సంక్షోభం మాటున సంస్కరణలు!

  ఇందిర, మోడీ -2   గతంలో మన పాలకులు చేపట్టిన సంస్కరణలన్నీ విదేశీ చెల్లింపుల అంశాలతో సహా వివిధ సంక్షోభాలతో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఒక ఏడాదికి అటూ ఇటూ సరిపడా నిల్వలున్నా దేశం ఆర్ధిక సంక్షోభంలోకి కూరుకుపోతోంది. కారణం ఆశించిన స్ధాయి లో ఎగుమతులు పెరగలేదు, దిగుమతులతో వాణిజ్య లోటు పెరుగుతోంది. దేశీయంగా మన జనాల వినిమయ ఖర్చు తగ్గుతోంది, అంటే వస్తు వినిమయం తగ్గుతోంది.ఫలితంగా పరిశ్రమలు పూర్తి సామర్ధ్యంతో పని […] The post సంక్షోభం మాటున సంస్కరణలు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఇందిర, మోడీ -2

 

గతంలో మన పాలకులు చేపట్టిన సంస్కరణలన్నీ విదేశీ చెల్లింపుల అంశాలతో సహా వివిధ సంక్షోభాలతో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఒక ఏడాదికి అటూ ఇటూ సరిపడా నిల్వలున్నా దేశం ఆర్ధిక సంక్షోభంలోకి కూరుకుపోతోంది. కారణం ఆశించిన స్ధాయి లో ఎగుమతులు పెరగలేదు, దిగుమతులతో వాణిజ్య లోటు పెరుగుతోంది. దేశీయంగా మన జనాల వినిమయ ఖర్చు తగ్గుతోంది, అంటే వస్తు వినిమయం తగ్గుతోంది.ఫలితంగా పరిశ్రమలు పూర్తి సామర్ధ్యంతో పని చేయటంలేదు, కార్మికులకు పనీ లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావటం లేదు. అభివృద్ధి రేటు పడిపోతోంది. వెరసి ఆర్ధిక సంక్షోభం ముసురుతోంది. ఈ ఆరేండ్ల కాలంలో చమురు దిగుమతి ఖర్చు గతంతో పోలిస్తే బాగా తగ్గింది. ఇదే సమయంలో పన్నుల వాత మోగిపోతోంది.ఆదా అయిన సొమ్ము ఏమౌతోందో, అదనంగా వసూలు చేస్తున్న డబ్బు ఏమౌతోందో తెలియదు. ఈ సంక్షోభం నుంచి ఎలా బయట పడాలా అని చూస్తున్న మోడీ సర్కార్‌కు కరోనా వైరస్ మంచి అవకాశం ఇచ్చిందనే చెప్పాలి.

గత ఆరు సంవత్సరాలుగా నరేంద్ర మోడీ సర్కార్ ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ లోటు బడ్జెట్ పెద్ద సమస్యగా ముందుకు వస్తోంది. అది జిడిపిలో 3.5 శాతానికి లోపుగానే ఉంచుతామని చెబుతున్నప్పటికీ సాధ్యం కావటం లేదు. 2021 మార్చి నాటికి 6.2 శాతానికి చేరవచ్చని కొందరి అంచనా, కరోనా కారణంగా ఇంకా పెరిగినా ఆశ్చర్యం లేదు. ఈ నేపధ్యంలో ప్రకటించిన సంస్కరణల పర్యవసానాల గురించి తరువాత చర్చించుదాం. మన దేశంలో సంస్కరణలకు ఆద్యురాలు ఇందిరా గాంధీ. అయితే ఆమె సంస్కరణలను బ్యాంకుల జాతీయకరణ, గరీబీ హఠావో వంటి నినాదాల రూపంలోకి మార్చి జనంలోకి వెళ్లారు. ప్రతి పాలకుడూ అదే చేసినా మీడియాలో ఇప్పటి మాదిరిగాక సంస్కరణల పేరుతో చర్చ తక్కువగా జరిగింది. మీడియా మొత్తం గా గతంలో చేపట్టిన వాటినీ, ఇప్పుడు మోడీ ప్రభుత్వ సంస్కరణలనూ సమర్ధిస్తోంది గనుక విమర్శనాత్మక వైఖరికి బదులు భ్రమలను మరింత పెంచే విధంగా వ్యవహరిస్తోంది.

మన సంస్కరణల భారతం గురించి క్లుప్తంగా చూద్దాం. రెండవ ప్రపంచ యుద్ధం ముగియటం, స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో తలెత్తిన అనిశ్చిత స్ధితిలో కొందరు స్వేచ్ఛా మార్కెట్ విధానాలను అనుసరించాలని ప్రతిపాదించగా మరికొందరు అంగీకరించలేదు. ప్రయివేటు రంగంలోని పరిశ్రమలను రక్షించుకోవాలంటే ప్రభుత్వరంగ పరిశ్రమల ఏర్పాటు అవసరమని బోంబే క్లబ్ పేరుతో జెఆర్‌డి టాటా, జిడి బిర్లాతో సహా ఎనిమిది ప్రముఖ పారిశ్రామికవేత్తలు చేసిన సూచనమేరకు పారిశ్రామిక విధానాన్ని రూపొందించారు. తరువాత ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశారు. తొలి ప్రణాళిక ఏడాది అమలు తరువాత విదేశీ చెల్లింపుల సమస్య తలెత్తింది. నాడు ఆర్ధిక సలహాదారుగా ఉన్న ప్రశాంత చంద్ర మహలనబిస్ స్వదేశీ లేదా స్వయం సమృద్ధి స్ఫూర్తిని ముందుకు తెచ్చారు. ఈ క్రమంలో పారిశ్రామికీకరణకు ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయటంతో దేశంలో ఆహారధాన్యాల కొరత ఏర్పడింది. వాటి దిగుమతికి విదేశీ మారక ద్రవ్యాన్ని వినియోగించాల్సివచ్చింది.దీనికి తోడు చైనాతో యుద్ధం మన సమస్యలను మరింత పెద్దవి చేసింది.

తరువాత లాల్‌బహదూర్ శాస్త్రి అధికారానికి వచ్చారు. పాకిస్ధాన్‌తో జరిగిన యుద్ధం లో విజయం పర్యవసానాల నేపధ్యంలో ఆర్ధిక సంస్కరణలకు తెరతీశారు. దానిలో భాగంగా కేంద్ర ప్రణాళికా విధానం నుంచి వైదొలగాలని ఆలోచన చేశారు. దాంతో ప్రణాళికా సంఘ అధికారాలను పరిమితం చేసి విదేశీ పెట్టుబడులు, ప్రయివేటు పెట్టుబడులకు ఆహ్వానం పలికారు. ఇదే సమయంలో ఆహార రంగంలో ఉత్పత్తి పెంపుదలకు జై జవాన్ జై కిసాన్ నినాదమిచ్చారు. ఇది హరిత విప్లవానికి నాంది పలికింది. ఆ ఉత్సాహంతో పాడి పరిశ్రమను ప్రోత్సహించి శ్వేత విప్లవానికి బాటలు వేశారు.

చైనాతో యుద్ధంలో ఓడినా, పాకిస్ధాన్‌తో గెలిచినా, పెట్టుబడులకు ఆహ్వానం పలికినా, నాడున్న అంతర్జాతీయ పరిస్ధితుల్లో అవి రాక మన ఆర్ధిక సమస్యలు తీవ్రమయ్యాయి. మన రాజకీయ, ఆర్ధిక వ్యవస్ధకు సవాళ్లు ఎదురు అయ్యాయి. లాల్ హదూర్ శాస్త్రి మరణం, ఇందిరా గాంధీ అధికారానికి వచ్చిన వెంటనే ఆమెకు అటు పార్టీలో ఇటు ఆర్ధిక రంగంలో ప్రతిఘటన ప్రారంభమైంది. జనంలో తీవ్ర అసంతృప్తి తలెత్తింది. చైనా తరువాత అతి పెద్దదైన మన మార్కెట్‌ను ఆక్రమించుకొనే అవకాశం దక్కలేదన్న అక్కసుతో ఉన్న ధనిక దేశాలు ప్రపంచ బ్యాంకు ద్వారా మన దేశంలో ప్రవేశించేందుకు అవకాశం కోసం కాచుకున్నాయి. కాంగ్రెస్ పాలకుల దివాలా కోరు విధానాలు అందుకు అవకాశం ఇచ్చాయి. 1964లో ప్రపంచ బ్యాంకు బృందం బెర్నార్డ్ బెల్ నాయకత్వంలో మన దేశంలో పర్యటించి మన రూపాయి విలువను తగ్గించాలని, విదేశీ వాణిజ్యంపై ఉన్న అనేక ఆంక్షలను ఎత్తివేయాలని ప్రతిపాదించింది.

వాటిని నాటి ఆర్ధిక మంత్రి టిటి కృష్ణమాచారి తిరస్కరించారు. పాకిస్ధాన్ మద్దతుదారుగా ఉన్న అమెరికా అంతకు ముందు మనకు ప్రకటించిన సాయాన్ని యుద్ధం కారణంగా ఆకస్మికంగా నిలిపివేసింది. 1965 లాల్ బహదూర్ శాస్త్రి మరణించటం, ఇందిరా గాంధీ ప్రధాని కావటం, ఆమె ప్రపంచ బ్యాంకు పట్ల సానుకూల వైఖరి ప్రదర్శించటం దానికి నిదర్శనంగా కృష్ణమాచారిని పదవి నుంచి తొలగించటం, భారత్ కు తిరిగి సాయం చేస్తామని అమెరికా ప్రకటించటం, ప్రపంచ బ్యాంకు విధానాలను అమలు జరుపుతామని ఇందిరా గాంధీ అంగీకరించటం వంటి పరిణామాలు వెంటవెంటనే జరిగాయి.

1965 జూన్ 6న ఇందిరా గాంధీ డాలరుతో మారకంలో మన రూపాయి విలువను 4.75 నుంచి 7.50కి తగ్గించారు. అనేక దిగుమతి ఆంక్షలను, ఎగుమతి సబ్సిడీలను తగ్గించారు. ఇవన్నీ షరతుల్లో భాగం. వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు. మన ఎగుమతులు పడిపోయాయి, దిగుమతులు పెరిగాయి. ప్రపంచ బ్యాంకు ఇస్తామని చెప్పిన మేరకు సాయం చేయలేదు. మరోవైపు ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో జనం దృష్టిలో కాంగ్రెస్ పలుచనైంది. ప్రతిపక్షాలు తీవ్రంగా ధ్వజమెత్తాయి. పర్యవసానం గా 1967 ఎన్నికల్లో కాంగ్రెస్ కేంద్రంలో గెలిచినా తొలిసారిగా ఏడు ఉత్తరాది రాష్ట్రాలలో అధికారాన్ని కోల్పోయింది. పశ్చిమ దేశాలు మనల్ని మరింతగా తమ పాదాల ముందు మోకరిల్లేట్లు చేసుకొనేందుకు పూనుకున్నాయన్నది తేలిపోయింది. ఆ సమయంలో అమెరికా సోవియట్ మధ్య తీవ్రవైరం ఉండటంతో ఇందిరా గాంధీ సోవియట్ యూనియన్‌తో రక్షణ ఒప్పందం చేసుకొని పశ్చిమ దేశాల మెడలు వంచి రెండు వైపుల నుంచి సాయం పొందాలని చూశారు. అధికారంలోకి రాగానే ఏ ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం చేసుకున్నారో, ఏ అమెరికాతో చేతులు కలపాలని చూశారో వాటి బ్లాక్‌మెయిల్ కారణంగా వ్యతిరేకంగా ఇందిరా గాంధీ రాజకీయంగా వ్యవహరించాల్సి వచ్చింది.

పంచ వర్ష ప్రణాళికలను అమలు జరపలేని స్ధితి, దాంతో 1966 నుంచి మూడు సంవత్సరాల పాటు వార్షిక ప్రణాళికలను రూపొందించాల్సి వచ్చింది. పాలక పార్టీలో ముఠాపోరు ఒకవైపు, ఆర్ధికంగా అనిశ్చితి మరోవైపు, ఈ బలహీనతను ఆధారం చేసుకొని ప్రయివేటు బ్యాంకులు, ప్రయివేటు బీమా సంస్ధలు ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా వ్యవహరించటంగాక తమ ఇష్టానుసారంగా వ్యవహరించటం, అక్రమాలకు పాల్పడటం వంటి పరిణామాల నేపధ్యంలో రాజభరణాల రద్దు, బ్యాంకులు, బీమా కంపెనీల జాతీయం వంటి చర్యలతో ఇందిరా గాంధీ తిరిగి ప్రజల మన్ననలను పొందేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ పార్టీలో కూడా పట్టు సాధించారు. చివరకు కాంగ్రెస్ రెండు ముక్కలుగా చీలిపోవటానికి పరిణామాలు దారి తీశాయి. స్వయం సమృద్ధి నినాదం మరోసారి ముందుకు వచ్చింది.

ముందే చెప్పుకున్నట్లు ప్రపంచ బ్యాంకు చెప్పినట్లు చేసినా ఫలితం లేకపోవటమే కాదు, 1966లో విదేశీ చెల్లింపుల సమస్య మరోసారి ముందుకు వచ్చింది. దీన్ని అవకాశంగా తీసుకొని ఉపయోగించుకొనేందుకు దెబ్బతిన్న సంబంధాలను మరింతగా దిగజారకుండా చూసుకొనేందుకు, అర్ధిక దిగజారుడును ఆసరా చేసుకొని 1967లో మరోసారి ప్రపంచ బ్యాంకు రంగంలోకి దిగింది. అప్పటికే హరిత విప్లవం ప్రారంభమైంది. దాన్ని ఆసరా చేసుకొని పెట్టుబడిదారీ తరహా వ్యవసాయాన్ని ప్రోత్సహించటం ఒకటైతే దానికి అవసరమైన ఎరువుల రంగంలో విదేశీపెట్టుబడులకు అనుమతి సాధించే ప్రతిపాదనలతో ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చింది. ఒక వైపు ప్రపంచ బ్యాంకు వత్తిడికి లొంగి కొన్ని సంస్కరణలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ మరోవైపు దాని విధానాలకు వ్యతిరేకంగా స్ధానిక అంశాల కారణంగా 1969లో బ్యాంకుల జాతీయకరణ, 1972లో బీమా కంపెనీలు, 1973లో బొగ్గు, చమురు కంపెనీల జాతీయకరణ వంటి చర్యలను తీసుకుంది.

ప్రయివేటు రంగం వైఫల్యం, అవినీతి అక్రమాలు, అవసరాలకు అనుగుణంగా పురోగతి లేకపోవటం వంటి వివిధ కారణాలు ఇందుకు పురికొల్పాయి. ఈ చర్యలతో ఈ రంగాలలో విదేశీ పెట్టుబడులకు దారులు మూసుకుపోయాయి. అయితే ఇదే సమయంలో ఇతర రంగాలలో విదేశీ పెట్టుబడులను ఎలాంటి నియంత్రణ లేకుండా కొనసాగించటం కూడా చూడవచ్చు. ఒక వైపు ఈ చర్యలను జనమంతా హర్షించి కాంగ్రెస్, ఇందిరా గాంధీకి జనం బ్రహ్మరథం పట్టినట్లు ఎన్నికల ఫలితాలు వెల్లడించాయి. ఎన్నికలలో అక్రమాలకు పాల్పడిన ఇందిరా గాంధీపై కేసులు, కోర్టు తీర్పు ప్రతికూలంగా రావటం వంటి పరిణామాలతో సానుకూల సంస్కరణ వాతావరణం ఉన్నప్పటికీ ఇందిరా గాంధీ తన పదవికోసం 1975లో అత్యవసర పరిస్ధితిని ప్రకటించి సరికొత్త రాజకీయ సంక్షోభానికి కారకురాలయ్యారు. ఇందిరా గాంధీనరేంద్రమోడీని పోల్చటం కాదు, పరిస్దితులు అప్పుడూ ఇప్పుడూ ఒకే విధంగా లేవు గానీ ఒక రాజకీయవేత్త పలుకుబడికిఆర్ధిక సంక్షోభాలకు సంబంధం ఉండదు. వారు అనుసరించే ఎత్తుగడలు పలుకుబడిని తెచ్చిపెడితే అనుసరించే విధానాలు సంక్షోభాలకు కారణం అవుతాయి. ఇప్పుడు మన దేశంలో అదే పునరావృతం కానుందా ? ఈ దిశగా ఆలోచించాల్సిన అవసరం నరేంద్రమోడీ వ్యతిరేకులకే కాదు, ఆయన్ను పదికాలాల పాటు కాపాడుకోవాలనే అనుకూలురకు కూడా ఉంటుంది కదా !

 

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సంక్షోభం మాటున సంస్కరణలు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: