కాంగ్రెస్ అంతర్గత విభేదాలు

కాంగ్రెస్ పార్టీకేమైంది? ప్రధాని మోడీ సారథ్యంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం వరుసగా ఘోర వైఫల్యాలను దేశానికి చవిచూపిస్తున్నా, వాటిని మరిపిస్తూ దేశ భక్తి, మత పిచ్చి మిశ్రమాన్ని మెజారిటీ ప్రజలకు తాపించి భారతీయ జనతా పార్టీ పరంపరగా గెలుపు జెండా ఎగురవేయడమేమిటి, దేశానికి బలమైన ప్రతిపక్షం లేని దుస్థితి, జనాభాలో అత్యధిక శాతంగా ఉన్న పేద, మధ్య తరగతి ప్రజలకు, ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం కాదా, కాంగ్రెస్ తిరిగి బలం పుంజుకోడమో, దాని స్థానంలో శక్తివంతమైన తృతీయ శక్తి అవతరించడమో […] The post కాంగ్రెస్ అంతర్గత విభేదాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కాంగ్రెస్ పార్టీకేమైంది? ప్రధాని మోడీ సారథ్యంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం వరుసగా ఘోర వైఫల్యాలను దేశానికి చవిచూపిస్తున్నా, వాటిని మరిపిస్తూ దేశ భక్తి, మత పిచ్చి మిశ్రమాన్ని మెజారిటీ ప్రజలకు తాపించి భారతీయ జనతా పార్టీ పరంపరగా గెలుపు జెండా ఎగురవేయడమేమిటి, దేశానికి బలమైన ప్రతిపక్షం లేని దుస్థితి, జనాభాలో అత్యధిక శాతంగా ఉన్న పేద, మధ్య తరగతి ప్రజలకు, ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం కాదా, కాంగ్రెస్ తిరిగి బలం పుంజుకోడమో, దాని స్థానంలో శక్తివంతమైన తృతీయ శక్తి అవతరించడమో ఎప్పుడు జరుగుతాయి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కాంగ్రెస్ నాయకత్వంలోని ఐక్యప్రగతిశీల కూటమి (యుపిఎ) పదేళ్ల పాలనలో పేదలకు, హక్కులకు కలిగిన ప్రయోజనాలు ఎన్నికల్లో ఆ పార్టీ కెందుకు అక్కరకు రాకుండా పోతున్నాయనే దానికి కూడా సరైన సమాధానం చిక్కడం లేదు.

కాంగ్రెస్ ఒకప్పుడు తిరుగులేని శక్తిగా రాజ్యమేలిన అనేక రాష్ట్రాల్లో ఇప్పుడా పార్టీ నామమాత్రంగా మారిపోయింది. లోక్‌సభలో కేవలం 44 స్థానాల బలంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న తర్వాత కూడా సభలో కేవలం 8 సీట్లను అదనంగా గెలుచుకోగలిగింది. దాని దయనీయ స్థితిపై ఆ పార్టీలో అణగారి రగులుతూ వచ్చిన అసంతృప్తి లావా ఇప్పుడు పెల్లుబకడం ప్రారంభమైంది. పార్టీ రాజ్యసభ సభ్యులతో సోనియా గాంధీ ఇటీవల నిర్వహించిన పరోక్ష సమావేశంలో యువ నేతలు యుపిఎ 2 ప్రభుత్వంలోని సీనియర్లను వేలెత్తి చూపించిన తీరులో అది ప్రస్ఫుటమైంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి యుపిఎ 2 ప్రభుత్వంలోని మంత్రులే కారణమని, వారు పార్టీ కార్యకర్తలకు దూరమయ్యారని, వాస్తవ పరిస్థితిని అంచనా వేయలేకపోయారని, ఇప్పుడు కూడా రాహుల్ గాంధీకి సహకరించడం లేదని కొందరు యువ ఎంపిలు విరుచుకుపడ్డారు. పార్టీ అంతర్గత చర్చలను బయటికి పొక్కిస్తున్నవారు అది మానుకుంటే తిరిగి అధికారంలోకి వస్తామనే సూచన కూడా వినవచ్చింది. కాంగ్రెస్‌లోని వృద్ధ, యువ నేతల మధ్య దూరం మరింతగా పెరిగిందనేది స్పష్టపడుతున్నది.

మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా, రాజస్థాన్‌లో సచిన్ పైలట్‌లు పార్టీని విడిచిపెట్టడానికి సీనియర్ల వైఖరే కారణమని యువతరం భావిస్తున్నది. పార్లమెంటులో బాగా కనిపించాలని, ప్రజల్లో తిరగాలని రాహుల్ గాంధీకి సీనియర్ నేతల్లో ముఖ్యుడు దిగ్విజయ్ సింగ్ చేసిన హిత బోధ కూడా యువ నేతల నుంచి విమర్శనే ఎదుర్కొంది. పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణు గోపాల్ వంటి వారు కపిల్ చిదంబరంలపై విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ చెప్పేదాన్ని సీనియర్లు నీరుగార్పిస్తున్నారని వేణు గోపాల్ వెలిబుచ్చిన అభిప్రాయం గమనించదగినది. అన్ని అంశాలపైనా మోడీ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ చీల్చిచెండాడుతున్నారని, ఆయన పై పాలక పక్షం ప్రతి దాడి చేసినప్పుడు ఆయనకు అండగా ఎవరూ నిలవడం లేదని అన్నారు. యువతరానికి పార్టీలో ప్రాధాన్యం ఇవ్వవలసిన అవసరాన్ని సోనియా గాంధీ గుర్తించినట్టు స్పష్టపడుతున్నది.

అది మొదటే జరిగి ఉంటే రాహుల్ గాంధీ అలిగి పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకునే వారు కాదేమో అనే అభిప్రాయానికి ఇది దారి తీస్తుంది. 200616 దశకంలో 27 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారని కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మనీశ్ తివారీ గుర్తు చేశారు. అందులో ఎనిమిదేళ్లు సాగింది యుపిఎ పాలనేనని, కాంగ్రెస్ అధికారం కోల్పోయి ఆరేళ్లు గడిచినా దానిపై చేసిన ఒక్క ఆరోపణ కూడా రుజువు కాలేదని ఆయన అన్నారు. 2 జీ స్పెక్ట్రమ్ కేటాయింపు కేసులో నిందితులందరూ నిర్దోషులుగా విడుదల కావడమే ఇందుకు తార్కాణమని, యుపిఎ హయాంలోని కాగ్ వినోద్ రాయ్ ఇచ్చిన వేలాది కోట్ల రూపాయల ఊహాజనిత కైంకర్యం నివేదికే ఆ కేసుకు కారణమని, యుపిఎ అంతర్గత శత్రువులే కాంగ్రెస్ పతనానికి దోహదం చేశారని మనీశ్ తివారీ చేసిన విశ్లేషణను ఆక్షేపించలేము. అలాగే ఆయన అన్నట్టు యుపిఎ నాటి ఉపాధి హామీ, ఆహార భద్రతా చట్టాలు ఇప్పుడు 80 కోట్ల మందికి తిండి పెడుతున్నాయన్న మాటను కూడా పూర్తిగా కొట్టేయలేము.

వీటన్నింటి గురించి ప్రజలకు వివరించి చెప్పే దృఢమైన కంఠం కాంగ్రెస్‌కు లేదు. ప్రధాని మోడీ ప్రభుత్వం ఆర్థిక, సైనిక తదితర వైఫల్యాలపై రాహుల్ గాంధీ వినిపిస్తున్న స్వరం బిగ్గరగా వినరావడం లేదు. పార్టీకి అధికారంగా అధ్యక్షులు లేని పరిస్థితి, ఒకవేళ రాహుల్ గాంధీ మళ్లీ పగ్గాలు చేపట్టినా ఆయన వెంట నిలబడి గట్టిగా ఆయన కంఠాన్ని దేశమంతా మారుమోగింపచేసే నాయకుల వ్యవస్థ లోపంగా ఉన్నమాట కాదనలేనిది. ఈ లోపాలు సరిదిద్ది కాంగ్రెస్‌ను మళ్లీ పటిష్టం చేస్తేగాని దేశానికి గట్టి ప్రతిపక్షం ఏర్పడే అవకాశాలు కనిపించడం లేదు. ఈలోగా వివిధ ప్రాంతీయ పార్టీలు, సామాజిక న్యాయ శక్తులు సంఘటితమై మూడో బలమైన శక్తిగా ఎదగడానికి తగిన అవకాశాలు లేకపోలేదు.

 

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post కాంగ్రెస్ అంతర్గత విభేదాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.