వెలుగు దారిలో నడిపే ములుగర్ర

  గురజాడ సృజనాత్మక రచనలు – గేయాలు, గేయకావ్యాలు, నాటకాలు, కథానికలు, వ్యాసాలు అన్నీ కలిపినా 620 పేజీలు మించవు. మనసు ఫౌండేషన్ ప్రచురించిన ‘గురుజాడలు‘ ఆధారంగా వేసిన అంచనా ఇది. గురజాడ వ్యక్తిత్వం ఆయన సృజనాత్మక రచనల వల్లే అంచనా వేయలేం. ఆయన డైరీలు, లేఖలు కూడా పరిగణనలఒకి తీసుకుంటే తప్ప ఆయన మూర్తిమత్వం ఆవిష్కరించలేం. ఇంగ్లీషులో 145 పేజీల మినిట్ ఆఫ్ డిసెంట్ తో కలిపినా ఇంగ్లీషులో ఆయన రాసిన లేఖలు, రాసుకున్న నోట్స్ […] The post వెలుగు దారిలో నడిపే ములుగర్ర appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

గురజాడ సృజనాత్మక రచనలు – గేయాలు, గేయకావ్యాలు, నాటకాలు, కథానికలు, వ్యాసాలు అన్నీ కలిపినా 620 పేజీలు మించవు. మనసు ఫౌండేషన్ ప్రచురించిన ‘గురుజాడలు‘ ఆధారంగా వేసిన అంచనా ఇది. గురజాడ వ్యక్తిత్వం ఆయన సృజనాత్మక రచనల వల్లే అంచనా వేయలేం. ఆయన డైరీలు, లేఖలు కూడా పరిగణనలఒకి తీసుకుంటే తప్ప ఆయన మూర్తిమత్వం ఆవిష్కరించలేం. ఇంగ్లీషులో 145 పేజీల మినిట్ ఆఫ్ డిసెంట్ తో కలిపినా ఇంగ్లీషులో ఆయన రాసిన లేఖలు, రాసుకున్న నోట్స్ కలిపితే మరో 671 పేజీలు. అయితే ఆయన సాహితీ కార్యకలాపాల ప్రభావం అపారం. ఆయన ఆలోచన, ప్రాపంచిక దృక్పథం దృష్టితో చూస్తే తన సమకాలికన్నా చాలా ముందుండడమే కాదు. ఆయన ఆశించిన ఆధునిక దశకు ఆయ్న మరణించిన 105 ఏళ్ల కాలంలో ఇప్పటికీ మన సమాజం చేరుకోలేదు.

గురజాడ సజీవంగా ఉన్న కాలంలో ఆయ్నకు రావలసినంత పేరు ప్రఖ్యాతులు రాలేదు, ఆయన మరణించిన తరవాతే జీవించడం మొదలు పెట్టాడు అన్న వాదన బలంగా వినిపిస్తూనే ఉంది. అసలు ఆయన రచనలను వెలికి తీసే పనే మూడు దశాబ్దాలకు కాని మొదలవలేదు. అవి అచ్చు రూపంలో రావడానికి మరో రెండు దశాబ్దాలు పట్టింది. గురజాడ అపారమైన చదువరి. కానీ ఆయన కుమారుడు రామదాసు పంతులు హయాంలోనే ఆయన గ్రంథాలయంలో చాలా వరకు గల్లంతైంది. ప్రస్తుతం గురజాడ స్మారక కేంద్రంలో ఉన్న గ్రంథాలు వందకు మించవు. గురజడ స్వదస్తూరిలో ఉన్న రచనలు మొదలైన వాటిని 1946 ప్రాంతంలో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ప్రచురణాలయం ప్రజాశక్తి పనుపుపై సెట్టి ఈశవర రావు రామదాసు పంతులు నుంచి సేకరించారు. అదంతా కలిపితే ఓ ట్రంకు పెట్టె. అందులో ఉన్నవీ పోగా మిగిలినవే. ఆ తరవాత గురజాడ రచనలను పరిశీలించే, పరిష్కరించే సమయంలో మరికొంత సామాగ్రి జారిపోయింది. దీనికి కారణం ఏమైనా కావచ్చు.

1948లో కమ్యూనిస్టు పార్టీ మీద జరిగిన దాడి సందర్భంగా తన సొంత వస్తువులను కూడా వదిలిపెట్టి గురజాడ సాహిత్య సామాగ్రి ఉన్న ట్రంకు పెట్టును తీసుకుని సెట్టి ఈశ్వర రావు మదరాసు వెళ్లి పోయారు. 1952లో విశాలాంధ్ర పత్రికా ప్రచురణ, విశాలాంధ్ర ప్రచురణాలయం ప్రారంభమైనప్పుడు ఈశ్వర రావు వాటిని విశాలాంధ్రకు చేర్చారు. ఈ సామాగ్రి ఆధారంగానే అవసరాల సూర్యా రావు సంపాదకత్వంలో గురజాడ సమగ్ర రచనలను విశాలాంధ్ర వెలువరించింది. కమ్యూనిస్టు పార్టీ పూనుకోక పోతే అదీ జరిగేది కాదు. ఈ క్రమంలోనే గురజాడ నేలబారు రచయిత అనీ, దేశభక్తి గీతం అసలు రాయనే లదని, కమ్యూనిస్టులే రాసి ఆయన పేర ప్రచారంలో పెట్టారని ప్రచారం చేసిన వారున్నారు. దేశభక్తి గీతం గురజాడ రచనే అని నిరూపించడానికి సెట్టి ఈశ్వర రావు ఓ చిరు పుస్తకమే రాయవలసి వచ్చింది.

ఇదంతా జరిగిన మరో రెండు దశాబ్దాలకు గురజాడ డైరీలను, లేఖలను అనువదించడంలో జరిగిన పొరపాట్లను ఫోర్జరీలు అని దుమ్మెత్తి పోస్తూ వారాల తరబడి పురాణం సుబ్రహ్మణ్య శాస్త్రి దుమ్మెత్తి పోశారు. ఈ రగడలో పాత్ర ధారి పురాణమే అయినా తెరవెనక సూత్రధారి నార్ల వెంకటేశ్వర రావు. వీరిద్దరికీ గురజాడ మీద గౌరవాభిమానాలు లేక కాదు. నార్లలో జీర్ణించుకుపోయిన కమ్యూనిస్టు వ్యతిరేకతే ఆయన చేత ఈ పని చేయించింది. గురజాడ రాత ప్రతుల పరిశీలన, పరిష్కరణ ప్రారంభైంభించాలనుకున్నప్పుడు ఆ కృషి చేసిన బృందానికి నాయకత్వం వహించింది నార్లే. అయితే ఆయన ఆ సామాగ్రిని మళ్లీ విశాలాంధ్రకు తిరిగి ఇవ్వలేదు. అవి తెచ్చుకోవడానికి సెట్టి ఈశ్వర రావు, ఏటుకూరి ప్రసాద్ నార్ల ఇంటి చుట్టూ తిరిగారు. చివరకు కారు షెడ్లో ఉన్న ట్రంక్ పెట్టెను స్వాధీనం చేసుకోగలిగారు.

అవసరాల సూర్యా రావు చేసిన పని మీద ఫిర్యాదులు రావడంతో మళ్లీ గురజాడ రచనలను ఎడిట్ చేసే పని సెట్టి ఈశ్వర రావుకు అప్పగించింది. ఆ పని పూర్తి చేసిన తరవాత తాను చేయవలసింది ఏమీ లేదు అని భావించిన ఈశ్వర రావు ఈ లోకం నుంచి సెలవు తీసుకున్నారు. ఈ పని పూర్తి అయితే తాను ఇక బతకవలసిన అగత్యం లేదని ఈశ్వర రావు నాతోనే అనేక సార్లు అన్నారు. అన్నంత పనీ చేశారు. గురజాడ శతజయంతి సందర్భంగా హైదరాబాదు నుంచీ, దిల్లీ నుంచీ ప్రత్యేక సంచికలు వెలువరించారు. గురజాడ రాసిన దానికన్నా ఆయన మీద అనేక మంది రాసిన రచనలో రాశిలో ఎక్కువ. వాటినీ సంకలితం చేసే పని జరిగింది. విశాలాంధ్ర ప్రచురణాలయమే కన్యాశుల్కం నూరేళ్ల పండగ సందర్భంగా మొదలి నాగభూషణ శర్మ, ఏటుకూరి ప్రసాద్ సమాదకత్వంలో ‘నూరేళ కన్యాశుల్కం సమాలోచన‘ వెలువరించింది. ఇది వెయ్యి పేజీల పై మాటే.

గురజాడ 15వ జయంతి సందర్భంగా మూడు ప్రయత్నాలు జరిగాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ‘మార్గదర్శి గురజాడ‘ వ్యాస సంకలనం ప్రచురించింది. అలాంగే ‘గురజాడ సాహిత్య సర్వస్వం‘ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభువమే వెలువరించింది. మరో వేపున మనసు ఫౌండేషన్ ‘గురుజాడలు‘ మహాకవి గురజాడ అప్పారావు సర్వ లభ్య సంకలనం వెలువరించింది. ఒకే సంపుటం కింద జాగ్రత్తగా, అందంగా ఈ సంపుటం వెలువడడానికి సంపాదకుడు కీ.శే. పెన్నేపల్లి గోపాలకృష్ణ ప్రధాన కారణం. అయితే ఈ గ్రంథం వెలువడడానికి ముందే గోపాలకృష్న మరణించారు. మిగతా సంపాదకత్వ బాధ్యతలు డా. కాళీదాసు పురుషోత్తం నిర్వహించారు. ఇంకో వేపు రాజాంలో వెలుగు సంస్థ నిర్వాహకుడు రామి నాయుడు ‘మూడు యాభయిల మన గురజాడ‘ ప్రచురించారు. ఆయన సాహిత్యాభిమాని. గురజాడకు వీర భక్తుడు. గురజాడను సరదాగా ‘ముసిలోడు‘ అనే ప్రస్తావిస్తుంటారు. 21-11-2011న ప్రారంభించి ఏడాది పాటు నెలకొక సమావేశం నిర్వహించి ఆ ప్రసంగ వ్యాసాలతో పాటు మరి కొన్ని వ్యాసాలూ కలిపి ఈ గ్రంథం ప్రచురించారు. నూటా యాభయ్యవ జయంతి సభ 2012 సెప్టెంబర్ 19, 20 తేదీల్లో విశాఖపట్నం కళాభారతిలో ఏర్పాటు చేశారు. ఇందులో చెప్పుకోదగ్గ విషయం కన్యాశుల్కం పూర్తి నిడివి నాటక ప్రదర్శన. అంతకు ముంది 1992లో కన్యాశుల్కం నూరేళ్ల పండగ కూడా వెలుగు సంస్థే ఏర్పాటు చేసింది.

గురజాడ మరణించి 105 ఏళ్లు దాటినా తెలుగు జాతి ఆయనను స్మరించుకోవడానికి వచ్చే ఏ అవకాశాన్నీ విడిచిపెట్టడం లేదు. ఇది నిర్వాహకుల గొప్పతనం కాదు. గురజాడ రచనలు ఇప్పటికీ నిత్యనూతనాలే. ఆయన ప్రారంభించిన ఎజెండా ఇంకా అసంపూర్ణంగానే ఉంది కనక గురజాడను సంస్మరించుకోవడం అనివార్యం అవుతోంది. ఒక వేళ గురజాడ ఆశించిన స్థాయికి చేరే సత్తువ మన సమాజం ప్రదర్శించే రోజు వస్తుందనుకున్నా ఆయన రచనా పాటవం ఆ తర్వాత కూడా ఆ సాహిత్యాన్ని నిత్య పఠనీయంగానే ఉంచుతుంది. గురజాడ సార్వకాలీనత, విశ్వజనీనత బలం అది. ‘మూడు యాభయిల మన గురజాడ‘ లో కొన్ని ఇంగ్లీషు వ్యాసాలు కూడా ఉన్నాయి. ఇందులో బళ్లారి రాఘవ (టి. రాఘవాచారి) 1934లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చేసిన ప్రసంగంలోని ప్రధాన భాగాలతో కూడుకున్నది. ఏ కోణం నుంచి చూసినా ఇది అపురూపమైంది. శివసాగర్ దీర్ఘ కవితతో పాటు మూడు కవితలూ చేర్చారు.

గురజాడ కవిత్వం, నాటకాలు, వ్యాసాలు మాత్రమే రాసిన సాహిత్యకారుడు కాదు. ఆయన భాషా శాస్త్రవేత్త. వాడుక భాషకోసం ఉద్దండ పండితులతోనూ, విశ్వవిద్యాలయాలతోనూ యుద్ధాలు చేసిన భాషా శాస్త్రవేత్త. సౌందామిని నవల రాయాలనుకున్నారు కానీ రాయక ముందే తనువు చాలించారు. ప్రత్యేకంగా గురజాడ రాసిన వ్యాసాలు తక్కువే కానీ ఆయన లేఖల్లో చాలా వ్యాసాల్లాంటివే. ఆయన ఆధునికులమని చెప్పుకునే వారిని కూడా సిగ్గుపడేలా చేసే అత్యాధునికుడు. నిఖ్సాన ప్రజాస్వామ్య వాది. కలింగ చరిత్ర రాయడానికి ప్రాతిపదక ఏర్పాటు చేసుకుని ఆ పని పూర్తి చేయకపోయినా చరిత్రకారుడే.

‘మూడు యాభయిల మన గురజాడ‘ గ్రంథం తీసుకున్న కాన్వాస్ చాలా పెద్దది. గురజాడ వ్యక్తిత్వంలోని సకల పార్శ్వాలనూ వ్యాస రచయితలు స్పృశించారు. వరవర రావు వ్యాసం ‘కన్యాశుల్కం నాటకం – ప్రజాస్వామ్య దృక్పథం‘, నల్లి ధర్మారావు ‘కళింగాంధ్ర తొలి సాంఘిక చరిత్రకారుడు-గురజాడ‘, ద్వారం దుర్గా ప్రసాద రావు ‘గురజాడ సంగీతాభిరుచి‘ డా. కె.వి. మోహన్ రావు ‘ది థాట్ అండ్ ఫిలాసఫీ ఆఫ్ గురజాడ‘ గురజాడ వ్యక్తిత్వంలోని భిన్న కోణాలను పట్టి చూపుతాయి. కేత్ విశ్వనాథ రెడ్డి ‘గురజాడ కథానికా సృజన: మూలాలు, లక్ష్యాలు‘ కథా రచయితగా గురజాడ ఇప్పటికీ ఎందుకు మేరు నగధీరుడో చూపుతుంది. పి.జె.ఆర్. పంతులు కన్యాశుల్కాన్ని, రాచకొండ విశ్వనాథ శాస్త్రి ‘నిజం‘ నాటకాన్ని పోల్చి చూపిన తీరు మన నాటక రంగ మహోదాత్తతో పాటు ప్రస్తుతం నాటక రంగం ఉన్న అధోగతినీ ఎవరికి వారే వింగడించుకోవచ్చు.

కాత్యాయని వ్యాసం ‘ఆధినిక మహిళను కలగన్నవాడు‘ ఆధినికత అంటే నిర్వచించడంతో పాటు ప్రగతిశీలమైంది అని తీర్మానించడం ఆధునికత కేవలం కాలవాచి కాదు అని గ్రహించడానికి కరదీపిక. ‘సాంఘిక దురాచారాలతో, మూఢ విశ్వాసాలతో నిండిన భూస్వామ్య సమాజంకన్నా వాటిని ప్రశ్నించటానికీ, మార్చటానికీ పూనుకున్న ఆధునిక సంస్కరణవాదం నిస్సందేహంగా ప్రగతిశీలమైనదే. కానీ భారత దేశంలో వలస పాలన ద్వారా ప్రవేశిందిన ఆధునికత, ఇక్కడి భూస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేయగలిగినంత శక్తివంతమైనది కాదు. తమ ఆర్థిక ప్రయోజనాలకు అడ్డు తగలనంత మేరకు భారత సమాజాన్ని ఆధునీకరించడమే తప్ప – దాన్ని సమ సమాజంగా ఎదగనివ్వటం వలన పాలకుల లక్ష్యం ఎంత మాత్రమూ కాదు‘ అన్న కాత్యాయని మాటలు ఆధినిక మహిళలు, మహిళాభ్యుదయం కోరుకునే వారు ఏ దిశలో ఆలోచించాలో చెప్తాయి. ‘సౌదామిని‘ నవల రాయగలిగి ఉంటే ఆధునిక సమాజం ఎలా ఉంటుందో, అందులో స్త్రీ ఎలా ఉంటుందో చెప్పగలిగే వాడేమో! ఈ విషయాన్ని కాత్యాయని క్షుణ్నంగా చర్చించారు. జి.ఎస్. చలం ‘కన్యాశుల్కంలో తిట్లు‘ ఆడవాళ్లను తిట్టే తిట్లు ఏకరువు పెట్టి ఉండవచ్చు. కానీ ఇప్పటికీ మన తిట్లలో ఎక్కువ భాగం మహిళలను ఉద్దేశించినవే అన్న కఠిన వాస్త్వాన్ని అర్థం చేసుకోవలసిన అగత్యాన్ని తెలియజెప్తుంది. ‘మూడు యాభయిల మన గురజాడ‘ గురజాడకు నివాళి మాత్రమే కాదు. గురజాడ ఆశించిన ఆధునిక స్థాయిని, ప్రజాస్వామ్య దృక్పథాన్ని అలవర్చుకోని వెధాయిత్వాన్ని పుడిచి చూపే ములుగర్ర కూడా.

                                                                            ఆర్వీ రామారావ్- 9676999856

Mudu Yabaiela Mana Gurajada book written by Shankar

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వెలుగు దారిలో నడిపే ములుగర్ర appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: