మారటోరియం మరో 3 నెలలు పొడిగింపు

  రెపో, రివర్స్ రెపో రేట్లు 40 బేసిస్ పాయింట్లు తగ్గింపు రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధానం సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలు 20 ఏళ్ల చరిత్రలో ఇంతగా తగ్గించడం ఇదే తొలిసారి ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం ఊహించిన దానికన్నా తీవ్రంగా ఉంది చాలా రంగాలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి ద్రవ్యోల్బణం అంచనా వేయడం కష్టంగా మారింది ఈ ఆర్థిక సంవత్సరం జిడిపి వృద్ధి నెగెటివ్‌లోనే ఉండే అవకాశం మీడియా సమావేశంలో ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత్ […] The post మారటోరియం మరో 3 నెలలు పొడిగింపు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రెపో, రివర్స్ రెపో రేట్లు 40 బేసిస్ పాయింట్లు తగ్గింపు
రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధానం సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలు
20 ఏళ్ల చరిత్రలో ఇంతగా తగ్గించడం ఇదే తొలిసారి
ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం ఊహించిన దానికన్నా తీవ్రంగా ఉంది
చాలా రంగాలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి
ద్రవ్యోల్బణం అంచనా వేయడం కష్టంగా మారింది
ఈ ఆర్థిక సంవత్సరం జిడిపి వృద్ధి నెగెటివ్‌లోనే ఉండే అవకాశం
మీడియా సమావేశంలో ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడి

ముంబయి: కోవిడ్19 కారణంగా కనీవినీ ఎరుగని రీతిలో సవాళ్లను ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థకు దన్నుగా భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) మరోమారు ముందుకు వచ్చింది.

ఊహించని రీతిలో తన బెంచ్‌మార్క్ వడ్డీ రేట్లను 20 ఏళ్ల కనిష్ట స్థాయికి తగ్గించింది. అంతేకాకుండా కరోనా మహమ్మారి , దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా పూర్తిగా కుదేలయిన దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమందించేందుకు రుణాల చెల్లింపుపై మారటోరియంను మరో మూడు నెలలు అంటే ఆగస్టు 31 వరకు పొడిగించింది. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో వరసగా రెండో సారి షెడ్యూల్‌కన్నా ముందుగాఆర్‌బిఐ ద్రవ్య పరపతి విధానం కమిటీ (ఎంపిసి) సమావేశం శుక్రవారం సమావేశమైంది. ఈ సమావేశంలో కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అనంతరం ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల ఆర్థిక ప్యాకేజిని ప్రకటించిన తర్వాత ఆర్‌బిఐ గవర్నర్ మీడియా ముందుకు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

రెపో రేటును 4.40 శాతంనుంచి 4 శాతానికి (40 బేసిస్ పాయింట్లు) తగ్గిస్తూ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నట్లు శక్తికాంత్ దాస్ తెలిపారు. రెపో రేటు తగ్గింపును 5 1 ఓట్లతో ఆరుగురు సభ్యుల కమిటీ ఆమోదం తెలిపినట్లు ఆయన చెప్పారు. ఈ నిర్ణయంతో తీవ్ర ఒత్తిడితో ఉన్న పారిశ్రామిక వర్గాలకు కాస్త ఊరట లభిస్తుంది. దీనికి అనుగుణంగా రివర్స్ రెపో రేటును కూడా 3.75 శాతంనుంచి 3.35 శాతానికి తగ్గించారు. 2000 లో రెపో రేటు ఉనికితోకి వచ్చిన తర్వాత రెపో రేటును ఈ స్థాయికి తగ్గించడం ఇదే మొదటి సారని శక్తికాంత్‌దాస్ చెప్పారు. రెపో రేటును తగ్గించడం వల్ల హోమ్, ఆటో తదితర రుణాల వడ్డీ రేట్లు తగ్గుతాయి. అదే సమయంలో సేవింగ్స్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేట్లు కూడా తగ్గుతాయి. తన సర్దుబాటు విధానాన్ని కొనసాగించడానికి అనుకూలంగా ఎంపిసి ఓటు వేసినట్లు శక్తికాంత్ దాస్ చెప్పడాన్ని బట్టి భవిష్యత్తులో అవసరమైతే వడ్డీరేట్లను మరింత తగ్గించే అవకాశం కనిపిస్తోంది.

జిడిపి వృద్ధి నెగెటివ్‌లోనే..
కాగా సుదీర్ఘ లాక్‌డౌన్‌తో మొదలైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు (జిడిపి)అంచనాపై ఆర్‌బిఐ గవర్నర్ తొలిసారి అధికారికంగా స్పందించారు. కరోనా మహమ్మారి విజృంభణ, ఫలితంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు భారీగా కుంటుపడినట్లు తెలిపారు. పలు రంగాల్లో ఉత్పాదకతతో పాటుగా పెట్టుబడులు నిలిచిపోయినట్లు చెప్పారు. దీంతో తాజా చర్యలు తీసుకొన్నట్లు తెలిపారు. 2021 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు భారీగా తగ్గే అవకాశముందని ఆయన చెప్పారు.

డిమాండ్ తగ్గిపోవడంతో పాటుగా సరఫరాలలో ఇబ్బందుల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో వృద్ధి రేటు తగ్గవచ్చని, అయితే రెండో అర్ధ సంవత్సరంలో కొంత మేరకు పుంజుకోవచ్చని శక్తికాంత్ దాస్ చెప్పారు. కరోనా విజృంభణకు ముందు కూడా జిడిపి వృద్ధి మందగమనంలోనే కొనసాగుతూ ఉన్న విషయం తెలిసిందే. 2019 20ఆర్థిక సంవత్సరంలో జిడిపి వృద్ధి రేటు ఆర్‌బిఐ అంచనా వేసిన 4.9 శాతంకన్నా తగ్గిన విషయం తెలిసిందే. దేశ స్థూల ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం ఊహించిన దానికన్నా ఎక్కువగా ఉందని, ఆర్థిక వ్యవస్థలోని అనేక రంగాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని ఆయన చెప్పారు.

కష్టంగా మారిన ద్రవ్యోల్బణం అచనా
ద్రవ్యోల్బణాన్ని అంచనా వేయడం కష్టంగా మారిందని, మున్ముందు ద్రవ్యోల్బణం లాక్‌డౌన్ నిబంధనల అమలుపై ఆధారపడి ఉండొచ్చని తెలిపారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో సిమెంట్, ఉక్కు పరిశ్రమలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందని, సిమెంట్ ఉత్పత్తిలో 25 శాతం తగ్గిందని శక్తికాంత్ దాస్ తెలిపారు. మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి 15 శాతం తగ్గిపోయిందని, ఏప్రిల్‌లో తయారీ రంగంలో ఎన్నడూ లేనంత క్షీణత కనిపించిందని ఆర్‌బిఐ గవర్నర్ అన్నారు. వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెరిగిందని ఫలితంగా ఆహార భద్రత సాధ్యమైందని ఆయన అంటూ వ్యవసాయ రంగానికి మరిన్ని ప్రోత్సాహకాలు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రపంచ వాణిజ్యం 13నుంచి 32 శాతం తగ్గిందని, నాలుగు కేటగిరీలుగా ఎగుమతులు, దిగుమతులను పెంచేందుకు చర్యలు తీసుకొంటున్నామన్నారు. వర్కింగ్ క్యాపిటల్ పెంచే విధంగా చర్యలు తీసుకొంటున్నామని, సిడ్బి రుణాలపై మారటోరియం మరో 90 రోజులు ఆగస్టు 31 వరకు కొనసాగుతుందని,టర్మ్ లోన్లకు వర్తించే విధంగా మారటోరియం ఉంటుందని ఆర్‌బిఐ గవర్నర్ తెలిపారు.

దేశవ్యాప్త లాక్‌డౌన్ విధింపు నేపథ్యంలో ఆర్‌బిఐ గవర్నర్‌కు ఇది మూడో పత్రికా సమావేశం. ఇప్పటికే మార్చి 27న మొదటిసారి, ఆ తర్వాత ఏప్రిల్ 17న రెండో సారి కోవిడ్19 సంబంధిత సమావేశాలు నిర్వహించారు. ఈ రెండు సమావేశాల్లోను బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ ఒత్తిడిని తగ్గించడానికి, కోవిడ్19 వైరస్ విజృంభణ కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి పలు చర్యలను ప్రకటించారు. అందులో భాగంగా మార్చిలో ఏకంగా 75 బేసిస్ పాయింట్లు వడ్డీరేట్ల తగ్గింపు, రూ.5 లక్షల కోట్ల విలువైన ద్రవ్య చర్యలు ఉన్నాయి. వీటితో పాటుగా మార్చి 1నుంచి మే 31వరకు అన్ని కాలవ్యవధి రుణాల చెల్లింపులపై మూడు నెలల పాటు తాత్కాలిక మారటోరియాన్ని ప్రకటించారు.

ఆర్‌బిఐ గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

* రెపో రేటు 40 బేసిస్ పాయింట్లు అంటే 4 శాతానికి తగ్గింపు
* రివర్స్ రెపో రేటు కూడా 3.35 శాతానికి తగ్గింపు
* రెండు నెలల వ్యవధిలో రెండో సారి భారీగా వడ్డీరేట్ల తగ్గింపు
* కీలక నిర్ణయాలు తీసుకోవడం కోసం ఎంపిసి సమావేశాన్ని ముందుగా నిర్వహించిన ఆర్‌బిఐ
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నెగెటివ్‌లోనే జిడిపి వృద్ధి రేటు. రెండో అర్ధ సంవత్సరంలో కాస్త పుంజుకునే అవకాశం
* పారిశ్రామిక ఉత్పత్తిలో 60 శాతం ఉండే ఆరు ప్రధాన పారిశ్రామిక రాష్ట్రాలు రెడ్/ ఆరెంజ్ జోన్లలోనే ఉన్నాయి.
* స్థూల ఆర్థిక వ్యవస్థపై కోవిడ్19 ప్రభావం ముందు అంచనా వేసినదానికన్నా తీవ్రంగా ఉంది.
* ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
* లాక్‌డౌన్ కారణంగా తొలి త్రైమాసికంలో వ్యవసాయ రంగం మినహా ఇతర రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలు ఒత్తిడిలోనే ఉండే అవకాశం.
* ద్రవ్యోల్బణం అంచనా వేయడం కష్టంగా మారింది.
* టర్మ్ రుణాలపై మారటోరియం మరో 90 రోజులు 2020 ఆగస్టు 31 వరకు పొడిగింపు.
* ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరగడంతో ఆహార భద్రతకు భరోసా ఏర్పడింది.
* ఎగ్జిమ్ బ్యాంక్‌కు ఆర్‌బిఐనుంచి రూ.15 వేల కోట్ల లైన్ ఆఫ్ క్రెడిట్ సదుపాయం.

RBI allows 3 month extension of loan EMI moratorium

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మారటోరియం మరో 3 నెలలు పొడిగింపు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: