ప్రత్యామ్నాయ రాజకీయాల దుర్భిక్షం

అయోధ్యలో బుధవారం నాడు జరిగిన మహా రామాలయ నిర్మాణ భూమి పూజకు దేశంలోని అనేక ప్రధాన రాజకీయ పక్షాల ఆమోదం లభించింది. ముస్లింలు, వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు, వామపక్షాలు తప్ప ఇంచుమించు మిగతా అన్ని రాజకీయ పక్షాలు హిందుత్వ శక్తులతో గొంతు కలిపి కోరస్ పాడాయి. ముఖ్యంగా జాతీయ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఈ పనిలో మైమరచిపోయింది. జాతీయ సమైక్యత, సోదర భావం, సాంస్కృతిక సమ్మేళనాల చిహ్నంగా ఆలయ శంకుస్థాపనను కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, […] The post ప్రత్యామ్నాయ రాజకీయాల దుర్భిక్షం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అయోధ్యలో బుధవారం నాడు జరిగిన మహా రామాలయ నిర్మాణ భూమి పూజకు దేశంలోని అనేక ప్రధాన రాజకీయ పక్షాల ఆమోదం లభించింది. ముస్లింలు, వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు, వామపక్షాలు తప్ప ఇంచుమించు మిగతా అన్ని రాజకీయ పక్షాలు హిందుత్వ శక్తులతో గొంతు కలిపి కోరస్ పాడాయి. ముఖ్యంగా జాతీయ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఈ పనిలో మైమరచిపోయింది. జాతీయ సమైక్యత, సోదర భావం, సాంస్కృతిక సమ్మేళనాల చిహ్నంగా ఆలయ శంకుస్థాపనను కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, ఆ పార్టీ ఉత్తరప్రదేశ్ ఇన్‌చార్జీ ప్రియాంక గాంధీ ముందస్తు ప్రశంసలందించారు. రాముడు ప్రతి ఒక్కరి వాడని నిరాడంబరత, ధైర్యం, నిగ్రహం, త్యాగం, నిబద్ధతలు దీనబంధు రామనామం లక్షణాలని ఆమె ఉగ్గడించారు. ఆలయ నిర్మాణ ఆరంభ ఘట్టం దేశ ప్రజలందరి స్వప్న సాఫల్యమని ప్రధాని నరేంద్ర మోడీ అంటున్నదానికి ప్రియాంక గాంధీ పలుకులకు తేడా కనిపించడం లేదు. అయోధ్యలో మందిర నిర్మాణానికి భారతీయులందరి ఆమోదం గలదని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ అన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ కూడా అదే బాటపట్టారు. ఈ ఘట్టం మహోత్కృష్టమైనదనడాన్ని ఎవరూ ఆక్షేపించరు. దేశ అత్యధిక జనాభా ఆరాధించే శ్రీరాముడికి గుడి కట్టడం, వారి విశ్వాసాలకు సమున్నత ప్రతీకను నిర్మించడం నిజంగానే అతిగొప్ప సన్నివేశం. అయితే వేరెక్కడైనా రామాలయ నిర్మాణం చేపట్టడానికీ, అయోధ్యలోనే అక్కడే దానిని నిర్మించడానికి తేడా ఉంది.

దేశ అత్యున్నత న్యాయ స్థానం నిర్దంద్వంగా అనుమతిస్తూ ఇచ్చిన తీర్పు మేరకే జరుగుతున్నది కాబట్టి ఆ వివాదం కూడా తెరమరుగైపోయింది. అందుచేత బుధవారం నాటి అయోధ్య ఘట్టం నిర్వివాదమైనదే. కానీ దేశ రాజ్యాంగం నిర్ద్దేశిస్తున్న సెక్యులర్ నీతిని, ముస్లిం మైనారిటీలు కూడా ఇతరులతో సమాన హక్కులున్న భారత ప్రజలేనన్న పరిపూర్ణ ప్రజాస్వామ్య స్థితిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అల్ప సంఖ్యాకుల ఓట్లతో ఎక్కువ కాలం ప్రయోజనపడి మళ్లీ వారి మద్దతు ఆశిస్తున్న ప్రధాన ప్రతిపక్షం ఇంతగా బిజెపి మందిర మహోత్సాహాన్ని పంచుకోడమేమిటనే ప్రశ్న కలగడం సహేతుకం. ప్రభుత్వం అన్ని మతాలకు సమాన దూరం పాటించడమే భారత రాజ్యాంగం నిర్దేశిస్తున్న లౌకిక తత్వం (సెక్యులరిజం) పరమ లక్షం. ప్రథమ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ దీనిని గట్టిగా పాటించారు. అది మెజారిటీ మతస్థులతో పాటు దేశంలో నివసిస్తున్న మైనారిటీలలో సైతం ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని సమాన స్థాయిలో పెంచుతుంది. ఆ పంథాకు కాంగ్రెస్ పార్టీ తిలోదకాలిచ్చిందనే అభిప్రాయానికి ఇప్పుడు ఆస్కారం కలుగుతున్నది. అంటే అది కూడా మత ప్రాతిపదికన మెజారిటీ ఓటును ఆకట్టుకునే వైఖరినే పెంచుకున్నదని, అధికారం సాధించుకోడానికి అదొక్కటే ప్రధాన మార్గమని దృఢ నిర్ధారణకు వచ్చిందని అనుకోవలసి ఉంది. అయితే భారతీయ జనతా పార్టీతో పోటీపడి మెజారిటీ మతస్థుల ఓట్లను కాంగ్రెస్ సాధించుకోగలదా, ఆ శక్తి దానికున్నదా? సెక్యులర్ హిందువులు, మైనారిటీలు, దళితులు, ఆదివాసుల ఓట్లే కాంగ్రెస్‌కు ఈనాటికీ ఏనాటికైనా దిక్కు. అలాగే ఇతరత్రా బయటపడే భారతీయ జనతా పార్టీ పాలక వైఫల్యాల చిట్టా అన్ని వర్గాల ఓటర్లు తిరిగి కాంగ్రెస్‌నే ఎన్నుకోక తప్పని స్థితికి దోహదపడుతుంది.

అయితే సామాజిక ఆలోచనపరంగా, సెక్యులరిజం విషయంలో బిజెపికి తోక పార్టీగా, ద్వితీయ రూపంగా మారిపోయిందనే ముద్ర కాంగ్రెస్‌కు ఎంతమాత్రం మేలు చేయదు. దానికి బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత వాటిల్లిన నష్టాలనే మళ్లీ దాపురింప చేస్తుంది. కాంగ్రెస్ కూరుకుపోయిన, పోతున్న ఇంత ఊబిలోనూ ఒక చిన్న ఆశారేఖగా ఈ ఘట్టానికి రాహుల్ గాంధీ నుంచి వచ్చిన ప్రతిస్పందన పని చేయగలదనిపిస్తున్నది. రాముడు మర్యాద పురుషోత్తముడు, అత్యున్నత మానవీయ లక్షణాల ప్రతీక అని పొగుడుతూ ప్రేమ, న్యాయం ఉన్న చోటనే అతడు కొలువు తీరి ఉంటాడని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య ప్రియాంక సహా మిగతా కాంగ్రెస్ నేతల కంఠాలకు భిన్నంగా ఉంది. రామాలయాన్ని నిర్మించే అర్హత అన్యాయం, ద్వేషం గూడుకట్టుకున్న భారతీయ జనతా పార్టీకి లేదన్నది ఆయన ఆంతర్యం. అయితే కాంగ్రెస్ పెద్దలు అటూ ఇటూ గల రెండు వర్గాలనూ సంతృప్తిపరచి లాభపడాలనే దృష్టితోనే ఈ ఉభయచర విన్యాసాన్ని రక్తి కట్టించి ఉంటే వారు మళ్లీ బురదలో కాళ్లేసిన వారే అవుతారు. దేశంలో సరైన, బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కరవు స్పష్టంగా కనిపిస్తున్నది. జాతీయ స్థాయిలో సిసలైన సెక్యులర్ శక్తి లోపం వెల్లడవుతున్నది. ఇది జాతికి ఎనలేని హాని దాపురింప చేస్తుంది. దేశ మిశ్రమత్వాన్ని దారుణంగా దెబ్బతీస్తుంది.

political parties Approval to Ram temple Puja in Ayodhya

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post ప్రత్యామ్నాయ రాజకీయాల దుర్భిక్షం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: