ఆహ్లాదకర విమర్శకుడు అమ్మంగి

  అమ్మంగి అయిదు దశాబ్దాలుగా సాహిత్యరంగంలో విద్యార్థిగా ఉన్నాడు. అందుకే అనేక విషయాల ఆకళింపు ఉన్నది. అనేక రంగాల జ్ఞాన సంపద ఉన్నది. “సదాశివ సంగీత సంస్కారం” అనే వ్యాసం ఆయన సంగీతజ్ఞానానికి ఆస్వాద గుణానికి మంచి నిదర్శనం. ఉస్మానియాలో నేను ఎం.ఫిల్‌లో చేరినప్పుడు అమ్మంగిగారి ‘మిణుగురు’ కవితా సంపుటి వచ్చింది. ఆ సంపుటిలో చదివానో, అంతకు ముందే పత్రికల్లో చదివానో గాని ఆ కవిత బాగా నచ్చింది. అది టమాటా మీద రాసింది. అప్పట్నుంచి అంటే […] The post ఆహ్లాదకర విమర్శకుడు అమ్మంగి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అమ్మంగి అయిదు దశాబ్దాలుగా సాహిత్యరంగంలో విద్యార్థిగా ఉన్నాడు. అందుకే అనేక విషయాల ఆకళింపు ఉన్నది. అనేక రంగాల జ్ఞాన సంపద ఉన్నది. “సదాశివ సంగీత సంస్కారం” అనే వ్యాసం ఆయన సంగీతజ్ఞానానికి ఆస్వాద గుణానికి మంచి నిదర్శనం.

ఉస్మానియాలో నేను ఎం.ఫిల్‌లో చేరినప్పుడు అమ్మంగిగారి ‘మిణుగురు’ కవితా సంపుటి వచ్చింది. ఆ సంపుటిలో చదివానో, అంతకు ముందే పత్రికల్లో చదివానో గాని ఆ కవిత బాగా నచ్చింది. అది టమాటా మీద రాసింది. అప్పట్నుంచి అంటే నలభై ఏండ్ల నుంచి ఆయన పేరు మా మధ్య ప్రస్తావనకు వస్తుండేది. ఆయన నెమ్మదస్తుడు. దూకుడు ఉండదు. ఉరికురికి పడిపోయేదుండదు. ఆ పరిణతి అన్ని వ్యాసాల్లో ఉంటది. దేవులపల్లి రామానుజరావు గారి గురించి రాస్తూ “తన కంటే వెనుకటి తరం (ఆంధ్ర జన సంఘం, ఆంధ్ర మహా సభ వ్యాసకర్త) వారు వెలిగించిన విద్యాదీపం ఆరిపోకుండా, వారు వెలిగించని చోట్లలో వెలిగిస్తూ (నేటి తెలంగాణ సారస్వత పరిషత్తు నాటి ఆంధ్ర సారస్వత పరిషత్తు ద్వారావ్యాసకర్త) కార్యదీక్షతో ముందుకు సాగిపోయారు” అని “విన్నంత …! కన్నంత” అనే వ్యాసంలో రాసిండ్రు.

అమ్మంగి లాగా పరిణతి లేని వారయితే “వారు వెలిగించని చోట్ల” అనే బదులు “వారు నిర్లక్ష్యం చేసినచోట్ల” అని రాసి ఉండేవారు. అమ్మంగి ఎప్పుడూ ఆహ్లాదకరంగా, చల్లగా ఉంటాడు. రచయిత స్వభావమే అతనిశైలిని అంటే రచనావిధానాన్ని నిర్ణయిస్తుంది. అందుకు అమ్మంగే నిదర్శనం. ఆయన ఉన్నట్టే ఆయనశైలి ఆహ్లాదకరంగా ఉంటది. ఆహ్లాదకరం అంటే చదివినప్పుడు పాఠకుని మెదడు అలసిపోకుండా ఉండటం. సృజనాత్మక ప్రక్రియలైన కథ, నవల, కవిత్వం లాంటి వాటికి ఆ ఆహ్లాదగుణం ఉంటది. విమర్శాప్రక్రియకెలా ఉండగలదు? విమర్శశాస్త్రం కదా? విమర్శ శాస్త్ర గుణాన్ని తగ్గించుకొని కళగా మారినప్పుడే అది సాధ్యం. (విమర్శకళా? శాస్త్రమా? అనే చర్చ అట్లా వచ్చిందే) విమర్శను కళగా కూడా మార్చిన ప్రత్యేకత అమ్మంగిది.

“గ్రాఫ్ పేపర్‌ మీద జీవితాన్ని చిత్రించినవాడు అలిట్టి ప్రభాకర్. తెరవెనుక పొంచివున్న మృత్యువును ఫొటో తీసినవాడు ప్రభాకర్. ఒక్క క్షణానికి కూడా విరామమివ్వక కాలాన్ని కవిత్వీకరించినవాడు ప్రభాకర్. అతనికి లోకం తెలుసు. లౌక్యం తెలియదు. అతనికి కళ తెలుసు. కళను అమ్ముకోవడం తెలియదు. సమాజ రోగాలకు మందు తెలుసు. తన జబ్బును నయంచేసుకోవటమే తెలియదు. భార్యాబిడ్డలకు అపారమైన ప్రేమనిధిని ఇచ్చిపోయినవాడు. స్నేహితులకు అపూర్వమైన స్నేహరాశిని పంచిచ్చినవాడు. పాఠకులకు అమూల్యమైన కవిత్వాన్ని రాసిచ్చినవాడు ప్రభాకర్. అందరినీ ప్రేమించినట్టే జాన్‌కీట్స్‌లాగా తనలోని క్షయను కూడా ప్రేమించాడని అనిపిస్తుంది”. దటీజ్ అమ్మంగి. ఈ పేరాలో ఒక వ్యాసమే దగినంత లోతు ఉంది. విమర్శ ఇక్కడ కళ అయినందువల్లనే ఆ డెప్త్ వచ్చింది. “కఠోర పరిశ్రమలో సానదేలిన వజ్రం ఆచార్య రవ్వా శ్రీహరి” లాంటి శీర్షికలుకూడా అట్లా వచ్చినవే.

అమ్మంగి కొటేషన్లు గుప్పించడు. పాండిత్య ప్రకర్షకు పోడు. సైద్ధాంతిక పారిభాషిక పదాలు ఎక్కువగా వాడడు. బాలగోపాల్ మలిదశ రచనల్లో ఎక్కడా కొటేషన్లు ఉండవు. అనేక రచనల సారాంశాన్ని మాత్రమే అవసరమైన మేరకే తనదైన పరిశీలనలను, వ్యాఖ్యానాన్ని సూత్రీకరణను జోడించి చెప్తడు. (అట్లా జీర్ణం కానివారు మాత్రమే అటు సంస్కృతం నుంచి, ఇటు ఇంగ్లీషునుంచి కొటేషన్లు గుప్పిస్తుంరు) ఈ లక్షణం అమ్మంగికి అబ్బింది. “ఒక తాత్త్వికుడు పరిపాలకుడయితే బాగుంటుందన్న అభిప్రాయం ఈనాటిది కాదు. అట్లే తాత్త్వికులు కవిత్వం రాయటమేమీ కొత్త విషయంకాదు. దార్శనికుడు సమగ్రదృష్టిని కలిగి ఉంటాడు. అంతేకాదు అతని దృక్కోణం కాలాతీతంగా కూడా వుండవచ్చు. పూర్వకాలపు తాత్త్వికుడే రుషి” ఈ సందర్భంగా ఎన్నో కొటేషన్లు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. కాని ఇవ్వలేదు.

పాఠకుడిని ఆ కీకారణ్యం మధ్య దారితప్పకుండా బయటపడేసిండు. ఈ సందర్భంగా పాఠకుడిని అయోమయంలో పడేసే పారిభాషిక పదాలను వదిలేసి సరళమైన పదాల్లో చెప్పడాన్ని గమనించొచ్చు. ఆయన పాజిటివ్ విశ్లేషణేగాని, నెగిటివ్ విమర్శకు పోడు. ఎక్కడైనా నెగిటివ్ విమర్శ దొరుకుతుందేమోనని వ్యాసాలన్నీ చూసిన ఒక్కటి కూడా దొరకలేదు. సురమౌళి కథల గురించి రాస్తూ “1968 లోనే రాసిన ‘మలుపులు’ అన్న కథలో వివాహంతో నిమిత్తం లేకుండా, ప్రేమ ప్రమేయం లేకుండా లైంగిక సంబంధాల కలిగి ఉండటాన్ని సమర్థించాడు” ఇప్పటికీ సమాజం ఆమోదం పొందని ఈ సమర్థనను నెగెటివ్‌గా విమర్శించే అవకాశం ఉన్నా అలా చేయలేదు. కేవలం పాజిటివ్ విమర్శవల్ల సాహిత్యానికి నష్టం చేయదా అని కొందరు ప్రశ్నించవచ్చు. కాని అలాంటి విమర్శవల్ల ఆయా రచయితలు ఆత్మపరిశీలన చేసుకోవడానికి అవకాశం ఇచ్చినట్లవుతుంది. ఆ మేరకు అది మంచిదే కదా? వెన్నముద్దలాంటి సరళవాక్యాలే తప్ప అన్నంలో రాళ్లలా సంక్లిష్ట వాక్యాలు రాయడు. అందుకే అంత రీడబిలిటీ.

“కవిని జాతి అంతరాత్మగా, కవిత్వాన్ని అంతర్వాణిగా భావిస్తారు. అంటే కవులులేని జాతికి అంతరాత్మ లేనట్లే. సాహిత్యంలోనే కాదు ప్రజాక్షేత్రంలో కూడా కవికి ఉన్నత స్థానం ఉంది” ఎంతో క్లిష్టమైన విషయాన్ని కూడా ఎంత సుబోధకంగా చెప్పిండు? ఆయన వచన రచనలోని సారళ్యతకూ, రీడబిలిటీకి మచ్చుతునక ఇది. ఆయన మంచి చమత్కారి. కాసేపు ఆయనతో మాట్లాడినా తెలస్తుందది. ఇది చాలామందిలో కవిత్వంలోనూ, సంభాషణల్లో వ్యక్తమవుతుంది. ఆయన కవిత్వంలో వ్యక్తమవడం సరేసరి. అది విమర్శనా వ్యాసాల్లో కూడా వ్యక్తం కావడం ఆయన ప్రత్యేకత. “భాష ఒక మానవ వనరు రచయిత పవరు”, “వేదవాక్కుతోపాటు బీదహక్కు” కూడా అందుకే కవిత్వం కాగలిగింది (కవి కవిత్వం).

అమ్మంగి అయిదు దశాబ్దాలుగా సాహిత్యరంగంలో విద్యార్థిగా ఉన్నాడు. అందుకే అనేక విషయాల ఆకళింపు ఉన్నది. అనేక రంగాల జ్ఞాన సంపద ఉన్నది. “సదాశివ సంగీత సంస్కారం” అనే వ్యాసం ఆయన సంగీతజ్ఞానానికి ఆస్వాద గుణానికి మంచి నిదర్శనం. మరొక వ్యాసం “మ్రోయు తుమ్మెద నారాయణరావు” కూడ. “మ్రోయుతుమ్మెద” విశ్వనాథ సత్యనారాయణ నవల. విశ్వనాథ కరీంనగర్‌లో ఉన్నప్పుడు 1960ల్లో రాసింది. ఈ నవల గురించిన వ్యాసం మనకు (కనీసం నాకు) తెలియని కొన్ని విషయాలు చెప్తుంది. ఈ నవలలోని ప్రధానపాత్ర నారాయణరావు. ఇది సజీవపాత్ర. కరీంనగర్ జిల్లాకు చెందిన నారాయణరావు హిందుస్థానీ సంగీత దిగ్గజం. తెలంగాణ వాళ్లపట్ల ఒక తృణీకారభావం, కోస్తాంధ్రులకు మొదటినుంచీ ఉన్నది. అది విశ్వనాధకూ ఉంది. తెలంగాణ వాళ్ళకు ఏమీ తెలియదన్నదే ఆ తృణీకార భావానికి కారణం. ఇక్కడ నారాయణరావు సంగీతం వినిపిస్తున్న తొలిదశలో విశ్వనాథ అదే తృణీకార భావాన్ని వ్యక్తం చేసిండు.

పోనుపోను నారాయణరావు అనే సంగీత శిఖరం ముందు విశ్వనాథ తలవంచక తప్పలేదని అమ్మంగి తేల్చిండు. ఇలాంటివే విశ్వనాథ కాళోజీ సోదరుల గురువైన గార్లపాటి రాఘవరెడ్డి పద్యాలు వినిపిస్తుంటే విశ్వనాథ పండుకొని అలవోకగా వింటున్నవాడల్లా క్రమంగా పద్యాల గరిమకు దిగ్గునలేచి కూర్చుని మరీ విన్నాడట. ఒకసారి శ్రీకృష్ణదేవరాయాంధ్రభాషా నిలయంలో ఒక రచయిత గురించి మాట్లాడడానికి విశ్వనాథను ముఖ్యవక్తగా పిలిచిండ్రట. ఆ సభకు అధ్యక్షత వహించిన సురవరం ప్రతాపరెడ్డిగారి అధ్యక్షోపన్యాసం అయింతర్వాత విశ్వనాథ లేచి అధ్యక్షులవారు నాకు ఏమి మిగిల్చినారు అన్నారట. ఇవి తెలంగాణ అస్మితను నిలబెట్టిన ఘటనలు. వీటికి మరో చేర్పు అమ్మంగి పైన వివరించిన ఘటన. పై వ్యాసంలోనే అమ్మంగి తేల్చిన మరొక అంశం ఉంది. విశ్వనాథ కరీంనగర్‌లో ఉంటూ తెలంగాణ వాతావరణంలో రాసిన పై నవల లో “పదేళ్ళ క్రితం వరకు (1950 ప్రాంతం) సాగిన రైతాంగ పోరాటం, గ్రంథాలయ, ఆర్యసమాజ ఉద్యమాలు వాటి పరిణామ ప్రభావాలు కరీంనగర్ ప్రాంతపు సమాజం మీద స్పష్టంగా ఉన్నాయి. కాని వాటి చర్చ విశ్వనాథ చేయలేదు”.

“సామాజిక, మానసిక జీవితాలను చిత్రీకరించడంలో విశ్వనాథ శ్రద్ధ చూపలేదు” అన్న పరిశీలన విశ్వనాథలాంటి వారికి తెలంగాణ పట్ల ఎంత అశ్రద్ధ (అంటే నిర్లక్ష్యం, తృణీకారభావం) ఉన్నదో చెపుతుంది! అసలైతే ఈ ఒక్క వ్యాసం ద్వారానే అమ్మంగి గారి అనేక విశ్లేషణా కోణాలను ఆవిష్కరిస్తూ ఒక వ్యాసమే రాయవచ్చు. మచ్చుకు ఒక ట్రెండు చూడొచ్చు. “తిరోగమన భావాల మూలంగా కూడా ప్రసిద్ధి గడించినవారు, బహుశా విశ్వనాథ ఒక్కరే” గొప్పపరిశీలన. బహుశా అనే సందేహం అక్కర్లేదు. ఒక్కరే. దీనివెనువెంటనే మరొక గొప్పపరిశీలన ఉంది. అది “తన సాహిత్యానికి ప్రజలలో ఆదరణ లేదని తన అభిమానులకన్నా బాగా గుర్తించిన వారు విశ్వనాథ. దీనికి ఉపబలకంగా ఆ నవలలో విశ్వనాథే చెప్పిన వాక్యాల్ని ఉదాహరించిండు. అవి “నీవు నాంధ్ర కవితమార్గమున ననాదృశమై నొక విలక్షణమైన వ్యక్తిత్వమును స్ఫురింపజేయునొక మార్గమును పట్టితివి. దానిని లోకము మెచ్చుకొనుటలేదు. నీవు గుడుసుళ్ళు పడుతుంటివి”.

విశ్వనాథ తిరోగమన దృక్పథాన్ని త్రిపురనేని లాంటివాళ్ళు చీల్చిచెండాడినారు గాని, ఆయన మాటల్నే ఆయనకు ఎదురునిల్పి సత్యాన్ని సుతిమెత్తగా చెప్పింది అమ్మంగే. సుతిమెత్తగా చెప్పినా నిష్కర్శ వీడడు. “ఒక్కమాటలో చెప్పాలంటే విశ్వనాథకు హిందూత్వం అంటే బ్రాహ్మణ కులాశ్రిత సంప్రదాయాలు తప్ప మరేదీకాదు. ఈ కులవాదాన్నే భారతీయ, ఆదర్శవాదంగా ప్రతిపాదిస్తారు. ఈ భావన అన్నింటికంటే ఎక్కువగా భారతీయ ఆధ్యాత్మిక స్ఫూర్తిని దెబ్బతీస్తుంది”. ఈ వ్యాసం (తేదీలేదు) ఎప్పుడు రాసిండో గాని ప్రస్తుత సందర్భంలో హిందుత్వపేరుతో జరుగుతున్న తతంగం వెనుక ఉన్న ఎజెండాను చాలా స్పష్టతతో అప్పుడే ఎరుకపర్సిండు. గ్రేట్. అమ్మంగి చారిత్రక పరిజ్ఞానానికి ‘గోలకొండ’, ‘జాతి జనులు గర్వించే చిత్రకారుడు’, ‘చరిత్ర రచనలో సాహిత్యాత్మ’, ‘తెలంగాణ కవి సమ్మేళనాలు’, ‘తెలంగాణ చిరస్మణీయులు’, ‘సాహిత్యచరిత్రలో తెలంగాణ’ లాంటి వ్యాసాలు నిదర్శనం. “షాజహాన్ నగర నిర్మాతకాడు.

కానీ కులీకుతుబ్‌షా 1591 లో హైదరాబాద్ నగరాన్ని నిర్మించాడు” అని అనగలిగింది ఆ జ్ఞానం వల్లనే. “డా.సుంకిరెడ్డి నారాయణరెడ్డి తెలంగాణ చరిత్రకు, తెలంగాణ సాహిత్యచరిత్రకు ముఖచిత్రంగా నిలిచినవారు” అని సాధికారికంగా అనగలిగింది ఆ జ్ఞానం వల్లనే. మాకంటే ముందుతరం వాడు అయినందువల్ల 60ల నాటి సంగతులు ఆయన వ్యాసాలవల్ల చాలా తెలుసుకున్నందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్పాలే. సాహిత్య గమన దిశను పట్టుకోగలిగిన వాడు దార్శనికుడైన విమర్శకుడు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాబోయే కవిత్వం గురించిరాస్తూ “తెలంగాణ సంస్కృతిలో మమేకమై గతవైభవ గానం చేయటం మరికొంతకాలం కొనసాగవచ్చు” అన్న మాటలు కవిత్వ గమన దిశను గ్రహించగలిగిన దార్శనికతను పట్టిస్తయి.

సమాజంలోగాని సాహిత్యంలోగాని ఏంజరుగుతున్నదనే పరిశీలన విమర్శకుడి గ్రాహ్యశక్తికి గుర్తు. ‘స్వాతంత్య్రానంతర కాలపు యువత ముఖ్యంగా 1950 దశకంలో ఉద్యమాలకు దూరమవుతూ వచ్చారు” “రచనారూపం చిన్నదవుతున్న కొద్దీ, దాన్ని మెప్పించటానికి ఎక్కువ కళాత్మక ప్రతిభ అవసరమవుతుంది” అనేవి అమ్మంగి పరిశీలనా శక్తికి నిదర్శనాలు. సాహిత్యంలోగాని సమాజంలో గానీ ఏం జరుగుతున్నదనే పరిశీలన విమర్శకుడి ఉత్తమలక్షణాలలో ఒకటి అయినా, అంతకంటే ఎందుకు జరుగుతున్నది, ఎలా జరుగనున్నదనే సూత్రీకరణ శక్తి ఇంకా గొప్ప లక్షణం. అది విమర్శకుడి పరిణతికి కూడా గుర్తు. “సాహిత్యం జీవిత చిత్రణతోపాటు విమర్శ కూడా చేస్తుంది. చిత్రణ బహిర్ముఖంగా విమర్శ అంతర్ముఖంగా సాగటం ఉత్తమసాహిత్య లక్షణం”. దేవులపల్లి కృష్ణమూర్తి కథలగురించి రాస్తూ “కలలపందిరి కథానికల్లో కొట్టొచ్చినట్లు కనపించేది, వాస్తవికత”.

“కృష్ణమూర్తిగారి సందర్భంలో కాల్పనికత పాలు తక్కువగా ఉన్న సామాజిక వాస్తవికత అనిగూడ చెప్పుకోవచ్చు”. “జీవితాన్ని నిశితంగా పరిశీలించగలిగిన వాడే మంచి కథకుడవుతాడు. సంవిధాన శిల్పంతో నైపుణ్యం మూలంగా కథానిక మరింత మంచి రచనగా రూపొందుతుంది” “ప్రారంభం బాగున్నప్పుడే కవిత కూడా బాగుంటుంది. ప్రారంభ వాక్యాల ప్రవేశద్వారం ఎప్పుడూ పాఠకుణ్ణి ఆకట్టుకునేటట్లుగా వుండాలి” అనేవి అమ్మంగి సూత్రీకరణ నైపుణ్యానికి నిదర్శనాలు. తన ఏభైఏళ్ళ సాహిత్య జీవితంలో అభ్యుదయోద్యమం, విప్లవోద్యమం, వివిధ అస్తిత్వ ఉద్యమాలు లాంటి ఎన్నో ఉద్యమాలు చూసిండు. అన్నింటినీ సానుకూలంగానే స్వీకరించినాడు. మొత్తంగా బాధితుల పక్షం వహించి పురోగామి దృక్పథాన్ని అవలంబించిండు. వట్టికోట గురించి రాస్తూ “ ‘గాలిపటం’ కథలోను, ‘కనువిప్పు’ నాటికలోను వంచితులపట్ల పీడితులపట్ల ప్రేమను, సానుభూతిని ప్రదర్శించిండు”.

“ఆర్థికంగా, సామాజికంగా వెనుకబాటు తనంతో అణగారిపోతున్న శ్రమజీవులే ఉద్యమకారుల కథానాయకులు. అందుకే ఈ బడుగు, పేదరైతులు మొత్తం కటుంబంతోపాటు వ్యవసాయ కార్యక్రమంలో పాల్గొంటారు. వీరే శాయిరెడ్డికి ప్రతీపాత్రులు. భూస్వాములు వారి దృష్టిలో లేరు. అందుకే శాయిరెడ్డి “నీ కొలమందు జన్మించిన జమీం / దారులు గనరు నీ తాపమెల్ల” అంటూ, కులదృష్టిని కాక, వర్గదృష్టిని ప్రదర్శించారు” అనే ఉల్లేఖనలు అమ్మంగి దృక్పథాన్ని తెలుపుతున్నవి. విమర్శకుడి ముఖ్యలక్షణాలతో విశ్లేషణా శక్తి ఒకటి. అమ్మంగికి మంచి విశ్లేషణా శక్తి ఉంది. అది చాలా వ్యాసాలలో చూడవచ్చు. ఉదాహరణకు పొట్లపల్లి రామారావు, బి.నరసింగరావుల మీదరాసిన వ్యాసాలు చూడవచ్చు. పొట్లపల్లి, బి.నరసింహారావులు విమర్శకులకు సవాలు (యాదృచ్ఛికంగా వీరిరువురి మీద నేనుగూడ రాసిన). వాళ్ళనెట్లా లొకేట్ చేయాలన్నది పెద్ద సమస్య.

ఆ సమస్యను అధిగమించి తన విశ్లేషణా సమర్థతను నిరూపించుకున్నాడు అమ్మంగి. కొన్ని ఉల్లేఖనలు చూద్దాం. “పేరు గడించడానికి ఆయన సాహిత్యరంగంలోకి వచ్చినట్లు కనిపించదు… పేరు తెచ్చు కోవాలనుకునే రచయితకు ఒక పథకం ఉంటుంది. తన మనసు చెప్పినట్లు రాసుకుంటూ పోయిన రామారావుకు అట్లాంటి పథకం ఏదీ లేదు. కనుక అన్ని ప్రక్రియలను, ఏ ప్రక్రియలోకి చేర్చాలో తెలియని పద్ధతి రచనలు కూడా రాసుకుంటూ పోయారు” అని ఆయన గ్రామచిత్రాలు (చుక్కలు, అక్షరదీప్తి, నాలో నేను కూడావ్యాసకర్త) రాయడానికి గల కారణాన్ని సరిగ్గా విశ్లేషించిండు. ‘కూరపాదులు’ లో మనం అజ్ఞానంతో కలుపు మొక్కలను పీకేయటం సరైందేనా అన్న ప్రశ్న వేస్తాడు. మనం పెంచే మొక్కలకు జీవించే స్వేచ్ఛ వున్నట్టే కలుపుమొక్కలకు కూడా ఉంటుందని రామారావు ప్రతిపాదిస్తున్నాడు” అని కలుపు మొక్కలపట్ల, స్వేచ్ఛపట్ల రామారావుకు గల విలక్షణభావాన్ని విశ్లేషించి చూపిండు.

బి.నరసింగరావుగారి గురించినేను రాసినప్పుడు భూస్వామ్య కుటుంబంలో పుట్టిన ఆయన సామ్యవాద భావాలవైపు ఎట్లా వచ్చిండన్నది అర్థం కాలేదు. దానికి కారణాలను సరిగ్గా చూపించిండు అమ్మంగి. పెంపుడు తండ్రిగారి ఆర్యసమాజ్ భావాల ప్రభావం తొలి బీజంగా చెప్పిండు. “స్కూల్ చదువు నచ్చలేదు. కారణం స్వేచ్ఛలేని వాతావరణం. నిన్న నేడుకు, నేడు రేపుకు ప్రతిధ్వనిగా సాగేయాంత్రికతలో సృజనాత్మకత చోటుండదు. సృజనాత్మకతలేని చోట ఇమడలేకపోవటం బాల్యంలోని కళాహృదయానికి సూచిక… ఆల్వాల్ వ్యవసాయ క్షేత్రాలతో అలరాలే పెద్దవూరయినా నరసింగరావులో ఏదో ఉక్కపోత, ఏదో ఇమడలేనితనం, ఏదో అశాంతి. ఇది తనలోని సృజనశక్తి బయటకు రావటానికి పడే ఆరాటం.. కళ అది ఏరూపంలో ఉన్నా ఒక సామ్యవాదాన్ని కల కంటుంది”. అతని కళామూలాన్ని తద్వారా సామ్యవాద భావాలవైపు సాగటానికి గల ఆంతరిక కారణాన్ని అమ్మంగి అద్భుతంగా పట్టుకున్నడు. “బోగిపండుగ నాటి కిరణం అప్పు చిన్నమ్మ నడుక్కున్న ఇరవై రూపాయలు
రామప్ప పెట్టిన మూడుశేర్ల బియ్యం / పెద్దపిల్ల నెత్తికి కొబ్బరినూనె బదుళ్ళు” ఇందులో కవిత్వాంశలేదు. కాని ఇది కవిత్వమే అని ఇలా విశ్లేషించిండు. “ఇట్లాంటి చిన్నచిన్న అంశాల వర్ణన పైకి పట్టిక అనిపించినా, అర్థవంతంగా వుంటే అది కవిత్వంలో భాగమవుతుంది. ఇట్లా విభిన్నకోణాలనుండి చూసినప్పుడు అమ్మంగికి ఉత్తమ విమర్శకుడికుండాల్సిన చాలా లక్షణాలు ఉన్నవని అర్థమవుతుంది.

Article about Ammangi Venugopal

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post ఆహ్లాదకర విమర్శకుడు అమ్మంగి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: