బడి పిల్లల కథలు 1

  మనదేశంలో బాలబాలికలే ఎక్కువ నిర్లక్ష్యానికి గురవుతున్నారు. పట్టణ నగర ప్రాంతాల తల్లిదండ్రులకు తమ పిల్లలకు చదువు చెప్పించాలనే దృష్టివుంటుంది. గ్రామీణ ప్రాంతాల తల్లిదండ్రులకు ఈ దృష్టి తక్కువ. విద్యార్జన ద్వారా శాస్త్రీసంబంధమైన అంశాలనే కాకుండా జీవితానికి సంబంధించిన విలువలు నేర్చుకోవటం కూడా ప్రధానమే. అందుకే విద్య విస్తృతంగా అందుబాటులో లేని రోజుల్లో రామాయణ మహాభారత కథల ద్వారా, రాజురాణి కథల ద్వారా, ‘అనగనగా’తో మొదలయ్యే రకరకాల కథల ద్వారా, పశుపక్ష్యాదుల కథల ద్వారా మన తాతలు, […] The post బడి పిల్లల కథలు 1 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మనదేశంలో బాలబాలికలే ఎక్కువ నిర్లక్ష్యానికి గురవుతున్నారు. పట్టణ నగర ప్రాంతాల తల్లిదండ్రులకు తమ పిల్లలకు చదువు చెప్పించాలనే దృష్టివుంటుంది. గ్రామీణ ప్రాంతాల తల్లిదండ్రులకు ఈ దృష్టి తక్కువ. విద్యార్జన ద్వారా శాస్త్రీసంబంధమైన అంశాలనే కాకుండా జీవితానికి సంబంధించిన విలువలు నేర్చుకోవటం కూడా ప్రధానమే. అందుకే విద్య విస్తృతంగా అందుబాటులో లేని రోజుల్లో రామాయణ మహాభారత కథల ద్వారా, రాజురాణి కథల ద్వారా, ‘అనగనగా’తో మొదలయ్యే రకరకాల కథల ద్వారా, పశుపక్ష్యాదుల కథల ద్వారా మన తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు ఇట్లాంటి విలువలనే మన పెద్దలు పిల్లలకు నేర్పించటానికి పూనుకున్నారు. కనుక కథ అన్నది పాఠ్యాంశంలో భాగంగా మారిపోయింది.

భావిభారత పౌరులకు సంబంధించి శుష్క నినాదాలతో మాట్లాడటం, రాయటంతో అంతగా ప్రయోజనం ఉండదు. ఒకటి రెండుసార్లు ఒక మంచి సంగతిని చెప్పినంత మాత్రాన ఆచరణలో పెట్టే జాతికాదు మనది. ఈ ‘చెప్పటం’, ఈ ‘బాధ్యతలను గుర్తుచేయటం’ ఒక ఉద్యమ రూపంలో పదేదపే గుర్తు చేయటం అవసరమన్న సత్యాన్ని గ్రహించి ఆచరణలో పెట్టినవారు మణికొండ వేదకుమార్‌గారు. వారి లక్ష్యం నెరవేరాలని ఆశిద్దాం. బడిపిల్లలకోసం బడిపిల్లలు రాసే కథలు ప్రత్యేకమైనవి. ఇవి ఆ పిల్లలు తమకోసం తాము రాసుకునే కథలు! ఈ కథలు చాలా వరకు ఒకే అంశం చుట్టూ కేంద్రకృతమవుతాయి. ఈ అంశానికి జీవం పోయటంలో భాగంగా తమ సృజన శక్తులను కేంద్రీకరించి భౌతికవాతావరణాన్ని, మానసిక వాతావరణాన్ని సృష్టించుకుంటారు. రెండుమూడు సన్నివేశాలు, ఒకే ఒక ప్రధాన సంఘటన, అవసరమైన పాత్రలను సృష్టించుకుంటారు.

తమ స్థాయిలో సంభాషణలు వుంటాయి. నీతిబోధ స్పష్టంగా వుంటుంది. వీళ్ళు 12 సంవత్సరాలు 15 సంవత్సరాల మధ్య వయోవర్గం వాళ్ళు కనుక, కథాశిల్పంలో లోటుపాట్లు వుండవచ్చు. ఇది పెద్దలకు తెలిసినంతగా చదువరులైన పిల్లలకు తెలియకపోవచ్చు. బాలల సాహిత్యంలో మనుషులు, దేవతలు, భూతాలు, చెట్లూ చేమలు, ప్రకృతి, ఆకాశం, చుక్కలు, పశుపక్ష్యాదులు వీళ్ళంతా లేదా ఇవన్నీ అంతా సమానమవుతారు. వీళ్ళంతా లేదా ఇవన్నీ మానవభాషలోనే మాట్లాడుతారు. ఎందుకంటే, రాసే వ్యక్తి మనిషి కనుక! ఒక మాటలో బాలసాహిత్యంలో ఒక ప్రపంచం వుంటుంది. ఈ ప్రపంచం ఒక్కోసారి తాము ఉంటున్న ప్రపంచం కావచ్చు, తమ ఊహాలోకం లోని ప్రపంచం కావచ్చు లేదా తాము ఎట్లాంటి ప్రపంచంలో నివసించాలనుకుంటున్నారో ఆ ప్రపంచం కావచ్చు. పెద్దలు పిల్లలకోసం రాసే కథల్లో కల్పన పాలు ఎక్కువ. పిల్లలు రాసే కథల్లో వాస్తవికత ఎక్కువ. ఇదంతా సృజన వ్యాపారంలో భాగం కనుక ఇది ఇట్లా, అది అట్లా వుండాలన్న సూత్రీకరణలు చేయటం కుదరదు. జిల్లాల వారీగా కొన్ని కథలను సంక్షిప్తంగా పరామర్శిద్దాం.

హైదరాబాద్ జిల్లా
‘ఊర్వసి’ అన్న 8వ తరగతి అమ్మాయి ‘ఆదర్శం’ అన్న కథ రాసింది. ఆవు మేతకోసం అడవికి పోతే పులి తినటానికి వస్తుంది. అప్పుడు ఆవు తన రెండు లేగదూడలు ఆకలితో వున్నాయి నేను వాటికి పాలిచ్చి వస్తానంటుంది. ఈలోగా ఆవు స్నేహితురాలు కుందేటు ఆవు పులికి ఆహారమైతే దాని పిల్లల సంగతి ఎట్లా? అని ప్రశ్నించుకొని ధైర్యంగా పులి ముందుకు వెళ్తుంది. ఆవుకు బదులు తనను తినమంటుంది. ఈలోగా ఆవు వస్తుంది. ఇది పులికి ఆశ్చర్యం కలిగిస్తుంది. తనకంటే తక్కువ స్థాయిలో వున్న జీవుల ప్రవర్తన ఇంత నిజాయితీతో వుంటుందనుకోలేదు. వాటిని వదిలివేస్తుంది. నిజానికి ఆవు పులి కథగా ప్రాచీన కాలం నుంచి ఇది ఉన్నదే. ఒక క్రూర జంతువులో మానసిక పరివర్తన ప్రధానంగా వున్న కథ. అయితే, ఈ కథలో కుందేలు పాత్రను అదనంగా సృష్టించింది ఊర్వసి. దీంతో ఆవు నిజాయితీకి అదనంగా స్నేహధర్మం అనన మరొక విలువ ఈకథకు సమకూరింది. ‘పిచ్చుక పిల్ల’ అన్న కథను రాసినవాడు యు. బాలరాజ్. ఆకాశంలో గాలిపటం ఎగురుతుండటం చూసిన చిన్న పిచ్చుక తన తల్లిని తనకు గాలిపటం కావాలని కోరుతుంది. అప్పుడు ఆ తల్లి ఉల్లిగడ్డ నుండి ఉల్లిపొరను తెచ్చి, సాలెపురుగు నడిగి దారం తెచ్చి, తుమ్మచెట్టు నుండి గోందును తెచ్చి గాలిపటాన్ని తయారు చేసి ఇచ్చింది. చిన్న పిచ్చుక సంతోషంతో ఆ గాలిపటాన్ని ఎగురవేసి ఆడుకుంది.ఇందులో రెండు విశేషాలున్నాయి. ఒకటి పిచ్చుక కూడా పతంగి లాగే ఆకాశంలో ఎగిరేది. పిచ్చుకకు ఆకాశంలో ఎగరాలన్న కోరిక సహజాతం. ఇక రెండో అంశం పిచ్చుక తల్లి సేకరించినవన్నీ తనకు అందుబాటులో వున్న వనరులే కావటం. ఇది చిన్న మెదళ్లలో ఆలోచనలు రేకెత్తిస్తుంది. ఈ రెండు పక్షులకు మానవుల లక్షణాలున్నట్టు కల్పించబడింది.

మెదక్‌జిల్లా కథల్లోంచి ‘యువరాణి జాలిగుణం’ కథను చూద్దాం. అందమైన యువరాణి రాజ్యం చూడటానికి బయలు దేరితే గాయాలతో బాధపడుతున్న కుక్కపిల్ల కనిపిస్తుంది. దయాగుణంతో దాన్ని చేరదీసి వైద్యం చేయించి, ఆ కుక్కపిల్లను తాను పెంచుకుంటానని తండ్రి అయిన రాజుతో అంటుంది. ‘ఇది ఊరకుక్క. దీన్ని పెంచుకోవద్దు, ముట్టుకోవద్దు’ అంటాడు. రాజు ప్రతి అంశంలో హెచ్చుతగ్గులు చూస్తుంటాడు. అయినా యువరాణి దాన్ని పెంచుకుంటుంది. ఒక కొత్త వ్యక్తి దురుద్దేశంతో రాజుగారి గదిలోకి ప్రవేశిస్తాడు. ఈ కుక్క వెంటనే పసిగట్టి మొరుగుతుంది. అది రాజుగారిని రక్షిస్తుంది. జాతిలో చిన్న, పెద్ద వుండనట్లే గుణలో కూడా చిన్న పెద్ద వుండవు. మనం ప్రేమతో పెంచితే అది విశ్వాసం ప్రదర్శించటం ద్వారా రుణం తీర్చుకుంది. రాజుగారి అభిప్రాయం ఓడిపోయింది. యువరాణి ప్రేమ గెలిచింది. ఈ కథను 9వ తరగతి బాలుడు ఎం.డి. అఫ్రిన్ రాశాడు. బి.మానస అనే అమ్మాయి రాసిన కథ ‘కృతజ్ఞత’. సరిగ్గా పంట చేతికి వచ్చే సమయంలో పొలం బోరు చెడిపోయింది. ఊరి పెద్దలు దయామయులు. చెరువునీరును వాడుకునేందుకు అనుమతిస్తారు. దీంతో వారికి మంచి దిగుబడి వచ్చింది. ఇందుకు కృతజ్ఞతగా తమ పంటలో పావుభాగం గ్రామ పెద్దలకు ఇచ్చి రుణం తీర్చుకున్నారు. ఆ తర్వాత గూడా పంటలు బాగా పండటంతో కూతురును బాగా చదివించారు. ఆ అమ్మాయికి ఉద్యోగం కూడా దొరుకుతుంది. బాలబాలికలకు రైతు సమస్యలపట్ల అవగాహన పెరుగుతున్నది. ఈ చివరి పరిణామం మనకొక సత్యాన్ని చెపుతుంది. ఈ కథను రాసింది అమ్మాయి. ఆ అమ్మాయే కథలో కూడా పాత్ర. ఆమె మనోగతం ఏమిటి? బాగా చదువుకొని భవిష్యత్తులో ఉద్యోగం సంపాదించి తీరాలని!

మహబూబ్‌నగర్ జిల్లా నుండి ‘తికమక’ అన్న కథను చూద్దాం. దీన్ని రాసింది తొమ్మిదో తరగతి చదువుతున్న ఎం.ఎన్. జయంత్ కుమార్. రాజుకు తన కొలనులో అందమైన చేపలను పెంచాలనిపించింది. వాటిని తెమ్మని భటులకు ఆజ్ఞాపించాడు. వాళ్ళు అందమైన చేపలే తెచ్చి రాణిగారికి ఇస్తే, ఆమె వాటిని వండించి రాజుగారికి వడ్డించింది. అప్పు డు రాజుకు అర్థమైంది. తాను భటులతో కేవలం చేపలే తెమ్మన్నాడు తప్ప ‘కొలనులో పెం చుకోవటానికి’ అని చెప్పలేదు. భటులు వాటిని రాజు సమక్షంలోకి తీసుకురాకుండా రాణికి అందజేస్తారు. రాణి కూడా ‘ఎందుకు’? అని అడగకుండా వండించేసింది. మొత్తం కథలో ‘సమాచార లోపం’ (కమ్యూనికేషన్ గ్యాప్) వుంది. ఈ సున్నితమైన అంశం మీద కథరాసిన బాల కథకుడు మెప్పించాడు.
ఇదే జిల్లా నుంచి తరంగిణి అనే 9వ తరగతి చదివే అమ్మాయి రాసిన కథ చూద్దాం. దీని పేరు శిక్షతో మార్పు. ఊళ్ళో వున్న దొంగ దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఒకరోజు పట్టుపడ్డాడు. ఊరివాళ్ళంతా చెట్టుకు కట్టేసి కొట్టి దూషించారు. వాటిని తట్టుకోలేక, తాను మంచిగా బతుకటానికి ఎంతో ప్రయత్నం చేసినా లాభం లేకపోయిందని అంటాడు. పనులు చేయించుకున్న వాళ్ళు సరిగ్గా డబ్బులు ఇవ్వలేదని, అందుకే టీవీలో దొంగతనాలు చేయటమెలాగో చూసి, వీటికి అలవాటు పడ్డానని, పని ఇప్పిస్తే, బుద్ధిగా పని చేసుకుంటూ బతుకుతానని అంటాడు.

ఇందుకు గ్రామస్తులు కూడా ఒప్పుకొని చెట్లకు నీళ్ళు పోసే పని చెప్పి, తగిన జీతం ఏర్పాటు చేస్తారు.ఒకసారి ఒక వ్యక్తి మీద దొంగ అనే ముద్రపడితే వాణ్ణి జీవితాంతం దొంగ అనే అనేవారు. ఇది పాతకాలపు నీతి. విక్టర్ హ్యూగో ‘లేమిజరబ్లే’ అన్న జావాల్ నాయకుడుగా వున్న నవలలో తొలిసారి ఒకడు ఏ పరిస్థితుల్లో దొంగ అయ్యాడో చూడాలని ప్రతిపాదిస్తాడు. అట్లే శాంతారాం అనే గొప్ప దర్శకుడు కరడుగట్టిన నేరస్తులలో మంచి తనంతో మానసిక పరివర్తన తీసుకురావచ్చు అన్న సత్యాన్ని నిరూపించటానికి ‘దో ఆంభే బారాహాత్’ అన్న గొప్ప సినిమాను నిర్మించాడు. చెట్లకు నీళ్ళుపోయటం కూడా ఒక ఉద్యోగంగా చూపించటం మూలంగా పర్యావరణం పట్ల బాలబాలికల్లో కలుగుతున్న అవగాహనకు కూడా ఈ కథ ఒక నిదర్శనంగా నిలుస్తుంది.                                                              ( ఇంకా వుంది…)

                                                                                అమ్మంగి వేణుగోపాల్- 9441054637

Manikonda Vedakumar written by Badi pillala kathalu books

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బడి పిల్లల కథలు 1 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: