కమల్‌నాథ్ నిష్క్రమణ!

    మధ్యప్రదేశ్ రాజకీయం ఊహించిన మలుపే తిరిగింది. బిజెపి పన్నిన వ్యూహం నుంచి బయటికి రాలేక ముఖ్యమంత్రి కమల్‌నాథ్ చేతులెత్తేయడంతో అక్కడ అధికారం భారతీయ జనతా పార్టీ కైవసం అయిపోయింది. శుక్రవారం నాడు సాయంత్రం 5 గం.కు శాసన సభా వేదిక మీద బల పరీక్ష జరుగనుండగా 2 గం. ముందే కమల్‌నాథ్ గవర్నర్‌ను కలిసి రాజీనామా ఇచ్చేశారు. దీనితో అధికార యాత్ర కమల్ నుంచి కమలానికి సునాయాసంగా సాగిపోయింది. ఎన్నికల్లో ప్రజలు ఎవరికి ఆధిక్యం […] The post కమల్‌నాథ్ నిష్క్రమణ! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

    మధ్యప్రదేశ్ రాజకీయం ఊహించిన మలుపే తిరిగింది. బిజెపి పన్నిన వ్యూహం నుంచి బయటికి రాలేక ముఖ్యమంత్రి కమల్‌నాథ్ చేతులెత్తేయడంతో అక్కడ అధికారం భారతీయ జనతా పార్టీ కైవసం అయిపోయింది. శుక్రవారం నాడు సాయంత్రం 5 గం.కు శాసన సభా వేదిక మీద బల పరీక్ష జరుగనుండగా 2 గం. ముందే కమల్‌నాథ్ గవర్నర్‌ను కలిసి రాజీనామా ఇచ్చేశారు. దీనితో అధికార యాత్ర కమల్ నుంచి కమలానికి సునాయాసంగా సాగిపోయింది. ఎన్నికల్లో ప్రజలు ఎవరికి ఆధిక్యం కట్టబెట్టినా మాయోపాయాలతో సభలో త్రాసును తమ వైపు తిప్పుకోగలిగేవారికే అధికారం చెందుతుందని మరోసారి రుజువయిపోయింది.అటువంటప్పుడు ఎన్నికలెందుకు అనే ప్రశ్న తాటి చెట్టంత ఎత్తున లేస్తుంది. ఎన్నికల దారి ఎన్నికలదే ప్రజా తీర్పుకి తూట్లు పొడిచి అధికారాన్ని హైజాక్ చేసుకోడం దారి దానిదే అన్నట్టు స్థిరపడిపోయింది.

కేంద్రంలో సిర్థమైన, బలమైన అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రాల్లో ప్రజల తీర్పులకు తల కొరివి పెట్టడం ఆనాడు కాంగ్రెస్ హయాంలో కూడా జరిగింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పాలనలో అంతకంటే వికృతంగా సరికొత్త సిగ్గులేని పద్ధతుల్లో కొనసాగుతున్నది. కర్నాటక ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా బిజెపి అవతరించి, అటూ ఇటూ కాని హంగ్ అసెంబ్లీ ఏర్పడగా కమల నాథుడైన యెడ్యూరప్పకు గవర్నర్ అధికారం అప్పజెప్పినప్పటికీ కాంగ్రెస్, జెడి(ఎస్)లు కలిసి స్పష్టమైన మెజారిటీని కూడగట్టుకొని శాసన సభా వేదిక మీద తిరుగులేని బలాన్ని నిరూపించుకొని ఆయన ప్రభుత్వాన్ని దింపి పాలన పగ్గాలు చేపట్టాయి. వాటి పాలన కొద్ది కాలం సాగిన తర్వాత కాంగ్రెస్, జెడి(ఎస్)లకు చెందిన 17 మంది ఎంఎల్‌ఎల చేత రాజీనామాలు చేయించి ముంబై హోటల్లో ఉంచి కథ నడిపించడం ద్వారా అధికారాన్ని బిజెపి దొరకబుచ్చుకున్నది. ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో కూడా అదే జరిగింది.

ముఖ్యమంత్రి పదవి, లేదా పిసిసి అధ్యక్ష పీఠమైనా దక్కనందుకు అలిగిన కాంగ్రెస్ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా బిజెపి పట్టులోకి జారిపోయి తన వర్గీయులైన 19 మంది ఎంఎల్‌ఎలను బెంగళూరు శిబిరానికి పంపించి వారిచేత రాజీనామాలిప్పించాడు. తాను కాంగ్రెస్ నుంచి వైదొలగి ప్రధాని మోడీని, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలిసి వారి ఆశీస్సులతో బిజెపిలో చేరిపోయి రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా పొందాడు. చేయి దాటిపోయిన పరిస్థితిని అదుపులోకి తెచ్చుకోడానికి కమల్ నాథ్ సింధియా వర్గీయులైన ఆరుగురు మంత్రులను బర్తరఫ్ చేశాడు. కరోనా సాకు చూపించి శాసన సభను ఈ నెల 26 వరకు స్పీకర్ చేత వాయిదా వేయించాడు. ఆలోగా బలాన్ని మళ్లీ కూడగట్టుకోవచ్చనే భ్రమల్లో పావులు కదిపాడు. మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించి తక్షణమే బల పరీక్ష జరిపించేలా ఆదేశాలు సాధించాడు.

అది శుక్రవారం సాయంత్రం జరగవలసి ఉండగా అంతకు ముందే స్వస్వరూపాన్ని తెలుసుకున్న కమల్‌నాథ్ రాజీనామా చేసి దిగిపోయాడు. ఈ మొత్తం వ్యవహారంలో ఎంఎల్‌ఎలను నిర్బంధంలో ఉంచకూడదని వారికి స్వేచ్ఛ ఉండాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం దిక్కులేనిదైపోయింది. వారిని స్వయంగా పిలిపించుకొని రాజీనామా స్వచ్ఛందంగా చేశారా, ఎవరి ఒత్తిడైనా ఉందా అనే ప్రశ్నకు సమాధానం సాధించుకునే అవకాశం స్పీకర్‌కు దక్కలేదు. బెంగళూరులో ఉన్నవారితో విడియో కాన్ఫరెన్స్ జరిపి వారి అభిప్రాయం తెలుసుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన సూచనకు స్పీకర్ అంగీకరించలేదు. తమను అక్కడికి తీసుకెళ్లి శిబిరంలో ఉంచిన వారి సమక్షంలో ఎంఎల్‌ఎలు స్వేచ్ఛగా ఎలా అభిప్రాయం చెబుతారని ధర్మాసనం భావించిందో తెలియదు. మొత్తానికి జరిగింది పరమ అప్రజాస్వామిక క్రీడ అని సందేహాతీతంగా చెప్పవచ్చు. చెప్పుకోడానికి ప్రజాస్వామ్యమే అయినా జరుగుతున్నదంతా అప్రజాస్వామికమే.

15 మాసాల క్రితం జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బొటాబొటీ మెజారిటీ సాధించింది. ఎస్‌పి, బిఎస్‌పికున్న అతి కొద్ది మంది సభ్యుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. పార్టీలో సీనియర్ అయినందున కమల్ నాథ్‌కు ముఖ్యమంత్రి పదవిని కట్టబెడుతూ కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం తీసుకున్న నిర్ణయమే ఇప్పుడీ పరిణామాలకు ప్రధాన కారణమైంది. పార్టీ జరిపించకుండా రాజీనామాల తంత్రంతో అధికార పక్షాన్ని శాసన సభలో మైనారిటీకి పడవేసి అధికారాన్ని కాజేయడమనే కొత్త కుతంత్రం ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నది. గవర్నర్లు, స్పీకర్లు నిష్పాక్షికంగా వ్యవహరించడం, ఫిరాయింపులకు బొత్తిగా సందు లేకుండా, మధ్యలో రాజీనామాలకు అవకాశం లేకుండా చేయడం వంటి చర్యల ద్వారా ప్రజల తీర్పుకి గట్టి రక్షణ కవచాన్ని తొడగాలి.

Madhya Pradesh CM Kamal Nath resigns, State Govt falls

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కమల్‌నాథ్ నిష్క్రమణ! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: