ఆడ శిశువుల భ్రూణ హత్యలు..

ఎగుడు దిగుడుల అసమ సమాజంలో ధనికులకు, పేదలకు మధ్య దూరం చాంతాడులా పెరిగిపోతున్న వర్తమానంలో సాధారణ కుటుంబాల్లో పుట్టడమే ముళ్ల కంప మీద అడుగు పెట్టడం వంటిదైతే, ఆడ శిశువు ఈ నేల మీద కాలు మోపడమనేది గర్భంలో పడినంత సులభం కాదు. పండంటి మగ బిడ్డని, రత్నం లాంటి కొడుకును కనండంటూ నవ దంపతులను ఆశీర్వదించే సమాజానికి ఆడ శిశువంటే ఎంత ఈసడింపో, మరెంత చిన్న చూపో వివరించి చెప్పనక్కర లేదు. ఈ విషయాన్ని ఐక్యరాజ్య […] The post ఆడ శిశువుల భ్రూణ హత్యలు.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఎగుడు దిగుడుల అసమ సమాజంలో ధనికులకు, పేదలకు మధ్య దూరం చాంతాడులా పెరిగిపోతున్న వర్తమానంలో సాధారణ కుటుంబాల్లో పుట్టడమే ముళ్ల కంప మీద అడుగు పెట్టడం వంటిదైతే, ఆడ శిశువు ఈ నేల మీద కాలు మోపడమనేది గర్భంలో పడినంత సులభం కాదు. పండంటి మగ బిడ్డని, రత్నం లాంటి కొడుకును కనండంటూ నవ దంపతులను ఆశీర్వదించే సమాజానికి ఆడ శిశువంటే ఎంత ఈసడింపో, మరెంత చిన్న చూపో వివరించి చెప్పనక్కర లేదు. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి జనాభా నిధి మంగళవారం నాడు విడుదల చేసిన ప్రపంచ జనాభా స్థితి గతుల నివేదిక నిగ్గు తేల్చింది. 2013 నుంచి 2017 వరకు ఇండియాలో ఏటా 4 లక్షల 60 వేల మంది స్త్రీశిశువులు పుట్టుకలోనే మాయమయ్యారని, గత 50 ఏళ్లలో 4 కోట్ల 60 లక్షల మంది భ్రూణ హత్య కావించబడ్డారని ఈ నివేదిక తెలియజేసింది. ఎక్కువ మంది తలిదండ్రులు మగ బిడ్డనే కోరుకోడం అందు కోసం మొక్కులు, ముడుపులు, నోములను ఆశ్రయించడం తెలిసిందే. ఎక్కడోగాని ఆడ బిడ్డ కావాలనుకునే వారు ఉండరు. పై పెచ్చు పుట్టబోయే అమ్మాయిని పురిట్లోనే చంపివేయడమో, పుట్టగానే ఏ చెత్త బుట్టకో అర్పించడమో చేస్తున్నారు. తల్లి గర్భంలో నుంచి ఒడిలో పడిన వెంటనే ధాన్యపు గింజలు గొంతులో వేసి ప్రాణం గిలగిలా కొట్టుకొని అంతమయ్యే స్థితిని కూడా కల్పిస్తున్నారు. ఇందుకు దారి తీస్తున్న కారణాల్లో ప్రధానమైనది వరకట్నం. ఇది తనను నిషేధించిన చట్టాన్ని తన ఇనుప కాళ్లతో తొక్కుకుంటూ ఇప్పటికీ వర్ధిల్లుతున్నది.

రాజకీయ పీఠాల్లోని, అధికార పదవుల్లోని వారు సైతం ఆకాశమంత పందిళ్లు వేసి అట్టహాసంగా పెళ్లిళ్లు చేసి, వరుడికి భారీగా కట్నం ముట్టజెప్పుకుంటున్నారు. కింది స్థాయి వారు కూడా దానిని ఒక హోదా చిహ్నంగా, గౌరవానికి గుర్తుగా భావించి ఎవరి స్తోమతను బట్టి వారు ఫంక్షన్ హాల్స్‌లో పెళ్లిళ్లు చేసి, లక్షల్లో కట్న కానుకలు చెల్లించి ఆడ పిల్లను వదిలించుకుంటున్నారు. వరుడి తరపు వారు కోరినంత కట్నం ఇచ్చుకునే శక్తిలేకపోయినా ఉన్నదీ లేనిదీ అమ్ముకొని, తాకట్టు పెట్టో, అప్పు చేసో అమ్మాయిని అత్తవారి చేతిలో పెడుతున్నారు. పెళ్లినాడు ఇస్తామని మాట ఇచ్చిన కట్నమేగాకుండా అదనంగా వస్తు, వాహనాలు తేలేదని కొత్త కోడల్ని నానా ఆరళ్లకు, అగచాట్లకు గురి చేసి హతమారుస్తున్నారు. ఆత్మహత్య చేసుకునే స్థితికి నెడుతున్నారు. బాల్యంలోనే ఆమె బరువు వదిలంచుకోడానికి చాలా మంది తలిదండ్రులు ప్రయత్నిస్తున్నారు. భారమని భావిస్తున్నవారు ఆడ శిశువును పుట్టగానే మట్టుపెడుతున్నారు. ఇందువల్ల భారత దేశంలో లింగ నిష్పత్తి బాగా పడిపోతున్నదని, పురుష జననాలతో పోలిస్తే ఆడ జన్మ అధ్వానంగా ఉందని ఐక్యరాజ్యసమితి నివేదిక స్పష్టం చేసింది. పెళ్లీడుకు వచ్చిన మగ పిల్లలకు చేసుకోడానికి ఆడ పిల్లలు దొరకని దుస్థితి ఇందువల్ల దాపురిస్తున్నదని నివేదిక అభిప్రాయపడింది. కేవలం కొడుకు కోసమే చాలా మంది దంపతులు కాన్పు మీద కాన్పుకు వెళ్లడం, ఆ క్రమంలో వరుసగా పుట్టుకొచ్చే ఆడ పిల్లలను అయిష్టంగా పెంచడం, చదువు సంధ్యలు చెప్పించకుండా దొరికిన పురుష పుంగవుడికి కట్నం ఇచ్చి పెళ్లి చేయడం చూస్తూనే ఉన్నాం.

2011లో సేకరించిన జనాభా లెక్కలను బట్టి దేశంలో సగటున ప్రతి 1000 పురుష జననాలకు 940 స్రీశిశు జననాలు రికార్డు కాగా, 20162018 మధ్య ఇది 899కి పడిపోయింది. హర్యానా, ఉత్తరాఖండ్, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, బీహార్‌లలో ఇదే పరిస్థితి. అక్కడ ప్రతి 1000 మంది మగ బిడ్డలకు ఆడ శిశువులు 900లోపే. ఆడ పిల్లలను మగ పిల్లలతో సమానంగా చదివించి ఉద్యోగంలో చేర్చినా కట్నం ఇచ్చుకోక తప్పకపోడంతో కొంత మంది తలిదండ్రులు వారి చదువును మధ్యలోనే తుంచివేసి వంటింటికి పరిమితం చేస్తున్నారు. దేశంలో ప్రతి నలుగురు ఆడ పిల్లల్లో ఒకరికి (26.8%) బాల్యంలోనే పెళ్లి చేస్తున్నట్టు ఐక్యరాజ్య సమితి నివేదిక తెలియజేసింది. బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రతి ఐదుగురిలో ఇద్దరికి జార్ఖండ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో ప్రతి ముగ్గురిలో ఒకరికి బాల్య వివాహాలు జరుగుతున్నాయని ఎండగట్టింది. ప్రపంచం మొత్తం మీద చూసినప్పుడు ప్రతి ఐదుగురు ఆడ పిల్లల్లో ఒకరికి పసి వయసు వివాహాలు జరుగుతున్నాయి. దారిద్య్రం, అభద్రత, మంచి చదువు అందుబాటులో లేకపోడం, ఉపాధి పనులు కరవు వంటి కారణాలే బాల్య వివాహాలకు దారి తీస్తున్నాయని స్పష్టం చేసింది. పసి వయసు పెళ్లిళ్లకు గురైన ఆడ పిల్లల్లో 32 శాతం మంది భర్తల చేతిలో భౌతిక దాడులకు గురవుతున్నారని, వయసు వచ్చిన తర్వాత పెళ్లిళ్లు జరిగిన వారిలో 17 శాతం మందే ఈ దుస్థితిని ఎదుర్కొంటున్నారని నివేదిక తెలిపింది. అందువల్ల ఇష్టమున్నా లేకపోయినా కడుపులో పడిన ఆడ పిల్లను పుట్టనిచ్చి అల్లారు ముద్దుగా పెంచి మంచి చదువు చెప్పించి వయసొచ్చిన తర్వాత పెళ్లి విషయంలో ఆమెకు స్వేచ్ఛను కల్పించినప్పుడు మహిళ బతుకు కొంతైనా మెరుగుపడుతుందని గ్రహించాలి. పురుషాధిపత్య సమాజం మూలంలోని మౌఢ్యాలను, దురహంకార భావజాలాన్ని వదులుకోవాలి.

Article about Female infant mortality in India

The post ఆడ శిశువుల భ్రూణ హత్యలు.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: