై దాఖలైన కేసులను పెండింగ్‌లో ఉంచి ప్రశాంత్ భూషణ్‌పై ధిక్కార వ్యాజ్యాన్ని ఇంత హుటాహుటిగా పరోక్ష విచారణకు స్వీకరించి, ఆగమేఘాలపై తీర్పు చెప్పడమేమిటని వారు ప్రశ్నించారు. అత్యవసరంగా చేపట్టే పరోక్ష విచారణల విధానం పౌరుల వ్యక్తి గత స్వేచ్ఛను కాపాడ్డానికి ఉద్దేశించిందని, ఈ కేసులో ఒకరి స్వేచ్ఛను అరికట్టడానికి అది ఉపయోగపడడం ఆశ్చర్యకర మని భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎం లోధా అన్నారు. మామూలుగా పని చేయడం ప్రారంభించిన అనంతరం సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను చేపట్టి ఉంటే కొంపలేమీ మునిగిపోయి ఉండేవి కాదని ఆయన అన్నారు. గౌరవ న్యాయమూర్తులు రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వాతంత్య్రానికి అండగా నిలిచి ఉండవలసిందని ఓ సీనియర్ న్యాయవాది అభిప్రాయపడ్డారు. ధిక్కార కేసుల్లో తనకున్న అధికారాన్ని వినియోగించేటప్పుడు న్యాయస్థానం తన స్థాయిని తగ్గించుకోకుండా ఉంటే బాగుండేదని మరో సీనియర్ న్యాయవాది అభిప్రాయపడ్డారు. కోర్టు ధిక్కార నిబంధనల నిరంకుశాధికారాలను ఉపయోగించి న్యాయస్థానం ప్రజాస్వామిక కంఠాలను మూయించే విధంగా వ్యవహరిస్తున్నదని పౌర స్వేచ్ఛల ప్రజాసంఘం (పియుసిఎల్) వ్యాఖ్యానించింది. బంతిని ఎంత బలంగా నేలకేసి కొడితే అది అంతే తీవ్రంగా పైకి వస్తుంది. రాజద్రోహం, కోర్టుధిక్కార దోషాల పేరిట శిక్షించడమనేది బ్రిటిష్ రాచరిక పాలకుల హయాంలో అంకురించింది. ప్రజాస్వామిక రాజ్యాంగం కింద నెలకొన్న న్యాయవ్యవస్థ మూలాల్లో భావప్రకటన స్వేచ్ఛకు అపరిమిత స్థానమున్నది. న్యాయమూర్తులను విమర్శించ డానికి న్యాయ ప్రక్రియకు అడ్డుతగలడానికి తేడా ఉన్నది. బ్రిటన్‌లో తమను వ్యక్తిగతంగా తిట్టినా సహించే గుణం అక్కడ న్యాయమూర్తులకున్నదని చెబుతారు. ప్రశాంత్ భూషణ్ ట్వీట్లు గౌరవ న్యాయమూర్తులకు మనస్తాపం కలిగించాయని తెలుస్తున్నది. అందుకు ఒక అనుభవజ్ఞుడైన హక్కుల న్యాయవాదిని శిక్షించడం ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైన భిన్నాభిప్రాయ ప్రకటన స్వేచ్ఛను బెదిరించగలదన్న ఆందోళనను తప్పుపట్టలేము.

Supreme Court convicted lawyer Prashant Bhushan

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post కోర్టు ధిక్కార దోషం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: