పాత సెక్రెటేరియట్ కూల్చివేత షురూ

  మంగళవారం తెల్లవారుజామునుంచే పలు బ్లాకుల నేలమట్టం, పర్యవేక్షించిన సిఎస్, డిజిపి 50% పూర్తయిన కూల్చివేత పనులు ప్రాంగణంలోని నల్లపోచమ్మ దేవాలయంలో ప్రత్యేక హోమం కూల్చివేతల నేపథ్యంలో ట్రాఫిక్‌ను మళ్లించిన పోలీసులు మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర సచివాలయ భవనం కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే కూల్చివేత ప్రక్రియను అధికారులు మొదలుపెట్టారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, మింట్ కాంపౌండ్ వైపుగా ఉన్న సెక్రటేరియట్ దారులను అధికారులు మూసివేశారు. పాత […] The post పాత సెక్రెటేరియట్ కూల్చివేత షురూ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మంగళవారం తెల్లవారుజామునుంచే పలు బ్లాకుల నేలమట్టం, పర్యవేక్షించిన సిఎస్, డిజిపి
50% పూర్తయిన కూల్చివేత పనులు
ప్రాంగణంలోని నల్లపోచమ్మ దేవాలయంలో ప్రత్యేక హోమం

కూల్చివేతల నేపథ్యంలో ట్రాఫిక్‌ను మళ్లించిన పోలీసులు

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర సచివాలయ భవనం కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే కూల్చివేత ప్రక్రియను అధికారులు మొదలుపెట్టారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, మింట్ కాంపౌండ్ వైపుగా ఉన్న సెక్రటేరియట్ దారులను అధికారులు మూసివేశారు. పాత సచివాలయ భవనాన్ని కూల్చేసి దాని స్థానంలో కొత్త సచివాలయం నిర్మాణాన్ని చేపట్టాలని కెసిఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగానే పాత సచివాలయ భవనాన్ని ప్రభుత్వం కూల్చేస్తుంది. సచివాలయం కూల్చివేతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అంశంలో అనుకూలమైన తీర్పు వచ్చింది.

కూల్చివేత పనుల్లో వేగం పెంచిన ప్రభుత్వం
హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా రావడంతో కూల్చివేత పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. భూమిపూజ చేసిన ఏడాది తర్వాత ఈ కూల్చివేత ప్రారంభం కావడం గమన్హారం. హైకోర్టు తీర్పు అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో సచివాలయ భవనం కూల్చివేత ప్రక్రియను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం, సచివాలయం వైపు వెళ్లే మార్గాలను మూసివేసి కూల్చివేత పనులను కొనసాగిస్తోంది. ఈ నెలాఖరు నాటికి సచివాలయ భవనాన్ని కూల్చివేసి శ్రావణ మాసంలో కొత్త సచివాలయం నిర్మాణానికి టెండర్లు పిలిచి పనులు మొదలయ్యేలా చూడాలని సిఎం కెసిఆర్ ఆలోచనగా తెలుస్తోంది.

నాలుగైదు రోజుల్లో పూర్తి స్థాయిలో భవనాల కూల్చివేత
నాలుగైదు రోజుల్లో పూర్తి స్థాయిలో పాత సచివాలయాన్ని కూల్చివేయాలని సిఎం అధికారులను ఆదేశించినట్టుగా తెలిసింది. కొత్త సచివాలయం కోసం ఇప్పటికే డిజైన్‌ను ప్రభుత్వం ఫైనలైజ్ చేసింది.అన్ని ఆధునిక హంగులతో నిర్మించబోయే సచివాలయం కొత్త భవన నిర్మాణాన్ని మంత్రిత్వ శాఖల వారీగా బ్లాకులతో, ఓ పథకం ప్రకారం, ప్రణాళికాబద్ధంగా, వాస్తు పద్ధతులకు అనుగుణంగా చేపట్టనున్నారు.

పాత సచివాలయ భవనానికి 132 ఏళ్ల చరిత్ర
పాత సచివాలయ భవనానికి 132 ఏళ్ల చరిత్ర ఉంది. నిజాం నవాబుల పాలనలో సైఫాబాద్ ప్యాలెస్ పేరుతో ఇది ప్రసిద్ధి పొందింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ముఖ్యమంత్రుల పాలనా కేంద్రంగా ఈ సచివాలయ భవనం వెలుగొందింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి పాలనా కేంద్రంగా చరిత్రలో ఇది నిలిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సిఎంలతో కలుపుకుంటే మొత్తం 16 మంది ముఖ్యమంత్రులు ఇక్కడి నుంచే పాలన సాగించారు. 25 ఎకరాల విస్తీర్ణంలో10 లక్షల చదరపు అడుగుల్లో ఈ సచివాలయం నిర్మాణం జరిగింది. 132 ఏళ్ల కాలంలో మొత్తం 10 బ్లాకుల నిర్మాణం జరిగింది. అతి పురాతనమైన జి బ్లాక్ 1888లో ఆరవ నిజాం నవాబు కాలంలో నిర్మితమైంది.

2003లో డి బ్లాక్, 2012లో నార్త్, సౌత్ బ్లాక్స్ ప్రారంభమయ్యాయి. ఎ- బ్లాక్ భవన సముదాయాన్ని 1981లో నాటి సిఎం టి.అంజయ్య ప్రారంభించగా, సి- బ్లాక్‌ను 1978లో చెన్నారెడ్డి ప్రారంభించారు. ఇందులో మొత్తం 6 అంతస్తులున్నాయి. దీంట్లోనే ముఖ్యమంత్రులు కొలువుదీరేవారు. కెసిఆర్ మినహా మిగతా సిఎంలు ఈ బ్లాక్ నుంచే పని చేశారు. ఎ -బ్లాక్ రెండో దశను 1998 ఆగస్టు 10వ తేదీన చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. డి- బ్లాక్‌కు 2003లో చంద్రబాబు శంకుస్థాపన చేయగా, 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి దానిని ప్రారంభించారు. రాష్ట్ర విభజన తర్వాత ఎపి అధీనంలో ఉన్న జె, ఎల్ బ్లాక్‌లను 1990లో మర్రి చెన్నారెడ్డి ప్రారంభించగా, జే- బ్లాక్ సచివాలయంలో అతిపెద్దది.

50శాతం కూల్చివేత పనులు పూర్తి
పాత సచివాలయం భవనాల కూల్చివేత 50 శాతం పూర్తయింది. బుధవారంలోగా మిగిలిన భవనాలను పడగొట్టేందుకు రాత్రిపూట కూడా పనులు కొనసాగుతున్నాయి. దాదాపు 8 నుంచి 10 జైజాంటిక్ జేసీబీలను రంగంలోకి దించి రోడ్లు భవనాల శాఖ కూల్చివేతలను శర వేగంగా కొనసాగిస్తోంది. మరోవైపు పాతసచివాలయంలో ఉన్న నల్ల పోచమ్మ దేవాలయంలో సోమవారం రాత్రి పది గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు ప్రత్యేక హోమం జరిగింది. ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్లు ఈ హోమంలో పాల్గొన్నారు.

ఆ తరవాత అమ్మవారు విగ్రహాన్ని కదిలించి గుడిని కూల్చేశారు. ప్రస్తుతం విగ్రహం అక్కడే ఉన్న రేపు దాన్ని మరోచోటికి తరలించి అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిరాఘాటాంగా జరిగేలా చూస్తారు. ఆ తరవాత ప్రాంగణంలో ఉన్న మసీదును కూల్చివేశారు. ఈ రెండిటి తరవాత సచివాలయ భవనాల్లో అతి పురాతన భవనం సర్వహితను నేలమట్టం చేశారు. రెండు భారీ జేసీబీల సాయంతో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో మింట్ రోడ్డులో ఉన్న రాతి భవనాన్ని కూల్చివేశారు.

ట్రాఫిక్ మళ్లింపు
సచివాలయంలో కూల్చివేతల సందర్భంలో మంగళవారం ఉదయం నుంచి ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. సచివాలయం నుంచి కిలోమీటర్ వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఐమాక్స్, రవీంద్రభారతి, లక్డీకాపూల్, హిమాయత్ నగర్, బషీర్ బాగ్ వద్ద వాహనాలను దారి మళ్లించారు. ఈ నేపథ్యంలో బషీర్‌బాగ్, అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. ఇందిరాపార్క్ నుంచి వచ్చే వాహనాలన్నింటిని లోయర్ ట్యాంక్‌బండ్, బషీర్‌బాగ్ మీదుగా మళ్లించారు.

జేసిబిలతో భవనాల కూల్చివేత
జేసిబిలతో భవనాలను కూల్చివేశారు. సచివాలయం కూల్చివేస్తున్న నేపథ్యంలో పాత సచివాలయం వైపు వెళ్లే అన్ని రహదారులను మూసివేశారు. అటు వైపు ఎవరూ రాకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే మంగళవారం బిఆర్‌ఆర్‌కె భవన్‌ను మూసివేశారు. ఎవరూ రావొద్దని సచివాలయ ఉద్యోగులకు అధికారులు మౌఖిక ఆదేశాలు చేశారు. మరోవైపు కూల్చివేత పనులను సిఎస్, డిజిపి, ఉన్నతాధికారులు దగ్గరుండి పర్యవేక్షించారు.

Demolition of old Telangana Secretariat complex begins

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post పాత సెక్రెటేరియట్ కూల్చివేత షురూ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: