‘గుజరాత్ మోడల్’ పోరు!

  ‘మంచి’ కైనా, చెడుకైనా మోడల్ (నమూనా)గా ఉండడం ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రం గుజరాత్‌కే చెల్లింది. 2014 పార్లమెంట్ ఎన్నికలకు ముందు పెట్టుబడులను విశేషంగా ఆకర్షించడంలో, సత్వర ఆర్థికాభివృద్ధి సాధించడంలో దానికి మించిన రాష్ట్రం లేదంటూ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మోడీ పాలనను వేనోళ్ల కీర్తిస్తూ సాగిన ‘గుజరాత్ మోడల్’ ప్రచారం గురించి ప్రతేకించి చెప్పుకోనవసరం లేదు. కార్పొరేట్ పెట్టుబడులకు అవసరమైనంత భూమి ఇచ్చి రోడ్లు, విమానాశ్రయాలు, రైల్వే వంటి మౌలిక సౌకర్యాలను పూర్తి స్థాయిలో […] The post ‘గుజరాత్ మోడల్’ పోరు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

‘మంచి’ కైనా, చెడుకైనా మోడల్ (నమూనా)గా ఉండడం ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రం గుజరాత్‌కే చెల్లింది. 2014 పార్లమెంట్ ఎన్నికలకు ముందు పెట్టుబడులను విశేషంగా ఆకర్షించడంలో, సత్వర ఆర్థికాభివృద్ధి సాధించడంలో దానికి మించిన రాష్ట్రం లేదంటూ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మోడీ పాలనను వేనోళ్ల కీర్తిస్తూ సాగిన ‘గుజరాత్ మోడల్’ ప్రచారం గురించి ప్రతేకించి చెప్పుకోనవసరం లేదు. కార్పొరేట్ పెట్టుబడులకు అవసరమైనంత భూమి ఇచ్చి రోడ్లు, విమానాశ్రయాలు, రైల్వే వంటి మౌలిక సౌకర్యాలను పూర్తి స్థాయిలో కల్పించి, వారి పన్ను భారాన్ని తగ్గించి భారీగా సబ్సిడీలను ఇవ్వడం వంటి చర్యల ద్వారా ఎగుమతులను పెంచగలిగారన్న ఖ్యాతిని మోడీ ఖాతాలో వేశారు. అప్పట్లో వరుసగా తొమ్మిదేళ్లు వర్షాలు బాగా కురియడంతో 78 శాతం వద్ద నమోదయిన రాష్ట్ర వ్యవసాయాభివృద్ధి కూడా ఆ ప్రచారానికి బాగా గాలి ఊదింది. అయితే 2011-12 తర్వాత తీవ్ర వర్షాభావం సంభవించి వ్యవసాయాభివృద్ధి 3.7 శాతానికి పతనమై ఆ ప్రచారం గాలి తీసేసింది.

సమాజ ప్రగతికి, నిజమైన వృద్ధికి వెన్నెముక అయిన మానవాభివృద్ధిలో దేశంలోని రాష్ట్రాలలో 21వ స్థానం వద్ద కుంగి కునారిల్లడం గుజరాత్ బండారాన్ని వీధిన పడవేసింది. గుజరాత్ మోడల్ ప్రచారంతో దేశాధికారాన్ని కైవసం చేసుకోగలిగిన మోడీ ఆ తర్వాత అనేక అవివేక నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థ దారుణ పతనానికి ఎలా కారకులయ్యారన్నది కళ్ల ముందరి కఠోర సత్యమే. కరోనాతో సాగుతున్న పోరాటంలో గుజరాత్ పరాజయాల తాజా చరిత్ర మోడీ అమిత్ షా, వారి ప్రచార బాకాలు చాటింపు వేసిన గుజరాత్ మోడల్ నిజ స్వరూపాన్ని మరింత వికృతంగా బయట పెట్టాయి. ఏ దేశమైనా, రాష్ట్రమైనా సమగ్ర అభివృద్ధి సాధించడమంటే కేవలం కార్పొరేట్లను మేపి అంతర్జాతీయంగా డిమాండ్ బాగా ఉన్నప్పుడు కాకతాళీయంగా పెరిగిన ఎగుమతులను చూసి మురిసిపోడం వర్షాలు బాగా కురిసినప్పుడు పండిన పంటలను చూపించి చిందులేయడం కాదు. ప్రజల శ్రమకు తగిన ప్రతిఫలం అందేలా చూడడం, విద్య, వైద్య రంగాలను విశేషంగా మెరుగుపర్చి అది జన జీవన సౌభాగ్యంగా రూపాంతరం చెందేలా కృషి చేయడమే నిజమైన అభివృద్ధి సాధన అవుతుంది.

కరోనా సోకిన వారికి చికిత్స చేయడంలో అహ్మదాబాద్ ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి నిర్వాకాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు ఎండగట్టిన తీరును గమనిస్తే గుజరాత్ మోడల్ అసలు రహస్యం వెల్లడవుతుంది. అహ్మదాబాద్ పౌర ఆసుపత్రిలో పరిస్థితులు పరమ దయనీయంగా ఉన్నాయని గుజరాత్ హైకోర్టు చేసిన వ్యాఖ్యానంలోనే కరోనాపై అక్కడి ప్రభుత్వం ఎంతటి పుచ్చు అస్త్రాలు సంధిస్తున్నదో అవగతమవుతున్నది. ఇప్పటి వరకు గుజరాత్‌లో తేలిన 14 వేలకు పైచిలుకు కరోనా కేసుల్లో 10 వేలకు పైగా అహ్మదాబాద్‌లోనే నమోదయ్యాయి. 829 మరణాల్లో అత్యధికంగా అహ్మదాబాద్‌లోనే సంభవించాయి. దేశంలో అత్యధిక కేసులు, మరణాలు రికార్డయిన మహారాష్ట్ర తర్వాత రెండవ స్థానంలో గుజరాత్ ఉన్నది. అహ్మదాబాద్ మరణాల్లో ఎక్కువగా అక్కడి ప్రభుత్వాసుపత్రిలో సంభవిస్తున్నవే. అందుకే దానిని గుజరాత్ హైకోర్టు అతి నికృష్టమైన భూగర్భ ఖైదు కంటే హీనంగా ఉన్నదని అభిప్రాయపడింది.

ఈ నెల 20 వరకు రాష్ట్రం లో నమోదయిన 625 మరణాల్లో 570 అహ్మదాబాద్‌లోనే సంభవించగా, అందులో 351 దుర్ఘటనలు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలోనే దాపురించాయని హైకోర్టు వెల్లడించిన కఠోర వాస్తవం ఆ దవాఖానా ఎంతటి నరకప్రాయమో చాటుతున్నది. ఆసుపత్రిలో అత్యవసర చికిత్స సదుపాయాలు బొత్తిగా లేవని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా మందలించింది. అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ నడుపుతున్న సర్దార్ వల్లభబాయ్ పటేల్ ఆసుపత్రిలో 425 మంది వైద్యులుండగా, సివిల్ ఆసుపత్రిలో 1200 మంది ఉన్నారని అయినా అక్కడ అత్యవసర సేవలు అత్యంత దయనీయంగా అఘోరిస్తూ ఉండడం బాధాకరమని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది.

కరోనా గత డిసెంబర్‌లోనే చైనాలో బయటపడి నెమ్మది నెమ్మదిగా ప్రపంచంలోని ఇతర దేశాలకు దాపురించడం ప్రారంభించింది. ఆ దశలో తగు ముందు జాగ్రత్తలు తీసుకోడానికి బదులు ప్రధాని మోడీ ప్రభుత్వం అహ్మదాబాద్‌లో ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమాన్ని వేలాది మందితో ఘనంగా నిర్వహించడానికి, రాజ్యసభ ఎన్నికల్లో విశేష విజయాలు మూటగట్టుకోడానికి సంబంధించిన కృషిలో తలమునకలయింది. ఫిబ్రవరి నెలాఖరులో జరిగిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమానికి లక్ష మందికి పైగా హాజరయ్యేలా చూశారు. మార్చి 6 నుంచి 22 వరకు అహ్మదాబాద్ విమానాశ్రయానికి విదేశాల నుంచి 6 వేల మంది ప్రయాణికులు వచ్చారు. ఇలా చెప్పడానికి అలవికానంత ప్రమత్తతను చిత్తగించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుజరాత్‌లో ఇప్పుడు ఆగకుండా విజృంభిస్తున్న కరోనా అద్దంలో మోడీ మోడల్ అభివృద్ధిని చూసి విస్తుపోతాయో, విచారిస్తాయో మరి!

 

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ‘గుజరాత్ మోడల్’ పోరు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: