ప్రజాస్వామ్యమా, రాచరికమా?

  కప్పం కట్టి కాలు మొక్కే సామంత రాజ్యాలకు, ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాలకు తేడా తెలియని ఫ్యూడల్ దురహంకార ప్రదర్శనలో ప్రధాని మోడీ ప్రభుత్వం అలనాటి నిరంకుశ చక్రవర్తులకంటే మూడాకులు ఎక్కువే చదువుకున్నది. ప్రజల ఓటుతో పొందిన అధికారాన్ని ప్రజాస్వామ్య సూత్రాలను, నియమాలను, రాజ్యాంగాన్ని, ఇతర సకల జనహిత వ్యవస్థలను నాశనం చేయడానికి కేంద్రం దుర్వినియోగం చేయడం ఇప్పుడు జరుగుతున్నంత హేయంగా ఎమర్జెన్సీ కాలంలోనూ లేదనిపిస్తే ఆక్షేపించనక్కరలేదు. జాతీయ స్థాయిలో పాలనాధికార చక్రాన్ని దొరకబుచ్చుకున్న కేంద్ర […] The post ప్రజాస్వామ్యమా, రాచరికమా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కప్పం కట్టి కాలు మొక్కే సామంత రాజ్యాలకు, ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాలకు తేడా తెలియని ఫ్యూడల్ దురహంకార ప్రదర్శనలో ప్రధాని మోడీ ప్రభుత్వం అలనాటి నిరంకుశ చక్రవర్తులకంటే మూడాకులు ఎక్కువే చదువుకున్నది. ప్రజల ఓటుతో పొందిన అధికారాన్ని ప్రజాస్వామ్య సూత్రాలను, నియమాలను, రాజ్యాంగాన్ని, ఇతర సకల జనహిత వ్యవస్థలను నాశనం చేయడానికి కేంద్రం దుర్వినియోగం చేయడం ఇప్పుడు జరుగుతున్నంత హేయంగా ఎమర్జెన్సీ కాలంలోనూ లేదనిపిస్తే ఆక్షేపించనక్కరలేదు. జాతీయ స్థాయిలో పాలనాధికార చక్రాన్ని దొరకబుచ్చుకున్న కేంద్ర పాలకులకు ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు అరుదుగా కాని ఉండవు. జనానికి అతి చేరువుగా ఉండి వారి కన్నీట పన్నీట, కష్టసుఖాల్లో పాలు పంచుకునేవి రాష్ట్రాలే. అందుకే పార్లమెంటుతోపాటు శాసన సభలకూ ఎన్నికలు నిర్వహించి రాష్ట్రాలకు ప్రజాప్రాతినిధ్య పాలనను రాజ్యాంగ కర్తలు సువ్యవస్థీకరించారు.

ఈ సూకా్ష్మన్ని గ్రహించేవారెవరైనా కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య ఉన్నది సమాఖ్య బంధమే కాని ‘కేంద్రీకృతం’ కాదని అంగీకరిస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మాత్రం అటువంటి స్పృహ బొత్తిగా లేదని పదేపదే రుజువవుతున్నది. వస్తు, సేవల (జిఎస్‌టి) పన్నును అమల్లోకి తెచ్చిన కీలక సంస్కరణ విషయంలో తనకు సంపూర్ణ సహకారాన్నిచ్చిన రాష్ట్రాలను పూర్తిగా నిర్లక్షం చేస్తూ కేంద్రం ఇప్పుడు తేదలిచిన సంస్కరణలు దాని ఏకపక్ష, నియంతృత్వ వైఖరినే చాటుతున్నాయి. భారత దేశం ఏరికోరి ఎంచుకున్న సహకార ఫెడరల్ పాలన విధాన పరిమళాన్ని పూర్తిగా తుడిచిపెట్టదలచాయి. ముఖ్యంగా ఉమ్మడి జాబితాలోని విద్యుత్తు రంగాన్ని పాదాక్రాంతం చేసుకోడానికి, అందుకు అనుగుణంగా రాష్ట్రాల మెడలు వంచడానికి ద్రవ్య బాధ్యత, బడ్జెట్ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బిఎం) చట్టం పరిమితి పెంపును వాడుకోదలచడంలో కేంద్ర పాలకుల అప్రజాస్వామికత స్పష్టపడుతున్నది.

ఎఫ్‌ఆర్‌బిఎం ఉద్దేశం భారత దేశ ద్రవ్య నిర్వహణలో పారదర్శకతను నెలకొల్పడం, దీర్ఘకాలంలో ఆర్థిక సుస్థిరత్వాన్ని సాధించడం, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచే విషయంలో రిజర్వు బ్యాంకుకు తగినంత వీలు, వాలు కల్పించడం, అందుకు ప్రభుత్వాలు చేసే అప్పులను స్థూల దేశీయోత్పత్తిలో కొంత శాతానికి పరిమితం చేయడం. ప్రస్తుత కరోనా కఠోర కల్లోలంలో సుదీర్ఘమైన మూసివేత (లాక్‌డౌన్) మూలంగా చెప్పనలవికాని ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న రాష్ట్రాలు ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం కింద రుణ పరిమితిని జిఎస్‌డిపిలో ప్రస్తుతమున్న 3 శాతం నుంచి 5 శాతానికి పెంచాలని కోరుతున్నాయి. దీనిని సాకుగా తీసుకొని మోకాలికి బోడిగుండుకి ముడిపెట్టినట్టు విద్యుత్తు రంగంలో తాను తీసుకురాదలచిన నిరంకుశ సంస్కరణలకు సహకరించే రాష్ట్రాలకే ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితి పెంపును వర్తింపచేస్తామని కేంద్రం షరతు విధించింది.

విద్యుత్తు పంపిణీని ప్రైవేటుపరం చేసి, రైతులకు, పేదలకు ఉచితంగానూ భారీ రాయితీలపైనా కరెంటును సరఫరా చేయడంలో అవి అనుభవిస్తున్న ప్రస్తుత సౌలభ్యాన్ని హరించి వేయడానికి, టారిఫ్ నిర్ణయంపై, రెగ్యులేటరీ కమిషన్‌లకు కీలక నియామకాలపై వాటికి గల స్వేచ్ఛను కబళించడానికి ఉద్దేశించిన సంస్కరణలకు తలవొగ్గడమంటే రాష్ట్రాలు తమ తలకాయలను నరికి కేంద్రం చేతుల్లో ఉంచడం వంటిదే. అప్పు పెంపు ఆశ చూపి ఇటువంటి దుశ్చర్యకు తలపడడం ఎంతటి దుర్మార్గమో చెప్పనక్కరలేదు.

ఈ ప్రతిపాదనను రాష్ట్రాలకు పంపించినప్పుడు ముందుగా గళమెత్తి గట్టిగా నిరసన తెలిపిన ఖ్యాతి తెలంగాణకే దక్కింది. సోమవారం నాటి మీడియా గోష్ఠిలో కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ నీళ్లు నమలకుండా ఈ కుట్రను వ్యతిరేకించారు. ఆ విధంగా రాష్ట్రాల స్వేచ్ఛను కాపాడే పోరాటంలో తెలంగాణ సాటిలేని పాత్రను నిర్వహిస్తున్నది. కరోనా సృష్టించిన ఆర్థిక సంక్షోభం మాటున కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను మరింతగా తన అదుపాజ్ఞల్లోకి తెచ్చుకోడానికి ప్రయత్నించడం దురదృష్టకరమని, కేంద్రం రాష్ట్రాలను భిక్షగాళ్లుగా చూస్తున్నదని ముఖ్యమంత్రి వెలిబుచ్చిన అభిప్రాయం ఆయనలోని ప్రజాహిత ధర్మాగ్రహాన్ని చాటుతున్నది.

ఇటువంటి నిరంకుశ షరతులకు లొంగి అదనపు అప్పు సౌకర్యాన్ని ఉపయోగించుకోబోమని విద్యుత్తు సంస్కరణలకు తలవొగ్గే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చేసిన స్పష్టీకరణ ఇతర రాష్ట్రాలకు కూడా మార్గదర్శకం కావలసి ఉన్నది. దేశంలో ఉన్నది కేంద్రం రాష్ట్రాల మధ్య సమాఖ్య సంబంధాలతో కూడిన ప్రజాస్వామ్యమేనని దేశాధ్యక్షుడు రాజుగా వ్యవహరించడానికి ఎంతమాత్రం వీలులేదని అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్‌కు న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో ఇటీవల చేసిన హెచ్చరిక ఇక్కడ గుర్తుకు తెచ్చుకోడం సమంజసం. ప్రధాని మోడీ ప్రభుత్వం తన సంస్కరణల నిరంకుశ దూకుడుకి ఇకనైనా స్వస్తి చెప్పవలసి ఉంది.

 

 

The post ప్రజాస్వామ్యమా, రాచరికమా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: