కొనసాగుతున్న ప్రపంచ సభల స్ఫూర్తి

  దాదాపు దశాబ్దాల పాటు మూతపడ్డ సాహిత్య అకాడమీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం పునర్వస్థీకరించింది. తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యకలాపాలు ప్రారంభించి ఈ నెల 10వ తేదీన మూడేళ్లు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డితో ‘మన తెలంగాణ’ దినపత్రిక ‘కలం’పేజీ పాఠకుల కోసం చేసిన సంభాషణ. సాహిత్య అకాడమీ కార్యకలాపాలను ప్రారంభించి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మీకు అభినందనలు […] The post కొనసాగుతున్న ప్రపంచ సభల స్ఫూర్తి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

దాదాపు దశాబ్దాల పాటు మూతపడ్డ సాహిత్య అకాడమీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం పునర్వస్థీకరించింది. తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యకలాపాలు ప్రారంభించి ఈ నెల 10వ తేదీన మూడేళ్లు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డితో ‘మన తెలంగాణ’ దినపత్రిక ‘కలం’పేజీ పాఠకుల కోసం చేసిన సంభాషణ.

సాహిత్య అకాడమీ కార్యకలాపాలను ప్రారంభించి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మీకు అభినందనలు సార్. సాహిత్య అకాడమీ కార్యకలాపాలకు ప్రణాళిక ఏవిధంగా రూపొందించారో వివరిస్తారా?  ధన్యవాదాలు. పూర్వం పనిచేసిన ఉమ్మడి ఆంధప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ తెలుగు విశ్వవిద్యాలయంలో విలీనమైంది. అప్పటి అకాడమీ రూపొందించిన ప్రణాళికలను పరిశీలించాలని ప్రయత్నించాం. అయితే రాష్ట్ర పునర్వస్తీకరణ చట్టం2014 ప్రకారం ఆ అంశం తొమ్మిదో షెడ్యూల్ కింద రెండు రాష్ట్రాల ఉమ్మడి అంశంగా ఉన్నందువల్ల అది సాధ్యపడలేదు.

దాంతో సాహిత్య అకాడమీ చేయవలసిన పనులేమున్నాయని మేం సరికొత్తగానే ఆలోచించాల్సి వచ్చింది. అప్పటికి, ఇప్పటికి వారధి నిర్మించడానికి ఉమ్మడి జాబితా పరిమితుల దృష్టా వీల్లేకుండా పోయింది. అందువల్ల సాహిత్య అకాడమీ ప్రణాళికను సరికొత్తగా నిర్వహించుకోవాల్సి వచ్చింది. సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు డాక్టర్ నందిని సిధారెడ్డి గారికి ఉన్న అపారమైన అనుభవం, సాహిత్య పరిజ్ఞానం వల్ల కొత్త సాహిత్య అకాడమీ ఏయే పనులు చేయాలనే దిశలోనే ఆలోచించాం.

తెలంగాణలో సాహిత్య వాతావరణాన్ని పెంపొందించేందుకు తెలుగు మహాసభలు ఏవిధంగా దోహదపడ్డాయి సార్?  ప్రపంచ తెలుగు మహాసభలనే సాహిత్య అకాడమీ తొలి కార్యక్రమంగా తీసుకున్నాం. నేను 2017 నవంబర్ 3వ తేదీన అకాడమీ కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నాను. ఒక ఆశ్చర్యం, ఒక ఆనందం ఏమిటంటే సాహిత్య వాతావరణాన్ని ప్రోది చేసేందుకు ప్రపంచ తెలుగు మహాసభలు అంత గొప్పగా ఉపయోగపడతాయని చాలా మంది అనుకోలేదు. అంత పెద్ద స్థాయిలో మహాసభలు విజయవంతమై, ఆ తర్వాత కూడా సాహిత్య వాతావరణం వెల్లివిరుస్తుందని మేం కూడా అనుకోలేదు. మేం అనుకున్న దానికంటే సాహిత్య వాతావరణం ఏర్పడి కొనసాగింది.

ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహాక సమావేశాలు ప్రతి జిల్లా కేంద్రంలో జరిగాయి. చిన్న జిల్లాల్లో జిల్లాస్థాయి కార్యక్రమాల నిర్వహణ బాగా కలిసొచ్చింది. ప్రతి జిల్లాలోనూ ఉన్న కవులు జిల్లా కేంద్రానికి వచ్చి తమ సాహిత్య అభినివేశాన్ని ప్రదర్శించేందుకు అవకాశం ఏర్పదింది. ఉదాహరణకు గద్వాల జిల్లానే తీసుకుంటే జిల్లాలోని 12 మండలాల్లో ఉన్న కవులు, రచయితలు జిల్లాస్థాయి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి కవి పోటీల నిర్వహణలో బాధ్యులుగా వ్యవహరించండం కానీ పోటీల్లో పాల్గొనడం కానీ లేదా కనీసం ప్రేక్షకులుగా పాల్గొనడం గానీ జరిగింది.

ఇతర జిల్లాల్లో కూడా ఇలాగే కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాలకు వచ్చిన స్పందన వల్ల జిల్లా కేంద్రంలోనే కాకుండా మండల కేంద్రాల్లో కూడా సన్నాహాక సమావేశాలు జరపాలని వివిధ జిల్లాల కలెక్టర్లకు ఆదేశించారు. ఆవిధంగా మండల స్థాయిలో కూడా కవులు రీ ఆర్గనైజ్ అయ్యారు. ఏ ఒక్క సాహిత్యకారుడు, రచయిత, కవి ప్రపంచ తెలుగు మహాసభలకు లింక్ కాకుండా ఉండే అవకాశం లేకుండా పోయింది. అలా ప్రతి జిల్లాల్లో కనీసం వందమంది కవుల జాబితా తయారైంది. ఆ విధంగా సాహిత్యం తాము పట్టించుకోవాల్సిన అంశమని అటు పరిపాలన యంత్రాంగం, ఇటు సాహిత్యకారులతో పాటు రాజకీయ నాయకులు కూడా భావించడం వల్ల పూర్తిస్థాయి సాహిత్య వాతావరణం ఏర్పడింది.

అదే వాతావరణం ప్రపంచ తెలుగు మహాసభల్లో రిఫ్లెక్ట్ అయ్యింది. నిర్మల్, బోధన్, కొత్తగూడెం, వనపర్తి, వికారాబాద్‌తో సహా రాష్ట్రంలోని ప్రతి మూలలోనూ ప్రపంచ తెలుగు మహాసభల స్ఫూర్తి అనంతరం కాలంలోనూ కొనసాగింది. ఇప్పటికే అదే స్ఫూర్తి కొనసాగుతూ వస్తోంది.స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌గా రెవిన్యూ శాఖలో మంచి పోస్టింగ్ పొందే అవకాశాలు ఉన్నా మీరు సాహిత్య అకాడమీకి కార్యదర్శిగా రావడానికి వెనుక కారణాలు, ప్రేరణ ఏమిటి సార్?

రెవెన్యూ శాఖలో చేరకముందే నేను కవిని. అప్పటికీ నేను ‘సమాంతర స్వప్నం’ అనే కవితా సంకలనాన్ని ప్రచురించాను. రెవిన్యూ శాఖలో ఉద్యోగినైనప్పటికీ సాహిత్య కృషి కొనసాగుతూ వచ్చింది. నా రెండవ సంకలనం జిన్నారంలో పనిచేసేటప్పుడు ‘మట్టిపాట’ అనే పేరుతో దేశపతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో క్యాసెట్ విడుదల చేశారు. దాన్నే జూలూరి గౌరీశంకర్ నేను ములుగులో పనిచేసేటప్పుడు సంకలనంగా ప్రచురించారు. ఆ తర్వాత ‘కొత్త పలక’ అనే సంకలనాన్ని ‘హైదరాబాద్ విషాదం’ అనే అనువాద గ్రంథాన్ని వేశాను. ఈ విధంగా కవిగా అందరికీ తెలిసినవాడినయ్యాను.

ప్రపంచ తెలుగు మహాసభలకు కార్యదర్శి అవసరంపై చర్చ వచ్చినప్పుడు సాహిత్యం తెలిసినవాడైతే బాగుంటుందన్న ఆలోచన ప్రభుత్వానికి వచ్చింది. సాహిత్యకారుడైన గ్రూప్ 1 అధికారి కావాలన్నా చర్చ వచ్చినప్పుడు నా పేరు తట్టి, నన్ను అడిగారు. నేను సంతోషంగా అంగీకరించాను. ఎందుకంటే నేను కూడా ఇలాంటి సర్వీస్ చేయాలన్నా ఆలోచనతోనే ఉన్నాం. పైగా సిధారెడ్డి గారు నేను విద్యార్థిగా ఉన్న కాలం నుండే వ్యక్తిగతంగా పరిచయం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక మాట అడగగానే సంతోషంగా వస్తానని చెప్పాను. సాహిత్య అకాడమిలో పనిచేయడం నాకు చాలా ఆనందదాకయమైన విషయం. నా కెరీర్‌లో ఇది ఒక గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోతుంది.

మీరు అకాడమీ బాధ్యతలు తీసుకున్న నెలరోజులకే ప్రపంచ తెలుగు మహాసభలొచ్చాయి. అంత స్వల్ప కాలంలో మహాసభలను విజయవంతం చేసేందుకు శ్రమించడం టెన్షన్ అనిపించలేదా సార్. నిజమే. అది ఒప్పుకోక తప్పదు. అయితే ‘నువ్వంత ఒత్తిడికి గురికాకబ్బా. నడిచేవి నడుస్తూనే ఉంటాయి’ అని సిధారెడ్డి గారు టెన్షన్ తగ్గేలా చేసేవారు. చాలా ధైర్యం చెప్పేవారు. అయితే నేరుగా ముఖ్యమంత్రి గారు ఇన్వాల్స్ కావడం వల్ల అంత పెద్ద పని కూడా మాకు సింప్లిఫై అయింది. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రోత్సాహం, ప్రణాళిక గొప్పది. వాటివల్ల మాపని చాలా సులువైంది. వివిధ శాఖలకు ఆ సందర్భంగా ఇచ్చిన పనిని ఆయనే స్వయంగా డిక్టేట్ చేయడం విశేషం.

మిగిలిన కొన్ని పనులకు మేము ఆర్డర్స్ వేసి డిగ్రీ కాలేజి లెక్చరర్లు, జూనియర్ కాలేజీ లెక్చరర్లు, ఉపాధాయులను విధి నిర్వహణకోసం తీసుకున్నాం. వాళ్లంతా పనిని విభజించుకొని ఇష్టపడిచేశారు. ‘ప్రపంచ తెలుగు మహాసభలు పూర్తయ్యేలోపల నీ ఆరోగ్యానికి ఏం కాకుండా చూసుకో అని నాకు సలహాలిచ్చినవారు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి గారి పోత్సాహం, అధికారుల అంకితభావం, విధినిర్వహణకోసం తీసుకున్నవారు ఇష్టంగా పనిచేయడం వల్ల తెలుగు మహాసభలను విజయవంతంగా పూర్తిచేయగలిగాం. ‘క్లేశహిఫలే నహి ఉనర్నవతం విధత్తే’ అని కాళిదాసు కుమారసంభవంలో అంటారు. ‘చాలా కష్టపడి , ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తే ఆ కష్టం గుర్తుండదు’ అని అప్పుడు అనిపించింది.

సాహిత్య అకాడమీ కార్యదర్శిగా పనిచేయడం మీ వ్యక్తిగత సృజనకు ఆటంకం ఏర్పరిచిందా సార్? లేదు లేదు. నాకు ఒకరకంగా ప్రోత్సాహాం కూడా దొరికింది. సృజనాత్మక రచయితలు చాలామంది నన్ను వారి సభలకు, సమావేశాలకు ఆహ్వానించారు. ముందుమాటలు రాయించారు. సదస్సులో, కార్యక్రమాల్లో మాట్లాడాల్సిరావడం వలన అద్యయనం పెరిగింది. రెవెన్యూశాఖలో ఉన్నప్పటికంటే ఎక్కువ సమయం అకాడమీకి కేటాయించినప్పటికీ ఇదంతా నా వ్యక్తిగత సాహిత్యసృజనకు ఉపయోగపడేదిగానే ఉంది. ఆ విధంగా సృజనను పెంచుకోగలిగాను. ఇక్కడికి వచ్చాక ఆరేడు గ్రంథాలను ప్రచురించాను. అవి అంతకుముందు రాసినవైనా ఇక్కడికొచ్చాకే ప్రచురించగలిగాను.

ఈ మూడేళ్లకాలంలో మీకు ఎదురైన సంఘటనల్లో బాగా గుర్తుండేవి చెప్పండి సార్.

ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ ఎప్పటికీ గుర్తుంటుంది. నిజామాబాద్‌లో ఏ ప్రోగ్రాంకు వెళ్లినా చక్కటి అనుభూతి మిగులుతుంది. అక్కడ జరిగే సమావేశాల్లో జూనియర్స్ మాత్రమే కాకుండా కందాళై రాఘవాచార్య, వి.పి. చందణ్‌రావు లాంటి సీనియర్ కవులు కూడా మేం మాట్లాడే అంశాలను శ్రద్ధగా వింటుంటారు. ఘనపురం దేవేందర్, ప్రొద్దుటూరి మాధవీలత ఈ ఇద్దరూ నిజామాబాద్‌లో వివిధ కార్యక్రమాలకు ఆహ్వానించారు. అక్కడ చాలా గొప్ప అనుభూతికి లోనవుతుండేవాళ్లం. కొఱవి గోపరాజుపై నిజామాబాద్‌లో ఒక సదస్సు పెట్టి నన్ను అతిథిగా పిలిచారు. నేను ప్రతి సభకూ చదువుకొని మాట్లాడ్డానికి వెళ్తాను. అయితే ఆ సదస్సులో ప్రసంగించేందుకు సిద్ధమయే టైం లేదు. అక్కడికి బయలుదేరాక కారులో మాత్రమే టైం దొరిగింది. ‘సింహసన ద్వాత్రింశిక’ అనే కొఱవి గోపరాజు కావ్యంపై శ్రీరంగాచార్యతో అకాడమీ ప్రసంగ పారం ఇప్పించింది. ఆ ప్రసంగాన్ని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాం. కార్లో యూట్యూబ్ ఓపెన్ చేసి ఆ ప్రపంగాన్ని విన్నా. కొన్ని పాయింట్లు నోట్ చేసుకొని, అంతకుముందే ఉన్న పూర్వజ్ఞానాన్ని జోడించి మాట్లాడాను. దానిని మంచి స్పందన లభించింది. సాహిత్య అకాడమీ చేసిన పనులు ఈ విధంగా ఉపయోగపడతాయని చెప్పడానికి ఇదోక ఉదాహరణ. చికాగోలోనో, మారిషస్‌లోనో, వైజాగ్‌లోనో, తిరుపతిలోనో కొఱవి గోపరాజుపైననో, పోతనపైననో మాట్లాడాలంటే యూట్యూబ్‌లో కావ్యపరిమళం వింటేచాలు. మనం కూడా 45 నిమిశాలు మాట్లాడ్డానికి పనికొస్తుంది.

ఈ మూడేళ్లకాలంలో చేయాలనుకొని చేయలేని పనులేమైనా ఉన్నాయా ?

అసంపూర్తిగా కొన్ని ఉన్నాయి. సమగ్ర తెలంగాణ సాహిత్య చరిత్ర ఎడిటింగ్ దశలో ఉంది. జిల్లాల సాహిత్య చరిత్రలు ఇంకా కొన్ని ప్రచురించాల్సి ఉంది. ‘నవలాస్రవంతి’ని కూడా పుస్తకరూపంలోకి తేవాల్సి ఉంది. ‘పరంపర’ అనే పేరుతో తెలంగాణ ప్రాతినిధ్య కవిత్వాన్ని హిందీ, ఇంగ్లీష్‌లోకి తేవాల్సి ఉంది.

అకాడమీ భవిష్యత్తు కార్యక్రమాలు చెప్పండి

ప్రతి జిల్లా కేంద్రంలో రెగ్యులర్‌గా శిక్షణా శిబిరాలు, సదస్సులు నిర్వహిస్తాం. కథపై, నవలపై అన్నిచోట్లా శిక్షణా శిబిరాలు పెట్టాలనే ఆలోచన ఉంది. మరో వంద పుస్తకాలు ప్రచురించే ప్రణాళిక ఉంది. రిసెర్చింగ్ ఓరియెంటెండ్ ప్రాజెక్టులు కూడా చేయించాలని ఉంది. ప్రస్తుతం త్రైమాసికంగా ఉన్న ‘పుగస’ను ద్వైమాసికంగా చేసి బయటకూడా అమ్మకానికి పెట్టాలనుకుంటున్నాం.

కొత్తగా సాహిత్యరంగంలోకి వచ్చేవారికి మీరిచ్చే సందేశం ఏంటి సార్!

సాహిత్య అకాడమీ కార్యదర్శిగా కంటే కవిగా, రచయితగా నేనిచ్చే సలహా ఏంటంటే పుంఖానుపుంఖాలుగా రాయడం కాకుండా పుంఖాను పుంఖాలుగా చదవాలి. కరోనా కాలంలో ప్రతి రచయిత కవి రాసిందంతా ప్రచురిస్తున్నారు. అలా కాకుండా ఎడిట్ చేసి ప్రచురించాలి. బాగా అధ్యయనం చేయాలి. తెలంగాణలో చాలా మంది కవులను కోట్ చేయలేకపోతున్నాం. ఏదైనా వేదికపై మాట్లాడితే కరుణశ్రీ, జాషువా, విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ, ఆరుధ్రవీళ్ళవే కోట్ చేస్తున్నాం. సామల సదాశివ, కపిలవాయి లింగమూర్తి, గంగుల శాయిరెడ్డి మొదటగా తెలుగులో చాలా మంది రచయితలు, కవులు ఉన్నారు. వారిని కూడా కోట్ చేయాలి. సామల సదాశివ లాంటివారి కావ్యాలు చాలా లోతుగా ఉన్నాయి. తెలంగాణ కవుల గురించి ఎక్కువగా చదివి, వారి గురించి ఎక్కువగా మాట్లాడాలి. అవసరమైన సందర్భాల్లో తెలంగాణలోని ప్రసిద్ధ కవుల రచనలను కోట్ చేయాలి.

 

ఇంటర్వూ

డాక్టర్ రాయరావు సూర్యప్రకాశ్‌రావు
9441046839

The post కొనసాగుతున్న ప్రపంచ సభల స్ఫూర్తి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: