ఆత్మగౌరవ పాఠశాల టిఆర్‌ఎస్

  “తెలంగాణ రాష్ట్రసాధనలో ప్రతిఒక్కరి పాత్ర ఉంది. 14 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రసాధన అంశంలో నేను సృష్టికర్తను. నా కంటే ముందు కొంతవరకు ప్రయత్నం జరిగిన మాటవాస్తవమే. అందరూ ఏకీభవించాల్సిందే. కానీ, ఒక బలమైన, వ్యూహాత్మకమైన, రాజకీయ నేపథ్యం, ఉద్యమ పంథాతో కూడుకున్న రాజకీయపార్టీని నేను స్థాపించి ఆ పార్టీకి నేను నేతృత్వం వహించిన ఆ ఉద్యమంలో అందరూ పాల్గొన్నారు. ఆ ఉద్యమ ఫలితమే రాష్ట్రసాధన, తెలంగాణ ప్రజల కలలు సాకారమైనాయి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న […] The post ఆత్మగౌరవ పాఠశాల టిఆర్‌ఎస్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

“తెలంగాణ రాష్ట్రసాధనలో ప్రతిఒక్కరి పాత్ర ఉంది. 14 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రసాధన అంశంలో నేను సృష్టికర్తను. నా కంటే ముందు కొంతవరకు ప్రయత్నం జరిగిన మాటవాస్తవమే. అందరూ ఏకీభవించాల్సిందే. కానీ, ఒక బలమైన, వ్యూహాత్మకమైన, రాజకీయ నేపథ్యం, ఉద్యమ పంథాతో కూడుకున్న రాజకీయపార్టీని నేను స్థాపించి ఆ పార్టీకి నేను నేతృత్వం వహించిన ఆ ఉద్యమంలో అందరూ పాల్గొన్నారు. ఆ ఉద్యమ ఫలితమే రాష్ట్రసాధన, తెలంగాణ ప్రజల కలలు సాకారమైనాయి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అన్నిరాజకీయ పార్టీలకు, అందుకు దోహదపడిన ప్రతిశక్తికి, ప్రతి తల్లికి, ప్రతి చెల్లికి, ప్రతి వ్యక్తికి, ప్రతి అన్న, తమ్మునికి తెలంగాణరాష్ట్ర శాసనసభ తొలి సమావేశంలో తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రిగా రెండుచేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విజయం ఏ ఒక్కరిది కాదు, ఈ విజయం తెలంగాణ ప్రజలది. నాతోపాటు ఉద్యమంలో పనిచేసిన ప్రతి ఒక్కరిది. ఎప్పటికప్పుడు ఉద్యమంలో మమ్ముల్ని అగ్రభాగాన నిల్పినటువంటి, దోహదపడినటువంటి, ప్రేరణ కల్గించినటువంటి యావన్మంది తెలంగాణ సమాజానికి తెలంగాణరాష్ట్ర తొలిశాసనసభ నిండుసభలో రెండు చేతులు జోడించి, శిరస్సువంచి కృతజ్ఞతలు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.”

కేసీఆర్ (13.06.2014న శాసనసభలో )

ఈ చరిత్ర పుస్తకాలల్లో లేదు. ఇంకా గ్రంథస్థం చేయబడలేదు. దీని చరిత్ర ఎన్ని పేజీలో? ఎన్ని సంపుటాలో చెప్పలేం? ఎన్నెన్ని సందర్భాలను ఎంతెంత గ్రంథస్తం చేయాలో చరిత్రకారులు అంతా ఒక దగ్గర కూర్చొని చేయాలి. తెలంగాణ చరిత్ర దక్కన్ పీఠభూమిమీద విశిష్ట చరిత్ర. అందర్నీ ఆదరించిన చరిత్ర. అన్నీభావాలు విలసిల్లినచరిత్ర. నవనాగరికతలకు పుట్టినిల్లు ఈ నేల. ఇపుడు ఒక్క మాటలో ఈ చరిత్ర ఎక్కడుందంటే 4 కోట్లమంది జనుల 8 కోట్ల కనుగుడ్లల్లో నిక్షిప్తంగా ఉంది. ఈ నేల ఒక్కొక్క త్యాగాల పొరల్లో నిక్షిప్తమై ఉంది. మహోజ్జ్వల చరిత్ర. నా తెలంగాణ త్యాగాల చరిత్ర. నా తెలంగాణది మానవీయ చరిత్ర. నా తెలంగాణది ఎదుటివాళ్లను ప్రేమించేచరిత్ర. నా చరిత్ర అన్యాయాలను ఒప్పుకోని చరిత్ర. నా తెలంగాణ చరిత్ర తిరుగబడ్డ తెలంగాణ చరిత్ర. నా చరిత్ర ఎదుటివాళ్లు అడిగితే కడుపుల ముద్దను తీసి ఇచ్చిన చరిత్ర. నా తెలంగాణది బక్కపేగుల చరిత్ర. నా తెలంగాణది యుద్దతంత్రాలు తెలిసిన చరిత్ర. నా తెలంగాణది చీమలదండులా కదిలి అన్యాయాలను ధిక్కరించిన చరిత్ర. నా తెలంగాణది మొఖంమీదనే ఉన్నది ఉన్నట్లు మాట్లాడేచరిత్ర.

నాది ఎనకొకటి ముందొకటి మాట్లాడే చరిత్రకాదు. నా తెలంగాణ చల్లటి వెన్నెలలాంటి చందమామ లాంటిది. ఆగ్రహిస్తే భగభగమడే సూర్యకిరణం లాంటిది. నా తెలంగాణ చరిత్ర శ్రీరామనవమినాటి పానకం, రంజాన్ సేమియాలు, క్రిస్‌మస్ నాటి తియ్యటి కబురులాంటిది. తెలంగాణ తల్లిచేతిలోని జొన్నకంకి నా చరిత్ర. లేతమక్కలరుచి తెలంగాణ. భూమికి పసిడి రంగుగా విరగపండిన వరికంకుల బంగారు తెలంగాణ. నా తెలంగాణది తాటిపండ్లు, ఈతచెట్ల చరిత్ర. నా తెలంగాణది గంగాజమున తెహజీద్‌చరిత్ర. మానవ సంబంధాల గూడు నా తెలంగాణ. మానవీయ స్పర్శ నా తెలంగాణ. ఆధిపత్యాన్ని అడ్డంగా నరికేసిన నా తెలంగాణ. నా తెలంగాణ నీళ్లకోసం నిధులకోసం కొలువుల కోసం తండ్లాడిన నేల. నా తెలంగాణ సబ్బండ వర్ణాల, సబ్బండ వర్గాల మహాకలయిక. నా తెలంగాణ ఆత్మగౌరవపాఠశాల. నా తెలంగాణ అనిర్వచనీయమైనది. ఈ నేలమీద ప్రతిగోసిగుడ్డ అవ్వ అయ్య చెప్పే జీవిత కథలన్నీ మహాచరిత్ర పాఠాలే. తెలంగాణ పేరు చెబితే చరిత్ర ఒక్కసారి విరబూసి నూరుపుష్పాలుగా వికసిస్తది. వేయి ఆలోచనలుగా సంఘర్షిస్తది. నా తెలంగాణది మనుషులందర్నీ కలిపిన మనిషిమతం. ఎన్నెన్నో దారుల్లో చీలికపేలికలైన తెలంగాణ ఒక్కటిగావటానికి పడ్డ తంటాలు అంతా ఇంతాకాదు.

ఇది కథకాదు అసలు చరిత్ర. ఇది ఎప్పటి ముచ్చటో కాదు. ఇది ఎన్నడో మనం చూడనిది కాదు. ఇందులో మనందరం కలిసి పాల్గొన్నాం. ఉద్యమ అడుగులు వేసుకుంటూ ధూవ్‌ుధావ్‌ు పాటలు పాడుకుంటూ అడుగులు వేసినం. తెలంగాణ స్వాతంత్య్రం కోసం, ఆర్థిక, రాజకీయ, సామాజిక స్వావలంభన కోసం చీమలదండులా కదిలి కరుడుగట్టిన ఆధిపత్యంపై యుద్ధంచేసిన ఆధునిక అస్తిత్వ మహాయుద్ధం తెలంగాణ. ఈ ఉద్యమదారులు ఎన్నెన్నో. అవన్నీ స్వయం ప్రకాశాలే. దేశానికి స్వాతంత్య్రం కోసం ఎగిసిన చైతన్యాల్లాగే తెలంగాణ కూడా. ప్రజలందర్నీ ఒక్కటి చేసిన రాజకీయ ప్రక్రియ. “తెలంగాణ రాష్ట్ర సాధనే” నా ఏకైక లక్ష్యమన్న మహోజ్జ్వల సంకల్పంతో పిడికెడు మందిని పట్టుకుని పిడికిలి బిగించిన ఒకే ఒక్కడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొనసాగించిన మహోద్యమం. ఆధిపత్య శక్తులు మెడలు వంచే విధంగా ప్రజా ఉద్యమాన్ని మలిచిన మహానాయకుడాయన. అతడు పట్టిన పట్టు విడువని వాడు. ప్రజలందరిలో ఒక దశాబ్ధమున్నర కాలంలో తెలంగాణ చైతన్యం ఆరిపోకుండా తనను తాను నూనెను చేసుకొని వొత్తిని చేసుకొని తెలంగాణ అఖండ జ్యోతి ఆరకుండా వెలిగించి కరిగిపోయిన వ్యక్తి కేసీఆర్.

ఆమరణ నిరాహారదీక్ష చేపట్టి మృత్యువుముఖద్వారం దాకా వెళ్లివచ్చారు. ఆయన చేపట్టిన రాజకీయ ప్రక్రియ ఉద్యమ రూపం టీఆర్‌ఎస్. అదే తెలంగాణ రాష్ట్రసమితి. దాని పుట్టుకకు కారకుడు కేసీఆర్. ఉద్యమ జెండా రూపకర్త కేసీఆర్. ఉద్యమ వ్యూహం, ఎత్తుగడ కేసీఆర్. తలవంచని ధీరత్వానికి నిదర్శనం కేసీఆర్. పద్నాలుగేళ్ల ప్రజాస్వామ్య ఉద్యమ ప్రస్థానంలో తానెంతగా నలిగినా ప్రజలందర్నీ వదలకుండ నిలిచినోడు. దేశానికి గాంధీ లెక్క తెలంగాణ గాంధీ కేసీఆర్. దేశానికి స్వేచ్ఛాపోరు చిహ్నం మహాత్ముడు. తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమ మహావిశ్వరూపం కేసీఆర్. వీళ్లిద్దరిదీ అహింసామార్గం. విజయం సాధించేదాకా వెనుదిరిగి చూడని అనిర్వచనీయమైన మహాసంకల్ప సాధకులు. టీఆర్‌ఎస్ చరిత్ర అంటే అది తెలంగాణ జాతిజనుల చరిత్రగా మార్చి ఉద్యమాన్ని ఉరవళ్లు పరవళ్లు తొక్కించారు. జలసౌదసాక్షిగా 2001 ఏప్రిల్ 27న తనకుతాను ప్రతినబూని తెలంగాణ రాష్ట్రసాధనే ఏకైక లక్ష్యమని ప్రతినబూని ఎగరేసిన జెండానే టీఆర్‌ఎస్. 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్రం సాకారం అని ప్రకటించేదాకా ఎత్తిన జెండా దించని టీఆర్‌ఎస్ మహోగ్రరూపం కేసీఆర్. టీఆర్‌ఎస్ చరిత్ర అంటే ఒకపార్టీ చరిత్ర కాదు. మొత్తం తెలంగాణ జాతిజనుల గుండె దండోరాగా మార్చిన మహా రాజనీతిజ్ఞుడు కేసీఆర్.

ఓడిఓడి వచ్చిన తెలంగాణ ఒక్కసారిగా గెలిపించిన ఘనత టీఆర్‌ఎస్‌ది. రాజకీయప్రక్రియద్వారానే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ హక్కుద్వారా తెలంగాణ హక్కులను సాధించిన కేసీఆర్. ఆ బక్కమనిషి బలం తెలంగాణ బలం. ఆ ఒంటివూపిరే ఆధునిక తెలంగాణ పునర్నిర్మాణ వూపిరి. టీఆర్‌ఎస్‌ను రాజకీయ పార్టీగానే కాకుండా ప్రజలందరి ఇంటిగడపల ముందు కావలి మనిషిగా మార్చిన ఘనత కేసీఆర్‌ది. 60లక్షల మంది సభ్యత్వమున్న టీఆర్‌ఎస్ అంటే తెలంగాణను అనునిత్యం కంటికి పాపల్లా చూసుకునే శక్తులు. ఒక కార్యకర్త తెలంగాణ జనాభాను లెక్కించుకుని తానెంత మందికి కాపలాదారో గుర్తెరిగి పనిచేసే శక్తిని అందిస్తున్న దార్శనికుడు కేసీఆర్. అదే టీఆర్‌ఎస్ బలం, బలగం. అదే టీఆర్‌ఎస్‌కు ప్రజలరక్ష. పక్కవారిని పట్టించుకునే స్థితిని స్పర్శను కోల్పోతున్న ఈ ప్రపంచీకరణ దశలో టీఆర్‌ఎస్ ఒక మనిషి స్పర్శ. రాజకీయ పార్టీలు రాజకీయ నాయకుల నిర్వచనాలను తిరగరాసిన కొత్తచరిత్ర తెలంగాణది. దాశరథి కోటి రతనాల వీణ తీగలను ఆధిపత్యశక్తులు తెంచివేస్తే ఆగ్రహించిన తెలంగాణను కోటికత్తులవానగా, గుండెమండిన ప్రాణంగా, కత్తికి పదునెక్కించే సానగా, ఉద్విగ్న గీతాల నీటివీణగా, జలవిద్యుత్ కణంగా మారింది.

తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమాన్ని గాయాలకు బెదరని కృపాణంగా, గుప్పెడు మట్టికి గుండెనిచ్చిన రణంగా టీఆర్‌ఎస్‌ను కేసీఆర్ తీర్చిదిద్దారు. కోటిరతనాలు గుంజుకోబడ్డ దగాబడ్డ తెలంగాణనాది అన్న ప్రతితెలంగాణీయుడి గుండెఘోషగా ప్రజాఉద్యమాన్ని తీర్చిదిద్ది తెలంగాణ అస్తిత్వ ఉద్యమ జెండాను దేశవీధుల్లో ఎగరేసిన రూపకర్త, రూపశిల్పి కేసీఆర్. అది టీఆర్‌ఎస్ వారసత్వం. ఇప్పటికీ ఆ చైతన్యాన్ని కార్యకర్తల పనివిధాన ప్రసరణలకు అందిస్తున్న శక్తి టీఆర్‌ఎస్‌ది. టీఆర్‌ఎస్‌కు ఉగ్గుపాలు తాగించి ఉద్యమ బాలుణ్ణిచేసి అన్నిరకాల ఉద్యమ నైపుణ్యాలను నేర్పి సభ్యత్వంలేని కోట్లమంది ఉద్యమ ప్రేమికుల్ని తయారుచేసిన రాష్ట్రసాధన ఉద్యమ తండ్రి కేసీఆర్. ఇప్పుడు ఉద్యమ సంబంధంలేని వాళ్లు కొందరు తెలియకుండా ఏది బడితే అది మాట్లాడుతుంటే తెలంగాణ నవ్వుకుంటది. తెలంగాణ సమాజం నొచ్చుకుంటది. తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఇంటిని కదిలించి కలుపుకుంటూ పోయి వంటావార్పుగా మారినట్లే, రాష్ట్ర అవతరణ తర్వాత కూడా ప్రతిఇళ్లు, ప్రతి గడప కళకళలాడేందుకు కృషిచేసే పనిని కూడా టీఆర్‌ఎస్ తన భుజస్కందాలపై వేసుకుంది.

మిలియన్‌మార్చ్‌లు, సకలజనుల సమ్మెలు, సాగరహారాలు, తెలంగాణబంద్‌లు, రాస్తారోకోలు, దిగ్భందాలు, పాదయాత్రలు అన్నింటిలోనూ టీఆర్‌ఎస్ ముందుండి పెద్దన్న పాత్ర పోషించింది. సకలజనులను గుండెలకు హత్తుకుని జనాన్ని కదిలించింది టీఆర్‌ఎస్. దేశచరిత్రలోనే తిరుగులేని లక్షలాది మహాజన సభలను, సింహాగర్జన సభలను జరిపింది టీఆర్‌ఎస్‌నే. మళ్లీ అట్లాంటి సభలను మన జీవితకాలంలో చూడగలమా అన్న ఒక మహాప్రశ్నను కూడా టీఆర్‌ఎస్ ప్రపంచం ముందు పెట్టింది. తెలంగాణరాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నామన్న సంతృప్తిని పొందే ప్రతి తెలంగాణీయుడి గుండెల్లో ఉండే విజయదరహాసం వెనుక టీఆర్‌ఎస్ ఉంటుంది. ఇంతకంటే ఒక పార్టీకి ఏంకావాలి? టీఆర్‌ఎస్ ఒక విజయదుంధుభి, తెలంగాణకు విజయోస్తు టీఆర్‌ఎస్.
తెలంగాణ రాష్ట్ర అనంతరం ఈ ఆరేళ్లకాలంలో తిరిగి తెలంగాణ అభివృద్ధిచిత్రపటం రూపకల్పన కూడా టీఆర్‌ఎస్‌నే చేయటం మరో అద్భుత ఆవిష్కరణ. ఉద్యమకారుడే పాలకుడైనవేళ కేసీఆర్ పునర్నిర్మాణ సూత్రదారిగా పాత్రదారిగా ముందుకుసాగుతున్నారు.

ఇపుడు తెలంగాణ దేశానికే మార్గదర్శిగా నిలిచింది. అన్నిరంగాల్లో ముందుకు దూసుకపోతే తనను తాను పునర్నిర్మించుకుంటున్న చారిత్రక ఆవిష్కరణలో టీఆర్‌ఎస్ కీలకపాత్ర పోషిస్తుంది. తెలంగాణ దేశానికి ధాన్యాగారమైంది. ఐటిరంగంలో దూసుకపోతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు జలాలు భీడుభూముల్ని సస్యశ్యామలం చేస్తున్నాయి. నీళ్లందని పాలమూరు పచ్చగా నవ్వుతున్నా, ఫ్లోరోసిస్‌తో వొంకర్లు తిరిగిన నల్లగొండ మంచినీళ్లు తాగుతున్నా, ఉత్తర తెలంగాణ ధాన్యాగారంగామారిన, కాకతీయులు ఏలిననేల అన్నిరంగాల్లో దూసుకపోతున్నా, ఆదిలాబాద్‌లో మారుమూల గిరిజన ఆదివాసీ గూడెం దాకా ప్రభుత్వ పథకాల సాయాలు అందే విధంగా చేయటమైనా, మొత్తం తెలంగాణ చుట్టూ అభివృద్ధి గీతలు గీస్తూ ముగ్గులు పోస్తున్న చరిత్రలో దార్శనికుడైన, జ్ఞాని అయిన కేసీఆర్‌కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన ఆలోచనల కార్యరూపాలుగా పనిచేస్తున్న టీఆర్‌ఎస్ చరిత్ర మరువలేనిది. ఇదంతా టీఆర్‌ఎస్ చరిత్రకాదు. టీఆర్‌ఎస్ చరిత్రకు ముందుమాటగా సగంరాసిన వాక్యమిది.

టీఆర్‌ఎస్‌రాజకీయపార్టీ మాత్రమేకాదు అది తెలంగాణ రాష్ట్రసాకారంలో ఎన్నెన్నో కష్టసాగరాలకు ఎదురీది నిలిచిగెలిచింది. రాష్ట్ర సాకారం తర్వాత పునర్నిర్మాణం అన్న గొప్ప సంకల్పాన్ని తన భుజాలకెత్తుకుంది. టీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ కుటుంబంగా మారింది. పార్టీ వ్యవస్థాపకుడైన కేసీఆర్ దార్శనికతకు దారులుగా, అభివృద్ధి బాటలు వేసే సుశిక్షితులైన సైనికులుగా బంగారు తెలంగాణ నిర్మాణానికి టీఆర్‌ఎస్ నిరంతరంగా కృషిచేస్తుంది. సర్వజనుల శ్రేయస్సే ధ్యేయంగా సకలజనులకోసం సేవచేసే మహాసంస్థగా టీఆర్‌ఎస్ నిలవాలి.

మళ్లీ మనవూళ్లు పచ్చపచ్చగా ఉండాలి. చెరువులు నిండాలి. వాగులు పొంగాలి. కప్పల బెకబెకలు వినిపించాలి. వర్షంపడితే మళ్లీ భూమినుంచి వానపాములు పుట్టుకరావాలి. కాళేశ్వరం గోదావరి జలాలు కృష్ణాజలాలతో అనుసంధానం కావాలి. నీళ్లు అందని నేల తెలంగాణలో లేదన్న కేసీఆర్ లక్ష్యం పూర్తి కావొస్తుంది. ప్రతి ఇంటికి నల్లా నీళ్లొస్తున్నాయి. అవును సర్కారు దవఖానాకు ప్రజలొస్తున్నారు. పేదజనావళికి వైద్యం అందుబాటులోకి వచ్చింది. కేజీ నుంచి విద్యకు పటిష్ట పునాదులు పడ్తున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల గురుకులాలు నాణ్యమైన విధ్యనందిస్తూ దేశానికే తలమానికంగా నిలుస్తున్నాయి. దేశానికి తెలంగాణ ధాన్యాగారంగా మారింది. రైతుకూలీలు వ్యవసాయరంగంలో నిలదొక్కుకునే స్థితికి వస్తున్నారు. అన్నార్తులు అనాధలుండని నవయుగ నిర్మాణానికి తెలంగాణ పునర్నిర్మా ణం పకడ్భందీగా జరగాలి. అందుకు టీఆర్‌ఎస్ నిరంతర శ్రమచేయాలి. తెలంగాణ సమాజం ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే స్వరంగా, ఆపదలో ఆదుకుని కొండంత అండగా టీఆర్‌ఎస్ నిలవాలి. కేసీఆర్ దార్శనిక ఆలోచనలకు ఆచరణరూపం టీఆర్‌ఎస్.

                                                                                                           జై తెలంగాణ.

 

TRS Self-Defense School

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆత్మగౌరవ పాఠశాల టిఆర్‌ఎస్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: