డబ్లూహెచ్‌ఓతో కటీఫ్!

  ప్రపంచ ఆరోగ్యసంస్థతో అమెరికా తెగతెంపులు వేరే సంస్థలకు నిధులు మళ్లిస్తాం చైనాపై నిబంధనలు మరింత కఠినం : ట్రంప్ వైట్‌హౌస్ మీడియా సమావేశంలో ట్రంప్ వెల్లడి వాషింగ్టన్ : చైనా నుంచి కరోనా ప్రబలినప్పుడు అరికట్టకుండా ప్రపంచ దేశాలను తప్పుదారి పట్టించినందుకు, అవసరమైన సంస్కరణలను చేపట్టడంలో విఫలమైనందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థతో అమెరికా తెగతెంపులు చేసుకుంటోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాను జవాబుదారీ చేయలేక […] The post డబ్లూహెచ్‌ఓతో కటీఫ్! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ప్రపంచ ఆరోగ్యసంస్థతో అమెరికా తెగతెంపులు
వేరే సంస్థలకు నిధులు మళ్లిస్తాం
చైనాపై నిబంధనలు మరింత కఠినం : ట్రంప్
వైట్‌హౌస్ మీడియా సమావేశంలో ట్రంప్ వెల్లడి

వాషింగ్టన్ : చైనా నుంచి కరోనా ప్రబలినప్పుడు అరికట్టకుండా ప్రపంచ దేశాలను తప్పుదారి పట్టించినందుకు, అవసరమైన సంస్కరణలను చేపట్టడంలో విఫలమైనందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థతో అమెరికా తెగతెంపులు చేసుకుంటోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు.

కరోనా మహమ్మారి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాను జవాబుదారీ చేయలేక పోయిందని చైనా పై ఆంక్షలు విధించే సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థపై పూర్తి నియంత్రణ చైనాకు ఉందని ట్రంప్ ఆరోపించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందించే నిధులను ఇతర ప్రపంచ స్థాయి అర్హమైన అత్యవసర ప్రజాఆరోగ్య అవసరాలకు మళ్లిస్తామని చెప్పారు. చైనా నిర్వాకం వల్ల కరోనా ప్రపంచ మంతటా వ్యాపించి అమెరికాలో లక్షమందిని బలిగొందని, ప్రపంచం మొత్తం మీద 3,60,000 మంది ప్రాణాలు కోల్పోయారని ట్రంప్ ఆరోపించారు. ప్రపంచ ఆరోగ్యసంస్థకు భారీగా నిధులు అందించే దేశం అమెరికాయేనని, ఏటా దాదాపు 450 మిలియన్ డాలర్లు అమెరికా నుంచి వివిధ రూపాల్లో అందుతున్నాయని చెప్పారు.

భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. చైనాకు వ్యతిరేకంగా అనేక నిర్ణయాలను ప్రకటించారు. అమెరికాలో చైనా పెట్టుబడులపై నిబంధనలను మరింత కఠినం చేస్తామని, దేశ భద్రతకు ముప్పు కలిగించే చైనా పౌరులను అమెరికాలో ప్రవేశించనీయమని చెప్పారు. హాంకాంగ్ ప్రజల స్వేచ్ఛను హరించేలా జాతీయభద్రతా బిల్లును చైనా పార్లమెంటు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఆమోదించడాన్ని నిరసిస్తూ హాంకాంగ్‌కు ఇచ్చిన ప్రత్యేక హాదాకు స్వస్తి పలకనున్నామని ట్రంప్ వెల్లడించారు. హాంకాంగ్‌లో నిఘా గురించి హెచ్చరించడానికి ప్రయాణాలకు సంబంధించిన సలహాలను సవరిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా వచ్చిన ప్రశ్నలు దేనినీ ఆయన పట్టించుకోలేదు. ఇదివరకు ఎవరూ చేయలేని విధంగా చైనా మమ్మల్ని విడదీసిందని వ్యాఖ్యానించారు.

అమెరికాలో చైనా విద్యార్థుల ప్రవేశంపై నిషేధం
అమెరికా నుంచి మేథో సంపత్తిని సాంకేతికతను పొందే చైనా విద్యార్థులు, పరిశోధకులను ఉపయోగించుకోడానికి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ప్రయత్నిస్తోందని, అందువల్ల ఆ ప్రయత్నాలను నిర్వీర్యం చేస్తామని, అందుకని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో సంబంధాలు కలిగిన విద్యార్థులను, పరిశోధకులను అమెరికాలో ప్రవేశించడాన్ని నిషేధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. అమెరికాలో చదువు కోడానికి, పరిశోధన సాగించడానికి అమెరికాలో ఎఫ్ లేదా జె వీసా కాంక్షించే చైనాలోని నిర్దిష్ట పౌరులను అనుమతించడం తన నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని అన్నారు.

ఈ విధంగా విద్యార్థుల విషయంలో ట్రంప్ బెదిరించడాన్ని చైనా తీవ్రంగా విమర్శించింది. ఇది రాజకీయ హింసని, ఎలాంటి సాక్షాధారాలు లేకుండా కేవలం ఆరోపిస్తూ విద్రోహం చేసే అమెరికాకు చెందిన ‘మెక్ కార్తీ ’యుగాన్ని గుర్తు చేస్తోందని చైనా వ్యాఖ్యానించింది. వాణిజ్యంపైనా, కరోనా పైన అమెరికా, చైనాల మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో పెరిగిన నేపథ్యంలో ట్రంప్ ఈ ప్రకటన చేశారు. హాంకాంగ్‌లో బీజింగ్ భద్రతా విఘాతం, దక్షిణ చైనా సముద్రంలో చైనా సైనిక దళాల దూకుడు కూడా విభేదాలు తీవ్రంగా పెరగడానికి కారణమైంది. చైనా చర్యలు అమెరికా దీర్ఘకాలిక ఆర్థిక శక్తికి, అమెరికా ప్రజల రక్షణకు, భద్రతకు ప్రమాదకరంగా తయారయ్యాయని ట్రంప్ హెచ్చరించారు.

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post డబ్లూహెచ్‌ఓతో కటీఫ్! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: