కోవిడ్‌ను ఓడిస్తున్నాం

  సుదీర్ఘపోరులో విజయం సాధిస్తాం ఆర్థిక ప్యాకేజీతో పలు వర్గాల సాధికారత భారత్‌ దక్షతపై ప్రపంచం అచ్చెరువు జనం ఓపిక అందరికీ ఆదర్శం ప్రజలకు ప్రధాని 2.1 బహిరంగ లేఖ న్యూఢిల్లీ : గడగడలాడించిన కోవిడ్ 19 వైరస్‌ను ఓడించే దిశలోభారతదేశం సాగుతోందని ప్రధాని మోడీ చెప్పారు. రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది అయిన సందర్భంగా (2.1) మోడీ దేశ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. జాతియావత్తూ కరోనాపై పోరులో ధృఢసంకల్పంతో సాగుతోందని, దీనిని వైరస్‌పై విజయపథంగా […] The post కోవిడ్‌ను ఓడిస్తున్నాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సుదీర్ఘపోరులో విజయం సాధిస్తాం
ఆర్థిక ప్యాకేజీతో పలు వర్గాల సాధికారత
భారత్‌ దక్షతపై ప్రపంచం అచ్చెరువు
జనం ఓపిక అందరికీ ఆదర్శం
ప్రజలకు ప్రధాని 2.1 బహిరంగ లేఖ

న్యూఢిల్లీ : గడగడలాడించిన కోవిడ్ 19 వైరస్‌ను ఓడించే దిశలోభారతదేశం సాగుతోందని ప్రధాని మోడీ చెప్పారు. రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది అయిన సందర్భంగా (2.1) మోడీ దేశ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.

జాతియావత్తూ కరోనాపై పోరులో ధృఢసంకల్పంతో సాగుతోందని, దీనిని వైరస్‌పై విజయపథంగా పేర్కొనవచ్చునని మోడీ తెలిపారు. ఇదో సుదీర్ఘ పోరాటం, ఇందులో ప్రతి ఒక్కరూ ఎన్నో కష్టాలు నష్టాలు అనుభవించారని చెప్పారు. ప్రత్యేకించి వలసకూలీలు కరకు బాధలను అనుభవించిన విషయాన్ని తానూ గుర్తించినట్లు వివరించారు. సాధారణ పరిస్థితులు ఉండి ఉంటే, ఈ దశలో తాము ప్రజల మధ్య ఉండాల్సిందని, రెండో దఫా అధికారపు తొలి వార్షికోత్సవాన్ని ప్రజలతో గడుపుకోవల్సి ఉందన్నారు. అయితే దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా ఇప్పుడు తాము ప్రజలకు బహిరంగ లేఖతో తన భావ వ్యక్తీకరణకు దిగుతున్నానని తెలిపారు. ఈ సందర్భంగానే ప్రధాని మోడీ తమ ట్విట్టర్‌లో సందేశ పాఠాన్ని ఆడియో రూపంలో పొందుపర్చారు. లాక్‌డౌన్‌తో ప్రత్యక్ష అనుసంధానం వీలు కాకపోవడంతో ఈ విధంగా పరోక్షంగా సందేశం వెలువరిస్తున్నట్లు తెలిపారు.

ఇదో కష్టకాలం
విరుచుకుపడ్డ వైరస్ సంక్షోభాన్ని సృష్టించిందని, ఇది కష్టకాలం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి దశలోనే భారతీయులు ధృఢ నిర్ణయంతో ముందుకు సాగాల్సి ఉంటుందన్నారు. ఎటువంటి ప్రతికూలతలకు మనం తలొగ్గరాదు. 130 కోట్ల మంది భారతీయులను అనుకోని అవాంతరాలు శాసించరాదని ప్రధాని స్పష్టం చేశారు. మన వర్తమానం, మన భవిష్యత్తులను మనమే ఖరారు చేసుకోవల్సి ఉంటుందని, లక్షసాధనలో ముందుకు సాగడం కర్తవ్యంగా భావిస్తే, విజయం మనదే అవుతుందని ప్రధాని పిలుపు నిచ్చారు.

చారిత్రక నిర్ణయాలతో పురోగతి
ఈ ఏడాది కాలంలో తమ ప్రభుత్వం అనేక చారిత్రక నిర్ణయాలు తీసుకుందని ప్రధాని తెలిపారు. తత్ఫలితంగా దేశం త్వరితగతిన పురోగతి చెందిందని ప్రధాని చెప్పారు. అయితే సాధించాల్సింది చాలా ఉందని, దీనిని తాము అంగీకరిస్తున్నామని చెప్పారు. పలు సమస్యలు సవాళ్లు ఎదుర్కొవల్సి వస్తోందన్నారు. తాను రాత్రింబవళ్లూ కష్టపడుతున్నానని, ఈ క్రమంలో తనలో లోపాలు ఉండవచ్చునని, అయితే ఈ దేశం గొప్పదని, ఎటువంటి లోపాలు లేనిదని తెలిపారు.

తాను ప్రజలను నమ్ముతానని, వారి బలాన్ని, సమర్థతను విశ్వసిస్తానని, దీనికి మించి తనకు తనపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. కరోనా వైరస్ ఓ సవాలు అయిందని, దీనిని ఎదుర్కొనే దిశలో భారతదేశం సాధించిన విజయంతో ప్రపంచం విస్తుపోయిందన్నారు. ఆర్థిక పునరుద్ధరణ దిశలో కూడా విజయం సాధించి, ఈ క్రమంలో అందరికీ భారతదేశం ఆదర్శంగా నిలిచితీరుతుందని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు.

కష్టాలు అనుభవించాల్సిన దుస్థితి
ప్రస్తుత కరోనా సంబంధిత లాక్‌డౌన్‌తో సంక్షోభం కోరలు సాచినట్లుగా మారిందని ప్రధాని తెలిపారు. ఈ దశలో ఎవరూ బాధపడలేదని, అసౌకర్యానికి గురి కాలేదని చెప్పే పరిస్థితి లేదన్నారు. మన కార్మికులు, వలసకూలీలు, వృత్తికళాకారులు, హాకర్లు ఈ విధంగా ఎందరో పడరాని బాధలు పడాల్సి వచ్చిందన్నారు. ప్రత్యేకించి వలసకూలీల కష్టాలు అన్నీ ఇన్నీ కావన్నారు. బాధిత ప్రజల సమస్యల పరిష్కారానికి తాము సంఘటితంగా, ధృఢంగా ముందుకు సాగుతున్నామన్నారు. ప్రతి పౌరుడు నిర్ధేశిత మార్గదర్శకాలను పాటించాల్సిన బాధ్యత ఉందని తెలిపారు.

ఈ క్రమంలో ప్రజలు ప్రదర్శించిన ఓపికను తాను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఇది ఇదే విధంగా కొనసాగాల్సి ఉందన్నారు. కోవిడ్ అనంతర ప్రపంచం ఏ విధంగా ఉంటుందనేది చర్చనీయాంశం అయిందని, ఆర్థికంగా వివిధ దేశాలు తిరిగి ఏ విధంగా కోలుకుంటాయనేది ప్రశ్నార్థకం అయిందన్నారు. ఓ వైపు కోవిడ్‌ను ఎదుర్కొంటూనే, ఆర్థిక ముప్పునుంచి బయటపడేందుకు మన దేశం సాగిస్తున్న పోరు ప్రపంచాన్ని ఆశ్చర్యపొయ్యేలా చేసిందన్నారు.

20 లక్షల కోట్ల ప్యాకేజీ ఓ మైలురాయి
భారతదేశ స్వావలంభన, స్వయంసమృద్ధికి తాము ప్రకటించిన రూ 20 లక్షల కోట్ల ప్యాకేజీ కీలక రీతిలో దోహదం చేస్తుందని ప్రధాని తెలిపారు. దేశాన్ని ఆత్మనిర్భర్ చేయడంలో ఈ ఆర్థిక ఉద్ధీపన చర్య ప్రధాన పాత్ర పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతి భారతీయుడికి సరైన అవకాశాల కల్పనకు ఈ సహాయ పథకం ఉపయోగపడుతుందన్నారు. రైతులు, కార్మికులు, చిన్న సూక్ష్మ మధ్యస్థాయి పరిశ్రమల వారికి, స్టార్టప్‌లతో ముడివడి ఉన్న యువజనులకు ఈ ప్యాకేజీతో మేలు జరుగుతుందని హామీ ఇచ్చారు. స్వయంసమృద్ధి తక్షణావసరం అని, దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ సాధించుకోవల్సి ఉంటుందని తెలిపారు. మన శక్తి సామర్థాల ప్రాతిపదికన మనం మరింతగా ముందుకు సాగాల్సి ఉందన్నారు. మనకే సొంతమైన మన మార్గంలో పురోగమించాలని, ఆత్మనిర్భర్ భారత్ లేదా స్వావలంభన భారత్ మనం ఎంచుకునే లక్షం కావాలని పిలుపు నిచ్చారు.

Modi writes open letter to country

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కోవిడ్‌ను ఓడిస్తున్నాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: