వంగపండు జీవితం ప్రజలకే అంకితం

ప్రముఖ వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉత్తరాంధ్ర గద్దర్ గా పేరు తెచ్చుకున్న వంగపండు ప్రసాదరావు ప్రజల పాటగా ప్రసిద్ధి కెక్కినాడు. జానపద బాణీలో అనేక పాటలు రాసి పాడిన వంగపండు జూన్ 1943లో విజయనగరం జిల్లా పార్వతీపురం లోని పెదబొండపల్లి గ్రామంలో జగన్నాథం, చిన్న తల్లి దంపతులకు ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించాడు. పుట్టిపెరిగింది గ్రామీణ వాతావరణం. వీరి కుటుంబంలో వంగపండే పెద్దవాడు. పెద్దగా చదువుకోలేదు. బొబ్బిలిలో ఐటిఐ చేసి విశాఖపట్నం షిప్ […] The post వంగపండు జీవితం ప్రజలకే అంకితం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ప్రముఖ వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉత్తరాంధ్ర గద్దర్ గా పేరు తెచ్చుకున్న వంగపండు ప్రసాదరావు ప్రజల పాటగా ప్రసిద్ధి కెక్కినాడు. జానపద బాణీలో అనేక పాటలు రాసి పాడిన వంగపండు జూన్ 1943లో విజయనగరం జిల్లా పార్వతీపురం లోని పెదబొండపల్లి గ్రామంలో జగన్నాథం, చిన్న తల్లి దంపతులకు ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించాడు. పుట్టిపెరిగింది గ్రామీణ వాతావరణం. వీరి కుటుంబంలో వంగపండే పెద్దవాడు. పెద్దగా చదువుకోలేదు. బొబ్బిలిలో ఐటిఐ చేసి విశాఖపట్నం షిప్ యార్డ్ లో ఫిట్టర్ గా కొంతకాలం ఉద్యోగం చేశాడు. ఉన్న ఊరిలో భూమిని అమ్ముకుని రాయగడ్ లో కొన్నాడు. ఆ భూమి అడవులకు సమీపంలో ఉండటం చేత, గిరిజనులతో పరిచయాలు పెరిగాయి. అట్లాగిరిజనుల మాటలు, పదాలు వంగపండు పాటల్లో కనిపిస్తాయి. పేరుకు వంగపండు కొంతకాలం ఉద్యోగం చేస్తున్నప్పటికీ, ఆయన మనసంతా ఉద్యమాల మీదనే ఉండేది.

మూడు దశాబ్దాలపాటు 300పైగా జానపద పాటలు రాసి, పేద బలహీన, గిరిజన వర్గాల ప్రజలను ఎంతో చైతన్యము చేశారు. ఆయన పాటలు ప్రజా చైతన్యానికి ప్రతీక లయ్యాయి. విప్లవ కవిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు పొందాడు. 1972లో జననాట్యమండలి స్థాపించాడు. సుబ్బారావు పాణిగ్రాహి, వంగపండు, గద్దర్ మొదలగువారు విప్లవ భావాలను ప్రజల దగ్గరకు తీసుకు వెళ్లిన వారిలో ప్రముఖులుగా చెప్పవచ్చు. వంగపండు రాసిన 12 పాటలు ఇతర భారతీయ భాషలైన తమిళం, బెంగాలీ, కన్నడ, హిందీ తదితర భాషల్లోకి అనువదింపబడ్డాయి. ముఖ్యంగా వంగపండు రాసిన అర్ధరాత్రి స్వతంత్రం సినిమాలో ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవా… పాట 40 జాతీయ, అంతర్జాతీయ భాషల్లోకి తర్జుమా చేయబడింది అంటే వంగపండు కీర్తి ప్రతిష్టలు ఎంతటి స్థాయికి ఎదిగినవో మనం అర్థం చేసుకోవచ్చు.

ఉత్తరాంధ్ర మాండలిక భాషలో తన జానపద బాణి తో ఉర్రూతలూగించిన పాటల పల్లకి వంగపండు. ఆయన 30 సినిమాలకు పాటలు కూడా రాశాడు.టి. కృష్ణ, నారాయణ మూర్తి వంటి దర్శకులు పాటలు రాయమని కోరడం జరిగింది. టి. కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమా అర్ధరాత్రి స్వతంత్రంలో వంగపండు సినీ ప్రవేశం చేసి ఏం పిల్లడో ఎల్దమొస్తవా,,, ఏం పిల్లో ఎల్దామొస్తవా.. సికాకుళంలో సీమ కొండకి.. అంటూ పాడిన పాట, చేసిన నాట్యము ప్రజలను చైతన్య వైపు నడిపించాయి. ఆ తదుపరి మరికొన్ని సినిమాలకు పాటలు రాయమని కోరినప్పటికీ, జననాట్యమండలి సిద్ధాంతాలకు కట్టుబడి, అందివచ్చిన అవకాశాలను వదులుకున్నారు. లేకపోతే వ్యాపార దృక్పథంతో వెళ్తే కోట్లు సంపాదించే వాడు. ఆయన ఉదారవాది. ఆయనకున్న 150 ఎకరాల భూములను నిరుపేదలకు రాసిచ్చాడు. ఆ భూములు పొందిన వారు నేటికీ వంగపండు ను దేవుడిగా కొలుస్తారు.

మూర్తీభవించిన మానవత దృక్పథానికి ఇంతకంటే ఉదాహరణ మరేముంటుంది? వంగపండు తన జీవిత కాలంలో పెద్దగా ఆస్తులు అంతస్తులు కూడ పెట్టకపోయినా, ప్రజల మనసుల్లో గూడు కట్టుకున్నారు. అదృష్టం, దురదృష్టం వంటి పదాలను ఎప్పుడు నమ్మలేదు. నమ్మిన సిద్ధాంతాల కోసం సెంటు భూమి కూడా ఉంచుకోలేదు. వంగపండు దేవుళ్ళ పై నమ్మకం లేనప్పటికీ, సింపుల్ గా కనిపించే శివుడు అంటే చాలా ఇష్టపడే వాడు. శివుని మీద అనేక పాటలు కూడా రాశాడు. వంగపండు రాసిన అనేక గీతాలు నృత్య రూపకాలు గా ప్రదర్శించబడ్డాయి. ‘జజ్జనకరి జనారే,’ ‘సి న్నది కాదు పైసా /చిత్రాల మొగుడయ్యో’, ‘యంత్ర మెట్ల నడుస్తున్నదంటే’ వంటి అనేక పాటలు కార్మికుల కష్టాలు కడుపు కోతలను తన పాట ద్వారా వినిపించాడు. భూస్వామ్య పెత్తందారీ విధానాలపై తన బాణిని ఎక్కుపెట్టాడు. తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర… ప్రాంతం ఏదైనా పేద ప్రజలకు గుండె చప్పుడై, కార్మిక వీరుల కన్నుల్లో, కర్షక వీరుల గుండెల్లో ఉప్పొంగే ఉత్తుంగ తరంగమై నిలిచాడు.

ఏ సిష్టానికి లొంగని వంగపండు తనకంటూ ఇష్టమైన సిస్టంలో సాగి నారు. వంగపండు చేసిన సేవలకుగాను 2017 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న పురస్కారం అందుకున్నారు. ఇట్లా అనేక చోట్ల అనేక పురస్కారాలు అవార్డులు పొందారు. ఉద్యోగం వదులుకొని ప్రజా జీవితం లోకి అడుగుపెట్టిన వంగపండు ప్రముఖ కళాకారుడిగా జానపద బాణీలు తీసుకొని విరివిగా పాటలు రాసి విప్లవోద్యమ భావజాల ప్రసారంలో కీలక భూమిక పోషించాడు. నక్సలైట్ ఉద్యమంలో కలిసి పని చేసి ఆయన వందలాది పాటలు రాశారు. విప్లవద్యమానికి బాసటగా గద్దర్ తో కలిసి నడిచారు. ప్రజానాట్యమండలి స్థాపనలో కీలక పాత్ర వహించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రబాణీలో అనేక పాటలు రాసి ప్రజలను చైతన్య పరచడంలో వంగపండు పాత్ర విశిష్టమైనది గా భావించవచ్చు. ఇటీవలనే ఒక టీవీ న్యూస్ ఛానల్‌లో గద్దర్‌తో కలిసి కరోనా మహమ్మారి కట్టడి కోసం పాల్గొన్నారు. వయసుతో సంబంధం లేకుండా చూడడానికి ఎప్పుడూ చలాకీగా కనిపించే వంగపండు ప్రసాదరావు(77) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆగస్టు 4, 2020న తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు.

కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి-  9441561655

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post వంగపండు జీవితం ప్రజలకే అంకితం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.