జనతా కర్ఫూ మహా సంకల్పం

     ఒక చోటి నుంచి మరొక చోటికి జన సంచారం వల్లనే, ప్రజలు ఎక్కువ సంఖ్యలో చేరే సామూహిక సన్నివేశాల కారణంగానే కరోనా వైరస్ వ్యాపిస్తున్నదని స్పష్టపడినందున దాని ఆటలు కట్టించడానికి ఎవరికి వారు స్వీయ నిర్బంధంలోకి వెళ్లడమే మార్గమని భావించి ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు (22 మార్చి 2020)న దేశ ప్రజలంతా స్వచ్ఛంద జనతా కర్ఫూ పాటించాలని పిలుపు ఇచ్చారు. వివేకవంతమైన ఈ సూచనను పాటించడానికి ప్రజలు సిద్ధపడ్డారు. ప్రధాని సూచించినట్టు […] The post జనతా కర్ఫూ మహా సంకల్పం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

     ఒక చోటి నుంచి మరొక చోటికి జన సంచారం వల్లనే, ప్రజలు ఎక్కువ సంఖ్యలో చేరే సామూహిక సన్నివేశాల కారణంగానే కరోనా వైరస్ వ్యాపిస్తున్నదని స్పష్టపడినందున దాని ఆటలు కట్టించడానికి ఎవరికి వారు స్వీయ నిర్బంధంలోకి వెళ్లడమే మార్గమని భావించి ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు (22 మార్చి 2020)న దేశ ప్రజలంతా స్వచ్ఛంద జనతా కర్ఫూ పాటించాలని పిలుపు ఇచ్చారు. వివేకవంతమైన ఈ సూచనను పాటించడానికి ప్రజలు సిద్ధపడ్డారు. ప్రధాని సూచించినట్టు 14 గంటలే కాకుండా నేటి ఉదయం 6 గం. నుంచి సోమవారం ఉదయం 6 గం. వరకు 24 గంటల పాటు ప్రజలంతా ఇళ్లకే పరిమితమవ్వాలని ముఖ్యమంత్రి కెసిఆర్ విజ్ఞప్తి చేయడం కరోనా కట్టడిపై ఆయన వహించిన అసమాన దీక్షకు నిదర్శనం. తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత పట్టుదలతో సాధించుకున్నామో అదే రీతిలో కరోనాపై సమస్టి పోరాటం చేయాలని ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు కనిపించని శత్రువు నుంచి విరుచుకుపడిన విపత్తును ఎదుర్కోడంలో ఆయన వహించిన దృఢ సంకల్పాన్ని చాటుతున్నది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులను, మెట్రో రైలును కూడా బంద్ చేస్తున్నామని సిఎం కెసిఆర్ చెప్పారు.

వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని సూచించారు. ఇప్పటి వరకు 177 దేశాల్లో 2 లక్షల 70 వేల మందికి కరోనా సోకింది. ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. మృతుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 12 వేలకు చేరుకున్నది. మన దేశంలో 283 మందికి రాష్ట్రంలో 21 మందికి సోకినట్టు సమాచారం. దేశం మొత్తం మీద కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 5 కు చేరుకున్నది. చైనాలో పుట్టి అక్కడ 3255 మందిని బలి తీసుకున్న ఈ వైరస్ అత్యంత వేగంతో ప్రపంచమంతా విస్తరిస్తున్నది. మన దేశంలో ఇంకా ప్రమాదకరమైన స్థాయికి చేరుకోకపోడం మన అదృష్టమనే చెప్పాలి. అలాగని నిర్లక్షం ప్రదర్శిస్తే తీవ్ర పర్యవసానాలు తప్పవు. ఈ ప్రమాదాన్ని గమనించినందునే ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి కెసిఆర్ జనతా కర్ఫూను సంకల్పించారు.

జన సమ్మర్ధం వల్ల, గుంపులు గుంపులుగా చేరడం వల్ల కరోనా వ్యాప్తి పెరుగుతున్నది. కాబట్టి ఎవరికి వారు ఇళ్లల్లో ఉండడమే శరణ్యమవుతున్నది. ఇందువల్ల పేదలు, రోజు కూలీ చేసుకునేవారు, చిన్న వ్యాపారుల ఆదాయాలు నష్టపోయి ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉన్నది. అయినా మహమ్మారి వైరస్ నుంచి ఆత్మరక్షణ కోసం పాటించక తప్పదు. ఇంటిలో ఉండడమే సమాజానికి మనం చేసే సేవ అని ముఖ్యమంత్రి వెలిబుచ్చిన అభిప్రాయం నూటికి నూరు పాళ్లు నిజం. జన నేత తీసుకునే ఏ నిర్ణయమైనా జనాన్ని కదిలిస్తుంది. ఇప్పుడీ మహోపద్రవం నేపథ్యంలో కెసిఆర్ పిలుపును శిరోధార్యంగా భావించి రాష్ట్ర ప్రజలు ఆచరిస్తారనడానికి సందేహం అక్కర లేదు. అరికట్టే మందు లేనప్పుడు ఎవరికి వారు తగిన క్రమశిక్షణను పాటిస్తే వైరస్‌ను దూరంగా ఉంచగలం. వైరస్ సోకిన మొదటి వ్యక్తికి విజయవంతంగా నయం చేసిన ఘనత తెలంగాణకున్నది. స్వీయ నియంత్రణ, సామాజిక దూరం పాటింపు అనేవి ఈ ఆందోళనకర పరిస్థితుల్లో అత్యంతావశ్యకం.

రాష్ట్రంలో స్థానికులకు ఇంత వరకు వైరస్ సోకలేదు. విదేశాల నుంచి వస్తున్న వారే కరోనా వాహకులని తేలిపోయింది. వారి రాకను అరికట్టడం ద్వారా వైరస్ వ్యాప్తికి తెర దించవచ్చని తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగిన చర్యలు తీసుకున్నది. విదేశీ విమానాలను తక్షణమే నిలిపివేయాలని శుక్రవారం నాటి విడియో ముఖాముఖీలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధాన మంత్రికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో తెలంగాణకు పొరుగు రాష్ట్రాలతో గల సరిహద్దుల్లో 18 చెక్ పోస్టులు నెలకొల్పారు. శంషాబాద్ విమానాశ్రయంలో థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నారు. వైరస్ సోకిన వారిని గుర్తించి క్వారంటైన్లకు పంపిస్తున్నారు. కరోనా ప్రబలడం ప్రారంభమయిన తర్వాత రాష్ట్రానికి విదేశాల నుంచి వచ్చిన వారి సంఖ్య 20 వేల వరకు ఉండవచ్చునని అంచనా. నిఘా ద్వారా వీరి ఉనికిని కనుక్కోడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.

వీరంతా ముందుకు వచ్చి తమ సమాచారం ప్రభుత్వానికి తెలియజేస్తే మంచిది. దాని వల్ల వారికి పరీక్షలు జరపడం వైరస్ గనుక సోకినట్టు బయటపడితే వారు సంచరించిన ప్రాంతాల్లో అది వాపించకుండా చూడడానికి అవకాశం కలుగుతుంది. వారు నివసిస్తున్న ప్రాంతాల్లోని వారైనా వారి సమాచారాన్ని అందిస్తే దాని వల్ల చాలా మేలు కలుగుతుంది. ఒక అదృశ్య ముష్కర శక్తిగా దేశ దేశాలను గడగడలాడిస్తున్న ఈ వైరస్‌కు సరైన మందు కనుగొనే వరకు మానవాళికి ఇది అత్యంత పెద్ద సవాలే. దీనిని ఎదుర్కోడం కోసం ప్రపంచ ప్రజలంతా సమస్టిగా ఉద్యమించవలసి ఉంది. కరోనాను అరికట్టడానికి ముందు నుంచే చర్యలు తీసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం, దాని సారథి ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంతైనా అభినందనీయులు.

Indian people Supporting To Janata Curfew On Sunday

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జనతా కర్ఫూ మహా సంకల్పం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: