సోనూసూద్‌ను సెలబ్రిటీలు స్ఫూర్తిగా తీసుకోవాలి

సొంత లాభం కొంత మానుకుని పొరుగువారికి తోడుపడవోయ్’ అన్న గురజాడ మాటలను నిజం చేస్తూ కరోనా కష్టకాలంలో సమాజాన్ని తన ఇల్లుగా, పేద ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావిస్తూ వాటిని పరిష్కరించడంలో, తనకు చేతనైనా సహా యం చేయడంలో అగ్రభాగాన ఉన్న వ్యక్తి సోనూసూద్. లాక్ డౌన్ కు ముందు వరకు సినిమాల్లో విలన్‌గా నటించే నటునిగా మాత్రమే సోనూసూద్ సినీ ప్రేక్షకులకు, విమర్శకులకు, అభిమానులకు మాత్రమే తెలుసు. కరోనా లాక్-డౌన్ ఆర్థిక సంక్షోభ పరిస్థితుల […] The post సోనూసూద్‌ను సెలబ్రిటీలు స్ఫూర్తిగా తీసుకోవాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

సొంత లాభం కొంత మానుకుని పొరుగువారికి తోడుపడవోయ్’ అన్న గురజాడ మాటలను నిజం చేస్తూ కరోనా కష్టకాలంలో సమాజాన్ని తన ఇల్లుగా, పేద ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావిస్తూ వాటిని పరిష్కరించడంలో, తనకు చేతనైనా సహా యం చేయడంలో అగ్రభాగాన ఉన్న వ్యక్తి సోనూసూద్. లాక్ డౌన్ కు ముందు వరకు సినిమాల్లో విలన్‌గా నటించే నటునిగా మాత్రమే సోనూసూద్ సినీ ప్రేక్షకులకు, విమర్శకులకు, అభిమానులకు మాత్రమే తెలుసు. కరోనా లాక్-డౌన్ ఆర్థిక సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో నాటి నుంచి నేటి వరకు పేద ప్రజలకు అండగా సోనూసూద్ చేస్తున్న దాతృత్వ కార్యక్రమాల వలన నేడు భారతదేశంలో పసిపిల్లల నుంచి పండు ముదుసలి వరకు అతను తెలియనివారు లేరంటే ఏలాంటి అతిశయోక్తిలేదు. రీల్ లైఫ్ లో విలన్ క్యారెక్టర్లు పోషిస్తున్న సోనుసూద్ రియల్ లైఫ్ లో మాత్రం నిజమైన హీరో పాత్రను పోషిస్తున్నాడు.

కష్టకాలంలో ఉన్న పేద ప్రజలకు తనకు చేతనైనంత సహాయం చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. వారం రోజుల్లో మన తెలుగు రాష్ట్రాలలో జరిగిన మూడు సంఘటనలు సోనూసూద్ ఉన్నత వ్యక్తిత్వ వితరణశీలి స్వభావాన్ని తెలియజేస్తున్నవి. కరోనా పరిస్థితులతో చిత్తూరు జిల్లా మదనపల్లిలో టీ కొట్టు నడుపుకునే నాగేశ్వర రావు కుటుంబం. అది మూతపడటంతో తన కుటుంబాన్ని తీసుకొని స్వగ్రామానికి చేరుకుని తన రెండెకరాల భూమిని సాగు చేసుకోవడానికి కాడెద్దులు లేకపోవడంతో తన ఇద్దరు కూతుర్లనే కాడెద్దులుగా చేసుకుని విత్తనాలు విత్తిన విషయము సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న సోనూసూద్ ఒకరోజు వ్యవధిలోనే ఆ కుటుంబానికి ట్రాక్టర్‌ను పంపించడం అతని దయార్థ గుణానికి మచ్చు తునక. అలాగే లాక్ డౌన్ కారణంగా వరంగల్ జిల్లాకు చెందిన శారదను సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించింది.

ఉద్యోగం కోల్పోయి కూరగాయలు అమ్ముతున్న శారద వీడియో మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయము సోనూసూద్ దృష్టికి వెళ్లడంతో వెంటనే స్పందించి ఆమెకు తన వంతు సహాయం చేస్తానని ప్రకటించారు. తాజాగా ఆయన ప్రతినిధి ఆమెకు జాబ్ ఆఫర్ లెటర్ అందించినట్టు సోనూసూద్ సోషల్ మీడియాలో వెల్లడించారు. కిర్గిస్థాన్‌లో విద్యనభ్యసిస్తున్న తెలుగు విద్యార్థులు సోనూసూద్ సహకారంతో ఈ నెల 24న స్వస్థలాలకు చేరుకున్నారు. కిర్గిస్థాన్‌లోని బిస్కెక్ యూనివర్శిటీలో చదువుతున్న 250 మంది తెలుగు విద్యార్థులు కరోనా నేపథ్యంలో తమ సొంత ఊర్లకు రావటానికి ఇబ్బందులు పడుతున్న సందర్భంలో వారికి ప్రత్యేక విమానాన్ని కేటాయించి రప్పించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ మూడు సంఘటనల నేపథ్యంలో తెలుగు ప్రజల మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుని తన దాతృత్వానికి ఎల్లలు లేవని సోనుసూద్ నిరూపించాడు.

సినిమాల్లో ప్రజలు ఆపదల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు వారిని కాపాడేందుకు బ్రహ్మాండమైన విన్యాసాలు చేస్తూ ముందుకు వచ్చే హీరో పాత్రధారులు నిజ జీవితంలో మాత్రం పెద్దగా కానరావటం లేదు. పారితోషికాల విషయంలో కోటానుకోట్లు నిర్మాతల నుంచి వసూలు చేస్తూ స్టార్లుగా వెలుగొందుతున్న వారు నేడు సమాజంలో మసకబారుతున్నారు. అదే సమయంలో సినిమాల్లో ప్రజలను హింసిస్తూ, ఇబ్బందులు పెట్టే విలన్ పాత్రలు పోషిస్తున్న సోనూసూద్ నిజ జీవితంలో వారిని ఆదుకోవడానికి హీరోగా పలు రకాలుగా సహాయం చేస్తుండటం గొప్ప పరిణామం. కరోనా ప్రభావం ఫలితంగా లాక్ డౌన్ నాటి నుంచి వలస కూలీలు, పేదలు పడుతున్న ఇబ్బందులు నుంచి వారిని రక్షించడానికి సోనూసూద్ తన గొప్ప మనసును చాటుకుంటున్నాడు.ముంబై నగరంలో వేల మంది వలస కార్మికులను చేరదీసి వారికి వసతి భోజన సౌకర్యాలు కల్పించారు.

వివిధ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి అనుమతులు సాధించి బస్సులు, శ్రామిక రైళ్లు, విమానాల ద్వారా సొంత ఖర్చుతో వలస కూలీలను, విద్యార్థులను తమ స్వంత ప్రదేశాలకు పంపించాడు. కేవలం దేశంలో చిక్కుకున్న వారిని కాకుండా విదేశాల్లో ఇబ్బందులు పడుతున్న వారిని సైతం భారతదేశానికి సోనూసూద్ రప్పించాడు. ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న తన ఆరంతస్థుల హోటల్‌ను వివిధ ప్రాంతాల నుండి వచ్చి వైద్య సేవలు అందిస్తున్న వైద్యులకు, వైద్య సిబ్బందికి ఉండేందుకు అనుమతి నివ్వడం, పంజాబ్ లోని వైద్యులకు పదిహేను వందల వ్యక్తిగత సంరక్షక పరీక్షల కిట్లను అందజేయటం అతని ఉదార స్వభావాన్ని తెలియజేస్తున్నది. విపత్కర పరిస్థితుల్లో ఉన్న ప్రజలు ప్రభుత్వాలను సహాయం అడగడం మానేసి నేడు ట్విట్టర్ వేదికగా సోనూసూద్‌ను సహాయం కోరుతున్నారు. అదే స్థాయిలో సోనూసూద్ కూడా నేనున్నాను అంటూ భరోసా కల్పిస్తున్నారు. కరోనా మూలంగా ఉద్యోగాలు కోల్పోయిన వారికి కొత్త యాప్ సహాయంతో అర్హతను బట్టి ఉద్యోగాలు కల్పిస్తున్నారు.

ప్రాచీన కాలం నుంచి కూడా భారతదేశం దాతృత్వానికి నిలయంగా ఉంది. శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి, కర్ణుడు మొదలగు వారి దానగుణాలను నేటికీ మనం స్మరించుకుంటూనే ఉన్నాం. ప్రస్తుతం దేశంలో వ్యక్తిగత స్వార్థం పెరిగిపోయి దాతృత్వం కొరవడుతున్నది. ఐరోపా దేశాలతో పోల్చినప్పుడు మన దేశంలో దాతృత్వానికి ముందుకు వచ్చే సంపన్నులు చాలా తక్కువగా ఉన్నారు. దేశంలో సినిమా రంగంలో, క్రీడా రంగంలో సెలబ్రిటీలకు ఏమాత్రం కొదవలేదు. సెలబ్రిటీలు సోనూసూద్‌ను ఆదర్శంగా తీసుకుని సమాజం కోసం స్పందించాల్సిన అవసరం ఉంది. సినిమా హీరోల అభిమాన సంఘాలు కూడా సినిమా విడుదల సందర్భంగా చేసే ఆర్భాటాలను, ఆడంబరాలను నిలుపుదల చేసి తమ అభిమాన హీరోలు దాతృత్వ కార్యక్రమాలను చేసే విధంగా ఒత్తిడి పెంచాలి. అప్పుడే వారు నిజమైన హీరోలుగా కీర్తించబడుతారు.

బిల్లిపల్లి లకా్ష్మరెడ్డి, 9440966416

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post సోనూసూద్‌ను సెలబ్రిటీలు స్ఫూర్తిగా తీసుకోవాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.